Sunday, September 4, 2011

జాంబ పురాణానికి పల్లకి ఊరేగింపు నమస్తే తెలంగాణా సంపాదకీయం 29/06/2011




జాంబ పురాణం
జాంబ పురాణానికి పల్లకి ఊరేగింపు

jambapuranamజూలై 3వతేదీ ఆదివారం 6 గంటలకు హైదరా బాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఆడిటో రియంలో పుస్తకం విడుదల సభ జరుగుతుంది. ఈ సభలో ప్రొ. కొలకలూరి ఇనాక్, గద్దర్, జి. కళ్యాణ రావు, డా. పొత్తూరి వెంకటేశ్వరరావు, డక్కలి గోపా ల్, డా. బి. విజయభారతి, సావెం రమేశ్, డా. జిలు కర శ్రీనివాస్, డా. ఎ.కెపభాకర్, జయధీర్ తిరుమ లరావు, జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు. పుస్తకావిష్కరణకు ముందు సాయం త్రం 4 నుంచి 6 గంటల వరకు బాగ్‌లింగంపల్లి పార్క్‌లో జాంబ పురాణం పుస్తకం గూడుపల్లకిలో ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపుకు కవులు, కళాకారులందరూ పాల్గొనాలని మనవి.
-జయధీర్ తిరుమలరావు


నిజానికి పురాణాలు విశ్వజనీనం కావు. వాటి కవి దేశ వ్యాప్తం కూడా కావు. ఒక ప్రాంతంలో గల అన్ని సమాజాలకి ఆమోదం కావు. ఒక్కో సమూహానికి, ఒక్కో కులానికి, ఒక్కో మతానికి ప్రత్యేకమైన కొన్ని పురాణాలు ఉన్నాయి. వివిధ సామాజిక వర్గాలకు ప్రత్యేకమైన పురాణ సాహిత్యం ఉంది. ఈ పురాణాలు సహజంగా మౌఖిక కూర్పులే. ఆ తదుపరి కొన్ని పురాణాలు లేఖన రూపంలోకి వచ్చాయి. ఇవ్వాళ కనిపించే చాలా పురాణాలకు సహజ రూపం ఇదే అని చెప్పలేం. పురాణాలకు పూరకాలు ఉంటాయి. పాఠ్యాంతరాలు, పాఠభేదాలు కొల్లలు. ప్రధాన కథ లేదా మూల కథ చుట్టూ వేరు వేరు అల్లికలుంటాయి. జాంబ పురాణం చిందు వారి యక్షగానంగా, డక్కలి వారి పటం కథగా, మాదిగ గురువు పురాణ ప్రవచనంగా కనిపిస్తుంది .షాద్‌నగర్ వద్ద గల రంగాపురం గ్రామంలో డక్కలి రంగయ్య నోటి కథగా జాంబపురాణాన్ని చెప్పడం ఇక్కడ గమనించాలి. నేటికీ ఇన్ని రూపాల్లో ప్రచారంలో ఉందంటే జాంబ పురాణానికి చాలా ప్రాధాన్యం ఉన్నట్లే. అంటే ఇది సజీవ సంప్రదాయంగా నిరంతరం ప్రవహించే జీవనది వంటిది.

