Sunday, September 4, 2011

కుట్రలను ఛేదిస్తాం.. ఉద్యమంలో ముందుంటాం..---పిడమర్తి రవి, టీఎస్ జేఏసీ చైర్మన్ Namasethe Telangana 04/09/2011



శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన ప్రాంతీయ దురభిమానాన్ని, తెలంగాణ పట్ల తన వివక్షతను మరోసారి చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా మాదిగలు, అందరూ 30 ఏళ్ల పై బడిన వారున్నారని, వారంతా మావోయిస్టుల కనుసన్నల్లో ఉద్యమాన్ని నడుపుతున్నారని ఆయన అన్నట్టు వీకీలీక్స్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచీ క్రియాశీలకంగా పాల్గొంటున్న మాదిగ విద్యార్థిలోకాన్ని భయవూబాంతులకు గురిచేయాలనుకుంటున్నారు. అలాగే..రాబోయే కాలంలో ఉవ్వెత్తున లేస్తున్న ఉద్యమంపై నిర్బంధాన్ని ప్రయోగించడానికి భూమికను తయారు చేస్తున్నారు. తన రహస్య ప్రణాళిక ‘అమెరికన్ కాన్సులేట్‌కు చెబితే.. ఎవరికి తెలుస్తుందిలే’ అనే కుబుద్ధితో మనోహర్ గారు భావించి ఉంటారు. అదికాస్తా వెలుగు చూడటంతో.. నాలుక కర్చుకొని తాను అలా అనలేదని తప్పించుకోజూస్తున్నారు.

ఆది నుంచీ..తెలంగాణ గడ్డమీద మాదిగలు అన్ని పోరాటాల్లో అగ్రభాగాన ఉన్నారు. చరిత్ర పుటలు తిరిగేసినా ఇదే తెలుస్తుంది. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచీ ..నేటి దాకా సమాజంలోని అట్టడుగున దోపిడీ పీడనలకు గురవుతున్నది దళితులే. వారే సామాజిక మార్పుకోసం నిరంతరం తపిస్తుంటారు. సమాజంలో జరిగే సంఘర్షణలో భాగస్వాములవుతారు. దొడ్డి కొమురయ్య కాలంనుంచి.. నేటి మహబూబ్‌నగర్ జిల్లా నాగరాజు మాదిగ దాకా.. ఎందరో మాదిగ లు ఈ సమాజ మార్పుకోసం జరుగుతున్న పోరాటంలో భాగస్వాములయ్యారు. అమరులయ్యారు.

మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మాదిగలే తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల్లో విద్యార్థి జేఏసీ నాయకులుగా ఉన్నది మాదిగ విద్యార్థులే. సామాజిక మార్పుకు అత్యవసరమైన వర్గంగా, తెలంగాణ ఉద్యమాన్ని సహజంగానే గుండెకు హత్తుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో నిర్బంధాలను చవిచూస్తున్నారు. ఒక్కొక్కరిపై వందల కేసులు బనాయించి జైళ్లలో పెట్టారు. విద్యార్థి ఉద్యమంలో అగ్రభాగాన నిలుస్తున్న 20 మంది విద్యార్థినాయకుల్లో 15 మంది మాదిగ విద్యార్థులే. అలాగే మలి దశ ఉద్యమంలో అరెస్టు అయిన మొదటి విద్యార్థి కూడా మాదిగనే. అలాగే 2009 డిసెంబర్ 6న అరెస్టయి జైలుకెళ్లిన విద్యార్థులు ఏడుగురిలో ఐదుగురు మాదిగ విద్యార్థులే. ఇప్పటిదాక ఎక్కువ కాలం జైలు నిర్బంధంలో ఉన్నవారు కూడా మాదిగ విద్యార్థి నేతలే. అయినా విద్యార్థులు వెనకడుగు వేయకుండా పోరాడుతూనే ఉన్నా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దాకా పోరు ఆపేదిలేదని మడమ తిప్పకుండా పోరాటంలో ముందంజలో ఉన్నారు. త్యాగాలకు వెరువక ముందుకు కదులుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ ఉద్యమానికి జవ,జీవం ఇస్తున్నది మాదిగ కవులు, కళాకారులే. తెలంగాణ జాతీయ గీతం రాసిన అంద్శై గోరటి వెంకన్న మొదలు నేర్నాల కిశోర్ దాకా ఎందరో కవులు, రచయితలు తమ కలం తో, గళంతో.. తెలంగాణ ఉద్యమానికి వన్నె తెస్తున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో ప్రజాసంఘాల పాత్ర మరువలేనిది. ప్రజల పక్షాన నిలబడి కష్ట నష్టాలకోర్చి పోరాడుతున్న గజ్జెల కాంతం మొదలు విశారదన్, బొంగు రమేష్ తదితరు లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులు, ప్రజాసంఘాలకు తోడు మేధావులు, రాజకీయ నేతలు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు అవునన్నా, కాదన్నా మాదిగలు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నారు. అణగారిన వర్గంగా తెలంగాణ కోరుకునే వారిలో మాదిగలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఉన్నారు. ముందుండి పోరాడుతున్నారు. ఇక మందు కూడా ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని త్యాగాల కోర్చి అయినా పోరాడుతారు. ఇప్పుడు స్పీకర్ కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కాకుంటే.. ఆయన సీమాంధ్ర పక్షపాత బుద్ధితో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలనే కుట్రలో భాగంగా లేని నిందలు మోపుతున్నారు. మాదిగ విద్యార్థినాయకులపై మావోయిస్టుల ముద్రవేస్తున్నారు.

పీడిత తాడిత వర్గాల కోసం పోరాడుతున్న మావోయిస్టులంటే.. మాదిగలకు గౌరవం ఉంటే ఉండొచ్చు, ఆయన ఆరోపించినట్లు విద్యార్థి నాయకుల్లో మావోయిస్టులు ఎవరూ లేరు. తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న వారంతా ఆయా యూనివర్సిటీలలో చదువుతూ.., రీసెర్చ్ స్కాలర్లుగా ఉన్నవారే. ఇలాంటి కుట్రలు, కుహకాలతో.. తెలంగాణ ఉద్యమాన్ని అపలేరు. నిత్య నిర్బంధంలో సైతం నిప్పులై మండుతాం. సీమాంధ్ర వలసవాదుల పాలనకు చరమగీతం పాడుతాం. తెలంగాణ సాధించుకుంటాం.
-పిడమర్తి రవి, టీఎస్ జేఏసీ చైర్మన్
అడ్డూరి శ్రీనివాస్, తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర కన్వీనర్
బండారు వీరబాబు, బీఎస్‌ఎఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్,
దామెర రాజేందర్, తెలంగాణ మాదిగ విద్యార్థిసంఘం కన్వీనర్
పెద్దకొల్ల సంజీవ్ కుమార్, తెలంగాణ మాదిగ యూత్ ఫెడరేషన్ కో ఆర్డినేటర్

No comments:

Post a Comment