Tuesday, September 6, 2011

బతకాలి.. పోరు సాగాలి- జూలూరు గౌరీశంకర్ Andhra Jyothi 07/09/2011


బతకాలి.. పోరు సాగాలి

ఎంతో సమర్థులైన, విజ్ఞానవంతులైన సాహసవంతులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ జేగంటలు మోగిస్తున్నారు. ఇంత సామాజిక పరిణతిలో, తమ నేల విముక్తే ప్రధాన ధ్యేయంగా ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువత దేశంలో మరెక్కడా కనిపించదు. ఇన్ని బలిదానాలు జరుగుతున్నా కేంద్రం నాన్చుడు ధోరణితో వ్యవహరించడం పరమ దుర్మార్గమైనది.

ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మోయలేని భారాలు మీదపడ్డా, లక్ష్య బాటకు యింకా ఏ దారీ కన్పించకున్నా, మిన్నులు విరిగి వెన్నుల మీద పడి కదలలేకుండా వున్నా మరెన్నెన్నో వైఫల్యాలు చుట్టూ ఆవరించి ఉన్నా ఆత్మ బలిదానం చేసుకోవద్దు. ఆత్మ బలిదానం అంటే ఒక్క నైరాశ్యం నుంచి వచ్చేది కాదు, అది కూడా త్యాగానికి దీపికే, కాదనటం లేదు. కనిపించకుండా అదృశ్యమై కూడా అగ్గి రగిలించవచ్చునని యిప్పటివరకు తెలంగాణలో సుమారు 700 మంది దాకా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు.

ఎల్‌బి నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి వొంటికి అంటించుకున్న నిప్పు, ఉస్మానియా క్యాంపస్ ముందు సింగంలా దూకుకుంటూ నిప్పుల ఉప్పెనలా దూసుకొచ్చిన యాదన్న, పార్లమెంట్ సాక్షిగా యాదిరెడ్డి ఆత్మ త్యాగం, చిదంబరం ప్రకటన వల్ల శ్రీకాంత్ బలిదానం తెలంగాణ ఆకాంక్షల ప్రతిరూపం. ఆ ఆత్మ బలిదానాల సాక్షిగా పార్లమెంట్ కదిలిపోయింది. యాదిరెడ్డి, ఆత్మ బలిదానం సమయంలో రాసిన సూసైడ్ లేఖను లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ చదివి తెలంగాణ ఆకాంక్షను దేశ ప్రజలకు చాటి చెప్పారు. పార్లమెంటు ఒక్కసారిగా ఉత్కంఠకు గురైంది.

'ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ కోసం ఉద్యమించండని' సుష్మ పిలుపుయిచ్చారు. ఆత్మ బలిదానానికి ప్రతి వ్యక్తి ఇదే తన ఆఖరి బలిదానం కావాలని ఉత్తరం రాస్తూ బలిదానం చేసుకుంటున్నారు. ఈ పాలకులు ఆ లేఖల సారాంశాన్ని, ఆత్మ బలిదానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం వల్లనే మరిన్ని మరణాలు సంభవిస్తున్నాయి. ఏ నాయకుడు ఏ ఆగ్రహ ప్రకటన చేసినా తెలంగాణ మొత్తం భావోద్వేగానికి గురవుతుంది.

ఏ నాయకుడు ఏ నిరాశ మాట మాట్లాడినా అది తెలంగాణ నేలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి వుంది. వీటికి తోడుగా ఇంత సుదీర్ఘ పోరాటంపై నీళ్ళు చల్లుతూ చిదంబరం లాంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్ళు చేస్తున్న ప్రకటనలకు యువత తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యే పరిస్థితి వుంది. అందుకు ఎంటెక్ విద్యార్థి శ్రీకాంత్ మరణమే సాక్ష్యం. ఆయన మరణానికి ముందు రాసిన లేఖ అన్ని రాజకీయ పార్టీలకు ఒక మేలు కొలుపు, హెచ్చరిక అయింది.

ఏ నాయకుడు ఏ ప్రకటన చేసినా, ఎవరు తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే మాటలు మాట్లాడినా మానసికంగా ఆందోళనకు గురికాకుండా వాళ్ళను ఎండగట్టి బజారులో నిలబెట్టే దశకు తెలంగాణ ఉద్యమం ఎదిగి ఎంతో పరిణతి సాధించింది. ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడే స్థితిలో ఏ రాజకీయ పార్టీ లేదు. ఇదంతా తెలంగాణ యువత చేసిన పోరాటం వల్ల ప్రజా ఉద్యమాల వల్ల సాధ్యమైంది. కళ్ల ముందే విద్యార్థులు, యువత చేసుకుంటున్న ఆత్మ బలిదానాలు రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాయి. ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎగసిన పోరు పార్లమెంట్‌కు తాకింది.

