Monday, September 5, 2011


బీసీ అజెండా 2011 - 2014 ప్రత్యేక ప్రణాళిక - సమగ్రాభివృద్ధి
- ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ప్రయోజనాలు కల్పించాలి
- అన్ని వృత్తి కులాలవారికీ అవకాశాలు
- బడ్జెట్‌లో దామాషా ప్రకారం నిధులు
- రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు
- చట్టసభల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం 


bc-photoహైదరాబాద్‌ జూబ్లీ హాలులో ఆగస్టు 28న జరిగిన బీసీ మేధావుల, బీసీ ప్రజాసంఘాల, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకుల సమావేశంలో మొదటి సారిగా బీసీల అభివృద్ధికి ఒక ‘ప్రత్యేక ప్రణాళిక’ రూపొందించాలని తీర్మానించింది. ఇది రాబోయే 2012-13 నుంచే మొదలు కావాలని పే ర్కొన్నది. దేశ వ్యాప్తంగా చా లా కాలంగా ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వ నిధులతో స్పెషల్‌ కాంపొనెంట్‌ ప్లాన్‌లు, సబ్‌ ప్లాన్లను రూపొందించి అమలు చేస్తున్నారు. వారి జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు ఏర్పాటు చేశారు. కాని బీసీల అభివృద్ధికి కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని ఒక ప్రత్యేకమైన విధానం అంటూ లేదు. ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులు లేవు.

వాస్తవానికి కాకా కాలేకర్‌ కమిషన్‌, మండల్‌ కమిషన్లు కేంద్రంలో, మురళీధరరావు కమిషన్‌ రాష్ట్రంలో బీసీలకు స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని, వాటికి తగిన బడ్జెట్‌ కేటాయింపులుండాలని పేర్కొన్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రణాళికలు ఆ సిఫారసుల్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. కేంద్ర ప్రణాళికా సంఘం బలహీన వర్గాలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నదని చెబుతూ బీసీల అభివృద్ధి ప్రతిపాదనలను దాటవేసే ప్రయత్నం చేసింది. దేశంలో సగానికి పైగా జనాభా కలిగి, స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి అభివృద్ధికి నోచుకోని అనేక కులాల గురించి కనీసం సిద్ధాంత రీత్యా అయినా ఒక విధానం లేకపోవడం దారుణం.

ప్రభుత్వాధికారంలోని అన్ని స్థాయిల్లో- చట్ట సభల్లో, ప్రభుత్వాలను నడిపే నాయకత్వ స్థాయిల్లో, మంత్రి వర్గాల్లో, అన్ని పార్టీల హై కమాండ్‌లలో బీసీలు నామమాత్రంగా, విగ్రహ పుష్ఠిగా ఉండడం మాత్రమే కనుపిస్తున్నది. చట్టాలకు అర్ధాలను నిర్వచించే సంస్థల్లో, న్యాయస్థానాల్లో, అన్ని స్థాయిల ఉద్యోగ సామ్యంలో, ప్రణాళికా సంఘంలో, ఎక్స్‌పర్ట్స్‌ కమిటీల్లో, అపెక్స్‌- విధాన నిర్ణాయక సంస్థల్లో కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి, ఉన్నత స్థాయి అధికార గణంలో, ఇతరేతర కీలక స్థాయిల్లో బీసీలు అసలు లేకపోవడమో, లేదా కనీస స్థాయిలో లేకపోవడమో జరుగుతున్నందువల్లనే బీసీ ప్రజానీకాన్ని ఏ స్థాయిలో కూడా పట్టించుకునే పరిస్థితులు కనుపించడం లేదు.

