సామాజిక తెలంగాణ ఒప్పందం జరగాలి
సామాజిక తెలంగాణ ఒప్పందం మీద సంతకం చేసేందుకు కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపి, సిపిఐ, బిజెపి వంటి పార్టీలు ముందుకొస్తాయా? తెలంగాణ పెద్దమనుషుల ఒప్పందం చేసుకొనేందుకు ఇరుపక్షాలు సిద్ధపడుతాయా? ఒకవేళ ముందుకు రాకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఆయా పార్టీలకు మద్దతు ఎందుకివ్వాలి?
సామాజిక తెలంగాణ తక్షణమే సాధ్యం కాదు, భౌగోళిక తెలంగా ణే ఆచరణ సాధ్యమని కొందరు వాదిస్తున్నారు. ఈ మానవ వికాస భావజాలవాదులతో పాటు పాలక వర్గాలు కూడా ఇదే వాదన చేస్తున్నారు. పాలకవర్గాలకు అనుకూలమైన ఈ అవగాహనపట్ల 'వికాస'వాదులు సిగ్గుపడుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. పైగా అంబేద్కర్‌వాదులనూ, సామాజిక తెలంగాణవాదులనూ పాలకవర్గాల వైఖరికి అనుకూలంగా వ్యవహరించాలని సూచించే విప్లవ కర్తవ్యాన్ని మాత్రం మరచిపోవడంలేదు.
సామాజిక తెలంగాణ సాధ్యమేనా అనే సందేహంలో దాని సాధ్యాసాధ్యాల కంటే దాని పట్ల వ్యతిరేకతే ఎక్కువ ప్రదర్శితమవుతోంది. మన దేశంలో కులం సామాజిక వాస్తవికత. కులాతీత దృక్పథాలు, పరిష్కారాలు అంతిమంగా అగ్రకులాల ప్రయోజనాలకే ఉపకరిస్తాయి. తెలంగాణ ఉద్యమం కులాతీతంగా సాగుతుందనేది ఒక భ్రమాజనిత వాదన. అది ఉద్యమ నిర్దిష్ట వాస్తవికతను స్పష్టంగా చూడలేని గుడ్డితనం.
ఆంధ్ర, తెలంగాణ అగ్రకుల ఆధిపత్యం నుండి బయటపడే ఒక మార్గంగా తెలంగాణను బహుజనులు చూస్తున్నారు. ఆంధ్ర అగ్రకులాల నుండి అధికారాన్ని హస్తగ తం చేసుకొనే అవకాశంగా తెలంగాణ అగ్రకులాలు పరిగణిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణను వేదమయం చేస్తానని కెసిఆర్ ప్రకటించారు.
ఇది తెలంగాణ బహుజనులు ఆశిస్తున్నదానికి పూర్తిగా వ్యతిరేకమైంది. కెసిఆర్ నిర్వహించే యజ్ఞయాగాలు, పూజారుల పాదసేవలు ఆయన భావజాలాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. రేపు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పీడిత కులాలను అధోపాతాళానికి తొక్కేయబోడనే హామీ ఏమీలేదు. అందుకే సామాజిక తెలంగాణ కావాలని ఎలాంటి రాజీ లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కోరుతున్నారు.
దేశవ్యాప్తంగా బిసీ, మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అలాంటప్పుడు తెలంగాణలో మాత్రం కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఈ దేశ అధికారంలో జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చట్టబద్ధమైన వాటా ఉంటుందని నాడు రాజ్యాంగసభలో జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రకటనను అమలుచేసి ఉంటే సామాజిక తెలంగాణ అనే డిమాండ్ వచ్చేది కాదు.
దేశ విభజన పేరుతో ముస్లింలను పాకిస్తాన్‌కు పంపేసి బ్రాహ్మణీయ పాలకవర్గం రాజ్యాంగసభను పూర్తిగా ఆక్రమించుకుంది. ఏకపక్షంగా సాగిన రాజ్యాంగసభ సమావేశాలు మైనార్టీలకు అప్పటివరకు అమల్లో వున్న ప్రత్యేక నియోజకవర్గాలతోపాటు విద్యా ఉద్యోగ క్షేత్రాలలో ప్రాతినిధ్యాన్ని కూడా 27, 28 ఆగస్టు 1947లో రద్దు చేశాయి. బీసీలకు అధికారంలో వాటా కల్పిస్తామని నెహ్రూ చేసిన ప్రకటనను తుంగలో తొక్కేసారు.
