Sunday, September 4, 2011

ఆదివాసీలకు అందని ఫలాలు--శ్రీరాం నాయక్‌ Prajashakti , 8 Aug 2011


ఆదివాసీలకు అందని ఫలాలు
Share
నేటి వ్యాసం Mon, 8 Aug 2011, IST
స్వాతంత్య్రం వచ్చి 64 సంవత్సరాలు గడిచినా గిరిజనుల ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పు లేదని అనేక నివే దికలు వెల్లడిస్తున్నాయి. ఏ ఆశయాల కోసం మన పూర్వీకులు స్వాతంత్య్రం పోరాటంలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారో వారి ఆశయాలు ఇప్పటికీ నెరవేర లేదు. దేశంలో గిరిజనుల జీవన ప్రమాణాలు 26 ఆఫ్రికా దేశాల కన్నా హీనంగా ఉన్నాయని 2010 ఐక్యరాజ్యసమితి (ఐరాస )నివేదిక వెల్లడించింది. టాటాలు, బిర్లాలు, అంబానీల సేవలో మునిగి తేలుతున్న పాలకులకు ఆదివాసీల గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది? 1993 ఆగష్టు 9న ఐరాస న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన వేదికపై ఆదివాసీలు తమ హక్కులు గురించి తొలిసారి గళం విప్పారు. ఆ వేదిక నుంచే ప్రపంచ ఆదివాసీల దినోత్సవానికి పిలుపునిచ్చారు. అయితే ఇది తీర్మాన రూపం దాల్చడానికి చాలా సమయం పట్టింది. చివరికి 2007 నుంచి ప్రతియేటా అగష్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా పాటించాలని ఐరాస ఒక తీర్మానం తెచ్చేంతవరకు ఇది ఆచరణ రూపం దాల్చలేదు. ఈ తీర్మానంపై మన దేశంతో సహా 140 దేశాలు సంతకాలు చేశాయి. కానీ, ఇప్పటికీ మన ప్రభుత్వం దీనిని అధికారికంగా జరపకుండా వివక్ష చూపుతున్నది.
గిరిజనులను బందీ చేసిన అటవీ చట్టాలు
భారతదేశంలోని గిరిజన తెగలు తరతరాలుగా అడవులతో సాన్నిహిత్యం కలిగి ఉన్నారు. పండ్లు, దుంపలు, తేనె, మూలికలు వంటి అటవీ ఉత్పత్తులను సేకరించుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీల ఉపాధిపై మొట్టమొదట దెబ్బ కొట్టింది బ్రిటీష్‌ వలసపాలకులు. గిరిజనుల అటవీ ఫలసాయం, పోడు వ్యవసాయంపై అనేక ఆంక్షలు విధించారు. ఈ అన్యాయాన్ని ఎదిరించినవారిపై తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగించేవారు. ఈ విధంగా వచ్చినదే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 1835 సంతాల్‌ తిరుగుబాటు. ఆ స్ఫూర్తితో ముండాలు, నాగాలు, మిజో గిరిజన తిరుగుబాట్లు ఉవ్వెత్తున లేచాయి. స్వాతంత్య్రోద్యమంలో గిరిజనులు నిర్వహించిన పాత్ర తక్కువేమీ కాదు. మన్యం గిరిజనుల తిరుగుబాటు, నైజాం నిర్భంధ కాండపై కొమురం భీం పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిఉంటాయి. ఈ పోరాటాలను పాలకులు విస్మరించడమో, తక్కువ చేసి చూపడమో జరుగుతోంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్న సంపదను తరలించడానికి బ్రిటీష్‌ పాలకులు అణచివేత విధానాలను అనుసరించారు. నేటి పాలకులు కొంచెం అటు ఇటుగా అవే విధానాలను కొనసాగిస్తున్నారు.
