Wednesday, September 7, 2011

గోసంగి--ఎండ్లూరి సుధాకర్ Andhra Jyothi 05/07/2011


గోసంగి
(కృష్ణదేవరాయల కాలంనాటి దళిత దాసరి గోస)

ఒక విషాద శతాబ్దంలో జీవించినవాణ్ణి
ఒక అంధకార యుగంలో
అస్పృశ్యతను అనుభవించినవాణ్ణి
పేర్కొనడానికి
వీలులేని కులంలో పుట్టినవాణ్ణి
ముట్టుకోవడానికి ఇష్టపడని మురికి జలాన్ని
ఐదువందల సంవత్సరాలుగా
హైందవ లోక అవమానితుణ్ణి
అనుమానుతుణ్ణి
అభిమానవంతుణ్ణి
సూర్య నమస్కారం చేసినంత సుఖంగా
ప్రతివర్ణ నమస్కారం చెయ్యలేం కదా
ప్రతిసారి ఎదుటవాడి రూపంలో
ఛండాలుడే కనిపిస్తే
దుఃఖంతో పక్కకి తొలగిపోం కదా!

నేనూ మాణిక్యాన్నే
కానీ మసిగుడ్డలో దాచబడ్డాను
నేనూ సాటి మనిషినే
కానీ అంటరాని గడ్డలో పుట్టాను
విహ్వల విషాద
వివర్ణ యుగంలో విధి వంచితుణ్ణి
వేదం గుర్తించని మహాత్ముణ్ణి

నేను మాదిగని
నేను మాలని
నేను మాతంగిని
నేను గొడారి గోసంగిని
నన్నే పేరుతో పిలిస్తేనేం
నా దేహానికీ
దేవాలయానికీ మధ్యన
అంటు గోడలున్నంత కాలం

నేను పదహారో శతాబ్దపు పీడకలని
నన్ను పలకరించకండి
నేనొక వాడ శిలని
నేను పదహారో శతాబ్దపు చేదు చిరకని
కొండనాగు విరజిమ్మిన విషపు మరకని
పదహారో శతాబ్దం
నా జాతికి పెద్ద విషాదం
పదహారో శతాబ్దం
నా జన్మకు ప్రారబ్ధం

నన్ను గుర్తుపట్టలేదా కృష్ణరాయా!
నేనయ్యా దాసరి మాలను
మంగళ కైశికీ రాగవేదిక మీద
నర్తించిన సింహ క్ష్వేళను
నేను ప్రభూ! చర్మకారుణ్ణి
భూదిగంతరాల ప్రతిధ్వనించిన
జంబూద్వీప ఆది స్వరాన్ని
శ్రీరంగధాముని ముందు
సంగీత స్వర సముద్ర ఘోషని
మంగళ కైశికీరాగ గోసంగిని

నాకు తోలు చొక్కాలే గానీ
పట్టు వస్త్రాలేవి?
చినిగిన కొంగులే కానీ
చక్కని కోకలేవి?
నూలు బట్టలేవి?
నీర్కావి పంచలేవి?
బిళ్లగోచి తప్ప
ఏముంది నా మానం కప్పుకోడానికి
నేను పదహారో శతాబ్దపు
కపోలం మీద ఉలిపిరిని
పగిలిన కపాలంలోని రక్తఝరిని
నా కన్నీటి లందలో నేనే చర్మాన్ని మనువు కట్టిన బొందలో
మగ్గుతున్న ధర్మాన్ని!

నీళ్లు
మమ్మల్ని చూసినప్పుడల్లా
కన్నీళ్లు పెట్టుకునేవి
మేము తమని
తాకడం లేదని దిగులుపడేవి
తనివితీరా తాగడం లేదని దిక్కులు చూసేవి
నీటికి మతమున్న దేశంలో
మేము పుట్టడం నేటికీ గొప్ప విషాదం

