Sunday, September 4, 2011

పెరుగుతున్న సామాజిక రుగ్మతలు--,ఖాజాపాష 21 Aug 2011,Prajashakti


పెరుగుతున్న సామాజిక రుగ్మతలు

Shareసామజిక న్యాయం డెస్క్ - ఖాజాపాష- షాద్‌నగర్‌    Sun, 21 Aug 2011, IST  
  • పాలమూరు పల్లెల్లో భయం భయం....
  • అవగాహన కల్పించడంలో పాలకులు విఫలం
ఒక పక్క మానవుడు శాస్త్ర , సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించాడని చెప్పుకుంటున్నాం. కాని మరో పక్క మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. కొందరి స్వార్థం కోసం మూఢనమ్మకాలను పెంచిపోషిస్తున్నారు. గ్రామాల్లో బాణామతి నెపంతో దాడులు దౌర్జన్యాలు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. దెయ్యం సంచరి స్తుందని గ్రామాలను ఖాళీ చేస్తున్న సంఘ టనలు ఉన్నాయి. గుప్త నిధుల తవ్వకాల పేరుతో మను షులను, జంతు వులను బలిఇవ్వడం వంటి సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. వీటిపై అవగాహణ కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో పదేపదే మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. అదిగో దెయ్యం..ఇదుగో భూతం అంటూ పచ్చని పల్లె సీమలకు మనశ్శాంతి కరువైంది. అడుగడుగునా వీరిలోని అమాయకత్వం, నిరక్ష్యరాస్యత చైతన్యానికి బహుదూరంగా ఉంచుతోంది. ఇలాంటి బలహీనతలను ఆసరా చేసుకుని పేదల మధ్య పెత్తందారులు గొడవలు పెడుతున్న సంఘటనలు కూడా లేక పోలేదు. ఇలాంటి సామాజిక రుగ్మతలు మానవుని అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌, కొందుర్గు, ఫరూఖ్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగు చూశారు. ప్రజాశక్తి పరిశీలనలో వెలుగు చూసిన కొన్ని సంఘనటలు పాఠలకులకోసం.....
మహబూబ్‌నగర్‌ జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామంలో భాణామతి పేరుతో ఓ కుటుంబాన్ని సజీవ దహనం చేశారు. 1983లో కటికెల బాలయ్య, కటికెల రాములు, కటికెల బాలమ్మ కుటుంబం గ్రామంలో చేతబడి చేస్తుస్నదని ఆ కుటుంబాన్ని ఊరంతా చూస్తుండగానే చెట్టుకు కట్టి సజీవ దహనం చేశారు. దీనికి ప్రతీకారంగా కటికెల బాలయ్య కుమారుడు కటికెల మల్లేష్‌ సజీవ దహనానికి ప్రధాన సూత్రదారి సంజీవరెడ్డిని షాద్‌నగర్‌లో ప్రతీకారంగా హత్యచేశాడు. ఇలాంటి ఘోరం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అదేవిధంగా షాద్‌నగర్‌ పట్టణంలోని పటేల్‌రోడ్డులో గుప్త నిధుల కోసం ఓ బాలుడ్ని బలిచ్చారు. బాలానగర్‌ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలో మంగలి నర్సింహులు మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో డబ్బాలోనే నిర్భంధించి సజీవ దహనం చేసిన హృదయ విదారక సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. 1998లో కొందుర్గు మండలం మంత్రగత్తె అనే అనుమానంతో ఓ మహిళను వివస్త్రను చేసి సభ్యసమాజం తలదించుకునేలా ఊరేగించారు. 1999లో లాలాపేటలో ఓ వ్యక్తిని మంత్రగాడిగా భావించి బంధించి గ్రామస్తులు పళ్ళూడగొట్టారు. ఇదే గ్రామంలో ఓ వ్యక్తి తనకు పడరాని వ్యక్తులపై పూనకాలు తెప్పించి వాళ్ళ పేర్లు చెప్పించి దాడులు చేయించిన సంఘటనలు ఉన్నాయి. 2007లో ఇదే మండలం మహదేవ్‌పూర్‌ గ్రామంలో ఓ వ్యక్తి చనిపోగా అతని భార్య మంత్రాలు చేయించి చంపిందంటూ ఆమెను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించగా సకాలంలో పోలీసులు అడ్డుపడ్డారు. తాజాగా కొత్తూరు మండలం గూడూరు గ్రామ సమీపంలో గుడి తండాకు చెందిన రమావత్‌ చెంద్య్రా తన కొడుకు రమావత్‌ హరిదాస్‌ (14)ను ఈనెల 13న ఉదయం పాముకరిచి చనిపోయాడంటూ ప్రచారం చేశాడు. చనిపోయే వరకు బాగానే ఉన్న రమావత్‌ హరిదాస్‌కు పాము కరచడమేంటని తండావాసులకు అనుమానం వచ్చింది. చుట్టుపక్కల ఇండ్లవారు, ఇతరత్రా గిరిజన ప్రజలు అసలేం జరిగిందని తెలుసుకోవడానికి చెంద్య్రా ఇంటికి వెళ్ళారు. ఇంట్లో అనేక పూజలు నిర్వహించిన ఆనవాళ్ళు కనిపించాయి. ఇంట్లో గుంతలు తవ్వి, పసుపు, కుంకుమలు, కొబ్బరి, నిమ్మకాయులు చల్లిన దృశ్యాలు దర్శనమిచ్చాయి. వీటితో పాటే రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం కుమ్మరిగూడ గ్రామానికి చెందిన