Sunday, September 11, 2011

ఐరోమా దీక్షకు తెరపడేదెన్నడు? by - దేవేంద్ర Surya News Paper 11/09/2011


ఐరోమా దీక్షకు తెరపడేదెన్నడు?
sharmilaఅన్నా హజారే ఆమరణ దీక్ష యావత్‌ జాతిని ఏకతాటిపైకి తెచ్చింది. ఆసేతు హిమాచలం అన్నా నామస్మరణతో పునీతమైంది. ఆయన సంధించిన దీక్షాస్త్రం కేంద్రం మెడలు వంచింది. ‘లోక్‌పాల్‌’ బిల్లు తీసుకు రావడానికి మన్మోహన్‌ ప్రభుత్వం ఎట్టకేలకు సిద్ధమైంది. కానీ... పదకొండేళ్లుగా అన్నపానీయాలు ముట్టని మణిపురి మహిళామణి ఐరోమా షర్మిల చాను దీక్ష మాత్రం దేశ ప్రజలను ఏమాత్రం కదిలించలేకపోయింది. ప్రభుత్వాలే కాదు, మీడియా కూడా ఆమె దీక్షపట్ల ఉదాసీనంగానే వ్యవహరించింది. కాకపోతే, హజారే దీక్ష విజయం స్ఫూర్తితో ‘సేవ్‌ ఐరోమా’ ఉద్యమాన్ని నిర్వహిం చడానికి పౌర సమాజం సమాయత్తమైంది.

నిజమే! దీక్షా సమరంలో హజారే నిర్దేశించుకున్న లక్ష్యానికి, ఐరోమా లక్ష్యానికి మధ్య వ్యత్యాసం ఉన్నమాట వాస్తవమే. రాజకీయ వ్యవస్థలో, అధికార యంత్రాంగంలో నరనరాన జీర్ణించుకున్న అవినీతి నిర్మూలనకు హజారే దీక్షాబద్ధులైనారు. సర్వాంతర్యామిలా విస్తరించిన అవినీతి బారిన పడని పౌరుడు లేడు. అందుకే హజారేకు దేశ ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. కానీ, ఐరోమా దీక్షా సమర లక్ష్యం ఒక ప్రాంతానికే పరిమితమైనది. ‘సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం -1958’ని రద్దుచేయాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. హక్కుల ఉద్యమ నేతలు ఈసడించుకున్నట్లుగా అది రాక్షస చట్టమే. ఈ విషయాన్ని కేంద్రమే అంగీకరించింది.

కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ జీవన్‌రెడ్డి కమిటీ కూడా ఈ చట్టాన్ని రద్దు చేయాలని సిఫారుసు చేసింది. రెండవ పాలనా సంస్కరణల కమిషన్‌ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. స్వయంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా, ఈ చట్ట పీడితుల బాధలను అర్థం చేసుకోగలనని, త్వరలోనే దీని ఉపసంహరణ చర్యలు చేపట్టగలనని హామీ ఇచ్చారు. 2006 లోనే ఆయన ఈ హామీ ఇచ్చినప్పటికీ, ఇది ఇంతవరకూ ఆచరణ రూపాన్ని సంతరించుకోలేదు.నాగా పర్వత ప్రాంతాల్లో చెలరేగిన నాగా వేర్పాటు వాదులను అణచివేయడం కోసం 1958 సెప్టెంబర్‌ 11న భారత పార్లమెంట్‌ ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు చట్టాన్ని (ఏఎఫ్‌ ఎన్‌పీఏ)’ ఆమోదించింది.

నిజానికి ఇది బ్రిటిష్‌ కాలంనాటి ‘సాయుధ బలగాల విశేషాధికారాల ఆర్డినెన్స్‌’కు ప్రతిరూపమే.1942లో క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి సామ్రాజ్యవాదులు ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. దీనికి స్వల్పమార్పులు చేసి 1958లో ఏఎఫ్‌ఎన్‌పీఏ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈశాన్యంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర తదితర రాష్ట్రాల్లో ఆయా ప్రభుతాలు ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటించిన చోట ఇది అమలులోకి వస్తుందని చట్టంలో పేర్కొన్నారు. 1980 సెప్టెంబర్‌ 9న మణిపూర్‌లోని పలు ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి ఈ చట్టాన్ని అక్కడ అమలులోకి తెచ్చారు.

