Friday, September 23, 2011

దళితులకు 'నవజీవన'గ్రామాలు---- దుర్గం సుబ్బారావు Andhra Jyothi 24/09/2011


దళితులకు 'నవజీవన'గ్రామాలు

ఎనిమిది దశాబ్దాల క్రితం లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలలో 'అంటరానివారి' ప్రత్యేక రాజకీయ అస్థిత్వాన్ని డాక్టర్ అంబేద్కర్ బలంగా ప్రతిపాదించారు. 1932 ఆగస్టు 17న బ్రిటీష్ ప్రధాని "కమ్యూనల్ అవార్డ్'' ప్రకటించారు. ఈ అవార్డు అణగారిన వర్గాలకు రెండు ఓట్లు కల్పించింది.

ఒక ఓటుతో వారు అందరితో కలిసి జనరల్ అభ్యర్థిని ఎన్నుకోవచ్చు. రెండో ఓటుతో వారు తమ సొంత ప్రతినిధిని ఎన్నుకోవచ్చు. 'కమ్యూనల్ అవార్డ్ కల్పించిన రెండో ఓటు వెలకట్టలేని అవకాశమని, అది అణగారిన వర్గాల చేతిలో తిరుగులేని ఆయుధ'మని డాక్టర్ అంబేద్కర్ అన్నారు. కమ్యూనల్ అవార్డ్‌కు వ్యతిరేకంగా 1932, సెప్టెంబర్ 20న పూనా ఎరవాడ జైలులో కులహిందువుల తరఫున గాంధీ ఆమరణదీక్ష చేపట్టారు.

గాంధీ పట్టుదల వల్ల కమ్యూనల్ అవార్డ్ రద్దయి "పూనా ఒప్పందం'' 1932, సెప్టెంబర్ 24న కుదిరింది. ఈ ఒప్పందాన్ని 1935 ఇండియా చట్టంలో పొందుపర్చారు. షెడ్యూల్డ్ కులాలు తమ నిజమైన ప్రతినిధిని తామే ఎన్నుకునే కీలకమైన రాజకీయ హక్కును పూనా ఒప్పందం హరించివేసింది. మెజార్టీగా వున్న కులహిందువుల ఓట్లతో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థిని ఎన్నుకునే ప్రస్తుత 'రిజర్వ్‌డ్ నియోజకవర్గాల'కు ఆ ఒప్పందం బీజం వేసింది.

పూనా ఒప్పందం స్వతంత్ర దళిత రాజకీయ నాయకత్వాన్ని మొగ్గలోనే తుంచివేసింది. అది "పదవులు'' అనుభవించే ఆశ్రయ రాజకీయ నాయకత్వాన్ని పెంపొందించిందే కానీ నిజమైన "అధికారాన్ని'' చెలాయించగల స్వతంత్ర రాజకీయ నాయకులను తయారు చేయలేకపోయింది. ఇది అంబేద్కర్ ఊహించిన ప్రతికూల ఫలితమే. కాన్షీరాం మాటల్లో చెప్పాలంటే "పూనా ఒప్పందం దళితులను నిస్సహాయులుగా చేసింది.

దళితుల నిజమైన ప్రాతినిధ్యాన్ని చట్టసభల్లో తిరస్కరించింది. చట్టసభల్లో దళిత రాజకీయ ప్రాతినిధ్య దుస్థితి, దురవస్థ గమనించాక డా.అంబేద్కర్ మరో నూతన ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. 1942 జూలై 18-19 తేదీల్లో నాగపూర్‌లో ఆయన ఆధ్వర్యంలో జరిగిన 'ఆలిండియా షెడ్యూల్ కేస్ట్స్ కాన్ఫరెన్స్' దళితులకు ప్రత్యేక గ్రామ పంచాయతీలు కావాలని తన నాలుగవ తీర్మానంలో డిమాండ్ చేసింది. 'రాజకీయ అధికారమే సామాజిక ప్రగతికి మూలం' అనీ, 'రాజకీయ అధికారం మాస్టర్ కీ' అని దేశంలోని దళితులకు దిశానిర్దేశం చేసింది కూడా ఈ సమావేశమే. కులహిందూ గ్రామం వెలువల నివసిస్తున్న షెడ్యూల్డు కులాలు అంటరానితనం, వెలి, వివక్ష, అణచివేతలు ఎదుర్కొంటున్నారని పై తీర్మానం స్పష్టం చేసింది.

ఇండియాలోని ప్రస్తుత గ్రామవ్యవస్థ నిర్మాణ స్వభావ స్వరూపాలు మారనంతవరకు షెడ్యూల్డు కులాలు అస్వతంత్రులని పేర్కొంటూ 'షెడ్యూల్డు కులాల నివాస ప్రాంతాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భూమిని వారికి పంచాలని, భూమి కొనుగోలు చేసి సాగు భూమిని దళిత కుటుంబాలకు పంచాలనీ' ఈ తీర్మానం డిమాండ్ చేసింది.