'గంగా స్నానం
తుంగా పానం' పుణ్యమన్నారు శిష్టులు
మమ్మల్ని మాత్రం దూరంగా తరిమేశారు
ఈ దేశంలోని దుష్టులు
మురికి నీరే తీర్థమన్నారు
మూత్ర పానం చెయ్యమన్నారు
చెప్పుతో మలం తీయించి
చేతిలో పెట్టి
ఇదే ప్రసాదమన్నారు
కాలువలో దిగితే
కాళ్లు విరిచేశారు
చెరువు నీరు ముట్టుకుంటే
చేతులు నరికేశారు
ఇవి కల్పనా కథలు కావు
మా కన్నీటి గాధలు
అడగండి గోదావరిని
ఆరా తీయండి కావేరిని
కవిలె కట్టలు వెలికితీసి
చీకటి చరిత్ర పుటలు విప్పండి
కోనేటి రాతిమెట్ల కోవెల దగ్గర
పసుపు కొమ్ములు రాసుకునే
జలాంగనల చెంత
మా వాడ కొమ్మలు కనిపించవు
ఎపుడైనా నల్ల చిలుకలు ఎదురుపడితే
పసుపు రెక్కల ఎర్రచిలుకలు ఎగిరిపోతాయి

మా వీధులు వేశ్యావాటికలు కావు
అప్సరసల వక్షోజాల్లా
కస్తూరితో గుబాళించవు
పేరుకు పెద్దింటి స్త్రీలే గానీ
మావి మట్టి వాసనలు
పొట్టకు కూడు లేకపోయినా
పొట్టు తిని బతికామే గానీ
మా శీలాన్ని
ఏ శ్రీనాథుని సంతలోకి కౌలుకియ్యలేదు

నాలో ఆగమ జ్ఞాన నిధులు లేవు
నాకు వేదవేదాంగ శ్లోకాలు రావు
బ్రహ్మీదత్తవర ప్రసాదుడ కాను
చాత్తాద వైష్ణవ చారు దత్తుడను కాను
బ్రహ్మ కూడా నన్ను చూసి
ముఖం తిప్పుకున్నాడేమో!
నా తల రాతలు లేవు
నా తాతల గీతలూ లేవు
కాటికి దగ్గరలోనే నా కాపురం
శివుడు మా పక్కింటివాడు
మా డప్పుకు ఢమరుకం గొంతు కలిపేది
మా చిందుకు శివతాండవం కాలు కదిపేది
మా తాత తిన్న బొచ్చెలోనే
మా తరాలన్నీ తిన్నాయి
మా పూర్వీకుల గుడిసెల్లోనే
మా వంశాలన్నీ నివసించాయి

నా కెవరూ కేలూత యిచ్చి
బండిలో ఎక్కించుకోలేదు
నాకెవరూ ఉచితాసనమిచ్చి
ఊయలలూప లేదు
మా డప్పు విన్నాడా
శివుడు చిందేయాల్సిందే!
మా చెప్పు కొన్నాడా
కుబేరుడు పాదాభివందనం చేయాల్సిందే!
మా కిన్నెర మోత విన్నాడా
నారద మహర్షి మహతిని మర్చిపోవాల్సిందే!
మా గొంగూర మాంసం తిన్నాడా
ఇంద్రుడు ఇంటి భోజనం విడిచిపెట్టాల్సిందే!
మా పెద్దింటి స్త్రీలు పెట్టే
లచ్చించారు రుచి చూశాడా
విష్ణుమూర్తి పాల కడలి విడిచి
మా కూర చట్టి తెచ్చుకోవాల్సిందే!
మా గోరోజన విద్య తెలుసుకున్నాడా
అపర ధన్వంతరి మా దారికి రావాల్సిందే!
మా వాడ తెలుగు చెవిన బడితే
కృష్ణరాయలు మా వూరికి రావల్సిందే!

మా ముత్తాతలు
ముడ్డికి చెదలు పట్టేదాకా
సొరకాయ తంబుర మోగించేవారు
భుజాలు నొప్పులు పుట్టేదాకా
పలకలు వాయించేవారు
అశ్వినీ దేవతలు ఆకాశంలో నిలిచి
తెల్లారి మా పల్లె పాటలు వినిపోయేవారు
మా బోనాలూ
మా యక్ష గానాలూ
మా గోసంగి పురాణాలూ
రేణుకాదేవి కథలూ
మెట్ల కిన్నెర మోతలూ
జాతి మెచ్చిన జాజర పాటలూ
ఆరు బయట ఆరంజోతి ముచ్చట్లూ
పున్నమి చంద్రుడు కూడా వింటూ
పులకించి పోయేవాడు
విల్లి పుత్తూరుకు
మధురకు మా విద్యలు తెలియవు
శ్రీరంగ పట్నం
మా వాడ సోయగం చూడలేదు
మా పంబల పాటలకు
రత్న కంబళ్లు విప్పేసి
ఆ రంభలు కూడా
ప్రారంభ గీతాలు పాడేందుకు
మా పేటలకు రావాల్సిందే!

