Monday, September 19, 2011

సర్వజనుల కర్తవ్యం -చిక్కుడు ప్రభాకర్ Andhra Jyothi 20/09/2011


సర్వజనుల కర్తవ్యం
-చిక్కుడు ప్రభాకర్

ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంది. నాయకత్వ శక్తులు విడివిడిగా ఉన్నాయి. తెలంగాణ బిడ్డలు ఇప్పటికే ఇంచుమించు 700 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజాపోరాటం సకలజనుల సమ్మె రూపంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక డిమాండ్‌గా ముందుకొ చ్చింది. నాలుగుకోట్ల ప్రజల కర్తవ్యాన్ని మరోసారి గుర్తుచేస్తూ 2009 నవంబర్ 30నాటి స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరుతూ అమరుల ఆశయాలను గుర్తుచేస్తున్న తరుణంలో నేను రాసిన వ్యాసం (ఆగస్టు 16న) ప్రచురించబడింది.

నా రాజకీయ అవగాహనకు అనుగుణంగా వందలాది యువకిశోరాలు తమ ప్రాణాలర్పించి తెలంగాణలో ఒక కారంచేడు, చుండూరు, నీరుకొండ, వేంపెంట జరుగకుండ చూశా రు. తెలంగాణలో దొరల, బడా పెట్టుబడిదారుల, పాలెగాళ్ళ రాజ్యం రాకుండా ఎలా పోరాటం చేశారో వివరిస్తూ, 'ప్రత్యేక ప్రజాస్వామిక తెలంగాణ స్ఫూర్తితోనే తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ అగ్రనాయకునిగా తెలంగాణ జెఏసిల సమన్వయ ఫ్రంట్ నేతగా, తెలంగాణ ప్రజాఫ్రంట్ కార్యదర్శిగా ఆ వ్యాసం రాశాను.

నేను 'తొలిమెట్టు', 'ముందు షరతు' అన్నాను కాని భౌగోళిక తెలంగాణలోనే అన్నీ సాధ్యమవుతాయని అనలేదు. అననివి అన్నట్లు ఊహించుకోవడం, ఆ వ్యాసంలో ఉన్న 'భౌతిక వాస్తవికత'కు దూరంగా ఆలోచించడమే అవుతుంది. ఏ ఉద్యమానికైనా అం తిమ లక్ష్యసాధనకు నిర్దిష్ట ఎత్తుగడలుంటాయి. అందులో భాగమే 'సకలజనుల సమ్మె'గా ఇప్పటికీ కట్టుబడివున్నాను. నా వ్యాసానికి స్పందిస్తూ మిత్రులు ఉ.సా.(ఆగస్టు 19న),డాక్టర్ జిలుకర శ్రీనివాస్ (ఆగస్టు 29న), పాపని నాగరాజు, వెంకట నారాయణ (సెప్టెంబర్ 6న) వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలకు నా స్పందనే ఈ వ్యాసం.

ఏ విషయాన్నైనా సమగ్ర పరిశీలన చేసి స్వీయాత్మకతకు గురికాకుండా, వస్తుగతంగా విశ్లేషణ చేయడమే మార్క్సిస్టు విశ్లేషణ అంటారు. మరి నేను ప్రస్తావించిన మిత్రుల విశ్లేషణ అందుకు విరుద్ధంగా ఉన్నది. ఉద్యమం తొలి ఫలితాలు, అంతిమ ఫలితాలు ఉన్నట్లే ఉద్యమ తొలి లక్ష్యం, అంతిమ లక్ష్యం ఉంటుంది. అంతిమ లక్ష్యపు ఫలితానికి తొలి లక్ష్యం ముందు షరతుగా ఉంటుంది తప్ప దశల సిద్ధాంతంగా చెప్పడం లేదు. రూపం-సారం రెండిటినీ సమగ్రంగా పరిశీలించినప్పుడే ఆ విషయంపై సమగ్ర అవగాహనగా ఉంటుంది.

