Monday, September 19, 2011

బానిస బతుకులు ఎంతకాలం?-డా. ప్రభంజన్ యాదవ్ Namasethe Telangana 20/09/2011

బానిస బతుకులు ఎంతకాలం?
తెలంగాణ రాష్ట్రం తప్ప, మరే ప్రత్యామ్నాయం వద్దని యావత్ తెలంగాణ నినదిస్తున్నది. కాంగ్రెస్ ప్రజావూపతినిధులు ఇదే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి కరాఖండిగా చెప్పిండ్రు. పల్లెలల్ల, పట్నంల, ఢిల్లీల కాంగ్రెస్ నేతలు తమ ఆంతర్యాన్ని బాహాటంగానే ప్రకటించిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తమం ఏ జాదుతోనైనా చర్చలకు సిద్ధమన్నరు. ‘ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకొనే కదా 2004 ఎన్నికల్ల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది. ఆ పొత్తు కూడ నువ్వేకదా కుదిర్చింది’ అని ఆజాద్‌ను నిలదీసిండ్రు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని 2004 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిందీ, ఆ తర్వాత ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన ప్రసంగంలో పేర్కొన్నదీ యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్షికమంలో చేర్చిందీ, 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రకటన, ఆ మర్నాడు పార్లమెంటు ఉభయసభల్లో ఆయన ప్రసంగించిన చారివూతక సత్యాలను సారథ్య బృందం ఆజా ద్ ముందు ఏకరువు పెట్టింది.

ఆంధ్రోళ్ల లాబీయింగ్‌కు, ముడుపులకు ఢిల్లీ పెద్దలు దాసోహమంటున్నరు. తెలంగాణ ప్రజ ల ఆకాంక్షలకు, ఆత్మగౌరవానికి, ప్రాణ త్యాగాలకు విలువ ఇస్తలేరు. ఎందుకంటే తెలంగాణ ప్రజా ప్రతినిధులు, ప్రజల ఒత్తిడి తట్టుకోలేకనే రాజీనామాలు చేసిండ్రు కానీ కాంగ్రెస్ అధిష్ఠానం మీద, కేంద్ర ప్రభుత్వం మీద కాని ఒత్తిడి పెంచడానికి కాదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నరు. నైజాం కాలం నుంచీ మన నేతలు ప్రభు భక్తిని చాటుకునేందుకు అలవాటు పడ్డారు. మనోళ్లకు అంతో ఇంతో అధికార లాలసత్వమూ ఉంది. అయ్యేది ఎట్టాగూ అయితదిలే అన్న అలసత్వమూ ఉంది. అధిష్ఠానంతో ‘కంటు’ ఎందుకన్న మొహమాటమూ ఉంది. పదవులతో వచ్చే భోగాలు అంత అలకగా వదులుకునేందుకు సిద్ధంగా లేరన్న విమర్శలూ ఉన్నయి. పదవులు త్యాగం చేసేతందుకు తెలంగాణోళ్లు తెగ బాధపడ్తరన్న కావూరి మాటలు మనోళ్లకు కారం పెట్టినట్టియింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజావూపతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేశారు.

‘తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే’ అన్న కాంగ్రెస్ నేతల మాటలను తెలంగాణ జనం నమ్మడంలేదు. ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలే అని కొట్టి పారేసిండ్రు. జన్‌లోక్‌పాల్ విషయంలో అయిదారుగురు సివిల్ సోసైటీ వ్యక్తుల కన్నా ప్రజాస్వామ్యంలో 120 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌కే విలువ అధికారం ఉంటుందని యూపీఏ ప్రభుత్వం అంటున్నది. మరి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం రాజీనామా చేసిన ప్రజావూపతినిధుల గురించి యూపీఏ ప్రభుత్వం పల్లెత్తు మాట మాట్లాడడంలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ఒక్క అడుగు కూడ ముందుకేయడంలేదు. సుమారు 650 మంది తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేస్తేనే ఢిల్లీ పెద్దలు స్పందించలేదు. ఇక ఈ ప్రాణంలేని రాజీనామా కాగితాలు కాంగ్రెస్ పెద్దలను కదిలిస్తాయనుకోవడం అత్యాశేనేమో! తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏమీ కాదు ‘ఊదు కాలదు పీర్ లేవదు’ అని ఏలికలకు ఎరుకైందేమో ! 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత అదే ఆంధ్రోళ్లు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించగానే వారి బెదిరింపు మాటలకు ఢిల్లీ పెద్దలు భయపడ్డరు. అందించిన మూటలకు లాలూచిపడ్డరు. లేకపోతే ‘ఏ గుంజిగానికి బెదిరేదిలేదని’ కేంద్రం భావించి ఉంటే కేంద్రం మాట మార్చేది కాదు. డిసెంబర్ 26న మరో ప్రకటన చేసేది కాదు.
నెహ్రూ తర్వాత కాంగ్రెస్ పాలకులకు రాజనీతి కొరవడింది. నీతి తప్పుడే నిత్యకృత్యమైంది. అవినీతిలో అందరికన్న ముందుండడం అలవాటైంది. 1969 లో ఇందిరమ్మ తెలంగాణకు దగా చేసింది. 2009ల సోనియమ్మ నమ్మించి నట్టే ట ముంచింది. డిసెంబర్ 9న సోనియా జన్మదిన కానుక ‘తెలంగాణ ప్రకటన’ అన్న మన కాంగ్రెస్ నేతల మురిపెం ముప్పయి గంటలు కూడలేదు. మూటలకు తప్ప మాటకు విలువిచ్చే సంస్కృతి కాంగ్రెస్‌కు లేదని మరోసారి రుజువైంది.