కుమ్మరి బుచ్చయ్య అనే వ్యక్తి తండావాసుల కంటపడ్డాడు. కాషాయ వస్త్రాలలో పూజలకు సంబంధించిన సామాగ్రి ఉండడంతో గిరిజన ప్రజలు ఒక్కసారిగా మంత్రాలు జరిగాయన్న నిర్థారణకు వచ్చారు. పెళ్ళుబిగిన ఆగ్రహంతో తండావాసులంతా కుమ్మరి బుచ్చయ్యపై మూకుమ్మడిగా దాడిచేశారు. శుక్రవారం రాత్రి పౌర్ణమి ఉండడంతో మంత్రాలు చేసినట్లుగా ఇరుగుపొరుగు ప్రజలు చెప్పారు. పాము కరిచిన ఆనవాళ్ళు కూడా కనిపించకపోవడంతో తండా వాసులు వారినుండి నిజాలు రాబ ట్టేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన దాడిలో కుమ్మరి బుచ్యయ్యతో పాటు మృతి చెందిన బాలుడి కుటుంబంపై కూడా దాడిచేశారు. బుచ్చయ్య నిధుల కోసం మంత్రాలు చేశానని ఒప్పుకోవడంతో ప్రజలు కొందరు మీడియాకు సమాచారం అందించారు. మీడియా వచ్చాక కూడా కుమ్మరి బుచ్చయ్యను చితకబాదారు. ఇంట్లో జరిగిన మంత్రాలకు సంబంధించిన వస్తువులను బుచ్చయ్యతో తండావాసులు తీయించారు. ఈ సామాగ్రిని కాషాయ వస్త్రంలో కట్టి అతని తలపై పెట్టి దూరంగా పడేసి నిప్పు పెట్టాలని చెప్పడంతో బుచ్చయ్య అట్టి సామాగ్రిని చెంద్య్రా పొలంలో దహనం చేశాడు.
అమ్మో దెయ్యం..భూతం
దెయ్యం ఉందని అది తమతో మాట్లాడిందని తనకు కావాల్సిన అవసరాలు తీర్చమంటోందని ఇటీవలే మొగిలిగిద్ద గ్రామంలో దళితులు కొందరు భయభ్రాంతులకు లోనయ్యారు. జూన్‌లో ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్ద గ్రామం దళిత వాడలో నెల రోజుల క్రితం పొడుగు యాదమ్మ(25) ప్రసవ సమయంలో బిడ్డతో పాటు ఆమె కూడా మరణించింది. మూడు రోజులకే అదే ఇంట్లో యాదమ్మ అన్న యాదయ్య(27) అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఎస్సీ వాడలో వీరి మరణాలపై రకరకాల ప్రచారం జరిగింది. గర్భవతి అయిన యాదమ్మ ప్రసవం కాక మరణించినందుకు దెయ్యమై పడుతుందని భావించిన కొందరు పెద్దలు యాదమ్మ ఖనన సమయంలో ఆమె కళ్లలో సూదులు గుచ్చి, ఆపై జీడి రసాన్ని కళ్ళలో పోసి దహన సంస్కారాలు చేశారు. ఇలా చేస్తే ఆమె ఆత్మ శాంతిస్తుందని ఆమె దెయ్యమై ఎవరినీ గుర్తుపట్టలేదన్న మూఢాచారంతో అలా చేశారు. మూడు రోజులకే యాదయ్య కూడా అనారోగ్య పరిస్థితుల కారణంగా ఉరి వేసుకొని చావడంతో గ్రామస్తుల్లో అనుమానం మొదలైంది. యాదమ్మ దెయ్యమైనందుకే యాదయ్య చనిపోయాడని అనుమానించారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో దళితవాడ మొత్తం పాకిపోయింది. యాదమ్మ దెయ్యమైందని రాత్రి వేళలో ఎవరూ బయటికి వెళ్ళొద్దంటూ నిర్ణయించారు. ఇండ్లముందు కుంపటి మంటలు పెట్టాలని
చిన్న పిల్లలు ఉన్నవారు ఇనుప తట్టలో రాళ్ళు, కట్టెలు పొట్టుతో మంటలు పెట్టుకోవాలని దళితవాడలో ప్రచారం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక అధికార యంత్రాంగంతో పాటు షాద్‌నగర్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, జెవివి షాద్‌నగర్‌ డివిజన్‌ నాయకులు వెంకటరమణ, గిరిధర్‌ అవగాహన చర్యలు చేపట్టారు. అంతకన్నా ముందు ఇలాంటి సంఘటనలే కేశంపేట మండలం సంగెం, ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల, కొత్తూరు మండలం గూడూరు, కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల, గుంజల్‌పహాడ్‌ గ్రామాలలో దెయ్యం ఉందన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక మూఢవిశ్వాసాల విషయానికి వస్తే గ్రామం పచ్చగా ఉండాలని నేటికీ నియోజకవర్గంలో జంతు బలులను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో క్షుద్రపూజలు, మంత్రాలు, తంత్రాలు నిర్వహించడం అవి వికటించి గ్రామస్తుల మధ్య కక్ష సాధింపులకు ఆస్కారం ఏర్పడింది. ఫరూఖ్‌నగర్‌ మండలం కంసాన్‌పల్లి, భీమారం, కొత్తూరు మండలం లోని వీర్లపల్లి, కేశంపేట మండలం లోని అల్వాల, కొత్తపేట గ్రామాలలో నేటికీ జంతు బలులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇవన్ని మూఢాచారాలని పలుసార్లు జెవివి ప్రచారం చేసింది. అయినా ప్రజలను పూర్తి స్థాయిలో అవగాహన రాలేదు. ప్రభుత్వం నుంచి ఇలాంటి వాటిపై తగిన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్య పర్చాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.

No comments:

Post a Comment