ఎస్సీ, ఎస్టీలకు కేవలం ఉమ్మడి నియోజకవర్గాల రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి బానిసలను చేశారు. బిసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేసి రాజకీయ దాస్యంలోకి నెట్టేశారు. ఆ రకంగా అధికారమంతా కేవలం బ్రాహ్మణీయ అగ్రకులాల చేతిలో కేంద్రీకృతమైంది. దేశంమీద పాలకవర్గం తిరుగులేని ఆధిపత్యం చెలాయించాలంటే ఉత్తర, దక్షిణ భారతాలకు మధ్యన ఉన్న నిజాం రాజ్యాన్ని ఆక్రమించాలి.
అందుకే నిజాం రాజ్యాన్ని ఇండియన్ యూనియన్ సైన్యం ద్వారా ఆక్రమించారు. ఈ ఆక్రమిత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ రాజ్యం పునరుత్థానం పొందకుండా భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో మూడు ముక్కలు చేసి తెలంగాణను ఆంధ్రలో విలీనం చేశారు. ఫలితంగా ఆంధ్ర అగ్రకులాలు లబ్ధి పొందాయి. దాంతో నేటికీ బహుజనులు తీవ్రమైన దాస్యంలో మగ్గుతున్నారు. అందుకే సామాజిక న్యాయానికి ఇంత ప్రాధాన్యం ఏర్పడింది. దాన్ని రాజ్యాంగ పరిధిలో సాధించడం అనేది ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీ, మైనార్టీలకే ఎక్కువ అవసరం. అందుకే కొత్త రాష్ట్రం సామాజిక పునాదుల మీద ఏర్పడాలి.
కేవలం రాజకీయ వనరుల పంపిణీకి మాత్రమే సామాజిక తెలంగాణ భావనను పరిమితం చేయడం అపరిణతికి నిదర్శనం. సామాజిక న్యాయం అనే భావనను పాలకవర్గాలు ఎంత అపహాస్యం చేశాయో, దాన్ని సమర్ధించే శక్తులూ అంతే చేస్తున్నాయి. వనరుల, అవకాశాల పునర్‌పంపిణీయే సామాజిక న్యాయం అనే ఉదారవాద అవగాహన కూడా దృగ్గోచరమైందే తప్ప సారభూతమైంది కాదు.
సామాజిక అవగాహన పునాదిగా లేని వనరుల పంపిణీ, అవకాశాల పునర్‌పంపిణీ వంటి రాజ్యాంగ సహితమైన సాంకేతికవాదం మాత్రమే 'సామాజిక న్యాయం' అనే భావన రూపంలో ప్రాచుర్యం పొందింది. కానీ స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రం, సోదరభావం, న్యాయం అనే విలువల ఆధారంగా తెలంగాణ సమాజాన్ని నిర్మించాలని ఇక్కడి బహుజనులు కోరుకుంటున్నారు. బహుజనవాదం పునాదులమీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే పీడిత కులాలకు న్యాయం జరుగుతుంది.
అయితే సామాజిక తెలంగాణ ఏర్పాటు సాధ్యమా అనేది చిక్కు ప్రశ్నగా ఉంది. దీనికి పరిష్కారమార్గం చూపాలని బహుజన మేధావుల మీద ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఒక పక్షంగా- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరో పక్షంగా ఏర్పడి ఒక ఒప్పందం చేసుకోవాలి. అదే తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎలాంటి రక్షణలు, హక్కులు లభిస్తాయో అంశాలవారీగా పేర్కొని ఇరు పక్షాలు సంతకం చేయాలి.
స్థూలంగా ఇలాంటి అంశాలు ఒప్పందంలో ఉండాలి
1. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. కాని బీసీ, మైనారిటీలకు రాజకీయ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అగ్రకులాల వల్ల లభించలేదు. అందుకే రాబోయే తెలంగాణలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 50 శాతం, మైనార్టీలకు 15 శాతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని అన్ని పార్టీలు ఇచ్చే ప్రధానమైన హామీ ఈ ఒప్పందంలో ఉండాలి.
2. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి విడుదల చేసి సరైన పద్ధతిలో ఖర్చుచేయాలి.
3. ముస్లింలు సమైక్య రాష్ట్రంలో సాంస్కృతికంగా రాజకీయంగా ఆర్థికంగా అనేకం కోల్పోయారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో దామాషా ప్రాతినిధ్యం కల్పిస్తూ చట్టం చేయాలి. ఉర్దూ భాష వికాసంకోసం పాటుపడాలి. ముస్లింలపై వారి సంస్కృతిపై జరిగే దాడులను అరికట్టాలి. తీవ్రవాద ముద్రతో, శాంతిభద్రతల పేరుతో ముస్లింలను వేధించే పోలీసు హింసను నియంత్రించాలి.
4. బహుజనుల భూమిని పారిశ్రామిక అవసరాల పేరుతో సేకరించే విధానం రద్దు చేయాలి. అవాంఛిత రియల్ ఎస్టేట్ వ్యాపారంవల్ల వ్యవసాయరంగం నష్టపోతుంది. అందువల్ల భూగరిష్ట పరిమితి చట్టాన్ని అమలుచేయాలి. పట్టణ భూగరిష్ట పరిమిత చట్టాన్ని పునరుద్దరించి బహుజనుల భూములు కాపాడాలి. భూబదలాయింపు చట్టాలను సమీక్షించాలి.
5. బహుజన సంస్కృతిని వైదిక సంస్కృతితో నింపే ప్రయత్నాలను అరికట్టాలి. అందుకోసం ఒక సాంస్కృతిక అధ్యయనశాఖను ఏర్పర్చాలి.
6. ఆదివాసీ షెడ్యూల్డు ఏరియాల్లో గిరిజనేతరుల ప్రాబల్యం తగ్గించాలి. అటవీ సంపదమీద ఆదివాసీలకే నిర్ణయాధికారం ఉండాలి. వారి భాషాసాహిత్యాలు, సంస్కృతుల పరిరక్షణతోపాటు సమగ్ర వికాసంకోసం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. వారి ప్రాంతాల అటానమస్ స్థితిని కాపాడేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలి.
7. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలోనూ సంప్రదింపులలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజకీయేతర సంస్థలకూ సంఘాలకూ ప్రాతినిధ్యం ఉండాలి. ఇలాంటి అనేక అంశాలతోపాటు వివిధ సంస్థలు, సంఘాల సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఒప్పందం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆమోదయోగ్యమైన తెలంగాణ ఏర్పడుతుంది. అదే సామాజిక లేదా బహుజన తెలంగాణ అవుతుంది.
ఈ ఒప్పందానికి రాజ్యాంగ ఆమోదం ఉండదు. ఇది రాజకీయమైన నైతిక ఒప్పందం. తెలంగాణ ఏర్పడేందుకు రూపొందించే టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్‌లో ఈ ఒప్పందాన్ని పేర్కొనాలి. తెలంగాణ ఆంధ్రలో విలీనం సందర్భంగా చేసుకొన్న ఒప్పందం ఏ విధంగా అవమానించబడిందో అదేవిధంగా తెలంగాణ పెద్దమనుషుల ఒప్పందం కూడా అమలుకు నోచుకోకపోవచ్చు. అంత మాత్రాన ఈ ఒప్పందం ప్రాముఖ్యాన్ని, విలువనూ తోసిపుచ్చలేం.
దీనివల్ల తమకు అన్యాయం జరిగిందని పీడిత కులస్తులు పోరాడేందుకు ఒక సహేతుకమైన పునాదైనా ఏర్పడుతుంది. అయితే ఈ ఒప్పందం మీద సంతకం చేసేందుకు కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపి, సిపిఐ, బిజెపి వంటి పార్టీలు ముందుకొస్తాయా? తెలంగాణ పెద్దమనుషుల ఒప్పందం చేసుకొనేందుకు ఇరుపక్షాలు సిద్ధపడుతాయా? ఒకవేళ ముందుకు రాకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఆయా పార్టీలకు మద్దతు ఎందుకివ్వాలి?
- డా.జిలుకర శ్రీనివాస్
కన్వీనర్, 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం
No comments:
Post a Comment