Sunday, September 4, 2011

విలువలకు విఘాతం ఈ ప్రాపకం -రమా మెల్కోటే Andhra Jyothi


విలువలకు విఘాతం ఈ ప్రాపకం
-రమా మెల్కోటే

ఒక దైవ పురుషుని మరణం, శాంతి కోసం యాగం, ఎద్దు మాంసాన్ని వడ్డించాలని విశ్వవిద్యాలయంలో ఆందోళన - ఇవన్నీ మన దేశంలో రాజ్యం, సమాజం స్వభావాన్ని సూచిస్తున్నాయి. భారతీయ సమాజంలో మతం, మూఢ నమ్మకాల ప్రభావం ఎంత బలీయంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం నుంచి వాటికి అంతకంతకూ లభిస్తోన్న ప్రాపకం మూలంగా మన రాజ్య వ్యవస్థ ప్రజాస్వామిక, లౌకిక స్వభావానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సత్యసాయి బాబా మరణం ఊహించిందే. సాయిబాబాను భగవంతుడిగా కొలిచి, ఆయన మరణానికి అమితంగా బాధపడినవారి పట్ల సానుభూతి చూపవచ్చు. విశ్వాసాన్ని హేతుబద్ధం చేయలేము కదా. అయితే అటువంటి విశ్వాసమూ, ఆ విశ్వాసానికి ఆలంబననిస్తోన్న సంస్థలూ విలసిల్లడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని, నిధులను ఉపయోగించడం లౌకికవాద ప్రమాణాలు ప్రతి ఒక్కదాన్ని ఉల్లంఘించడమే కాదూ?

పుట్టపర్తి సత్యసాయిబాబా మరణించిన తీరూ, ఆయన మరణమూ, భక్తుల పరితాపంలోనూ ఆ బాబాకు రాజ్య వ్యవస్థ పరంగా ఎంతటి ప్రాపకం లభించిందో మనకు స్పష్టంగా కన్పించింది. బాబా చేసిన 'మంచి పని'ని ఇక్కడ ప్రశ్నించడం లేదు. అయినా సంచితమైన సంపదను ఖర్చు పెట్టాలి కదా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, రాష్ట్ర గవర్నర్ మొదలైన వారు తమ విచారాన్ని వ్యక్తం చేసిన తీరు అభ్యంతరకరం, గర్హనీయం. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వారు బాబా పట్ల తమ గౌరవాన్ని లోకానికి తెలియజేశారు.

ఇటువంటి సందర్భాలన్నిటిలోనూ ఖర్చు చేసేది ప్రభుత్వ నిధులు అంటేప్రజల సొమ్మే కాదూ? మతం, విశ్వాసం అనేవి వ్యక్తిగత వ్యవహారాలు. వ్యక్తిగత హోదాలో స్వీయ మత, విశ్వాసాలను ప్రదర్శించుకొనే హక్కు ప్రభుత్వాధినేతలు, ప్రభుత్వాధికారులకు పూర్తిగా ఉంది. అయితే బాబాలను, అమ్మలను- అశేష జనావళి వారికి భక్తులుగా ఉన్నప్పటికీ- ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పుడు పోషిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం లౌకికవాద ప్రభుత్వమెలా అవుతుంది? అటువంటి ప్రభుత్వపు లౌకిక వాద నిబద్ధత ప్రశ్నార్ధకమే. మరీ అభ్యంతరకరమూ, ప్రశ్నించవలసిన విషయమేమిటంటే ఆ బాబాకు ప్రభుత్వపరంగా అంత్యక్రియలు నిర్వహించడం.

'తెలంగాణ, శాంతి కోసం' టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చండీయాగం నిర్వహించారు. ఈ యాగం వ్యవహారాలకు మీడియాలో మంచి ప్రచారం లభించింది. అయితే ఒక వ్యక్తిగా తన వ్యక్తిగత హోదాలో చంద్రశేఖర్‌రావు చండీయాగాన్నే కాదు, మరెదైనా పూజను నిర్వహించినా ఆందుకు ఆయనకు గల హక్కును ఎవరూ ప్రశ్నించరు. తాను నిర్వహించిన చండీయాగాన్ని వ్యక్తిగత హోదాలో నిర్వహించానని ఆయన చెప్పవచ్చు. నిజానికి యాగం కంటే జాతరే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

తన విశ్వాసం మేరకు యాగాలు, పూజలు నిర్వహించే హక్కు చంద్రశేఖర్‌రావుకు ఉందా లేదా అన్నది ఇక్కడ ఒక అంశం కాదు. అయితే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోన్న ఒక పార్టీ నాయకుడిగా తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని సాధించేందుకై యాగాన్ని నిర్వహించడం సమంజసమేనా? ఆ యాగంలో బ్రాహ్మణ సంస్కృతీ సంబంధ కర్మకాండను ఆచరించడం, ఆంధ్ర, తెలంగాణ బ్రాహ్మణుల తీరుతెన్నులపై చేసిన వ్యాఖ్యలు లౌకికవాద స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి.