సమైకాంధ్ర అంటున్న సీమాంధ్రుల వాదనలో పస లేదు. రాయలసీమోళ్లు, ఆంధ్రోళ్లు సమైక్యంగా ఉండాలనుకుంటే ఉండొచ్చు. నిజానికి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వాళ్లు కలిసే ఉన్నరు. తమిళుల వివక్షకు తట్టుకోలేక, వేధింపులు వేగలేక 1923లోనే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఉద్యమానికి తెరతీసిండ్రు.1953లో ఆంధ్రరాష్ట్రాన్ని సాధించుకున్నరు. మూడేండ్లు సీమాంధ్ర సర్కార్ గుడారాల కిందనే కొలువు దీరింది. తెలంగాణ వనరుల మీద, హైదరాబాద్ పట్నం మీద సీమాంవూధుల కన్నుపడింది. ఫజల్ అలీ కమిషన్, నెహ్రూ వద్దన్నా వినలేదు. తెలుగు భాష ముసుగుతో తెలంగాణకు దగా చేసిండ్రు. అప్పటి తెలంగాణ బ్రహ్మణ- రెడ్డి నాయకుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరును ఆసరా చేసుకున్నరు. మాయమాటలతో మోసం చేసిండ్రు. తెలంగాణ ఆంధ్ర, రాష్ట్రం పేరు పెడతామని ఒప్పుకున్నరు. పార్లమెంట్‌లో ఈ పేరుతో బిల్లుపెడదామని నమ్మబలికిం డ్రు. తీరా సమయానికి కొచ్చేసరికి ఆంధ్రవూపదేశ్‌గా మార్చి బిల్లు పెట్టిండ్రు. తెలంగాణోళ్ల అభీష్టానానికి వ్యతిరేకంగా 1956లో ఆంధ్రవూపదేశ్ ఏర్పడింది. స్వాతం్ర త్యం వచ్చినంకా 1956 వరకూ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా, మద్రాసు నుంచి విడిపోయి 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రం వేర్వేరుగానే ఉన్న యి. అసలు ఈ రెండు రాష్ట్రాల్లో మధ్య పొత్తే లేదు. ‘మవూదాసు నుంచి విడిపోయే హక్కు ఆంధ్రోళ్లకున్నట్లే, ఆంధ్రవూపదేశ్ నుంచి విడిపోయే హక్కు తెలంగాణ ఎందుకుండదు?’ అని కేంద్ర హోంమంత్రి చిదంబరం మొదట వాదించిండు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆత్మగౌరవం కోసం అభివృద్ధి కోసం, పరిపాలన సౌలభ్యం కోసం ఎన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడలేదు? 56 ఏండ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతూనే ఉన్నరు. వెయ్యి మంది యువత ప్రాణాలను ఆంధ్ర పాలకులు బలిగొన్నరు. ఇంకెంత మంది చావాలే? ఎంతకాలమీ పోరు? ఇగ తాడోపేడో తేలిపోవాలె. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలె అన్న బలమైన కోరికతో ప్రజలు బరిగీసి నిలిచిం డ్రు. దాంతో సీమాంధ్ర, తెలంగాణ చీలిపోయిం ది. పార్టీలు, ఉద్యోగులు, ఉద్యమకారు లు నిట్టనిలువునా చీలిపోయిండ్రు. రెండ్లు కండ్ల సిద్ధాంతమనే తెలుగుదేశం, రెండు నాలుకల కాంగ్రెస్‌పార్టీ తెలంగాణపై తేల్చుకోవాలె. అన్నం పెట్టిన మామకే సున్నం పెట్టిన సీమాంధ్ర బాబు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తడని ఇంకా నమ్మబలుకుతున్న తెలంగాణ తెలుగుదేశం ఫోరం నాయకులు పునరాలోచించుకోవాలి. సోనియమ్మకు ఇంకా భజన చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి.

తెలంగాణలో నిరసనలు, ఉద్యమాలు కొనసాగుతునే ఉన్నాయి. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది. ఆరువందలకు పైగామంది ఆత్మబలిదానాలు చేసుకున్నరు. యాదిడ్డి అనే యువకుడు ఏకంగా భారత ప్రజాస్వామ్యానికి నిదర్శనమైన పార్లమెంట్ ఎదురుగానే ప్రాణం తీసుకున్నడు. కానీ కనికరం లేని కాంగ్రెస్ అధిష్ఠానికి కనువిప్పు కాలేదు. పదవులకు రాజీనామాలు చేసినా, దీక్షలు చేసినా అధిష్ఠానం స్పందన కరువయింది. ఎందుకంటే ‘ఘర్ కా మురిగి దాల్ కా బరాబర్’ అన్నట్లు అధిష్ఠానం వైఖరి ఉంది. పల్లెనుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలె. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పేరుతో సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించుకోవాలె. తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతరు. పదవులకే కాదు పార్టీకి రాజీనామా చేసిన త్యాగాన్ని గుర్తిస్తరు, ఆదరిస్తరు, ఓట్లు వేసి మళ్లీ పట్టం కడతరు. 
-డా. ప్రభంజన్ యాదవ్
తెలంగాణ ఐకాస కో- కన్వీనర్, ఢిలీ

No comments:

Post a Comment