ఇది తెలంగాణ యువత సాధించిన విజయం, ఇది తెలంగాణ ప్రజల పోరు విజయం. ఎంతో మంది తల్లుల గర్భశోకం మంటలై ఎగిసింది. ఎంపీలు, మంత్రులు అని చూడకుండా ఎవరు ఎంత పెద్దస్థాయి హోదాలో ఉన్నా తరిమికొట్టారు. ఆ పోరు మంటలే అన్ని పార్టీల వారిని రాజీనామాలు చేసి సామూహికంగా ఒక దగ్గరకు చేరే దశకు చేర్చింది. ఇక రాజకీయ పార్టీలకు మరో దారి లేదు. ఇక మిగిలింది అందరూ కలిసి తెలంగాణ కోసం నిలబడి ముందుకు సాగటమే.

ఈ గీత కాదని ఏ పార్టీ కదిలినా ఆ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లుగానే భావించాలి. ఇక ఆ తల్లుల గర్భశోకంతో తెలంగాణ కన్నీళ్ల పర్యంతం అయింది. ఏ ఒక్క ఆత్మ బలిదానం జరిగినా తెలంగాణ గుండె తట్టుకోలేదు. దయచేసి ఈ ఆత్మ బలిదానాలు రగిల్చిన మంటలు చాలు పార్లమెంట్‌ను దహించి వేయడానికి! ఏ తల్లి పేగు ఎక్కడ తెగబడ్డా ఈ తెలంగాణ తట్టుకోలేదిక, తెలంగాణ సాధన కోసం పోరుదారిలో దిగటం మినహా మరొక దారి లేదు.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పోరాటమే అంతిమమైనది కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా పోరాడాల్సిన చారిత్రక కర్తవ్యం యువతపైనే వుంది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత దాన్ని తీర్చిదిద్దుకోవాల్సింది యువతే. భౌగోళిక తెలంగాణ సాధించుకున్న తర్వాత దొరల తెలంగాణను, గడీ తెలంగాణను కుప్ప కూల్చ వలసింది నవ యువతరం శక్తులే.

ఇప్పుడు నడుస్తున్న సమస్త ప్రజల తెలంగాణ మహోద్యమంలో దొర, పాలేరు, ధనవంతుడు, నక్సలైట్ ఒక్క వేదిక మీదకొచ్చి కలిసి పనిచేస్తున్నారు. మరి తెలంగాణ వచ్చినంక దొరలు, పాలేర్లు ఒక వేదిక మీద ఉండరు. ఆధిపత్యవాది, నక్సలైటు కలిసి నడువరు. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ఆధునిక దొరలు, ఊర్ల నుంచి పారిపోయిన పాత దొరలు మళ్లీ తెలంగాణ జెండా బట్టి తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనే కోట్లాది ప్రజల ఆకాంక్షే, పాత, కొత్త దొరలకు ఆ వెసులుబాటు కల్పించింది. తెలంగాణ పది జిల్లాల్లో అగ్రవర్ణ కులం కోరలు చాచి ఎప్పుడైనా తన ఆధిపత్య భావజాలంతో సబ్బండ వర్ణా లపై విషం గక్కడం ఖాయం.

సింగరేణి సంపదలను, తెలంగాణ పచ్చటి పైట కింద ఉన్న సంపదల సిరులను దోచుకునే శక్తులు ఎప్పుడైనా వుంటాయి. ఇప్పుడు తెలంగాణ కోసం అన్ని కులాలు, పంతాలు పక్కన బెట్టి అందరూ కలిసి అడుగులు వేస్తున్నారు. ఇలా కలిసి రావడం వల్లనే కులం పోదు. మళ్ళీ రాష్ట్ర సాధన తర్వాత కులం లేని తెలంగాణ కోసం పోరాడాలి. భౌగోళిక తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళీ ప్రజాస్వామిక తెలంగాణ కోసం, బహుజన తెలంగాణ కోసం ఉవ్వెత్తున ఎగిసిపడే పోరాటాలు జరగాలి.

అగ్రవర్ణ ఆధిపత్య శక్తులను తరిమికొట్టి ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా అనే సామూహిక పల్లవిగా సబ్బండ వర్ణాలు కదలాలి. తెలంగాణ ఎర్ర సెలకల్లో అన్ని వర్ణాలకు సమ వాటా దక్కాలి. తెలంగాణ వచ్చాక ఇది చదువుల తల్లి తెలంగాణగా విలసిల్లాలి. అందరికీ ఉద్యోగాలు, అందరికీ నీళ్లు, అందరికీ ఇళ్లు, అందరికీ బువ్వ, అందరకీ సమానావకాశాలు, శ్రమజీవి చెమట చుక్కలకు పట్టం గట్టే తెలంగాణ కావాలి.

తెలంగాణ కోసం ఇప్పటివరకు చేసుకున్న ఆత్మ బలిదానాలన్నీ ఏదో ఉద్వేగంలోనో, ఆవేశంలోనో జరిగినవి కావు. ఇప్పటివరకు చనిపోయిన వారిలో రికార్డెడ్‌గా దొరికిన లేఖలు చూస్తే అవన్నీ వాళ్లు ఎంతో కమిట్‌మెంట్‌తో విషయాలు చెప్పి త్యాగాలు చేసి కన్ను మూశారు. యాదిరెడ్డి, శ్రీకాంత్ లేఖలు చూస్తే అర్థమౌతుంది. పార్లమెంట్‌లో చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఎంతో గాయపరిచే విధంగా వున్నాయి. తెలంగాణ సమస్య పరిష్కారం విషయంలో రాజకీయ మూలాలు వున్నాయి. చిదంబరం ప్రకటన వెనుక ఉన్న దోషులను గుర్తించాలి. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఈ ఆత్మ బలిదానాలపై ఒక్కమాట కూడా మాట్లాడలేదు.