గిరిజన సంపద లూటీ
ఆదివాసీల జీవన విధానంపై అనేక ఆంక్షలు విధించిన ప్రభుత్వం మరోవైపు అడవుల్లోని గిరిజన సంపదను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టేందుకు చట్టాలను సవరిస్తున్నది. అడవుల్లోని జంతువులు, పక్షులకు కల్పించే కనీస హక్కులకు కూడా గిరిజనులు కల్పించడం లేదు. పైగా గిరిజనుల వల్లే అడవులు నాశనం అవుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. నయాఉదారవాద విధానాలు అమలులోకి వచ్చాక ఆదివాసీల హక్కులపై దాడి మరింత పెరిగింది. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో వీరిని అడవుల నుంచి గెంటివేస్తున్నారు. బయటి ప్రాంతాల అభివృద్ధి కోసం గిరిజనులను త్యాగాలు చేయమంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో అతి విలువైన ఖనిజ సంపద ఉన్నట్లు భూగర్భ సర్వేలు తెలియచేస్తున్నాయి. అల్యూమినియం, బాక్సైట్‌, ఇనుము, రంగురాళ్ళు, సుద్దరాయి, సిమెంట్‌ వంటి గనులకు ఈ ప్రాంతాలు ఇప్పటికే ప్రసిద్ధి. ఈ ఖనిజ సంపదనంతటినీ దేశాభివృద్ధికి ఉపయోగిస్తే అమెరికా కంటే ధనిక దేశంగా మన దేశాన్ని తీర్చి దిద్దవచ్చు. అంత సంపద ఉన్నది కానీ, మన పాలకులు వీటిని కారు చౌకగా విదేశీ బహుళ జాతి కంపెనీలకు, దేశం లోని బడా కార్పొరేట్‌ శక్తులకు, వ్యక్తులకు కట్టబెడు తున్నారు. బిజెపి, కాంగ్రెస్‌ ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతున్నది ఇదే. జిందాల్‌, వేదాంత, పోస్కొ, రిలయన్స్‌ వంటి కంపెనీ లకు ఈ ప్రభుత్వాలు వేలాది ఎకరాలు ధారాదత్తం చే శాయి. ఎం.ఎల్‌.ఏలతో పాటు మంత్రులు, ముఖ్య మంత్రుల బంధువర్గాలు కూడా ఈ లూటీలో భాగ స్వాములవుతున్నారు. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులు అడవులను ముంచెత్తుతున్నాయి. ఖనిజ తవ్వకాల ద్వారా వచ్చే సంపదలో ఒక శాతం కూడా గిరిజన ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయడం లేదు. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో మైనింగ్‌ పాలసీని పార్లమెంట్‌లో యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది. గిరిజన ప్రాంతాల నుంచి పొందిన ఆదాయంలో 26 శాతం మొత్తాన్ని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వెచ్చించాలని ప్రతిపాదిస్తే దీనికి బహుళజాతి, ప్రైవేట్‌ సంస్థలు ససేమిరా అంటున్నాయి. దీనిని బట్టే అడవులను ఎవరు నాశనం చేస్తున్నారో అర్థమవుతుంది.
