Sunday, September 11, 2011

ఉగ్రవాదం - జన్మ రహస్యం - జాహ్నవి Andhra Jyothi 11/09/2011


ఉగ్రవాదం - జన్మ రహస్యం
- జాహ్నవి

ఢిల్లీ హైకోర్టు ముందు బాంబు పేలుళ్ళతో దేశమంతా ఉలిక్కి పడింది. డజను మరణాలు, మరిన్ని డజన్ల క్షతగాత్రులు. యధావిధిగా ప్రధాని, హోం మంత్రుల ప్రకటనలు, ప్రధాని కావాలనుకునే వారంతా క్షతగాత్రులకు పరామర్శలు. "ఇదో పిరికి చర్య, ఇలాంటి చర్యలకు మేం లొంగం'' అన్న ప్రధాని మాటలకు నవ్వొస్తుంది. పిరికి తనం ఎవరిది? అఫ్జల్ గురుకు క్షమాభిక్ష పెట్టనందుకు నిరసనగా ఈ పేలుళ్ళు జరిపి పన్నెండు మంది అమాయకులను చంపారని తెలుస్తోంది.

విధించిన ఉరిశిక్ష అమలు చేయకుండా ఇన్నాళ్ళూ పిరికి తనం చూపిందెవరు? ఏ ఓటు బ్యాంకులకు లొంగిపోయి? అలాగే రాజీవ్‌గాంధీ హంతకులకు విధించిన శిక్షలను అమలు జరపరాదని సరాసరి అసెంబ్లీ తీర్మానమే చేసేశారు. కాశ్మీర్, శ్రీలంక తమిళుల పోరాటాలను వామపక్ష మేధావులు జాతుల పోరాటాలుగా అభివర్ణిస్తారు. ప్రపంచంలో జరుగుతున్న ఉగ్రవాద చర్యలన్నిటి వెనుక ప్రాంతీయ, మత, జాతి, తెగల పేరిట జరిగే గుంపుల పోరాటాలే ఉన్నాయి. ఈ ధోరణులు ఇన్నేళ్ళుగా నిర్మించుకున్న నాగరికతకే సవాలు విసురుతున్నాయి.

నాగరికత దానంతట అది పరిఢవిల్లదు. జాగ్రత్తగా పోషించుకుంటేనే నిలబడుతుంది. ప్రస్తుతం నాగరికత క్రమంగా అంతరించిపోయే ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. అది ఒక్క రాత్రిలోనే జరిగిపోదు. దాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి వ్యాధిని గుర్తించి సకాలంలో విరుగుడు చర్యలు చేపట్టకపోతే అంతర్గతంగా కుళ్ళి, కృశించి, నశించిపోతుంది.

ఆ వ్యాధి ఏమిటంటే మనుషులు తెగల స్వభావానికి (ట్రైబలిజం) లోనుకావడం. ఒకపక్క ఆధునిక సమాచార సాధనాలతో ప్రపంచమంతా అరచేతిలోకి వస్తోంది. మరో పక్క సమాజాలన్నీ కుల, మత, భాష, ప్రాంతీయ, జాతీయ, చర్మం రంగుల్లాంటి ప్రాతిపదికలపై ముక్కలుముక్కలవుతున్నాయి. ఆస్తిత్వాల పేరిట కొత్త కొత్త గుంపులు ఆవిర్భవిస్తున్నాయి. ఆఫ్రికా, ఆసియాల్లో బహిరంగంగాను, యూరప్, అమెరికాల్లో అతర్గతంగాను గుంపుల పోరాటాలు నడుస్తున్నాయి. వాటి స్వభావమేమిటి? కారణాలు, పర్యవసానాలేమిటి?

మనుషుల్లో పెరుగుతున్న తెగ స్వభావం అహేతుకత, సామూహికత్వాల (కలెక్టివిజమ్) కలయికతో జనించే విషం. ఇప్పుడు రాజ్యమేలుతున్న తాత్వికతకు అదొక పర్యవసానం. వ్యక్తిని మేధోపరంగా, నైతికంగా అసహాయుణ్ణి చేసి, ఏ హక్కులూ లేకుండా చేసి, హేతుబద్ధ మార్గంలో నడవనీయకుండా చేసి, గుంపులే సర్వస్వమని, తన గుంపుకు సేవచేయడమే వ్యక్తి పరమావధి అని ప్రవచించడంతో, ప్రతి వ్యక్తీ ఏదో ఒక గుంపులో జొరబడక తప్పని పరిస్థితి ఉత్పన్నమయింది.

ఏ గుంపులో భాగమవ్వాలి? సింపుల్, తన ప్రమేయం లేకుండా, తాను జన్మించిన గ్రూపులో. అది కులం కావచ్చు, మతం కావచ్చు, దేశం కావచ్చు. అలా తనపుట్టుక, తన రక్తమాంసాలు తన మేధస్సును నిర్దేశిస్తున్నాయి! నిజానికిది జాత్యహంకారం. కానీ గుంపు పెద్దదయితే జాత్యాభిమానమంటారు. మరీ చిన్నదయితే దాన్ని మైనారిటీ ఆస్తిత్వ చైతన్యమంటారు. ఈ సామూహికత్వం, తెగ స్వభావం ఎప్పుడైనా, ఎక్కడైనా యుద్ధం, రక్తపాతాలనే సృష్టిస్తుంది. విముక్తి తెస్తానన్న కమ్యూనిజం, రష్యా, చైనా, కంబోడియాల్లో ప్రజల రక్తంతో తడిసిన నియంతృత్వాలను తెచ్చింది.