1990లో ఈ చట్టాన్ని జమ్మూ-కాశ్మీర్‌కు విస్తరింపజేశారు. కల్లోలిత ప్రాంతాల్లో మోహరించిన సైనికు లకు ఈ చట్టం విశేషాధికారాలను సంక్రమింపజేస్తున్నది. అంతర్గత అల్లర్లను అదుపు చేయడంలో విఫలమైన రాష్ట్రాలకు సహ కరించే ఉద్దేశ్యంతోనే ఈ చట్టాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంటున్నది. అయితే, ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతు న్న అల్లర్లకు, వేర్పాటువాద హింసకు పాలకుల ఉదాసీనతే కారణమన్నది చేదునిజం. ఈశాన్యంలోని పలు రాష్ట్రాలు భారత రిపబ్లిక్‌ లోకి ఆయా ఒప్పందాల ద్వారా వచ్చిచేరినవే. భౌగోళికంగా కీలక ప్రాంతాల్లో ఉన్న ఈ రాష్ట్రాల విలీనంపై చూపించి నంత ఆసక్తిని ఆ తరువాత పాలకులు ఏనాడూ చూపలేదు.

సామాజికంగా, సాంస్కృతికంగా, జాతి పరంగా భిన్నమైన ఈ ప్రాంత ఆర్ధికాభివృద్ధికి, సామాజికాభ్యున్నతికి ఢిల్లీలోని పాలకులు ప్రయత్నించలేదు. దీంతో అక్కడ అంతర్గత అల్లర్లు, వేర్పాటువాద హింస ప్రజ్వరిల్లింది. ఈ హింసకు కళ్లెం వేయడానికి కేంద్రం ఈ వివాదాస్పద ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని తీసుకొచ్చింది.దీని ప్రకారం కల్లోలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న సైనికాధికారులు స్థానికంగా అమలులో ఉన్న చట్టాలను ఉల్లంఘింస్తున్న వ్యక్తులపై బలప్రయోగం జరపవచ్చు. అవసరమైతే కాల్పులు జరిపి హతమార్చవచ్చు. చివరకు ఐదుగురికి మించి గుమికూడిన వారిపై కూడా కాల్పులు జరపవచ్చు.

వారెంట్‌ లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. కాకపోతే, అరెస్టు చేసిన వ్యక్తిని ‘ఎక్కువ జాప్యం’ లేకుండా సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించాల్సి ఉంటుంది. నేరానికి పాల్పడిన వారిపైన లేదా అనుమానితులపైన అవసరమైన బలప్రయోగం చేయవచ్చు. కల్లోలిత ప్రాంతంలో మోహరించిన సైనికాధికారుల చర్యలను న్యాయస్థానాల్లో విచారించే అవకాశం లేదు. కాకపోతే, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని విచారించవచ్చునని చిన్న మినహాయింపు ఉంది. అయితే, కేంద్రం ఇలాంటి అనుమతి ఇస్తుందని భావించడం అత్యాశే అవుతుంది. రాజ్యాంగంలోని ‘జీవించే హక్కు’కు ఈ చట్టం తూట్లు పొడుస్తున్నది.

ఈ అంశం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీలో ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో పెచ్చరిల్లుతున్న వేర్పాటు వాదుల హింసను అరికట్టడానికి ఇలాంటి చట్టం తప్పనిసరి అని భారత్‌ వాదించింది. దీనిని ఉపసంహరిస్తే... వేర్పాటు వాదులను అణచడం సాధ్యం కాదని భారత సైన్యం స్పష్టం చేసింది. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని సైన్యం అరాచకాలకు పాల్పడటంతో... స్థానికంగా అల్లర్లు మరింతగా పెరిగాయి. వాటిని అదుపు చేయడానికి సైన్యం మరింత పాశవికంగా వ్యవహరించింది. తిరుగుబాటుదారుల ముద్రవేసి అమాయకులను కాల్చిచంపడం, మిహళలపై అత్యాచారాల వంటి అకృత్యాలకు అంతులేకుండా పోయింది.