ఇఫ్లూ (భారతీయ, విదేశీ భాషల విశ్వవిద్యాలయం)లోని దళిత, బహుజన విద్యార్థులు తమ భోజనంలో ఎద్దు మాంసాన్ని వడ్డించాలని డిమాండ్ చేయడం ప్రజాస్వామిక, లౌకిక డిమాండ్ల పరిధిలోనే ఉంది. ఎద్దు మాంసాన్ని తినని వారిచేత బలవంతంగా తినిపించవలసిన అవసరం లేదు. చాలా ఉన్నత విద్యా సంస్థలు ఇప్పటికీ అగ్రకులాల అభిరుచుల, ఆ కులాలవారికి నిషిద్ధాలయిన వాటి ప్రభావంలోనే ఉన్నాయి. కనుకనే విద్యార్థులకు ఎద్దు మాంసాన్ని వడ్డించడంపై అలిఖిత నిషేధం ఉంది. ఎద్దు మాంసాన్ని, ఆ మాటకు వస్తే పంది మాంసాన్ని తినే వారికి ఆ మాంసాన్ని వడ్డించకపోవడానికి కారణమేమీ లేదు.

ఉస్మానియా వర్సిటీ, ఇఫ్లూలోని దళిత విద్యార్థులు తమ అస్తిత్వాన్ని, ప్రజాస్వామిక హక్కులను చాటడానికి కల్యాణి బిర్యానీ విందుల నేర్పాటు చేశారు. ఆహార సంస్కృతి, అభిరుచులు దేశానికీ దేశానికీ మారుతుంటాయి; ఒక సామాజిక సముదాయానికీ, మరో సామాజిక సముదాయానికీ మారుతుంటాయి. చివరకు వ్యక్తికీ వ్యక్తికీ మధ్య కూడా ఆహార అభిరుచులు ఒకటిగా ఉండవు కదా. ఈ వ్యవహారంలో నైతిక ప్రశ్న ఏమీలేదు. సంస్కృతి అనేది ఆచారాలు, అలవాట్ల సమ్మేళనం. ఆహారం సైతం ఇందుకు భిన్నం కాదు. ఈ ఆచారాలు, అలవాట్లు కాలంతో పాటు మారుతుంటాయి.

అగ్రకులాల, ఉన్నత వర్గాల వారి శక్తిమంతమైన, గుత్తాధిపత్య సంస్కృతిని అందరిపై రుద్దడం సకల ప్రజాస్వామిక, లౌకికవాద ప్రమాణాలు, విలువలన్నిటికీ వ్యతిరేకం. గతంలో కంటే ఇప్పుడు మతం ప్రభావం అధికమయింది. ఉన్నత విద్యా సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కనీసం 1970ల వరకు మతపరమైన పండుగలను చేసుకొనేవారు కాదు. 1980 ల్లో వినాయకచవితి, ఇతర మతపరమైన పర్వదినాలను జరుపుకోవడం ప్రారంభమయింది. ఇందుకు రాజకీయపక్షాల ప్రోత్సా హం ఎంతైనా ఉంది. ఆ వేడుకలు క్రమంగా విద్యార్థుల మధ్య ఘర్షణలకు కారణమయ్యాయి. ఇప్పటికీ అవుతున్నాయి కూడా.

ఇప్పుడు వివిధ సామాజిక బృందాలవారు మతపరమైన పండుగలను మరింత ఆవేశపూరితమైన పద్ధతుల్లో జరుపుకోవడాన్ని మనం చూస్తున్నాం. ఇది తరచూ మతతత్వ ఘర్షణలకు కారణమవుతోంది. మీడియా, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, వ్యాపారవర్గాలు ఒక సంఘటనకు, ఒక పర్వదిన వేడుకల నిర్వహణకు, ఒక బాబాకు మద్దతు, ప్రోత్సాహం ఇవ్వడం, ప్రచారం కల్పించడంపై మతం, సంస్కృతి గణనీయమైన ప్రభావాన్ని నెరపుతున్నాయి.

