Wednesday, September 14, 2011

పరమకుడి ఘోరం - సంపాదకీయం by Andhra Jyothi 15/09/2011


పరమకుడి ఘోరం
- సంపాదకీయం

దక్షిణ తమిళనాడు రామనాథపురం జిల్లా పరమకుడిలో దళితులపై ప్రభుత్వమే అమానుషమైన దౌర్జన్యం జరిపింది. దళిత ఉద్యమ నేత ఇమాన్యుయేల్ శేఖరన్ వర్ధంతి సందర్భంగా ఆదివారం శ్రద్ధాంజలి ఘటించేందుకు ప్రయత్నించిన దళితులపై జయలలిత ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. వందమంది దాకా గాయపడ్డారు.

శేఖరన్‌కు నివాళి అర్పించేందుకు పరమకుడికి వస్తున్న తమిళగ మక్కల మున్నేట్ర కళగం (టీఎంఎంకె) నాయకుడు జాన్ పాండియన్‌ను టుటికోరిన్ వద్ద పోలీసులు అరెస్టు చేయడంతో ఈ ఉద్రిక్తతలు తలెత్తాయి. దీనికి నిరసనగా మధురై జిల్లా చింతామణిలో ఉద్యమించిన దళితులపై కూడా పోలీసులు దమనకాండకు పాల్పడ్డారు. జాతి యావత్తు ఖండించాల్సిన సంఘటన ఇది.

అయితే పోలీసుల ప్రవర్తనను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమర్థించడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ సంఘటనపై న్యాయవిచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. దాంతో హైకోర్టు రిటైర్డ్ జడ్జితో పరమకుడి ఘటనపై విచారణ జరిపించేందుకు జయ ప్రభుత్వం దిగివచ్చింది. ఉద్రిక్తతలను నివారించడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానిక దళిత నేతలు ఆరోపిస్తున్నారు.

కుల అణచివేత, వైషమ్యాల చరిత్ర కలిగిన సమాజంలో ఏ చిన్నపాటి రెచ్చగొట్టే సంఘటన అయినా ప్రాణాంతక దాడులకు, ప్రతీకారాలకు దారితీసే అవకాశముంటుంది. అన్నిరకాల రెచ్చగొట్టే చర్యలను పోలీసు అధికారులు నివారించలేకపోయినా, అవి సామాజిక ఉద్రిక్తతలుగా పరిణామించకుండా నిరోధించేందుకు ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు వారికి అవకాశముంటుంది. జయలలిత ప్రభుత్వానికి ఆ ముందుచూపు, చిత్తశుద్ది కొరవడడంతో పరమకుడి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.

పరమకుడిలో ఏం జరిగింది? దళితులు చేసిన తప్పేంటి? 'తేవర్' మధ్యస్థ కుల సమూహానికి చెందిన సుప్రసిద్ధ సంస్కర్త, సన్యాసి పశుంపన్ ముత్తురామలింగ తేవర్‌పై అభ్యంతరకరమైన రాతలు రాసినందుకు ఒక దళిత విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన నేపథ్యంలో ఇమాన్యుయేల్ శేఖర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి, తమ ఐక్యతను చాటుకునేందుకు పరమకుడికి భారీ ఎత్తున దళితులు తరలి వచ్చారు. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా దళిత నేత జాన్ పాండియన్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో హింస తలెత్తింది.

పాండియన్ అరెస్టుకు నిరసనగా రాళ్ళు రువ్వడం, వాహనాలు దగ్ధం చేయడం తదితర హింసాత్మక చర్యలకు పాల్పడిన దళిత ఉద్యమకారులను వాటర్ కేనన్, రబ్బర్ బుల్లెట్లు వంటి వాటితో ఎదుర్కొనకుండా పోలీసులు నిజమైన బుల్లెట్లతో కాల్పులు జరిపారు. 54ఏళ్ళ క్రితం హత్యకు గురయిన ఇమాన్యుయేల్ శేఖరన్‌కు నివాళులర్పించే రూపంలో శాంతియుతంగా ప్రదర్శన చేసేందుకు తలపెట్టిన దళితులను పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదు. శేఖరన్ సమాధి వద్ద సమావేశం కావడం కొత్తేమీ కాదు. ప్రతిఏటా జరుగుతున్నదే. జయ సర్కారు పరమకుడి పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించి దళితులను భయభ్రాంతులకు గురి చేయడం పౌర హక్కులను కాలరాయడమే.

దశాబ్దాలుగా దక్షిణ తమిళనాడు 'కుల ఘర్షణ'లకు నిలయంగా ఉంది. సహజంగా కుల ఘర్షణల్లో ప్రధానంగా దళితులే నష్టపోతున్నారు. తమిళనాడులో కుల వివక్షకు, బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్భవించిన ద్రవిడ ఉద్యమం ప్రభావంతో అనేక దళిత, వెనుకబడిన, మధ్యస్థ కులాలు సంఘటితమమ్యాయి. అయితే ద్రవిడ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్ర కులాల స్థానంలో మధ్యస్థ కులాలు అధికారంలోకి రావడంతో కుల ఘర్షణల రూపురేఖలు మారాయి.

