Friday, September 30, 2011

తెంచితేనే మంచిది By - నారదాసు లక్ష్మణ్‌రావు Andhra Jyothi 1/10/2011


తెంచితేనే మంచిది

శాంతియతు ఉద్యమాలకు తలదించరా? బలప్రయోగాలకే తలొగ్గుతారా? గుండెలు మండుతున్నాయ్. యావత్ తెలంగాణ రావణ కాష్టంలా మండుతున్నది. మా సకల జనుల సమ్మెను విరమించి, మరో పదునైన పోరాటరూపానికి సిద్ధమవక ముందే, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నాం.

అడుక్కుంటే ఇచ్చేది బిచ్చం-లాక్కుంటే వచ్చేవి హక్కులు - డాక్టర్ అంబేద్కర్
తెలంగాణ ఉద్యమం ఇవాళ అనేక అస్తిత్వ పోరాటాలకు కొత్త చూపు. తమ హక్కును సాధించుకోవడానికి సకల జనులను సమ్మిళితం చేసిన సరికొత్త పోరాట రూపు. జై తెలంగాణ అనే ఒకే ఒక్క నినాదం నాలుగున్నర కోట్ల ప్రజలను ఏకం చేసి పోరాట శక్తిగా మలచిన తారక మంత్రం. స్వాతంత్య్రోద్యమం తరువాత ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం తెలంగాణ చేస్తున్న మహా సంగ్రామం ఓ అత్యున్నత చైతన్య స్ఫూర్తి.

ఆకాంక్షల వ్యక్తీకరణ, నిరసనలు, నిరాహార దీక్ష ల నుంచి 'సకలజనుల సమ్మె' ద్వారా పదునెక్కిన ఉద్యమం రేపటి ప్రత్యక్ష పోరు వైపుకు పరుగులు తీస్తున్న చారిత్రక సందర్భం. త్యాగాల బాటలో విద్యార్థులు, ప్రజలు ఒక వైపు, ద్రోహాల త్రోవలో రాజకీయ నేతలు మరోవైపు నిలబడి ఉద్యమ చారిత్రక నేపథ్యంలో ఎవరు ఎటువైపో స్పష్టమైన విభజన రేఖ గీయబడిన పరిస్థితిని మనం చూస్తున్నాం.

సకల జనుల సమ్మెను ఒకసారి పరిశీలిస్తే, ఎవరి పాత్ర ఎలాంటిదో స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకటో తారీఖున జీతాలు వస్తేనే కానీ కుటుంబం నడవని పరిస్థితి ఉద్యోగులు, కార్మికులది. సమ్మె కాలంలో జీతాలు చెల్లించకపోతే తమ కుటుంబం అస్థిరతకు లోనవుతాయని తెలిసినా, ప్రభుత్వం తీసుకోబోయే కక్షసాధింపు చర్యలకు బలి కావలసి వస్తుందని తెలిసినా, ఏడికైతే గాడికాయె తెలంగాణ వచ్చే దాకా తెగించి కొట్లాడుతామని ఉద్యమ చైతన్యంతో ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.

దసరా పండుగ వస్తే, సింగరేణి సంబరాల జాతర అవుతుంది. ఉద్యమం కోసం ఆ సంబరాలను త్యాగం చేస్తే మళ్లీ వచ్చే దసరాను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటామంటూ తెగువతో, ఎందరు పోలీసులను మొహరించినా, ఎన్ని బెదిరింపులకు గురిచేసినా బొగ్గు పెల్ల పెకిలించక ఉద్యమానికి ఊపిరందిస్తున్నారు సింగరేణి కార్మికులు. ఆర్టీసీ, వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు, అప్రెంటీస్ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలు పోతాయని బెదిరించినా, తమకు తాము ఉద్యోగాల కంటే ముఖ్యమైనది తెలంగాణ సాధనే అనే మొక్కవోని ధైర్యంతో సమ్మెలో కొనసాగుతున్నారు.

దసరా సెలవులకు ముందురోజు పాఠశాలల్లో చేరకుంటే సెలవులన్నీ జీత నష్టపు సెలవులుగా మారతాయని తెలిసినా ఒక్క ఉపాధ్యాయుడు కూడా విధుల్లో చేరక ఆర్థిక ప్రయోజనాల కంటే ఆత్మ గౌరవమే తమకు ముఖ్యమని ఉడుంపట్టుతో ఉపాధ్యాయులు సమ్మెలో భాగస్వాములవుతున్నారు. ఐఐటి, ఏ.ఐ.ట్రిపుల్ఇ. లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో తమ బిడ్డలు వెనకబడే ప్రమాదముందని తెలిసినా, పిల్లలు కాలేజీలకు వెళ్ళకున్నా, తమ పిల్లల ప్రయోజనాలకంటే, తెలంగాణ సకల జనుల ప్రయోజనాలు ముఖ్యమని ప్రకటిస్తూ తల్లితండ్రులు ఉద్యమానికి కొండంత అండగా నిలుస్తున్నారు. ఎస్మా, జి.ఓ.177 లాంటి బూచీలు చూపించినా, బూటుకాలితో వాటిని తన్నేసి అన్ని శాఖల ఉద్యోగులు ఐక్యతా భావంతో సమ్మెను విజయవంతం చేస్తున్నారు.