ఐతే భారతీయ పౌరాణిక సాహిత్య సంపదలో జాంబపురాణం లాంటి పాఠ్యాలను వేలాది ఏళ్ళ నుండి ఈ నాటి దాకా ఎవరూ గుర్తించలేదు. లేదా గుర్తించి కూడా వాటి అస్తిత్వాన్ని కనుమరుగుచేయడానికి నిశ్శబ్దం పాటించి ఉంటారు అనిపిస్తుంది. జనపద గాథల పాఠ్యాలను వెలికితీసి పరిశోధనలు చేసిన పండితులు వేలాది ఏళ్ళనుండి జాంబ పురాణం లాంటి సమాంతర పౌరాణిక పాఠ్యాలను ఎందుకు వెలుగులోకి తేలేకపోయారనేది ప్రస్తుతపు ప్రశ్న. పురాణాలు అత్యంత పవివూతమైనవి అని భావించటం వల్ల, లోకానికి తెలియకుండా పోయా యి. అలా ఉండటం వల్లనే ఇవి ఈనాటికీ నిలిచి ఉన్నాయేమో అనిపిస్తుంది. ఉన్నతవర్గాల వారు పవిత్ర కథనాలని తమవిగా సగర్వంగా చెప్పుకున్నారు. ఐతే వాటిని ఇతరులు వినడం కూడా పాపమే అని ఢంకా బజాయించారు. అవి లోకానికి తెలిసి కూడా వాటి జోలికి పోకుం డా ఉండే కట్టుదిట్టమైన చర్యలు అమలు జరిగాయి.

ఉన్నత వర్గాల పాఠ్యాల భావజాలం కావ్య, ప్రబంధ, నాటక ప్రక్రియల రూపంలో రచించబడినప్పటికీ వాటిని పఠించడానికి సైతం చాలా వర్గాలను చాలా రకాలుగా దూరం ఉంచారు. ఎన్ని రకాల దూరాలు, అంటరానితనాలు పాటించబడినాయో వివరంగా అధ్యయనం చేయవలసే ఉంది. ఇలాంటి నేపథ్యంలో యుగయుగాలుగా తమవైన పాఠ్యాలను అడుగువర్గాల ప్రజలు కూడా పది ల పరుచుకున్నారు. ఎన్నో రకాల స్రవంతుల్లో, విభిన్న రూపాల్లో వాటిని సజీవం చేశారు. ఒక సాహిత్య సంప్రదాయంగా వాటిని కాపాడుకున్నారు. వాటి అవసరాన్ని ఆ సమూహాలకు నిలుపుకుంటూ వస్తున్నారు. ఇలాంటి కింది వర్గాల Sacred Narratives ని Secret Narratives గా కూగా గుర్తించాలి.
పై వర్గాల పౌరాణిక కథలలో Imagination in belief ఎక్కువ. విశ్వాస సహిత మత కల్పన, అమానవ సంభంధ కృతిమతకి ప్రాధాన్యం ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. కాగా కింద వర్గాల రహస్య పౌరాణిక కథనాలలో Realistic imagination in belief పాళ్ళు ఎక్కువ. సహమానవ సమాజాలను తమ కథనానికి కేంద్ర బిందువుగా చేసుకొని, ఆ వలయాల సంబంధాలలోకి వెళ్ళి మానవీయ దృక్పథాన్ని వ్యక్తం చేసే ఘట్టాలే ఈ కథనాలలో అధికంగా కనిపించడం విశేషం.

అందుకే ప్రధాన స్రవంతిగా పరిగణించే భారతీయ పౌరాణిక సాహిత్యం, అడుగు వర్గాల పౌరాణిక సాహిత్యం రెండూ వేరు వేరు. ఈ రెంటినీ తులనాత్మకంగా పరిశీలించడం చాలా అవసరం. అగ్రకులాల లిఖిత పౌరాణిక పాఠ్యం, కింద వర్గాల నోటి పాఠ్యం వీటి సంప్రదాయాలను కూడా పరిశీలించాలి. అప్పుడే ఏది ఎవరికోసమో, ఏ ప్రజలు ఎలాంటి మానవీయ భావాలు వ్యాప్తి చేస్తున్నా రో అవగతం అవుతుంది. నిజానికి హింసని, మారణకాండనీ, ఆధిక్యతా భావాల్ని ప్రచారం చేసే అగ్రకుల పౌరాణిక గాథల స్వభావాన్ని తేటతెల్లం చేయడానికి ఈ అధ్యయనాలు అవసరమవుతాయి. మానవీయ కోణం లో రూపొందిన కింద వర్గాల కథలు, ఆధిక్యతా భావన ల్ని ప్రశ్నించే ప్రజాస్వామిక దృక్పథం, సహజీవన అహిం సా సూత్రాన్ని చెప్పే ఉదంతాలను గుర్తించి, సమాజానికి అందించవలసి ఉంది.
-జయధీర్ ిరుమలరావు,ఎ.కెపభాకర్ (జాంబ పురాణం ముందుమాటలోంచి)