ఐశ్వర్యం తెస్తానని ఇండియా, క్యూబా, ఉత్తర కొరియాల్లో పేదరికం నింపింది. శాంతి బదులు రెండు ప్రపంచ యుద్ధాలు, ఎన్నో స్థానిక యుద్ధాలు, అణుబాంబుల భయాన్ని ప్రపంచానికిచ్చింది. ఈ సామూహికత్వం కేవలం కమ్యూనిస్టు దేశాల్లోనే కాదు, పెట్టుబడిదారీ దేశాలుగా చెప్పుకొనే అమెరికా, యూరప్‌లను కూడా ఆవహించింది. అందుకే వాళ్ళకీ కష్టాలు. జాతి హక్కులు, మైనారిటీ హక్కులు, ఆదిమ సంస్కృతుల పేరుతో జాత్యహంకారాన్ని పెంచి పోషించే తెగ స్వభావాన్ని సమకాలీన రాజకీయాలు, తాత్విక ధోరణులు ప్రోత్సహిస్తున్నాయి.

స్వేచ్ఛా సమాజంలో సంస్కృతి అంటే వ్యక్తులు సాధించిన పారిశ్రామిక, శాస్త్రీయ, సాంకేతిక, మేధోపర, కళా సౌందర్యాత్మక విజయాల సమాహారం. అది సాంప్రదాయికతను చీల్చుకుని వాస్తవాధారితమై వర్ధిల్లుతుందే తప్ప, పూర్వీకుల అంగీకారం కోసం ఎదురుచూడదు. కానీ తెగ స్వభావానికి సంప్రదాయమే ప్రాతిపదిక. సాంప్రదాయికులు తరతరాలకు అందించేది జానపద నృత్యాలు, పాటలు, దుస్తులు, వంటలు, పండుగలే. స్వభావ రీత్యా తెగల విజయాలన్నీ జంతుజాతి సమానమైన ఇంద్రియ జ్ఞాన స్థాయిలోనే ఉంటాయి.

మనిషికి మాత్రమే సాధ్యమై న భావగ్రహణం (కాన్సెప్ట్), దార్శనికత, అమూర్త (ఆబ్‌స్ట్రాక్ట్) ఆలో చనలు వాటిలో కానరావు. అవి ఇంద్రియాలను తాకే నిర్దిష్ట, తక్షణ విషయాలకే పరిమితం. ఒక పరిమిత ప్రపంచంలో మాత్రమే బ్రతకగలిగి, ఇంకా ఏమేమి సంభవమో దర్శించజాలని, అమూర్త సూత్రాలతో వ్యవహరించలేని మానసిక స్థాయితో, ప్రశ్నించకుండా, పుక్కిట పట్టిన ప్రవర్తనం నియమావళిని అనుసరించడమే తెగవాదం, జాతి జీవనం. తెలంగాణ నుంచి కెనడా వరకు ఇందులో మినహాయింపు లేదు.

భాషనేది భావ మార్పిడికి ఒక సమాచార సాధనం మాత్రమే. ఎన్ని భాషలు నేర్చుకుంటే భావాల (కాన్సెప్ట్) పరిధి అంతగా విస్తృతమవుతుంది. ఒక మాటలోని ధ్వని కంటే భావం ముఖ్యం. లోతుగా చూస్తే భాషా యుద్ధా లు భాష కోసం కాదు, తమ పరిమిత మానసిక చైతన్యస్థాయిని, తమ నిష్కృియాపరత్వాన్ని, తమ తెగపట్ల గుడ్డి విధేయతను, ఇతరులను గుర్తించలేని తమ అసహాయతను కప్పిపుచ్చుకోవడానికి, వాస్తవం నుంచి పారిపోవడం కోసం మాత్రమే. ఆత్మగౌరవాన్ని అధికారికంగా, ప్రామాణికంగా పొందలేని వాళ్ళకు జాత్యహంకారం ఒక సూడో ఆత్మగౌరవం ఆపాదించి పెడుతుంది. తమ కలవరపాటు, కంగారు, అస్పష్టతలు, భయాల నుండి, తమ జడచైతన్యావస్థల నుండి సురక్షితమైన భద్రత అనే భ్రమను కలగజేస్తుంది.