ఇక సకల జనుల సమ్మెలో యావత్ తెలంగాణ ప్రజానీకం చూపిస్తున్న తెగువ, ఉద్యమాల చరిత్రలో కథలు, కథలుగా చెప్పుకొనే, వీరగాథలుగా పాడుకొనే సాహసోపేత తెలంగాణ చరిత్ర. గ్రామ గ్రామాన సకల కులాల సబ్బండ వర్ణాలు, తెలంగాణ ద్రోహులకు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. వాడ వాడలా ధూం ధాం పాటలతో, డప్పుల దరువులతో గుండె గుండెలో తెలంగాణ నినాదాన్ని హృదయ స్పందనగా చేస్తున్నారు. చౌరస్తాలన్నీ దీక్షా శిబిరాలై ప్రజలకు దిశా నిర్దేశనం చేస్తున్నాయి.

రోడ్లన్నీ వంటావార్పులతో ఉద్యమ బంధాన్ని బలోపేతం చేస్తున్నాయి. దారులన్నీ బతుకమ్మ పాటలు, కోలాటపు ఆటలతో కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. కవులు, కళాకారులు ఉద్యమ భావజాల వ్యాప్తికై కవాతు చేస్తున్నారు. జాతీయ రహదారుల దిగ్బంధనానికై పిలుపునిస్తే, జాతరగా జనం తరలి వచ్చి విజయవంతం చేశారు. రైల్ రోకోకు పిలుపునిస్తే, రైలు పట్టాలనే పీకి వేస్తామంటూ రగిలిపోయి రాత్రిల్లు కూడ ఆ పట్టాలపైనే నిద్రోయే పోరాట పటిమను చాటారు. ఇప్పుడు యావత్ తెలంగాణ సకల జనుల సమ్మెతో సల సల కాగుతున్న ఉష్ణ కాసారాం. ఉద్రేక, ఉద్వేగాలతో బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతం.

సమ్మె ఇంత తీవ్రంగా ఉన్న, దాని ప్రభావమే లేదని కళ్ళకు రేచీకటి సోకిన రేణుకా చౌదరి రెచ్చగొట్టే దగుల్బాజీ మాటలు, అభిషేక్ సింఘ్వీ అనుచిత వ్యాఖ్యలు, ఉద్యమ ప్రభావమే లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పుడు నివేదికలు. రాష్ట్రంలోని ఒక ప్రాంతం ఆత్మహత్యలు, నిత్య సంఘర్షణలతో అట్టుడికి పోతున్నా దేశ ప్రజలకు చేరవేయని జాతీయ మీడియా బాధ్యతారాహిత్యం.

ఇవన్నీ ఒక ఎత్తైతే, ప్రజల ఓట్ల భిక్షతో పదవులు పొంది, సీమాంధ్రులకు అమ్ముడుపోయి, తెలంగాణ ఉద్యమ కోవర్టులుగా మారి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ, హీన మానవ నేరస్థులు ప్రజాకోర్టులో శిక్షించబడడానికి సిద్ధంగా ఉన్నారు మన తెలంగాణ నేతలు.

తెలంగాణకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఒకే రోజు తమ పదవులకు అలాగే తెలంగాణ పట్ల ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్న పార్టీల సభ్యత్వాలకు రాజీనామా చేసి మరునాటి నుంచే తెలంగాణ ప్రక్రియ మొదలు కాదా అని ఈ రోజు తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తోంది. అలా చేయకుండా తెలంగాణ జెండా చేతిలో పట్టడానికి, తెలంగాణ నినాదాన్ని నోటితో పలకడానికి అర్హత ఎట్లా ఉంటుందని కూడా ప్రజలు సూటిగా నిలదీస్తున్నారు.

అంతా ఒక సాచివేత ధోరణి. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలంటూ మోసపూరిత వ్యాఖ్యలు. అసలు దోషి కేంద్ర ప్రభుత్వమే. అసలు నేరస్థురాలు కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే 2009 డిసెంబర్ 7నాడు అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయాన్ని ప్రకటించిన తరువాత, డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకై కేంద్రం పక్షాన సాక్షాత్తు హోంమంత్రి ప్రకటన చేసిన పిదప, ఆంధ్రోళ్ళ కుట్రలతో తానూ భాగస్వామియై, మళ్లీ ఏకాభిప్రాయ ప్రకటన పేరుతో ఇచ్చిన తెలంగాణను వాపసు తీసుకొని యావత్ తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయే.

సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం ఒక రాష్ట్ర విభజనకు పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండక పోవడానికి కారణం ఏమిటి? చేతగానితనమా? ఆంధ్రులకు అమ్ముడుపోయిన స్వార్థమా? లేక తెలంగాణ ప్రజలు అమాయకులని, సంపదలో వెనుకబడ్డ వారనీ, ఏం చేసినా చెల్లుతుందనే ఒక నిర్లక్ష్య భావనా? ఇప్పుడు నిలదీయాల్సింది, నిగ్గు దేల్చాల్సిందీ కేంద్ర ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ వైఖరీనే! అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలు బిచ్చంలా అడుక్కోవడం కాకుండా హక్కులా తెలంగాణను లాక్కోవడానికి అంతిమ పోరాటానికి సిద్ధమయ్యారు. ఉద్యమ సెగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాకి, కార్యాచరణకు పూనుకోవాలంటే ఇంతకు ముందే చెప్పినట్లు మూకుమ్మడిగా తెలంగాణ ప్రజా ప్రతినిధులు పదవులకు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు చేయాలి.

తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరుస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిస్తూ, కుట్రపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేపు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక ఉద్యమం కొనసాగుతున్నపుడు అన్నికాల శక్తులు అందులో ఉంటాయన్న విషయం మరచిపోరాదు.

ఇప్పటివరకు మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడం, మమ్మల్ని మేము అనేక ఇబ్బందులకు గురిచేసుకుంటూ ఉద్యమాన్ని కొనసాగించడమే చూశారు. ఇకపై మా లక్ష్యాన్ని మార్చుకొని మరో పోరాట స్వరూపాన్ని రూపొందించుకొనే అనివార్యతలోకి మమల్ని మీరు నెట్టివేస్తున్న పరిస్థితుల్లో నెత్తుటి సంతకాలు చేయడానికి సిద్ధమవుతున్నారు మా పోరు బిడ్డలు. నేటి స్వాతంత్య్రోద్యమ పోరాటం కూడా సత్యాగ్రహ నినాదంతో మొదలై బలమైన ఉద్యమంగా రూపుదిద్దుకున్నా, బ్రిటిష్ వారు దానిని చిన్న చూపు చూస్తూ, తాత్సారం చేస్తూనే వచ్చారు.

ఎప్పుడైతే భగత్ సింగ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో బాంబులు పేల్చాడో, ఎప్పుడైతే సుభాస్‌చంద్ర బోస్ అజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి బ్రిటీష్ వారిపై ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించాడో, అప్పుడే ఇక తమ ఆటలు సాగవని తెలుసుకొని స్వాతంత్య్రాన్ని ప్రకటించడానికి సిద్ధమయ్యింది బ్రిటీష్ ప్రభుత్వం. ఇది చారిత్రక సత్యం.

శాంతియతు ఉద్యమాలకు తలదించరా? బలప్రయోగాలకే తలొగ్గుతారా? గుండెలు మండుతున్నాయ్. పొట్టలు ఎండుతున్నాయ్. ఆవేశం రగులుతున్నది. సహనం నశిస్తున్నది. సహనం నశిస్తే అశాంతి చెలరేగుతది. విధ్వంస భావనలకు పునాదులు పడుతయ్. యావత్ తెలంగాణ రావణ కాష్టంలా మండుతున్నది. ఇలాంటి సంక్షుభిత వాతావరణంలో విజ్ఞతను ప్రదర్శించండి.

పరిష్కార మార్గం కనుగొనండి. కాలానికి వదిలివేస్తే కాలకూట విషమవుతుంది తెలంగాణ. మా సకల జనుల సమ్మెను విరమించి, మరో పదునైన పోరాటరూపానికి సిద్ధమవక ముందే, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నాం. భౌతిక దాడుల భావన ప్రజల మెదళ్ళలో మెదలకముందే భవిష్యత్తును చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని గుర్తుచేస్తున్నాము. అందుకే మళ్లీ చెబుతున్నాం. అన్నదమ్ముల్లా విడిపోదాం. ఆత్మీయుల్లా కలిసుందాం. రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి చెందుదాం.

ఈ నేలపై చిందిన వీరయోధుల నెత్తుటి సాక్షిగా, ఈ గాలిలో వీచే పోరుపాటల పల్లవుల సాక్షిగా గతం, వర్తమానం, భవిష్యత్తును విశ్లేషిస్తూ చెబుతున్నాం.. 'ఇప్పుడిది తెగించిన తెలంగాణ, ఇక తెగిపోతేనే మంచిది'.

- నారదాసు లక్ష్మణ్‌రావు
శాసనమండలి సభ్యులు 

No comments:

Post a Comment