పెట్టుబడిదారీ విధానం ప్రపంచీకరణ అయిన ఈ రోజుల్లో మతపరమైన లేదా రాజకీయ పరమైన లక్ష్యాల కోసం ప్రజలను సమీకరించేందుకు పోటీదాయక మతతత్వాన్ని, ప్రజలు సమష్టిగా పాల్గొనే కొత్త ఆరాధనా పద్ధతులను సృష్టిస్తున్నారు. ఈ ప్రక్రియలలో రాజ్య వ్యవస్థ కూడా పూర్తిగా అంతర్భాగమవుతోంది. ఇది మన ప్రజాస్వామిక,లౌకికవాద సంస్కృతికి ఎంత మాత్రం మేలు చేయదు. మన సమున్న త సంస్కృతిని కుంటుపరుస్తోంది. మరి ఈ ప్రక్రియలను ఎలా ఎదుర్కోవడం?

మతాన్ని నిషేధించలేం. అయితే ఘర్షణలు, హింసాకాండను నిరోధించడానికి ప్రజా వ్యవహారాల్లో మతపరమైన ఆచరణలను క్రమబద్ధీకరించవచ్చు. ప్రజాస్వామిక, లౌకికవాద సంస్కృతిని సృష్టించేందుకు రాజ్యం ప్రజాస్వామిక, లౌకిక వ్యవస్థగా కన్పించి తీరాలి. బహిరంగ ప్రదేశాలను మతాలకు అతీతమైన లౌకిక ప్రదేశాలుగా ఉంచేందుకై ప్రభుత్వం ఆ ప్రదేశాలను మతపరమైన చొరబాట్లకు గురికాకుండా కాపాడాలి. వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా సరస్సులను కాలుష్య మయం చేయడం ప్రజలకు చెందిన సహజ వనరులను ఉల్లంఘించడం కాదా అని మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరముంది.

పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థపదార్థాలే సరస్సులు మొదలైన వాటిని మరింతగా కాలుష్యమయం చేస్తున్నాయన్న వాదన వాదనే కాదు. ఎందుకంటే ఆ విషయమై కూడా మన ం తీవ్ర నిరసన తెలుపుతున్నాం కనుక. అన్ని మతాలకు వర్తించే స్పష్టమైన నియమ నిబంధనలతో మతపరమైన కట్టడాల, ఆరాధనా మందిరాల నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాలి. ఆ నియమ నిబంధలను ఎవరూ ఉల్లంఘించడానికి వీలులేదు. వ్యక్తిగత హోదాలో మతపరమైన వేడుకలకు హాజరు కావడానికి, మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్రభుత్వాధికారులెవరూ ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి.

ఇప్పుడు మన అనుభవంలోకి వస్తోన్న ఆధ్యాత్మికత షిర్డీ సాయిబాబా, ఇతర రుషులు, సాధువులు ఉపదేశించిన ఆధ్యాత్మికతకు పూర్తిగా విరుద్ధమైనది. ఇది పూర్తిగా పచ్చి భౌతిక లా లస, సిరిసంపదల ప్రదర్శనే. కాకపోతే సంపన్నులు, అధికారంలో ఉన్నవారికి ప్రత్యేకంగా భగవదర్శనం కల్పించడమేమిటి? సకల రంగాలూ ప్రపంచీకరణ అయిన కాలమిది. అసమానతలు, అభద్రతలు పెరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్యం సమున్నతమవడానికి, మానవ సంబంధాలు మానవీయమవడానికి కొత్త ప్రజాస్వామిక సంస్కృతిని సృష్టించుకోవల్సిన అవసరమెంతైనా ఉంది.

కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ ప్రజాస్వామిక హక్కులను వినియోగించుకొనేందుకు వీలుగా ఆస్తిపరుల ఔద్ధత్యాన్ని, దురహంకారాన్ని రాజ్యం, ప్రభుత్వ, పౌర సమాజ సంస్థలూ సమర్థంగా ఎదుర్కోవాలి. అర్థవంతమైన రాజకీయ వ్యవస్థను సృష్టించేందుకై ప్రజా జీవితాన్ని క్రమబద్ధీకరించేందుకు ఒక ఆచరణాత్మక దృక్పథం అవసరం. ఆ సమున్నత లక్ష్యాన్ని సాధించగలమనే విశ్వాసం మనలో నిండుగా ఉన్నప్పుడే దానిని సాకారం చేసుకొనే కృషిని ప్రారంభించగలుగుతాము.

-రమా మెల్కోటే

No comments:

Post a Comment