మనుషుల మధ్య ద్వేషాన్ని వ్యాపింపజేయాలంటే వారిని తెగలు, వర్గాలుగా విభజిస్తే చాలు. వాళ్ళే కొట్టుకు ఛస్తుంటారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థల్లో ప్రభుత్వాల అధికారాలు, నియ్రంతణలు పెరిగే కొద్దీ తెగల సృష్టి, వాటి మధ్య సంఘర్షణ పెరుగుతుంటాయి. ఒకరి ఖర్చుతో వేరొకరికి చట్టపర పక్షపాతాలు, ప్రత్యేక హక్కులు కలగజేయడం వ్యవస్థీకృత పౌరయుద్ధాలకు దారితీస్తుంది. దీన్నెవరూ ఆపలేరు. "మా న్యాయమైన వాటా మాకు దక్కాలి'', "మా వర్గం హక్కులను కాపాడాలి'' - ఇలాంటి నినాదాలు వినపడగానే సామూహికత్వం వేళ్ళూనుకుంటోందని అర్థం చేసుకోవాలి.

దానర్థం వాటాలు, అవసరమైతే లాక్కుంటామని వారి భావం. దురాశాపరులైన నాయకులు కొత్త వర్గాలకు ప్రాణం పోస్తారు. సామాన్యులకు ఒరిగేదేం ఉండదు, ప్రత్యేక హక్కులు, మేళ్ళు, గుర్తింపు పొందేది నాయకులు మాత్రమే. ఈ ప్రక్రియ ఎంతదూరం వెళ్ళిందంటే, తెగ, సామాజికవర్గ భావనలు మార్క్సిజాన్ని కూడా మరుగున పడేస్తున్నాయి. వివిధ కమ్యూనిస్టు పార్టీలు అంతర్గతంగా కుల, మత, ప్రాంత విభేదాలతో సతమతమవుతున్నాయి. కుల, మత ఆస్తిత్వ భావనల టెంకను చీల్చుకుని వారి మెదళ్ళలోకి మార్క్సిజం వెళ్ళలేకపోతోంది. ఎందుకంటే, ఎంత విమర్శనార్హమైనదైనా, మార్క్సిజం ఒక మేధో భావన, మేధో నిర్మాణం. ఎంత తప్పుడుదైనా, అదొక అమూర్త సిద్ధాంతం. దాన్ని ఈ ఇంద్రియ గ్రహణ స్థాయిలో ఉన్న మేధస్సులు అర్థం చేసుకోలేవు.

పుట్టుకను బట్టి ఎవరి తెగకు వాళ్ళు చెంది, తమ ప్రత్యేక స్వభావాలు కలిగి ఉంటే, వివిధ తెగల మధ్య సోదర భావం, సమాచారం, పరస్పర అవగాహన ఉండవు, కేవలం పరస్పర ద్వేషం, భయం, అనుమానాలే మిగులుతాయి. ఆ ద్వేష వాతావరణంలో బాంబుపేలుళ్ళ లాంటి ఆకృత్యాలు అప్రతిహతంగా సాగిపోతూనే ఉంటాయి. వాటిని కూడా సమర్థించుకోజూస్తారు. ఈ తెగ స్వభావాలతో రాజీపడడం నిరుపయోగం. అదింకా విశృంఖల ఆకృత్యాలకు దారితీస్తుంది.

విల్లంబులతో కాకపోతే, అణు బాంబులతో. కొన్ని ప్రాంతాలు విడిపోతామంటే విడిపోయే హక్కుందా లేదా అనే సంశయం కలుగుతుంటుంది. తెగల స్వభావం, వాటి అస్తిత్వం రాజకీయంగాను, నైతికంగాను అహేతుకం. హక్కులు వ్యక్తులకు మాత్రమే ఉంటాయి. గుంపులకుండవు. ఒక నియంతృత్వం నుంచో, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుంచో విడిపోయి ఒక స్వేచ్ఛా సమాజాన్ని నిర్మించుకునే హక్కుంటుంది. కానీ కొందరు నేతలు ముఠాగా ఏర్పడి, తమ సొంత నియంతృత్వాన్ని, నియ్రంతణల ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే హక్కు ఏమాత్రం లేదు. స్థానికంగాను, అంతర్జాతీయ స్థాయిలోను కాపిటలిజమొక్కటే రక్తపాత రహిత సమాజానికి, వ్యక్తుల మధ్య స్వచ్ఛంద సంబంధాలకు పూచీ ఇస్తుంది.

అన్ని ప్రాంతాల ప్రజలనూ కలుపుకుని గొప్ప సమాజాలను నిర్మించింది. పౌరుల జీవన ప్రమాణాలను ఊహించనంత ఎత్తుకు పెంచింది. తెగ స్వభావాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చారిత్రకంగా పాము, ముంగిస లాంటి తెగల నుండి వచ్చిన ప్రజలు కూడా శాంతితో కలిసి బ్రతికే వాతావరణం కల్పిస్తుంది. ప్రపంచ ప్రజల్లో ఆశ, అభ్యుదయం, సర్వమానవ సౌభ్రాతృత్వం ఇనుమడింపజేసింది. తెగ స్వభావి రాసే కవితలు రెచ్చగొడతాయి. ఎందుకంటే అవి ఇంద్రియాలను తాకుతాయి. స్వతంత్ర భావాలున్నవాడెవడైనా - హిందువైన, ముస్లిమైనా - తన మతం కోసం బాంబులు పెడతాడా?

- జాహ్నవి

No comments:

Post a Comment