ఎక్కడో దూరంగా
నిద్ర పట్టని ప్రబంధ కన్య
నినదిస్తున్న పద్యంలా చంద్రోదయం
ఏ పుష్పలావికా
నా వంక కన్నెత్తి చూడలేదు
ఏ ప్రపోళికా
నా కోసం దోసెడు నీళ్లు పోయలేదు
నాది మట్టి కాయం
నాది మలిన దేహం
ఉడికిన మడుగు ధోవతుల్ని
ఉతికి తెచ్చే శిష్యులు లేరు
ఉన్న వాళ్లంతా అస్పృశ్యులే
లందలే తప్ప
సుగంధాలు తెలియవు
పచ్చి తోలు వాసనలే గానీ
పరిమళించే పునుగు జవ్వాది పీల్చలేదు

వెన్నెల
కన్నుల నీరు నింపుకుని
నా వాడ మీద
నా వాళ్ల మీద
దీనంగా కురుస్తున్నట్టున్నది
అప్పుడప్పుడు
వెన్నెల రాత్రుల వీణలు
మా వాడ చెవుల దాకా
ప్రబంధ పద్యాల రసరాగిణుల్ని
మోసుకొచ్చేవి
ఏ వరూధుని నోటిలోంచో
కప్పురపు విడియం గుబాళించేది
ఏ ద్రవిడాంగన కొప్పులోంచో
సన్నజాజుల గాలి మత్తు గొల్పేది

కృష్ణరాయా!
కీర్తి కాయా!
నీ భువన విజయంలో
నా కవనం కనబడుతుందా?
నీ ప్రబంధాలలో
నా జాతి అందం ప్రతిబింబిస్తుందా?
అష్టాదశ వర్ణనల్లో
అస్పృశ్య వర్ణం నిషిద్ధం
కవిలోక కావ్యాల్లో
వాడ నాయకుడు నిషిద్ధం
నీ భువన విజయంలో మేం కాలు మోపివుంటే
అష్టదిగ్గజాలేం కర్మ
వేల దిగ్గజాలు గండపెండేరాలతో ఘల్లుమనేవి
నీ సైన్యంలో మేముంటే
నీ కీర్తి పతాక హిమాలయాన్ని ముద్దాడేది
ఈ అంటరాని తనం మమ్మల్ని
ఒంటరిని చేసింది

వాల్మీకి తెలియదు
వాత్సాయనుడు తెలియదు
కాళిదాసును చదవలేదు
కొక్కోక శాస్త్రం చూడలేదు
వాడ తప్ప
వర్ణమాల తెలియనివాణ్ణి
బతుకు తప్ప
భారతం చదవనివాణ్ణి
నేను చూసిందల్లా
కాగిన సీసం పోసిన చెవుల్ని
తెగిన రక్తపు నాలుకల్ని

భయపడకుండా
బ్రహ్మరాక్షసి దగ్గరకు
నేను తప్ప మరెవ్వరు వెళ్లగలరు?
విష్ణు చిత్రుడు పోతాడా?
యమునాచార్యుడు వెళ్తాడా?
బ్రహ్మరాక్షసికి నేను భయపడలేదు గానీ
కుల రాక్షసి దెబ్బకు కుంగి పోయాను

లేవు చందన లేప సుగంధాలు
లేవు నారాయణ దివ్య ప్రబంధాలు
లేవు నిరుపహతి స్థలాలు
లేవు నిర్మల తీర్ధ జలాలు
లేవు నా బతుకున ఆనందగీతికలు
లేవు నా చుట్టూ రమణీప్రియ దూతికలు
నా నలువైపులా అస్పృశ్య గీతికలు

