Friday, September 30, 2011

దళితులకు దూరమైన బతుకమ్మ By - ఆశాలత Andhra Jyothi 1/10/2011


దళితులకు దూరమైన బతుకమ్మ

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి చిహ్నం. తెలంగాణ పోరాటానికి వ్యక్తీకరణగా కూడా మారింది. దసరా పండుగకు ముందు వచ్చే బతుకమ్మ పండుగను తెలంగాణ స్త్రీలందరూ జరుపుకుంటారనే అభిప్రాయం సాధారణంగా అందరిలోను వుంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా రోడ్లపై బతుకమ్మ ఆడుతున్నప్పుడు ఈ అభిప్రాయం బలంగా నాటుకుంది. కాని ఇందులోను కులభేదం ఉందని, దళిత స్త్రీలు బతుకమ్మ పండుగ జరుపుకోరనే నిజం అంత విస్తృతంగా బయటికి రాలేదు.

అసలు బతుకమ్మ మాదే, ఎన్నడో మా తాతలనాడు పెద్ద కరువొచ్చి తిననీకి తిండిలేక అడ్డెడు తవుడుకు (నూకలు కూడా దొరకని పరిస్థితి) బతుకమ్మను పై కులాలవారికి అమ్ముకున్నారట, అప్పటి నుండి మాకు బతుకమ్మ లేదు అని మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతపు మహిళలు చెప్పారు.

బతుకమ్మను పేర్చి దాని చుట్టు పాటలు పాడుతు ఆడుకోవాలన్న కోరిక వున్నా ఎన్నడో పెద్దలనాడు పోయిన ఆచారాన్ని ఇప్పుడు మళ్ళీ మొదలుపెడితే ఏం కీడు జరుగుతుందోననే సంశయము, నిరాశ కూడా ఆ దళిత స్త్రీల మాటలలో వ్యక్తమయింది.

దళిత స్త్రీలు బతుకమ్మ పండుగ జరుపుకోకపోవటానికి సిద్ధిపేట - కరీంనగర్ ప్రాంతపు ముదిరాజ్ కులానికి చెందిన స్త్రీలు మరొక వివరణ చెప్పారు, అదేమిటంటే - బతుకమ్మకు ప్రసాదంగా మేము పెరుగన్నం, పులిహోర, చింతకాయ పచ్చడి, నువ్వులపొడి, బెల్లం పెడతాము. వాళ్ళు ఎద్దు కూర తింటారు కదా, వెనుకట్కి వాళ్ళు ఎద్దు కార్జం ప్రసాదంగా పెట్టారట, దానితో గౌరమ్మకు కోపమొచ్చి వాళ్ళ దగ్గరి నుండి వెళ్ళిపోయిందట.

ఏది ఏమైనా దళితులు గతంలో బతుకమ్మ పండుగను జరుపుకునేవారని, ఆ తర్వాత అది వారికి కాకుండా పోయిందని పై రెండు వివరణలను బట్టి తెలుస్తోంది. తిండిలేక బతుకమ్మను పై కులాలవారికి అమ్ముకున్నామని దళిత స్త్రీలు నమ్ముతున్నప్పటికీ, అగ్ర కులాలవారు దళితుల పేదరికాన్ని, నిస్సహాయతను ఆసరా చేసుకుని వారిని పండుగనుండి దూరం చేసివుండవచ్చు అనటంలో ఎటువంటి సందేహము ఉండనక్కరలేదు.

శతాబ్దాలపాటు సాగిన, ఇంకా సాగుతున్న క్రూర కుల పెత్తనం, దురహంకారం దళితుల మాన ప్రాణాలనే కాలరాయగా లేనిది, వారి పండుగలను స్వంతం చేసుకుంటే ఆశ్చర్యపడనక్కరలేదు. ఎద్దుకూర ప్రసాదం పెట్టారు కనుక గౌరమ్మకు కోపమొచ్చి మాలమాదిగలనుండి వెళ్లిపోయిందని వారిని కించపరిచి, అవమానించి, వారిపై పెత్తనం చేసే కులాలవాళ్ళు అనటం బ్రాహ్మణీయ హిందూమత సంస్కృతికి అద్దం పడుతుంది. బతుకమ్మను దళితులనుండి లాక్కోవటానికి ఇటువంటి కథలల్లారని భావించటానికి ఆస్కారం కల్పిస్తుంది.

నైజాము పాలననాటికే దళిత స్త్రీలు బతుకమ్మ పండుగ జరుపుకోవటంపై నిషేధముందని, ఆ కాలంలో బి.సి.లలోని కింది కులాలవారు బతుకమ్మ పండుగ జరుపుకునేవారని, దొరల గడీలముందు పేదింటి మహిళలచేత బలవంతంగా బతుకమ్మ ఆడించేవారని చారిత్రక సాహిత్య ఆధారాలున్నాయి.