హక్కులపై దాడి
భారత రాజ్యాంగంలో షెడ్యూలు తెగలు, షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు ఉన్న ప్రత్యేక హక్కులపై పాలక వర్గాలు దాడిని ఎక్కుపెట్టాయి. మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ వరకు 9 జిల్లాల్లో షెడ్యూలు ప్రాంతం ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలను అత్యంత ప్రాధాన్యత గల 6వ షెడ్యూల్‌లో చేర్చారు. మన రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతాలను అయిదో షెడ్యూల్‌లోనే ఉంచారు. అంతేకాదు, షెడ్యూల్డు ప్రాంతంలో గిరిజనులకు అనుకూలంగా ఉన్న 1/70 చట్టం, పెసా , సుప్రీింకోర్టు తీర్పులను సైతం సరిగా అమలుచేయడం లేదు. ఏజెన్సీలో గిరిజనేతలరులకు ఎటువంటి హక్కులు ఇవ్వకూడదని చట్టాలు చెబుతుంటే వారికి ఇప్పుడు హక్కులు కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతోంది. వేలాది మంది గిరిజనేతర భూస్వాములు, వ్యాపారులు పేదలు ముసుగులో ఏజన్సీ ప్రాంతంలో తిష్టవేస్తున్నారు. పెద్ద పెద్ద హోటల్ళు, రెస్టారెంట్లు, లాడ్జీలు వెలుస్తున్నాయి. ఏజెన్సీలో గిరిజనేతరుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. పాలనా యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. భద్రాచలం లాంటి పట్టణాలను ఏజెన్సీ నుండి మినహాయించాలని డిమాండ్‌ చేసే స్థాయికి వీరు చేరుకున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే గిరిజనులు సొంతగడ్డపై శరణార్థులుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఏజెన్సీలో 2005 ప్రభుత్వ లెక్కల ప్రకారం గిరిజనేతర భూస్వాములు 3 లక్షల ఎకరాల గిరిజన భూములను ఆక్రమించారని ప్రభుత్వం నియమించిన గిర్‌గ్లానీ, డివిఎల్‌ఎన్‌ మూర్తి కమిటీలు స్పష్టంగా వెల్లడించాయి. కోనేరు రంగారావు భూ కమిటీ గిరిజన భూముల ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఏజెన్సీలో గిరిజనేతర భూస్వాములు ఆక్రమించిన భూముల విలువ పది వేల కోట్లకు పైబడి ఉండొచ్చని ఒక అంచనా. 1998 పంచాయతీరాజ్‌ ఏజెన్సీ ప్రాంత విస్తరణ చట్టం సెక్షన్‌ 4(డి(1) ప్రకారం షెడ్యూల్డు ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు నిర్మించాలంటే గ్రామసభ ఆమోదం తప్పనిసరి. 242 ఎఫ్‌ సెక్షన్‌ ప్రకారం మండల పరిషత్‌ అనుమతి తీసుకోవాలి. 2011లో ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా నోటిఫికేషన్‌ పేరుతో గ్రామసభ ఆమోదం తప్పనిసరి అనే క్లాజును తొలగించి మండల పరిషత్‌ ఆమోదం తెలిపితే చాలని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో 276 గ్రామాలు, 9 మండలాలు, 1.50 లక్షలు మంది గిరిజనులను జలసమాధి చేయడానికి సిద్ధ్దపడింది. విశాఖలో బాక్సైట్‌ నిక్షేపాలను జిందాల్‌ సంస్థకు కట్టబెట్టింది. ప్రభుత్వ చర్యల మూలంగా సుమారు మూడు లక్షల మంది వరకు గిరిజనులు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వాసితులవుతున్నారు. మినీ పవర్‌ ప్లాంట్ల నిర్మాణం కోసం ఏజెన్సీలో 13 ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఇవి గిరిజనుల భాగస్వామ్యంతో చేయాలని జిఓలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టింది. కృష్ణ ప్రియ అనే ప్రైవేట్‌ కంపెనీకి ఖమ్మం జిల్లా సీలేరు ప్రాజెక్టును అప్పగించింది. విశాఖ ఏజెన్సీలో 26 రకాల రంగు రాళ్ళు, చైనా క్లే వంటి విలువైన ఖనిజాలను రాజకీయ నాయకులు బినామీ కంపెనీలు సృష్టించి దోచుకోవాలని చూస్తున్నారు. కొన్నిటికి జిల్లా కలెక్టర్‌ అనుమతి ఇవ్వగా స్థానిక గిరిజనులు, గిరిజన సంఘం అండతో ఎదురు తిరగడంతో వాటిని తాత్కాలికంగా రద్దుచేశారు. ఖమ్మంజిల్లా బయ్యారం ప్రాంతంలో లక్షా నలబై వేల ఎకరాల భూమిని ఖనిజ తవ్వకాల కోసం అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ తన అల్లుడి ఆధ్వర్యంలోని సంస్థకు ఎలా కట్టబెట్టిందీ చూశాము.