అందుకే బీసీల అభివృద్ధికి ఒక విధానం, ఒక ప్రణాళిక, బడ్జెట్‌లలో ప్రత్యేక కేటాయింపులు లేవు. అందువల్లనే దేశంలో, రాష్ట్రంలో వేసిన బీసీ కమిషన్లు చేసిన సిఫారసులను అమలుకావడం లేదు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటివరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుండడం వల్ల బీసీలను అభివృద్ధికి దూరంగా నెట్టివేయడం జరిగింది.రాజ్యాధికారం ఏఏ కులాల చేతిలో ఉంటుందో ఆయా కులాలకే- నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్‌ కేటాయింపులు, నియామకాలు, నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టులు, సబ్సిడీలు, ఆదాయాలు, ఆస్తులు- వగైరా అన్ని రంగాల్లో ఆధిపత్యం ఉంటుందన్న సత్యం గత 65 ఏళ్ళుగా రుజువయ్యింది. రాజ్యాధికారానికి నోచుకోని బీసీలు అన్ని రంగాల్లో, అన్ని స్థాయిల్లో వెనుకబడిపోవడం, దోపిడీకి గురికావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఇటీవలి బీసీల సదస్సు ‘బీసీ అజెండా 2012-2014’ను ప్రతిపాదించింది.

బీసీ అజెండాలో అంశాలు: 1. రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి ఒక ‘స్పెషల్‌ ప్లాన్‌’ రూపొందించి 2012-13లో అందరికీ వర్తించే సాధారణ కేటాయింపులు పోను ప్రణాళికా బడ్జెట్‌లో కనీసం 25 శాతం బడ్జెట్‌ కేటాయించాలి. అంటే ప్రస్తుత అంచనాల ప్రకారం కనీసం రూ. 15 వేల కోట్లకు తక్కువ కాకుండా కేటాయించాలి. 2013-14 బడ్జెట్‌లో బీసీల జనాభా దామాషా ప్రకారం 50 శాతం నిధులను కేటాయిస్తూ ‘బీసీ ప్రత్యేక ప్లాన్‌’ అమలు చేయాలి. 2. బీసీ స్పెషల్‌ ప్లాన్‌లో బీసీ జాబితాలోని వివిధ గ్రూపుల్లో ఉన్న కులాల కనీసావసరాలు- అభివృద్ధి ప్రాతిపదికగా వారి వారి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి.

3. బీసీ కులాలన్నింటికీ ప్రాధాన్యతా క్రమంలో సంపూర్ణ- నాణ్యమైన విద్య అందించే ప్రణాళిక, ఆచరణాత్మక కార్యక్రమం రూపొందించాలి. 4. బీసీ కులాలకు సంబంధించిన వృత్తుల్లో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థల చొరబాటును నిషేధించాలి. వారి వృత్తుల ఆధునికీకరణ చర్యలు చేపట్టాలి. 5. ఇప్పుడున్న 17 ఫెడరేషన్లతో బాటు మిగిలిన వృత్తులకు- లేదా చిన్న చిన్న కులాల, వృత్తుల కోసం ప్రత్యేక ఫెడరేషన్లను ఏర్పాటు చేసి, అన్ని రకాల ఆర్ధిక, సాంకేతిక సహకారాన్ని, అందుకు తగిన సిబ్బందిని అందించాలి. ఈ ఫెడరేషన్ల పనితీరును పరిశీలించడానికి సింగిల్‌ మానిటరింగ్‌ సంస్థను ఏర్పాటు చేయాలి. ఈ ఫెడరేషన్ల నిర్వాహణ బాధ్యతను సంబంధిత కులాలవారికే అప్పగించాలి.

6. వృత్తుల ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ, పెట్టుబడులు, సబ్సిడీలు, ఉత్పత్తి మానిటరింగ్‌, మార్కెటింగ్‌లు కొనసాగే విధంగా ఆయా ఫెడరేషన్ల సహాయ సహకారాలను అందించే ఏర్పాటు చేయాలి. 7. సర్వీసు కులాలవారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చి- శిక్షణ, పెట్టుబడులు సమకూర్చి ప్రణాళికా బద్ధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. 8. నిర్ణరుూకరణ, నిర్వహణలో బీసీల భాగస్వామ్యం, నిరంతర పరిశోధన, అభివృద్ధి, సమష్ఠితత్వం, నాయకత్వం లక్ష్యాల ప్రాతిపదికగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపొందించి అమలు జరపాలి. 9. ప్రత్యేక ప్రణాళికను రూపొందించే క్రమంలో బీసీ ఎ గ్రూపులోని సంచార, ఇతర జాతులకు, బి గ్రూపులోని ఉత్పత్తి- సేవా కులాలకు, సి-ఇ గ్రూపుల్లో ప్రత్యేక నేపథ్యం కలిగిన కులాలకు, అదే విధంగా అన్ని గ్రూపుల్లోని యాచక కులాలకు, విముక్తి జాతులకు వివిధ ఆచరణాత్మకమైన విధానాలతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి.