మాదిగ రామయ్య ప్రవేశం
ప్రహస్తు: హలో! రామయ్యా
మాదిగ రామయ్య: (పాట) దూరాముండండయా - కడకు పెద్దింటోడ్ని
మాదిగవాడలోనా- మరి పెద్దవాడను నేను ॥
ప్రహ: స్వామి! పదే పదే వందనములయ్యా!
నీ పేరేమన్నావు?
మా.రా: నా యొక్క పట్టణము,నా నివాసము, నా యొక్క నామ ధేయము నీ వెరుంగ జాలకున్నావా?
ప్రహ: చెపితే గుర్తుకదా మహారాజా!
మా.రా: (పాట) గూడెంలోన-నే పెద్ద మాదిగనిరా
మాదిగవాడలోనే - పెద్ద వాడను రా ॥ గూడెం॥
ప్రహ: అయితే.... ఏమో అంటివి ప్రభూ?
మా.రా: నాయొక్క నష్కల్ గ్రామములో ఉన్నటువంటి హరిజనులదంతా సగంపాలు. నా ఒక్కనిది సగంపాలు అంటే నాది పెద్ద పాలు.
ప్రహ: అంటే నీవు పెద్ద మాదిగనివా?

మా.రా: నాయొక్క తాత పేరు గనుక జాంబవంతు డు. నీలావర హరిజనుడు. నీలావర జాంబవంత నీలావర నీకు జడలు లెక్కలు లేవు. సాటిలేని మహానుభావు డు నా యొక్క తాతగారు. మా నాయనగారు ఆయొక్క జగముని. నా తండ్రి పేరు అనగా జగముని. నా పేరు కలియుగానికి మాదిగ రామయ్య అంటారు. ఈ వూళ్ళో గనుక నేనే పెద్ద మాదిగని. ఏ తగువైనా, పంచాయతీ అయినా, పనికాడ అయినా సగం పాలు నాది.
(పాట) గూడెంల పెద్ద మాదిగనిరా
మగవాడలో నేను మాదిగనిరా ॥ గూడెం॥

ఈ వూళ్ళో గనుక పెద్ద మాదిగని నేనే. అయినా ఆ కాపాయం చేసే బలభద్ర పటేలు వద్ద కనుక ఆరుగాలం గనుక కష్టం చేసి ఉంచినాను. చేసిన కష్టం అంతా కాపాయన చేతిలో ఉన్నాది. ఆ విధంగా గనుక నేను ఒడ్డు చెక్కి న , ఒరం పెట్టిన, ఆ యొక్క కూలి లేకుండా నాగలి చేసి న, పలుపులిచ్చిన పగ్గాలిచ్చిన, ప్యారలిచ్చిన, హారలిచ్చి న, ఎనక తాళ్ళిచ్చిన, తొండము ఇచ్చిన, కొత్త చెప్పులు చేసి ఇచ్చిన, పాత చెప్పులు కూడా ఇచ్చిన, చేతుల కష్ట ము గనుక హక్కులు నాకు రావపూను.అది మాత్రం బలభవూదప కళ్ళెంలోనికి పోవాలె. ఆయన లోగిట్లో గను క నా భార్య ఆ యొక్క లచ్చవ్వ ఉండాలె. దాని ప్రవేశపెట్టుము.