మణిపూర్‌ ఇంఫాల్‌ లోయలోని మలోమ్‌లో అస్సాం రైఫిల్స్‌ జవాన్లు 10 మందిని కాల్చి చంపిన వార్త తెలుసుకున్న ఐరోమా 2000 నవంబర్‌ 2వ తేదీనుంచి నిరాహారదీక్ష చేస్తున్నారు. సైనికులకు కోరల్లాంటి అధికారాలు కట్టబెడుతున్న ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ ఆమె దీక్ష ప్రారంభించారు. అయితే ఆమె దీక్ష మూడో రోజుకు చేరగానే, పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఆత్మహత్యాయత్నం నేరం మోపారు. పోలీసుల నిర్భంధంలోనూ ఆహారం తీసుకోవడానికి ఆమె నిరాకరించారు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె ప్రాణాలు నిలబెట్టడానికి అధికారులు ముక్కుద్వారా ద్రవాహారం అందిస్తున్నారు. అప్పటినుంచి ఆమె అన్నపానీయాలు ముట్టడంలేదు. ఆమెను అరెస్టు చేయడం, విడుదల చేయడం ప్రక్రియ పదకొండేళ్లుగా కొనసాగుతున్నా- ఆమె నిరాహార దీక్ష మాత్రం మానివేయలేదు.

ప్రజల ధన, మాన, ప్రాణాలను హరిస్తున్న ఈ క్రూర చట్టాన్ని తొలగించాలన్న డిమాండ్‌ నానాటికీ పెరిగింది. మనోరమాదేవి అనే మహిళను అస్సాం రైఫిల్స్‌కు చెందిన జవాన్లు కాల్చి చంపడంతో మణిపూర్‌లో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ డజను మందికి పైగా మహిళలు అస్సాం రైఫిల్స్‌ ప్రధాన కార్యాలయం ఉన్న ‘కాంగ్లాఫోర్టు’ ఎదుట నగ్నంగా నిలబడి మనోరమను చెరచినట్లే మమ్మల్ని చెరచండి అంటూ నినదించడం యావత్‌ దేశాన్ని కుదిపేసింది. ఇలా సైన్యం అరాచకాలు ఒకటొకటిగా వెలుగు చూడడంతో కేంద్రం ఐదుగురు సభ్యులతో జస్టిస్‌ జీవన్‌రెడ్డి కమిటీని ఏర్పాటుచేసింది.

వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసిన కమిటీ ఈ చట్టాన్ని సమీక్షించి మానవ హక్కుల పరిరక్షణకు చోటు కల్పిస్తూ చట్టాన్ని సవరించాలని లేదా దీని స్థానంలో మానవీయ కోణంగల కొత్త చట్టాన్ని తేవాలని సూచించింది. 2005 లోనే ఈ కమిటీ నివేదిక సమర్పించింది. అయితే, ప్రభుత్వం మాత్రం జీవన్‌రెడ్డి సిఫారసులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఎప్పటి మాదిరిగానే హోంమంత్రి చిదంబరం ఏకాభిప్రాయ మంత్రాన్ని పఠిస్తున్నారు. ప్రజల హక్కులకు, స్వేచ్ఛకు పట్టం కట్టే మనదేశంలో ఏఎఫ్‌ఎస్‌పీ లాంటి క్రూర చట్టాలకు చోటు లేదు. ఇది ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన అంశమని ఉదాసీనంగా ఉండడమూ భావ్యం కాదు. ఐరోమా చేత దీక్ష విరమింపజేయాలంటే, ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందే తప్ప సవరణలతో సరిపుచ్చుతామంటే కుదరదు.

- దేవేంద్ర

No comments:

Post a Comment