ఈ స్పెషల్‌ ప్రణాళిక పూర్తి స్థాయి చర్యా కార్యక్రమాన్ని వివిధ కులాలకు చెందిన ప్రజాసంఘాలతో, వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులతో ఈ సెప్టెంబర్‌ మాసంలో సమావేశాలు ఏర్పాటు చేసి, అక్టోబర్‌లో అన్ని రాజకీయ పక్షాల నాయకులతో, బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులతో, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడితో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి రూపొందించాలి. ఈ బీసీ స్పెషల్‌ ప్లాన్‌ను ఒక విడి కార్యక్రమంగా కాకుండా మిగతా రాజకీయార్ధిక సామాజిక అంశాలను కలిపి సమగ్రీకరించి అమలు జరపాలి. ఆ క్రమంలో- 1. ఇంతకు ముందునుంచి అమలు పరుస్తున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను పటిష్ఠవంతంగా అమలు చేయాలి. బీసీ రిజర్వేషన్లను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో సమానంగా పెంచాలి.

అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలి. 2. పదోన్నతుల్లో రిజర్వేషన్లను చేపట్టాలి. బీసీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను బీసీలతో నింపాలి.3. ప్రభుత్వ సహాయాన్ని పొందుతున్న అన్ని సంస్థల్లో రిజర్వేషన్లను పాటించేలా చూడాలి. 4. ప్రభుత్వం చేస్తున్న అన్ని నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు విధిగా 50 శాతం కేటాయించాలి. అన్ని రకాల నామినేటెడ్‌ కాంట్రాక్టులు, ఔట్‌సోర్సింగ్‌ పనులు, లోక్‌పాల్‌ కమిటీలతో సహా అన్నింటిలో బీసీలకు వారి జనాభా శాతం ప్రకారం సమగ్రకోటా ఇవ్వాలి. 5. రాజకీయ పదవులు- ముఖ్యంగా చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి.

మంత్రివర్గాల్లో, ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖల్లో, అన్ని రకాల- ఎన్నికల ద్వారా, నామినేషన్‌ ద్వారా ఏర్పాటు చేసే సహకార సంస్థలు, కార్పొరేషన్లు, మార్కెట్‌ కమిటీలు, గ్రామీణాభివృద్ధి కమిటీలు, నీటి సంఘాలు- వంటి అన్ని క్షేత్రస్థాయి సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ ఉండాలి. 6. రాజకీయ పార్టీలు తమ నిర్మాణాలలోని వివిధ స్థాయిల్లో బీసీలను నియమించాలి. 7. విజ్ఞన, వికాస, సాంస్కృతిక రంగాల్లో బీసీల ప్రాతినిధ్యం పెంచేందుకు- వారికి ఫూలే నాలెడ్జ్‌ సెంటర్లను, ఐలమ్మ స్ర్తీ చైతన్య సేవా కేంద్రాలను, గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి.

moralimohan8. ప్రతి జిల్లాలో ఫూలే విగ్రహాలను నెలకొల్పడంతో బాటు ఫూలే భవన్‌లను ఏర్పాటు చేయాలి. 9. రాజీవ్‌ గాంధీ ఫెలోషిప్‌ కార్యక్రమాన్ని బీసీలకు వర్తింపచేయాలి. 10. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచాలి. 11. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను, బీసీ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. 12. బీసీలపై జరిగే దౌర్జన్యాలకు అనికట్టడానికి బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించాలి.దేశంలో ఇప్పటివరకూ నియమించిన బీసీ కమిషన్ల సిఫారసులను అమలు జరిపేందుకు నాంది పలకాలి. చదువుకున్న బీసీ యువకులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వ్యాపార వాణిజ్యవేత్తలు, వివిధ సంఘాల నాయకులు ముందువరుసలో నిలబడి గ్రామీణ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఇందుకోసం ఉద్యమాలు చేపట్టాలి.

No comments:

Post a Comment