ప్రహ: ఓహో లచ్చవ్వా! ఓ లచ్చక్కా....
మన బావొచ్చిండు.
***
లచ్చవ్వ: ఏంట్రా... బావేంటి?
ప్రహ: కాదవ్వా! ఆయన మీ ఆయన కాదా!
లచ్చవ్వ: మా రామయ్య ఒచ్చాడా?
ప్రహ: మీ రామయ్య, మీ ఆయనే గాని మా ఆయన గాదు. దా అక్కా! నడు మన బావకు పొద్దు పోతాది నడు.
లచ్చవ్వ: (పాట) దూరాముండండయ్యా-
కడకు పెద్దింటిదాన్ని ॥
మాదిగవాడలోన.. మరి పెద్ద దాన్ని ॥
ప్రహ: మాదిగవాడలోన నీకు సగం పాలు, సగమే మో శేవెలు. అన్నీ నీయే ఇంకోటి అది ఎంటో చెప్పు.
లచ్చవ్వ: ప్రహాస్తా!
(పద్యం) వినర సేవకా విశదంబుగ
కనరోయి నా పూర్వగాధను విన్నవించెదన్
మా అత్త జలగంధి- మహావేగ వినుమా
మా మామ జాంబవంతుడు- అతి వేగ కనుమా
రామయ్య మరదలును నేను
నా నామము మాదిగ లచ్చవ్వ అందురో
ఇలలోన.............
ప్రహస్తా ! నా యొక్క అత్త అనగా జలగంధి, మా మామ జాంబవంతుడు. ఆ జాంబవంతుని కుమారుడనంగా రామయ్య. ఆ యొక్క నా నామంబనగా మాదిగ లచ్చక్క అందురు. అయితే నాభర్త ఎక్కడ ఉన్నాడు?
ప్రహ: ఓ లచ్చక్కా! ఇగో ఆ రామన్న రమ్మన్నాడు. పోదాం వస్తవా? దా! నడువవ్వా?
లచ్చవ్వ: (పద్యం) వందనములు ప్రాణేశా
వందనములు నీకు బహుళముగా చేసెద
దండిగా నీకు - దయచూడమా!
రామ: నారిమణి! చల్లగా వర్ధిల్లుముగాక, మనం గనుక ఆ బలభవూదుని దగ్గర ఆ కాపాయన దగ్గర ఆరుగాలం చేసిన కష్టం అంతా అక్కడ నిలబడియున్నది. నీవు ఆ చాట, చీపిరి తీసుకొని నాతో పాటు నీవు బయలుదేరి రావపూను. మరి కళ్ళం చేయుటకై బయలుదేరి రావపూనమ్మా
లచ్చవ్వ: నడు పోదాం
(బలభవూదుని ప్రవేశం)
బలభవూదుడు: (మాదిగరామయ్య లచ్చవ్వలతో )
ఆగండి, ఆగండి, మీరెవ్వరు, ఎన్నడూకానరాలేదు.
ఇక్కడికెందుకొచ్చిన్రు
రామయ్య: నేను జాంబవంతుడి మనవణ్ణి. నా పేరు మాదిగ రామయ్య.
ఇది నాభార్య- లచ్చవ్వ. ఈ భూమి పుట్టింది, తాత గురించి. ఈ ప్రజల పోషించేవాడు మాతాత. ఇప్పుడు నేను ఆరుగాలం చేసిన ఎట్టికి నా ‘హక్కు’ తీసుకోడానికి వచ్చిన.
బల: నీకేం హక్కుంది నా దగ్గర....
నువ్వు మాదిగోడివి- నేను కాపోణ్ణి.
రామ: కాపోడివైతే నీ గొప్పతనం ఏంది?
నువ్వు తినేది మేం తినేదిఒక
బల: నువ్వు తినేది నేను తినేది ఒకటెట్లయితది?
రామ: (పాట) కోమట్లు బ్రహ్మలు అందురు కానీ
కోమట్లు తినేది కొవ్వేనయ్యా
కొవ్వు అంటే కోపమేముగని
కొవ్వుని కాల్చితే నెయ్యేనయ్యా