గత ఏప్రిల్‌లో సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులతో తెలంగాణ ప్రాంత సూడో సామాజికవాదులు కుమ్మక్కయ్యారు. ఈ విషయంలో అగ్రభాగాన నిలబడుతున్న మంత్రులు, డిప్యూటీ స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకొందరు చోటా మోటా నాయకులు కేంద్రంలోని తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసి దొరల తెలంగాణ వద్దని, ఇస్తేగిస్తే సామాజిక తెలంగాణ ఇవ్వాలని వితండవాదం చేస్తున్నారు. అసలు తెలంగాణ ఉద్యమానికే చిచ్చుపెట్టే ప్రయత్నమిది. వారిబాటనే నడిచే కొందరు, సామాజిక తెలంగాణ ఉద్యమకారుల్లాగా ముందుకు వచ్చి, ఇప్పుడు తెలంగాణ కనుక వస్తే సామాజిక తెలంగాణ రావాలని అంటున్నారు.

దొరల తెలంగాణ వద్దని అనడం వెనక తెలంగాణ రాకుండా అడ్డుపడే కుట్ర దాగి ఉన్నది. నిజమైన సామాజిక పునాది కలిగిన ప్రత్యేక ప్రజాస్వామిక తెలంగాణలోనే సామాజిక కులాలకు న్యాయం జరుగుతుందని, నిజమైన సామాజిక పునాది భావజాలాన్ని విస్తృతంగా ఉద్యమంలో చొప్పిస్తూ, నిర్మాణంలోనూ ఈ విషయాన్ని అగ్రభాగాన నిలబెడుతూ ఉద్యమక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఉద్యమంలో ప్రతి మలుపును సమగ్రంగా పరిశీలించి ఉద్యమ ఉధ్ధృతికి పాటుపడుతున్నాం.

నా వ్యాసం, ఒక టీవీ చర్చలో నేను చెప్పిన విషయానికి భిన్నంగా ఉన్నట్లు ఉ.సా.రాశారు. నాడు తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ అనే 'ఐక్య సంఘటన' ఏర్పాటులో ఉద్యమ మౌలిక అంశాలయిన 'తెలంగాణ వనరుల రక్షణ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమించాలని నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నాను; తెలంగాణ జెఏసిల సమన్వయ ఫ్రంట్‌లోను, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటులోను అదే విషయాన్ని కొనసాగిస్తున్నాను; సామాజిక న్యాయపునాదిని పటిష్టపరచుకుంటూ వరంగల్ డిక్లరేషన్ స్ఫూర్తిని కొనసాగిస్తూనే చేతనైనంతగా ఉద్యమానికి నాయకత్వం వహించే ప్రయత్నం చేస్తున్నాను. అంతే తప్ప ఉ.సా.గారంత సమయస్ఫూర్తి కలిగిలేను. ఉ.సా.వాదిస్తున్న సామాజిక న్యాయాన్ని అర్థం చేసుకోగలను.

అమరుడు మారోజు వీరన్న మాటలను ఉ.సా.తన వ్యాసాలలో ప్రస్తావిస్తుంటారు. వీరన్న అనుసరించిన సిద్ధాంతాన్నే ఇప్పటికీ అమలుపర్చుతున్నానని ఉ.సా. అంటారు. కాని ఆ స్ఫూర్తిని నా వ్యాసంపై తన స్పందనలో చూపలేకపోయారు. ప్రపంచ సోషలిస్టు విప్లవంలో భాగంగా మన దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించాలని వీరన్న చెప్పారు. అది సాధించాలంటే హిందూ అగ్రవర్ణ బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాల భూస్వామ్యాన్ని తొలగించాలని, మన స్థల కాల పరిస్థితులకు అనుగుణంగా ఎంఎల్ఎంను జోడించాలని చెబుతూ లక్ష్య సాధనకు సంపూర్ణ ఎత్తుగడలు రూపొందించుకునే సమయంలో వీరన్న అమరుడయ్యారు. ఆయనంటే మాకు గౌరవమున్నది.

అయితే వీరన్న బతికుండగా విడుదల చేసిన సూర్యాపేట డిక్లరేషన్‌కు, ఉ.సా. నేతృత్వంలో గత ఏడాది జనవరి 21న విడుదల చేసిన హైదరాబాద్ డిక్లరేషన్‌కు వ్యత్యాసముంది. హైదరాబాద్ డిక్లరేషన్ లో ఇలా ఉంది: 'ఉత్తరప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించడానికి ఇటీవల కాంగ్రెస్ చేసిన అగ్రకుల రాజకీయ ఎత్తుగడల్ని చిత్తు చేయడానికి మాయావతి సారథ్యంలోని బీఎస్పీ మూడు రాష్ట్రాల ఏర్పాటుకు సిద్ధమేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కార్యరూపం దాల్చితే ఏక కాలంలో మూడుచోట్ల భౌగోళిక రాష్ట్రాలతో పాటు బహుజన రాష్ట్రాలు కూడా ఏర్పడుతాయి. 1996లో శ్రామిక దళిత బహుజన సామాజిక తెలంగాణ వాదుల సారధ్యంలో ఉద్యమం మొదలైంది.