ప్రత్యేక గ్రామ పంచాయతీల డిమాండ్‌ను దళితుల "నవ జీవన ఉద్యమం''గా అంబేద్కర్ అభివర్ణించారు. అంటరానితనాన్ని తప్పించుకొనేందుకు ప్రత్యేక గ్రామాలు తోడ్పడుతాయనీ, ప్రస్తుత గ్రామవ్యవస్థలో అంటరానితనం రాజ్యమేలుతోందనీ ఆయన అభిప్రాయపడ్డారు. 1932లో జరిగిన పూనా ఒప్పందం దళితుల అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడక యథాతథస్థితిని కొనసాగించింది.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌నే తీసుకోండి. మనకున్న పాతికవేల గ్రామాల్లోనూ అంటరానితనం, కులం ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఈ విషయాన్ని పదేళ్ల క్రితమే నిర్థారించింది. టీ షాపుల్లో రెండుగ్లాసుల పద్ధతి నుంచి అంటరానితనాన్ని సూచించే 120 పైగా వివక్షా రూపాలు గ్రామాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని నేటికీ అవహేళన చేస్తున్నాయి. మాతంగి, జోగిని, బసివి వంటి మత వ్యభిచారం, అంటరానితనపు అత్యున్నత క్రూర రూపం సఫాయీ కర్మచారి వ్యవస్థలు ఇంకా గ్రామాల్లో బలంగా కొనసాగుతున్నాయి.

దళిత మహిళలు మైక్రోఫైనాన్స్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. భూమి-జీవనోపాధులులేని దళితులు కులగ్రామ విష చట్రంలో బందీలై పోయారు. పై సమస్యలకు సరైన పరిష్కారం అంబేద్కర్ సూచించిన "ప్రత్యేక గ్రామ పంచాయతీలు''. వెయ్యిమంది దళిత జనాభా నివాస ప్రాంతాలను ప్రత్యేక గ్రామాలుగా ఏర్పరచినట్లయితే (ఉదా: చుండూరు కులగ్రామాన్ని చీల్చి అంబేద్కర్‌నగర్ గ్రామ పంచాయతీగా ఏర్పరచినట్టు) అంటరానితనం అంతర్గతంగా క్షీణిస్తుంది.

మన రాష్ట్రంలో దాదాపు పదివేల నూతన దళిత గ్రామ పంచాయతీలను ఏర్పరచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఎంతైనా ఉంది. నూతనంగా ఏర్పడే పదివేల గ్రామ పంచాయతీల పునర్నిర్మాణానికి, వికాస ప్రక్రియకు అదే గ్రామంలోని దళిత శ్రమశక్తిని "మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం'' పెట్టుబడితో అనుసంధానించుకోవచ్చు. ఈ అంబేద్కర్ "నవజీవన గ్రామాల్లో అంటరానితనం లేని పంచాయతీ భవనం, ప్రాథమిక విద్యా, వైద్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కేంద్రాలుంటాయి.

సంవత్సర గ్రామ బడ్జెట్ వుంటుంది. పక్కారోడ్లు, రక్షిత మంచినీటి సదుపాయం కలుగుతుంది. పోరంబోకు, ప్రభుత్వ భూములను పంచవచ్చు. నూతన సాగుభూమి కొనుగోలు చేయవచ్చు. గతకాలపు గ్రామాల్లో అంటరానివారిగా వున్నవారు తమ సొంత గ్రామాల్లో మానవ గౌరవం, హక్కులు పొందవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా అంబేద్కర్ గ్రామాలు 20 వేలకు పైగా బీఎస్పీ ప్రభుత్వం ఏర్పరచిన వాస్తవం కళ్లెదుటే వుంది. ఈ గ్రామాల ఏర్పాటుకు అదనపు బడ్జెట్ ఖర్చు కూడా ఉండదు.

షెడ్యూల్డ్ కేస్ట్ సబ్ ప్లాన్ (ఎస్సీఎస్పీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర బడ్జెట్ నుంచి 16.8 శాతం, కేంద్రం నుంచీ అంతే మోతాదు, పంచాయతీలకు ప్రతీ సంవత్సరం ప్రణాళికా సంఘం, ఫైనాన్స్ కమిషన్ కేటాయించే నిధులు, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల నిధులు సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు. ప్రతీ సంవత్సరం మన రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాలకు ఈ డబ్బు అందవలసి/ఖర్చు చేయవలసి వుంది. పూనా ఒప్పందం పరాధీన బానిస రాజకీయాలను పెచ్చరిల్లజేసినా, అంబేద్కర్ చూపుడువేలు సూచించిన ప్రత్యేక గ్రామాల "నవజీవన'' ఉద్యమం దళితులు, ఇతర సామాజిక పరివర్తన వాదుల కళ్లెదుటే కర్తవ్యంగా వుంది.
- దుర్గం సుబ్బారావు
సామాజిక పరివర్తన కేంద్రం కన్వీనర్
(సెప్టెంబర్24కు పూనా ఒప్పందం జరిగి 79 ఏళ్లైన సందర్భంగా)

No comments:

Post a Comment