ప్రధాని: అయితే పటేలా రామయ్యని
కల్లంలోకి తోలుకుపోతే
బల: నా కల్లంలోకి రావద్దు- నా దగ్గరకి కూడా రావద్దు- దూరముండురా- దూరముండు.
రామయ్య: మీకు దూరముండాలా? ఎందుకురా పటేలా
బల: నన్ను రా అంటావా? ఎవడివిరా నువ్వు.
మీదకొస్తున్నావు. మర్యాద - ముట్టకు- ముట్టకు
రామయ్య: నేనెవడినా? నీకు చెప్పులు కుట్టిన అప్పుడే మర్చిపోయినవా!- ముట్టొద్దంటావు?
(పాట): ముట్టకు ముట్టకు అంటారయ్యా
ముట్టరానివాల్లము కాము-మేము
అంటు రోగులము కాము
చెప్పులు కుటి ్ట చేతికిచ్చిన చప్పుడు
కాళ్ళకు ఏసుకొంటిరి
డబ్బుల కొరకై యింటికి వస్తే
దూరంగా నిలుచుండమంటిరి
నా ఎంగిలి గలిసిన చెప్పులూ
నీ మూలకున్నవి చూసుకో ॥ ముట్టకు॥
(వచనం) అప్పుడు నేను చెప్పులు చేసి చేతికిస్తే
ఆ చెప్పులు
కాళ్ళకేసుకుంటివి. ఇప్పుడు ఎల్లగొట్టబడితివి.
ప్రధాని ః వద్దు పటేలా ! యి మాదిగోనితో పెట్టుకోకయ్యా!
బలః మాదిగోణ్ణి దూరంగొట్టు. ఆడి గాలి సోకితేనే మైలపడతం
రామయ్యః మాదిగ మాలలముట్టకూడదని
మైలు దూరము తొలగిపోతిరి
మాలలనేసిన మగ్గం నూలు
గంజియంబలి గట్టిగ పోసిన
చీరలు మీరలు దరించుకొంటిరి
అంటి మీరలు అంటిరి
బహుతంటలు తెచ్చి పెడితిరి ॥ ముట్టకు॥
(వచనం) మమ్మల్ని ముట్టొంద్దంటారు. మేం నేసిన బట్టలు
కట్టుకుంటారు. మమ్మల్ని దూరం పెడతారు యింటికొస్తే గంజి
పోయరు- తాగటానికి నీళ్ళవ్వరు.
(పాట)మాదిగ మాలలంతా కూడి
మంచి నీళ్ళు అడగబోతే
చెంబెత్తి మా చేతిలో పోస్తిరి
ఎలాగున్నది లోకమూ-ముందున్నది శోకము ॥ ముట్టకు॥
ప్రధాని: ఎందుకయ్యా పటేలా? రామయ్య కల్లంలోకి రానియ్యి
బల: వొద్దురా, ఆడు గొడ్డు మాంసం తింటడు- చచ్చిన దాన్ని
పీక్కుతింటాడు- అని తోటి మనకేంది!
రామయ్య: (పాట) మాదిగ మాలలు మాంసం తింటరు
పందిని తింటే యిందువులంటిరి
గోవుని తింటే సాయిబులంటిరి
గోదను తింటే మాదిగలంటిరి
రక్తపు చుక్కలు పాలుగ మారెను
పెరుగు చేసిన చల్లగా మారెను
వెన్న కరిగితే నెయ్యిగ మారెను
అన్ని విధంబుల బుజియించు చుందురు
అంటు అనేదెందుకు-బలుతంటలు పెట్టేదెందుకు
॥ ముట్టకు॥
(వచనం) మాంసం తిన్న నేను అంటరానివాణె్ణైతే- మరి తురకోడు కూడా ఆవుల్ని తింటారు- మరి వాడెందుకు అంటరానివాడు కాడు.