కనుక ఆ ఉద్యమం భౌగోళిక, సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమంగా నడిచింది. వారి సారధ్యంలోనే తెలంగాణ ఏర్పడితే, అది సామాజిక తెలంగాణ ప్రజారాజ్యంగానే ఆవిర్భవిస్తుంది'. ప్రజా ఉద్యమ శక్తులు ముందుకు తెచ్చిన భౌగోళిక-సామాజిక తెలంగాణ ఉమ్మడి ఎజెండాని స్వీకరించకుండా కనీసం రాజకీయరంగంలో వారి ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టకుండా నూతన రాజకీయశక్తులు (నవ తెలంగాణ, ప్రజారాజ్యం) తాను ప్రతిపాదించిన సామాజిక న్యాయ ఎజెండాను సొంతం చేసుకొని అధికారంలోకి రాలేకపోయాయని ఉ.సా. బాధపడ్డారు. నిజానికి ఆయన సిద్ధాంతం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదు.

ఈ కొత్త రాజకీయ శక్తులు అధికారంలోకి వచ్చినా అటు సీమాంధ్రలోగానీ, ఇటు తెలంగాణలో గానీ అణగారిన, వెనుకబడిన కులాలకు, మైనారీటీలకు దక్కేది ఏమీ లేదు. గతంలో 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం'అనే ఈ వర్గవాద సిద్ధాంతం ఏ ప్రాంత ప్రజలకూ ఒరగబెట్టిందేమీ లేదు. ఆ సిద్ధాంతమే ఆంధ్రప్రదేశ్ పేరుమీద సీమాంధ్ర అగ్రవర్ణ భూస్వామ్య పెట్టుబడిదారులకు స్వర్గ ధామం నేర్పాటు చేసింది.

అలాగే ఉ.సా. ప్రవచిస్తున్న ప్రత్యేక తెలంగాణలో ప్రజారాజ్యం సిద్ధాంతం తెలంగాణలోని దళిత, వెనుకబడిన, మైనారిటీలకు ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా, ఆయా సామాజిక కులాలలోని ప్రజలను దోచి అధికారంలోకి వచ్చిన, వస్తున్న వారికీ ఉపయోగపడుతుంది. పాలక వర్గంలోని శక్తులను, ప్రజా ఉద్యమ శక్తులను ఒకే గాటన కట్టేస్తూ, పాలకవర్గాల పంచన చేరిన శక్తులను మోసే ప్రయత్నాన్ని డాక్టర్ జిలుకర శ్రీనివాస్ చేస్తున్నారు.

తను మోస్తే తనకు సంతృప్తికావచ్చు కానీ, తన జాతి మొత్తం మోస్తుందని కితాబునివ్వడం గతం, వర్తమానం, భవిష్యత్‌ను నిరాకరించడమే అవుతుంది. నేను పైన చెప్పినట్లు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షగా ముందుకు వచ్చిన 'సకలజనుల సమ్మె'లో పాల్గొని దళిత, వెనుకబడిన, మైనారిటీ వర్గాల హక్కుల రక్షణ ఉద్యమించడం ద్వారా సాధ్యమవుతుందని అన్నాను. అంతేకాని కేసీఆర్‌తోనో, చంద్రబాబుతోనో, కిరణ్‌కుమార్‌రెడ్డితోనో అధికారం కొరకు పొత్తుపెట్టుకొని అంటకాగమని చెప్పలేదు.