బతుకమ్మను క్రింది కులాల పండుగగా భావించి గతంలో రెడ్డి, వెలమ స్త్రీలు జరుపుకునేవారు కాదని, తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత బతుకమ్మ తెలంగాణ ఆకాంక్షకు ప్రతిరూపంగా మారటంతో, అధికారాన్ని స్వంతం చేసుకోవటానికి ఈ పెత్తందారీ కులాల స్త్రీలు కూడా రోడ్లపైకి వచ్చి బతుకమ్మ ఆడటం మొదలు పెట్టారని కంచ ఐలయ్య ఇదివరకే విశ్లేషించారు. తెలంగాణ తల్లి విగ్రహం తలపై దళితులు చేసుకునే బోనాలను ఉంచకుండా చేతిలో బతుకమ్మను ఎందుకు పెట్టారని కూడా ఐలయ్య ప్రశ్నించారు.

దళితులకు బతుకమ్మను దూరం చేసినప్పటికీ ఈ రోజున కూడా దళిత స్త్రీలు బతుకమ్మను పేర్చటానికి తంగేడు, గునుగు పూలు ఏరి పై కులాలవారికి తెచ్చిస్తారు. మాదిగలు డప్పు కొట్టనిదే సద్దుల బతుకమ్మనాడు బతుకమ్మలు చెరువుకు బయలుదేరవు. గౌరమ్మను పెట్టి బతుకమ్మను పేర్చి పండుగ చేసుకునే అవకాశం లేక బతుకమ్మపై ఆశ చావక దళిత స్త్రీలు తమ వాడలలో విడిగా బతుకమ్మపాటలు పాడుతూ ఆడుకుంటారు. రాజకీయ చైతన్యం పెరిగినచోట్ల బి.సి. స్త్రీలు, దళిత స్త్రీలు కలసి ఆడుకోవటం ఇటీవలి పరిణామం.

దసరా పండుగకు 9 రోజుల ముందు పెద్దల అమావాస్య నాడు మొదలై అష్టమినాడు చేసే సద్దుల బతుకమ్మ వరకు తెలంగాణలో గ్రామగ్రామాన 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో' అనే పాట సాయంత్రంపూట అలలు అలలుగా వినిపిస్తుంది, గంటలతరబడి స్త్రీలు లయబద్ధంగా, అలుపులేకుండా పాడుతు, ఆడుతుంటారు.

ఈ పాటలలో చోటుచేసుకునే అనేక జానపద కథలు తెలంగాణ చరిత్రను వివరిస్తాయి. బతుకమ్మను పేర్చటానికి గునుగు, తంగేడు, బంతి, చేమంతి, గుమ్మడి వంటి పలురకాల పూలు కావాలి. ఆ పూలు సకాలంలో పూయాలంటే వర్షాలు సకాలంలో పడాలి, వాతావరణం అనుకూలించాలి. ఈ పూలకు పొలాలలో వేసే పంటలకు సంబంధముంది. చెలకభూములలో వేసే మొక్కజొన్న పంటలో గునుగు కలసి పెరుగుతుంది (కలుపు మొక్క అనలేము).

ఇప్పుడు మొక్కజొన్న బదులు ప్రతి పంట వచ్చేసింది, దానికి వేసే రసాయనాలు గునుగుకు విషంగా మారిపోయాయి. బతుకమ్మను సాగనంపటానికి చెరువులనిండా నీరుండాలి. సెజ్‌లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, పెట్టుబడిదారులకు భూములు నైవేద్యమైపోయాయి, మిగిలిన భూములలో పంటలు మారిపోయాయి. చెరువులు ఆక్రమణకు గురై, మట్టిమేటలు వేసి, కంపెనీలు వదిలే కాలుష్యాన్ని నింపుకున్న మురికి గుంటలుగా మారాయి. నేడు తెలంగాణలో బతుకమ్మ పండుగ జరుపుకోవటమే గగనమైపోయింది. వనరుల దోపిడీతో తెలంగాణ తల్లడిల్లుతున్నట్లే పూలు లేక నీళ్ళు లేక బతుకమ్మ బోసిపోతున్నది.

బతుకమ్మ పండుగలో కుల పెత్తనముంది, వర్గ దోపిడీ వుంది, స్త్రీ సమస్య వుంది, వనరుల పరాయీకరణ వుంది. బతుకమ్మకు తెలంగాణ ఆకాంక్షకు చాలా పోలిక వుంది. బతుకమ్మ దళితులకు దూరమయినట్లు తెలంగాణ వనరులలో, ఆత్మగౌరవంలో, స్వయంపాలనలో, నిర్ణయాధికారంలో దళితులకు, పీడిత తాడిత బహుజనులకు, శ్రామిక స్త్రీలకు భాగం లేకుండా పోయే ప్రమాదం పొంచి వుంది.

అయితే తాతలనాడు బతుకమ్మను జారవిడుచుకున్నట్లు దళిత బహుజనులు తెలంగాణను జారవిడుచుకోవటానికి సిద్ధంగా లేరు. బతుకమ్మను లాక్కున్నంత సులభంగా ఈ రోజున పెట్టుబడిదారులు, దొరలు తెలంగాణను స్వంతం చేసుకోలేరు. ఎందుకంటె తెలంగాణ ఆకాంక్ష బతుకమ్మలాగే పల్లెపల్లెన కొలువై అణగారిన ప్రజల నరనరాన జీర్ణించుకుని ఉంది.
- ఆశాలత

No comments:

Post a Comment