ప్రపంచీకరణ ప్రభావం
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ దుష్పరిణామాలు సమాజంలోని ఇతర తరగతుల కన్నా గిరిజనులు, దళితులపై ఎక్కువగా చూపుతున్నాయి. గిరిజనులు చిన్న చదువు చదివినా చాలు ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ అని ప్రచారం చేస్తుంటారు. కాని నేడు డబుల్‌ పిజీలు చేసినా ప్రభుత్వ నౌకరి వచ్చేపరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కుదించుకుపోతున్నాయి. అరకొరగా ఉన్న వాటిలో తాత్కాలిక , కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్దతుల్లో భర్తీ చేస్తున్నారు. గౌరవ వేతనం పేరుతో చాలా తక్కువ వేతనాలు ఇచ్చి గాడిద చాకిరి చేయిస్తున్నారు. ప్రభుత్వ రంగాలు, సంస్థలు బలంగా ఉన్నప్పుడు వీటిలో రిజర్వేషన్ల ద్వారా సామాజిక తరగతులకు ఉద్యోగాలు లభించేవి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తుండడంతో రిజర్వేషన్లకు విలువ లేకుండా పోతోంది. గత 10 సంత్సరాల కాలంలో 15 వేల ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం జి.ఓ.లను పొడిగిస్తూ వస్తోంది. ప్రైవేటు సంస్థల్లో రిసెప్షనిస్టు పోస్టుకు కూడా హిందీ, ఇంగ్లీషు రావాలని షరతులు విధిస్తున్నారు. ఎంతమంది గిరిజన బిడ్డలకు ఇంగ్లీషు, హిందీ వస్తుంది. గిరిజన తెగల్లోనే కొంతమంది అభివృద్ధి చెందిన వారు ఈ పోటీకి తట్టుకోగలిగినా, ఉన్నత వర్గాల రాజకీయ, ఆర్థిక బలం ముం దు నిలబడలేకపోతున్నారు.నాణ్యమైన విద్య చదువుకోవడానికి గిరిజనుల ఆర్థికపరిస్థితులు అడ్డుతగులుతున్నాయి. గిరిజనుల్లో 80 శాతం దాకా సన్న, చిన్న కారు రైతులే. వీరు వర్షాధార మెట్ట పంటలపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. వర్షాభావ పరిస్థితుల వలన పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రావడం లేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక, అప్పులు తీరే మార్గం లేక ఉన్న భూములను అమ్ముకుని కూలీలుగా మారుతున్నారు. పొట్టచేతపట్టుకుని సుదూర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు మన రాష్ట్రంలో ఉన్న 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో గిరిజనులను మరిన్ని అధికారాలు కలిగిన 6వ షెడ్యూల్‌ లోకి మార్పు చేయాలి. అలాగే గిరిజనులకు స్వయం ప్రతిపత్తి కలిగిన స్వయం పాలిత మండలి ఏర్పాటు చేయాలి. రాష్ట్ర బడ్జెట్‌లో గిరిజన సబ్‌ప్లాన్‌కు కేటాయిస్తున్న 6.6శాతం నిధులను వారి అభివృద్ధికే ఖర్చు చేసేవిధంగా చట్టం తీసుకురావాలి. నిధులు దారి మళ్లించకుండా ఒకచోట పూల్‌చేసి నోడల్‌ ఏజెన్సీ ద్వారా ఖర్చు చేయాలి. ఈ నిధులను గిరిజన గూడేలు, తండాలు, కాలనీల అభివృద్ధికి వినియోగించాలి. గిరిజనులు పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. 25 లక్షల ఎకరాల భూములపై హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. గిరిజన విద్యార్థులందరికీ ప్రభుత్వమే ఉన్నత చదువులు భోజన వసతి కల్పించాలి. దరఖాస్తు చేసిన ప్రతి గిరిజన విద్యార్థికీ అడ్మిషన్లు కల్పించాలి. స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ డిమాండ్ల సాధనకు గిరిజనులు ఇతర అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని ఐక్యంగా ఉద్యమించాలి. ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇందుకోసం ప్రతినబూనాలి.
శ్రీరాం నాయక్‌

No comments:

Post a Comment