మంగళ కైశికీ రాగాలతో రాళ్లు కరిగించి
నా మనసు గంగడోలును నిమురుకున్నాను
నా అస్పృశ్య ఆత్మవనంలో
ప్రేమ ధేనువును దయగా పెంచుకున్నాను

కృష్ణరాయల కాలంలో
నాకు భోజన యోగం లేదు
కడుపు నిండా మంచి తిండి తినలేదు
కప్పురపు భోగి వంటకాలూ
కమ్మని గోధుమ వంటలూ
చక్కెరలూ ఉక్కెరలూ చవిచూడలేదు
లేవు చలికాలం దుప్పట్లు
లేవు నా పాలిట వేడివేడి నిప్పట్లు
ఎన్నిసార్లు నేను
కుక్క తిండి తిన్నానో!
ఎన్నిసార్లు నేను
పస్తులు పడుకున్నానో!
ఋతువులొస్తే నాకు భయం
గుండెలు పిసుక్కుంటూ
నా గూడెంలో
నా గుడిసెలో
ఆకలి తపస్సు చేస్తుంటాను
కడుపు నింపుకోవడానికి
అర్థరాత్రి గబ్బిలంలా తిరుగుతుంటాను
అల్లసాని పెద్దనలా
ఆత్మకింపైన భోజనం చెయ్యలేదు
కప్పురపు విడియాలు నమలలేదు
ఏ ప్రియురాలూ
మాగిన మద్యాన్ని పుడిసపట్టి
నా నోట్లోకి వొంపలేదు
జలక్రీడలకు ఆహ్వానించలేదు
'కృపయా భోక్తవ్య'మంటూ
నన్ను సహపంక్తికి పిలవలేదు
నేనూ పదహారో శతాబ్దంలోనే బతికాను
రాయల యుగంలో రాచపుండులా!

కృష్ణరాయా!
నిన్నిప్పుడు ప్రశ్నవేయ
సముచితమో కాదో గానీ
నీ కీర్తి కిరీటంలోని కలికి తురాయి
అంటరానిదేనని గుర్తించలేకపోయాను
జోహార్! మూరురాయరగండ
నీ వైపే చూస్తున్నది
నీవు జయించలేకపోయిన
అంటరాని కొండ
చరిత్రలో మచ్చగానే ఉండిపోయింది
నీ పట్టాభిషేక మహోత్సవంలో
కళ్లారా నిన్ను చూడాలనుకున్నాను
కానీ వాడ విడిచి రాలేకపోయాను
నేనే ఒక ప్రబంధ దుఃఖమయ్యాను
ఆర్తితో ఆముక్త మాల్యదనయ్యాను
అక్షరాలా ఐదు వందల గాయాల
చరిత్రనయ్యాను
కృష్ణరాయా! వండిన అన్నమూ ఉండదు
చచ్చిన పీనుగూ ఉండదు
ఉన్నదంతా మంచి చెడ్డలే
ఉత్త మట్టి గడ్డలే! ...

- ఎండ్లూరి సుధాకర్

నిమ్న టిప్పణి:
శ్రీకృష్ణ దేవరాయలు తన 'ఆముక్తమాల్యద' ప్రబంధం ఆరవ ఆశ్వాసంలో 'గోసంగి' కులాన్ని మొదటిసారి గుర్తించాడు. 'మహాత్మా' అని సంబోధించాడు. కృష్ణదేవరాయలు తన విజయ యాత్రలో భాగంగా తెలంగాణాలో విస్తృతంగా పర్యటించాడు. ఇక్కడే రాయలవారు 'గోసంగి'ని చూసి ఉంటాడు. లేదా ఆ కులం పేరు విని ఉంటాడు. 'మాల దాసరి కథ' వేదం వేంకట రాయశాస్త్రి ఆముక్తమాల్యద వ్యాఖ్యానంలో చేసిన కల్పన. మూలంలో 'మాల' శబ్దం ఎక్కడా లేదు. రాయలు వారు ప్రయోగించలేదు. గోసంగులు ప్రత్యేక అస్తిత్వం ఉన్న పౌరాణిక దళితులు.

No comments:

Post a Comment