అలాగే గత పదిహేనేళ్ళుగా ప్రతి ఎన్నికలలోను అగ్రకులాల నాయకులతో చెట్టాపట్టాలేసుకొని అధికారంలోకి ఎక్కించేందుకు కృషి చేస్తూ, ఆఖరుకు అత్యంత అవినీతిపరునిగా చరిత్రలోకెక్కిన అగ్రకుల పాలెగాన్ని కూడా గెలిపించమని కోరిన నాయకత్వాన్ని మోస్తూ, ఇదే పోరాటమని, ఈ చదరంగమే జాతి వికాసానికి తోడ్పడుతుందని వాదించడం ద్వారా తను ఎవరి పంచన చేరుతున్నారో శ్రీనివాస్ గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు ఈ రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వచ్చేందుకు దళిత, వెనుకబడిన, మైనారిటీలను ఓట్లుకాసే చెట్లుగానే చూశాయన్నది ఒక కఠోర వాస్తవం. ఆ వర్గాల సమగ్ర వికాసం కోసం కనీస కృషి చేయలేదు.

అటువంటివారితో ఏఏ రూపాలలో ఒప్పందాలు చేసుకున్నా అవి సీమాంధ్ర, తెలంగాణ పెద్దమనుషులు చేసుకున్న ఆరు సూత్రాల, అష్ట సూత్రాల ఒప్పందాల మాదిరిగానే బుట్ట దాఖలవుతాయి. శ్రీనివాస్ ప్రతిపాదించిన అంశాలన్నీ రాజ్యాంగ బద్ధంగా ఒప్పందం చేసుకున్నా, అమలు కానివ్వని చరిత్ర నేటి పాలకులది. ఒక రాజ్యాంగ ఆమోదం లేకుండా చేసుకునే ఒప్పందాలు, పథకాలు 'నీటి బుడగలు'గానే మాయవమవుతాయనే చారిత్రక వాస్తవాన్ని ఉన్నత విద్యావంతులు, సామాజిక ఉద్యమకారులు అందరూ గ్రహిస్తారని ఆశిస్తున్నాను.

అటు ఉత్తరప్రదేశ్‌లోను, ఇటు తెలంగాణలోను అగ్రవర్ణ సంపన్న పాలకులతో గానీ లేదా ఆయా సామాజిక కులాలలోని అభివృద్ధి చెంది అధికారాన్ని చేజిక్కించుకున్న పాలకులతోగాని చేసుకున్న ఒప్పందాలను ఆ తరువాత అమలుపరచలేదు. ఉద్యమం ద్వారా మాత్రమే దళిత, వెనుకబడిన, మైనార్టీ వర్గాల వారి హక్కులకు రక్షణ కలుగుతుంది. ఈ పాలకుల నైజాన్ని డాక్టర్ అంబేద్కర్ నాడే గ్రహించారు. 1952లో రాజ్యసభలో భూమి సమస్య పరిష్కారం గురించి మాట్లాడుతూ 'ఈ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు నా ప్రజలకు దక్కని రోజున ఈ రాజ్యాంగాన్ని తగుల బెట్టాలి;

అలా తగులబెట్టే వారిలో మొదటివ్యక్తిగా తానే ఉంటానని' అన్నారు. ఈ దేశ ప్రజలకు ఆ హక్కులేవీ దక్కలేదు. కనీసం రాజ్యాంగంలోని అధికరణ 3 ప్రకారం తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కు కూడా నెరవేరలేదు. ఇందుకు కారకులైన సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే 'సకలజనుల సమ్మె'లో పాల్గొనడం మన అందరి కర్తవ్యంగా భావించాలి.

నిజమైన సామాజిక న్యాయ పునాది కల 'ప్రత్యేక ప్రజాస్వామ్య తెలంగాణ'లోనే దళిత, వెనుకబడిన, మైనార్టీవర్గాల వికాసం ఉంటుందనే సమగ్ర అవగాహన కలిగివుండాలి. ఉద్యమంతో దాగుడు మూతలు ఆడే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైతే మడమ తిప్పే ప్రయత్నం వారు చేస్తారో, అక్కడ నుంచి నిజమైన ఉద్యమ శక్తులుగా ఉద్యమ ఉద్ధృతిని పెంచే విధంగా తెలంగాణ ప్రజలందరు చేస్తున్న పోరాటానికి 'వ్యాన్ గార్డ్' పాత్ర మనం పోషించాలి. సకల జనుల సమ్మెను సర్వజనుల ఉద్యమంగా మార్చి తెలంగాణ అమరుల కలలను సాకారం చేద్దాం.

-చిక్కుడు ప్రభాకర్
తెలంగాణ ప్రజాఫ్రంట్ కార్యదర్శి

No comments:

Post a Comment