విద్యార్థులు, యువత ఏ కారణంతో చనిపోతున్నారో, ఎందుకోసం ఈ బలిదానాలు చేసుకుంటున్నారో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఈ జేఏసీలు ఏం చే స్తున్నాయి? ఇకనైనా తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు జరగకుండా చూడాలి. అందుకోసం రాజకీయ పార్టీలన్నీ ఆ ఆత్మ బలిదానాలు చేసుకున్నవారి పాదాల దగ్గర తమ పార్టీ జెండాలను బెట్టి ఏకంగా ఒకే స్వరంతో మాట్లాడి నిలబడి కలబడాలి.

ఎంతో సమర్థు లైన, విజ్ఞానవంతులైన సాహసవంతులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ జేగంటలు మోగిస్తున్నారు. ఇంత సామాజిక పరిణతిలో, తమ నేల విముక్తే ప్రధాన ధ్యేయంగా ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువత దేశంలో మరెక్కడా కనిపించదు. ఇన్ని బలిదానాలు జరుగుతున్నా కేంద్రం నాన్చుడు ధోరణితో వ్యవహరించడం పరమ దుర్మార్గమైనది. ఇంత శక్తిమంతమైన యువత పోరు మార్గంలో నడవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఒక మొదటి మెట్టు మాత్రమే. ఆ తర్వాత సుసంపన్న తెలంగాణ, అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చే తెలంగాణను నిర్మించడంలో యువతదే కీలకపాత్ర. అట్లాంటి చారిత్రక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర రథ చక్రాలను నడిపించవలసింది ఈ యువతరమే. ఓ తెలంగాణ బిడ్డలారా! కత్తికొనలాగా మీరు మెరవాలి. ద్రోహుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి.

ఓ నాయనలారా! ఓ తండ్రులారా! ఓ నా చిట్టి తల్లుల్లారా! మీరు అర్థాంతరంగా ఆందోళనతో కన్నుమూస్తే ఎట్లా నాయనా? అయ్యా, మీరు చేసిన ఆత్మ బలిదానాలతో తెలంగాణ వణికిపోతుంది. మీ ఆత్మ బలిదానాలతో తెలంగాణ తల్లడిల్లుతోంది. మీరు ఉరితాళ్లకు వేలాడింది ఇకచాలు, అవసరమైతే ఈ తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉరికించేందుకు ఇంధనంగా మారండి. మీరు లేని తెలం గాణ ఎవరి కోసం? మీరులేని తెలంగాణ ఏ దొరలకు అప్పగించడానికి? మీరు లేని తెలంగాణ దిక్కులేనిదౌతుంది. మన తెలంగాణ పోరు వారసత్వానికి పదును పెడదాం.

తల్లుల గర్భశోకం ఈ నేల భరించలేదు. ఆ తల్లులను గర్భశోకం నుంచి ఎవ్వరూ బైటపడేయలేరు. గత 60 ఏళ్ళుగా తన వెనుక ఎవరు లేక పోయినా, ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోకుండా వదిలేసినప్పటికినీ తనొక్కడుగా మొక్కవోని ధైర్యంతో, పట్టు విడవని సంకల్పంతో పట్టిన జెండా దించకుండా తుదిశ్వాస వరకు నిలిచిన కొత్తపల్లి జయశంకర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం. తెలంగాణను నిద్రాణ నిస్తేజం చేశామని సమైక్యవాదులు కులుకుతుంటే ఓపికగా కాలం పెట్టే అన్ని పరీక్షలకు నిలబడి నాలుగున్నర కోట్ల మందిలో తెలంగాణ జ్యోతులను జయశంకర్ వెలిగించారు.

ఆ భావజాల స్ఫూర్తితో ముందుకు సాగుదాం. యాదిరెడ్డి, శ్రీకాంత్‌లు చెప్పినట్లుగా ఇక ఎవ్వరూ ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. మా బలిదానమే చివరది కావాలని 700 మంది అసువులు బాశారు. ఈ శిఖండి రాజకీయ నాయకులను ఎండగడుతూ విస్తృత ప్రజా ఉద్యమాన్ని నిర్మించే హీరోలుగా యువతరం ముందుకు సాగాలి. కొత్త నాయకత్వానికి గేట్లు తెరిచి స్వరాష్ట్ర సాధన కోసం ముందుకు నడిచినవాడే నేటి హీరో. పోరు తెలంగాణ పోరు స్ఫూర్తిని మరొక్కసారి రగిలిద్దాం. పోరు కుంపట్లు రాజేద్దాం.
- జూలూరు గౌరీశంకర్

No comments:

Post a Comment