ప్రధాని: అరే! మేం ఆవుని తింటం కనీ అలాల్ చేస్తం. బాస్మిల్లా మంత్రం చదువుతామోయ్.
బల: మేం నవాబులం- మా రాజ్‌లం- మీరేంది! మీ గొప్పతనమేంది?
రామ: మేం కూడా దేశాలేలినం. మీకంటే ఎక్కువ ఉన్నోల్లం. మా సంగతి మీకేమెరిక!
(పాట) సత్యానికి ఆ అరిచ్చంవూదుడు
సతినమ్మి తన ప్రతిజ్ఞ గెలిచెను
కొన్నాదెవరో- కాటికాపరి
మాదిగ వాండ్లే మహారాజులు
కొన్నారంటే కోపమా-యిది
యిశ్వామివూతుని శాపమా ॥
అయ్యా, మీ బట్టు బ్రహ్మలు, అయ్యలూ, ఆచార్యు లు, పురోహితులు మీరంత మంది వున్నరు. మీరు కొనడానికి చాతనయ్యిందా? మీ విలువేంది- మీ బతుకేంది. కొన్నది నేను. హరిశ్చంవూదుడి సత్యాన్ని కాపాడింది నేను.
ప్రధాని: ఔ రామన్నో నిజమే. నువ్వే గొప్పోడివి?
బల: ఏం గొప్పరా- ఆడులేందే మనం బతుకలేమా! చస్తమా!
రామ: నిజం చెప్పినవు పటేలా? సస్తే నిన్ను కాట్లే పెట్టేది మేమే.
(పాట) మాదిగ మాలల ముట్టకూడదని
నిష్టల పట్టి నీలిగి సత్తిరి
కాటికి మీరు పోయేటప్పుడు
మా ఎట్టోడే నీగతి గాంచురా ॥
బల: అవన్ని సూస్తానికి మా బాపనోల్లున్నారు. దినాలు చేసినా పెద్దలకు పెట్టినా మాకన్నీ బాపనోల్లే చేస్త రు. వాల్లంతా వశిష్టుల గోత్రం వాల్లే.
రామ: వశిష్టుడా! వశిష్టుడెవరు? వానికి కులమేడుంది!
(పాట) ఆ వశిష్టునకు కులమొక్కడున్నదని
బస చేసె మా మాదిగ యింట్లో
ఇనుముతొపప్పు-వుసికతో అన్నం
జల్లెడు నీళ్ళు- జమ్మాకు యిస్తరి
అన్నముదిని మా కన్నుల గాంచక
అరంజోతిని పెండ్లాడెను
అన్నయ్యకు వరాలిచ్చెను. ॥ ముట్టకు॥
(వచనం) మీ వశిష్టుడు ఎవరనుకున్నావయ్య.
(పద్యం) తల్లి ఊర్వశిదేవి
తన యాలి మాదిగ
తను బ్రహ్మడంటే- జగతి గురువా?
ఆయనంటే మాకేం లెక్కలేదు. ఆయన మాకంటే తక్కువే. జాంబవంతుడు ఉంచుకొన్న వూర్వశికి పుట్టినోడు. మీ వశిష్టుడు మా యింటి ఆడపడుచుని ఎతికి ఎతికి పెల్లి చేసుకొన్నడు ఆకరికి ఆమె దిక్కయింది. అసుంటి వశిష్టుడు.మీ 24 కులాలకు బ్రహ్మణుడు. నేను ఉంచుకున్న భోగం దానికి పుట్టినోని కాళ్ళు పట్టుకుని మొక్కుతారు మీరు.
ప్రధాని: ఏ ఇజ్జత్ దీయకయా!
రామ: ఊర్వశి కనుక నేను ఉంచుకున్న భోగం.
బల: వారీ ! నిజమేనా?
రామ: వశిష్టుని తల్లి ఎవరు? ఊర్వశి ఎవరు? నేను ఉంచుకున్న భోగంది.
(జాంబ పురాణంలోని బలభద్ర విజయం నుంచి కొంత భాగం)

No comments:

Post a Comment