దళితులపై కుల వివక్ష రూపాలు అనూహ్యంగా రూపాంతరం చెందాయి. మధ్యస్థ కులమైన తేవర్లు దశాబ్దాలుగా దళితులపై అనేక రకాల ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో, గుళ్లలో దళితుల ప్రవేశం నిషిద్ధం. దళితులు తమ వీధుల్లోకి ప్రవేశించకుండా దారికడ్డంగా గోడలు కట్టడంలాంటి కులదురహంకార చర్యలకు తేవర్లు పాల్పడుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం ఏ రూపంలో అంటరానితనం కొనసాగినా నేరమైనప్పటికీ ఇక్కడ తేవర్లు చెప్పిందే చట్టం.

కల్లార్ (సూర్యవంశం), మరవర్ (చంద్రవంశం), అగముదయర్ (అగ్నివంశం) అనే వ్యవసాయంలో స్థిరపడిన మూడు సైనిక కులాల సమూహాన్ని తేవర్లు (ముక్కులతార్) అని పిలుస్తారు. శైవ మత భూస్వాములు వీరు. తమిళనాడు దక్షిణ, మధ్య జిల్లాలో తేవర్లదే రాజ్యం. దక్షిణ తమిళనాడు రామ్‌నాథ్ జిల్లాలో 1957లో యు.ముత్తురామలింగం తేవర్ 'ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్' (ఏఐఎఫ్‌బి)కి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఏర్పడిన ఎన్నికల వివాదం క్రమంగా కుల ఘర్షణలుగా పరిణామం చెందింది.

తేవర్లు కాంగ్రెస్‌లోని దళితులపై దాడిచేసి గృహదహనాలకు, హత్యాకాండకు పాల్పడ్డారు. అప్పటినుంచి ఆ ప్రాంతంలో తేవర్లకు, దళితులకు మధ్య కుల విద్వేషాగ్ని అనేక సందర్భాల్లో బయటపడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో దళిత వర్గాలు వామపక్షాలతో సహా వివిధ రాజకీయ పార్టీల్లో సంఘటితమయ్యాయి. 1990లలో ఈ రెండు కులాల మధ్య జరుగుతున్న పరస్పర దాడులు, ఒక దశాబ్దకాలంపాటు సద్దుమణి గాయి. మన రాష్ట్రంలోని రాయలసీమలోని ఫ్యాక్షనిజంతో పోల్చదగ్గ ముఠా తగాదాలు తేవర్ల మధ్య కూడా ఉన్నాయి.

తేవర్‌ల సంస్కృతినీ, అంతర్గత తగదాలను చిత్రీకరిస్తూ శివాజీగణేశన్, కమల హాసన్‌లతో భరతన్ 'తేవర్‌మగన్' (క్షత్రియపుత్రుడు) అన్న సినిమా తీశారు కూడా. ఆర్థికంగా, రాజకీయంగా అధిపత్య కులమైన తేవర్ల పక్షాన నిలిచిన జయలలిత ప్రభుత్వం దళితులపై దమనకాండకు పాల్పడింది.

శతాబ్దాలుగా దళితులపై అమలవుతున్న సామాజిక అణచివేతను ప్రశ్నించిన ప్రతిచోటా స్థానిక పెత్తందారీ కులాలు భౌతిక దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. తూర్పు తమిళనాడు మధురై జిల్లాలో కీల్వెన్మణి గ్రామంలో 42 మంది దళితులను ఒక గుడిసెలో పెట్టి సజీవ దహనం చేసిన ఘటన సుప్రసిద్ధం. మన రాష్ట్రంలో పాదరికుప్పం, చుండూరు, కారంచేడు, నీరుకొండలలో జరిగిన అత్యాచారాలు తెలిసినవే. కొద్ది మంది దళితులు రాజకీయంగా ఎదిగినంత మాత్రాన దళితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కనపడడంలేదు.

దళితులకు న్యాయం జరగాలంటే కులనిర్మూలన లక్ష్యం పునాదిగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాలు రావాలి. పరమకుడి ఉదంతం పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలకు ప్రజాస్వామికంగా వ్యవహరించాలనే రాజకీయ చిత్తశుద్ధి కావాలి. ఉద్రిక్తతలకు అవకాశముండే కులం, మతంలాంటి సున్నిత సమస్యలతో వ్యవహరించేటపుడు ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. బాధితుల ఆవేశాలను గుర్తించి అందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలను చేపడితే ఘర్షణలను నివారించేందుకు అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment