Thursday, September 29, 2011

బతుకమ్మ కాదు.. రాజకీయాలాడాలి - కంచ ఐలయ్య Andhra Jyothi 30/09/2011


బతుకమ్మ కాదు.. రాజకీయాలాడాలి

- కంచ ఐలయ్య

తెలంగాణలో బతుకమ్మ పండుగ బి.సి.ల పండుగ. బ్రాహ్మండ్లు, కోమట్లు, రెడ్లు, వెలమలు ఎప్పుడు ఆడెటోళ్లు కాదు. మాదిగ మాలోళ్లను కూడ సూదరోళ్లు తమలో భాగం చేసుకొని ఆడనిచ్చెటోళ్లు కాదు. పెతరమావాస్యనాడు, సద్దుల పండుగనాడు డప్పు కొట్టి దరువేసే డ్యూటీ మాదిగల్ది. కాని బతుకమ్మల్ని పేర్చుకొని శూద్ర ఆడోళ్లతో ఆడే హక్కు తెలంగాణలో కూడా వీళ్లకు లేదు. అగ్రకుల దొరసాన్లు బతుకమ్మలు పేర్చుకొని ఎన్నడు చెరువు దగ్గరకు వచ్చేటోళ్లు కాదు.

ఇప్పుడు బతుకమ్మ ఉద్యమ పండుగైంది. మంచిదే. ఆ పండుగల వైపు కన్నెత్తి చూడని వెలమ, రెడ్డి దొరసాన్లు, అక్కడక్కడ బాగ చదువుకున్న బ్రాహ్మణ అమ్మగార్లు బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ ఇప్పుడు ఊరూరి పండుగ అంటున్నారు. టి.వి.ల్లో చదువుకున్న దొరసాన్లు పట్టుబట్టలు కట్టుకొని (సెల్వార్ కమీజు లేసుకొని కాదు, జీన్‌పాంట్లు తొడుక్కొని అంతకన్నా కాదు) 'బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో' అంటూ ఉయ్యాలూగుతుంటే అందరు ఆనందంగా చూస్తున్నారు. కాని ఊరి బతుకమ్మల్లో ఈ ఉద్యమ ఉర్రూతలో కూడ మాదిగ, మాల ఆడోళ్లు పట్టుబట్టలు కట్టుకొని దొరసాన్ల పక్కన నిలబడి బతుకమ్మ లాడుతున్నారా!

సహజంగా బతుకమ్మ ప్రకృతిని ప్రతిబింబించే పూల పండుగ. మొదటి తొమ్మిది రోజులు ఆడోళ్ల పండుగ, ఆడబిడ్డలు అన్నదమ్ముల మెడలొంచి బట్టలు కొనుక్కునే పండుగ, నగలు చేయించుకునే పండుగ. సద్దుల తెల్లారొచ్చే దసరా తాగి, తినే మొగోళ్ళ పండుగ. ఆనాడు ఆయుధ పూజ అగ్రకుల సంస్కృతి అయితే, మందు తాగడం, మాంసం తినడం కింది కులాల పండుగ రూపం. ఈ పండుగను తెలంగాణ దొరలు వాళ్ల అవసరాన్ని బట్టి వాడుకున్నారు. సాధారణంగా బతుకమ్మ వరి కలుపుల సందర్భంగా వస్తుంది.

ఇంకా వానాకాలం ఉండి, చెరువులు కుంటలు కళకళలాడే రోజుల్లో వచ్చే పండుగ ఇది. ఆడోళ్లు బతుకమ్మలాడుతుంటే మొగపిల్లలు పాపెడు కాయలతో గొట్టాలాడే పండుగ ఇది. కాని దొరలు కలుపులు తీసే ఆడోళ్లను కనీసం సద్దుల పండుగనాడు కూడ కాస్త పొద్దుగాల యింటికి పోనివ్వకపోయేది. దాంతో ఆ తల్లులు తమ పసిపిల్లలకు సైతం డొప్పల్లో పాలు పిండి ఇంటికి పంపిన సంస్కృతి ఇక్కడి దొరలకున్నది. అందుకే దొరలున్న గ్రామాల్లో ఆడోళ్లు బతుకమ్మలాడేప్పుడు ఇట్ల పాడేటోళ్లు:

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో
బంగారు బతుకమ్మ.. ఉయ్యాలో
బట్టలిప్పి దొరలు.. ఉయ్యాలో
బతుకమ్మ లాడిస్తే.. ఉయ్యాలో
డొప్పలల్లో దొరలు.. ఉయ్యాలో
పాలు పిండి - పంపే.. ఉయ్యాలో
పాపాలు చేసిండ్రు.. ఉయ్యాలో
పాణాలు తీసిండ్రు.. ఉయ్యాలో...

తాంబాలాల్లో బతుకమ్మను పేర్చుకొని, నట్ట నడుమ బొడ్డమ్మను పెట్టుకొని సద్దుల పండుగ రోజున కూడ సద్దికి బువ్వలేక మొక్కజొన్న పాలా లేంచుకొని, సత్తు పిండి కొట్టుకొని, చెరువులో బతుకమ్మను వదులుతూ గౌరమ్మ గౌరమ్మ ఎన్నియలో
బంగారు గౌరమ్మ ఎన్నియలో
గంగలో కలువమ్మ.. ఎన్నియలో
కష్టాలు కడతేర్చి.. ఎన్నియలో
కన్నీళ్లు కడతేర్చు ఎన్నియలో

అని పాడి, తినడానికి పెరుగు బువ్వ కూడ దిక్కు లేక, సత్తు పిండి బుక్కి ఇక్కడి బి.సి ఆడోళ్ళు ఇండ్లకు పోయిన రోజులెన్నో! ఈ స్థితిలో కూడ మాదిగ, మాలోళ్ళు డప్పులు కొడుతూ దూరం నిలబడాల్సిందే. గ్రామాల్లోని ఈ స్థితిపై ఎన్నడూ కనికరం రాలేదు.

అదే దొరలు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి ప్రమాదమని కమ్యూనిస్టు ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం పుట్టాయి. ఈ క్రమంలోనే ముందు రెడ్డి దొరల నాయకత్వంలో 1969 తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం పుట్టింది. ఇప్పుడు వెలమ దొరల నాయకత్వంలో నడుస్తుంది. ఈ రెండు ఉద్యమాలు కూడ బతుకమ్మ పండుగలో మాదిగ, మాలల నుండి, చాకలి, మంగలి కులాలు, మిగతా బిసి కులాలతో కలిసి బతుకమ్మ ఆడాలని, ఆకలిని, అంటరానితనాన్ని ఈ ప్రాంతం నుండి పారదొయ్యాలని సాంస్కృతిక ఉద్యమాన్ని నడుపలేదు. 1969 నుండి ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్లు, వెలమ, రెడ్డి దొరలు ఒక్కటయ్యారు.

ఇప్పుడు విప్లవకారులు, వెలమలు, రెడ్లు కలిసి తెలంగాణ ఉద్యమం నడుపుతున్నారు. ఈ క్రమంలో రెడ్డి, వెలమ దొరలు, తిరిగి గ్రామాల్లోకి పోవడమే కాక తెలంగాణ తల్లి పేరుతో పట్టుబట్ట కట్టుకొని, బంగారు నగలు పెట్టుకున్న ఒక దొరసాని చేతిలో బతుకమ్మను పెట్టారు. ఎంత విచిత్రం!

ఇప్పుడు బి.జె.పి, టిఆర్ఎస్, విప్లవ పార్టీలు 'సిద్ధాంతానికతీతంగా' తెలంగాణ తెస్తరట. ఒక దొర్సాని నాయకత్వంలో ఊరూర బతుకమ్మ ఉయ్యాలలూగుతున్నది. ఈ ప్రాంతంలో అందరికీ సమాన చదువు అమలై ఉంటే బతుకమ్మ పండుగను దళితులు, బి.సి.లు, అగ్రకుల స్త్రీలతో కలిసి ఆడుకుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది.

కమ్యూనిస్టు ఉద్యమమో, మావోయిస్టు ఉద్యమమో తెచ్చిన మార్పులో దళితులో, బి.సి.లో ఉద్యమానికి నాయకత్వం వహించి ఒకనాటి దొరలు పాలితులుగా మారో కార్యకర్తలుగా పనిచేసే ఉద్యమమేదో నడుస్తుంటే ఇక్కడి దళిత-బహుజనులు ఆనందపడితే అర్థముంది. కాని దొరలు దొరసాన్లు కొత్త తరహా ఉద్యమం నడుపుతున్నారు. ఒకవైపు సమాజాన్ని మార్చే చదువును సంపూర్ణంగా ఈ ప్రాంతంలో బందుపెట్టి, ముఖ్యంగా ఇక్కడి బి.సిలచేత బతుకమ్మలాడిస్తూ, వాళ్ళు ఈ ప్రాంతంపై సంపూర్ణ అధికారం సాధించడానికి రాజకీయాలాడుతున్నారు. అంటే ఇక్కడి దళిత, బహుజనులు నిరంతరం బతుకమ్మ, లేదా ధూం ధాం ఆడాలి. వాళ్ళు రాజకీయాలాడుతారు. దళితులు అన్నిటికీ డప్పులు కొట్టాలి.

ఇప్పుడు సంవత్సరాల తరబడి స్కూళ్ళు, కాలేజీలు బందు పెట్టి బతుకమ్మ లాడిస్తుంటే, ఆ పిల్లల తల్లులు ఏ పాట పాడాలి. గౌరమ్మ, గౌరమ్మ... వలలో
బంగారు - గౌరమ్మ... వలలో
దొరల రాజ్యమొస్తే - వలలో
ధరలు తగ్గుతాయి - వలలో
'ఆడి' కార్లళ్ళో... వలలో
ఆనంద భోగాలు.... వలలో
మనింటికొస్తాయి... వలలో అని పాడుకోవాలి. ఊరూరి బతుకమ్మ "ఆంధ్ర టివి''లలో ఐక్య సంఘటన ఎందుకు కట్టింది? ఆం«ద్రులు కరుణించి డోనేషన్లు ఇస్తే ఇప్పుడు బతుకమ్మలు పూలతో కాదు, నోట్లతో పేర్చొచ్చు!

బి.జె.పి., టిఆర్ఎస్, ఒక మావోయిస్టు గ్రూపు (న్యూడెమోక్రసీ) రాబోయే ఎన్నికల్లో పొత్తుల పోటీ చెయ్యొచ్చు. ఈ పొత్తు పేరు 'తెలంగాణ విప్లవ'మని కూడ పెట్టొచ్చు. ఈ ప్రాంతపు బి.సి.లంతా రేపు నరేంద్ర మోడీ బి.జె.పి ప్రధాన మంత్రి కేండేట్ ఐతే బతుకమ్మలా కదిలి ఆ కూటమికి ఓటు వెయ్యవచ్చు. బి.జె.పి 'వచ్చేది మేమే ఇచ్చేది మేమే' అనే నినాదంతో మన చేత ధూం «ధాం ఆడించవచ్చు.

కాని క్రమంలో మనరక్తం పంచుకొని ఇక్కడ బతుకుతున్న ముస్లింల సంగతేమైతుందో ఎవరు ఆలోచించాలి? ఇక్కడి సంస్కృతిని, విద్యను సర్వనాశనం చేసిన దొరలు దొరసాన్లు ప్రత్యేక రాష్ట్రం పేరుతో ఇక్కడి దళిత-బహుజనుల్ని తోలుబొమ్మల్ని చేస్తే జరిగేదేంటి? రాబోయే తెలంగాణను ఎవరు పాలిస్తారు. ఇక్కడి స్కూళ్ళను బందుపెట్టి, తెలంగాణ ఉద్యమ నాయకులందరు తమ పిల్లల్ని విదేశాల్లోనో, ఇతర రాష్ట్రాల్లోనో చదివిస్తుంటే మన ఉపాధ్యాయులంతా ఉర్రూతలూగుతూ పాటలు పాడుతున్నారు.

ఈ మధ్య ఒక తెలంగాణ ఉపాధ్యాయ విద్యావేత్త తెలంగాణ వచ్చేవరకూ స్కూళ్ళు నడువకుండా చూసి తమ సత్తా చాటుకోవాలన్నారు. ఏ స్కూళ్ళను? ప్రభుత్వ స్కూళ్ళను! తెలంగాణ వచ్చినంక బతుకమ్మ లాడే బి.సి. స్త్రీలు మంత్రులౌతారా! ఐతే చదువు సరిగా రాకుండా ఫైల్లెట్ల రాస్తారు? ఈ ప్రాంతపు యస్.సి., యస్.టి., బి.సి. తల్లుల కర్తవ్యం స్కూళ్ళు బందు పెడుతుంటే, ఆనందపడి బతుకమ్మ లాడితే లాభం లేదు. ఈనాటి బతుకమ్మకు రాజకీయాలు లేకుండా లేవు?

దొరల ఉపన్యాసాలకు రెచ్చిపోయి, ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లులు ఏం బతుకమ్మ లాడుతున్నారు? వాళ్ళకు తినడానికి తిండి ఉందా? ఒకపక్క కొడుకుల్ని, బిడ్డల్ని, ఆకుల్లా రాల్చేసిన ఉద్యమంలో దొరసాన్లకు పట్టుబట్టలు కట్టుకొని 'ఆడి'కార్లల్లో ఎట్లా తిరుగబుద్ధవుతుంది? ఇదే సంస్కృతిని తెలుపుతుంది. వీళ్ళ పట్టుబట్టల్ని, బంగారు నగల్ని, ఆడికార్లని వేలం వేసినా, పిల్లల్ని కోల్పోయిన తల్లులకు కనీసం కట్టుకోడానికి బట్టలు దొరుకుతాయి.

ఈ ప్రాంతపు బడుగు జీవులు, రాజకీయాలు దొరలకు, దొరసాన్లకు వదిలి వీళ్ళు బతుకమ్మలాడినంత కాలం వీళ్ళ బతుకు బతుకమ్మే అవుతుంది. దానితో ఆడుకొని చివరికి గంగలో కలుపుతారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే లోపే వాళ్ళు బతుకమ్మ లాడుతుంటే ఇక్కడి బడుగు జీవులు రాజకీయాలాడే అగ్రిమెంట్‌కు సిద్ధమేనా? అడుగండి.

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత

No comments:

Post a Comment