చీకటిరోజులు చిదిపేసిన హక్కులు
Share
ఆర్. రఘు Sat, 25 Jun 2011, IST
రాజకీయంగా పార్టీలు ముక్కలు చెక్కలు అవటం, బలహీనపడడం ఒకవైపు జరుగుతూ వుంటే, మరోవైపు ప్రపంచబ్యాంకు ఆదేశిత ఉదారవాద ఆర్థిక విధానాల ఉచ్చులో దేశం బిగుసుకుపోతోంది. పర్యవసానంగా రాజకీయ నియంతృత్వానికి భిన్నంగా ఆర్థిక నియంతృత్వంలోకి దేశం జారిపోతోంది. ఈ క్రమాన్ని నిలువరించటమే వామపక్ష శక్తుల, ప్రజాతంత్ర లౌకిక శక్తుల కర్తవ్యం.
''తీవ్ర నిర్బంధ కాండకు, నియంతృత్వానికి పాలకవర్గ పార్టీ పాల్పడుతున్నది. ఇది ఏక పార్టీ నియంతృత్వాన్ని తీవ్రతరం చేస్తుంది. నేడు దేశం ముందున్న పెద్ద ప్రమాదం ఇదే''. - 1973లో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం చేసిన హెచ్చరిక ఇది.
అంతకు ముందు అంటే 1972లో జరిగిన పార్టీ 9వ మహాసభ కూడా ఇదే విధంగా హెచ్చరించింది. ఈ విషయమై ఆ మహాసభ రాజకీయ తీర్మానం ఇలా పేర్కొన్నది. ''గణనీయమైన రాయితీలు చూపి జనసామాన్యంలోని పెద్ద భాగాన్ని సంతృప్తిపరిచే శక్తి కాంగ్రెస్‌కు లేకపోవడం, మరిన్ని భారాలను మోపడం, నిర్బంధకాండను ప్రయోగించడం, వామపక్షాలు, ప్రతిపక్షం బలహీనంగా ఉండడం, పాలక పార్టీ మొత్తంగా ప్రతిపక్షాన్ని సహించలేని స్థితిలో ఉండటం ఇవన్నీ ఏక పార్టీ నియంతృత్వానికి దారి తీసే ప్రమాదముంది...అన్ని ప్రజాతంత్ర పార్టీల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఓటింగ్ హక్కుతో సహా కాంగ్రెస్ పాలనలో ఇంక ఎంతమాత్రం సురక్షితంగా ఉండవు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని ప్రజాతంత్ర పార్టీలు, గ్రూపులు, వ్యక్తులతో కూడిన సాధ్యమైనంత విస్తృతమైన ఐక్య సంఘటన అవశ్యం''
ఇదీ సిపిఎం అవగాహన. ఈ అవగాహన ఆధారంగా చేసిన హెచ్చరికలను నిజమని తేలడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆ తరువాత కొన్నాళ్లకే అంటే 1975 జూన్ 26న (25వ తేదీ అర్ధరాత్రి) ఇందిరా గాంధీ ఎమర్జన్సీ ప్రకటించింది. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ అంటే దాదాపు 21 నెలలపాటు ఈ చీకటి రాజ్యం సాగింది.
1971లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ మూడింట రెండొంతుల మెజార్జీ సాధించింది. 1972లో వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించింది. అయితే రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఈ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన హైకోర్టు 1975 జూన్ 12న ఆమె ఎన్నిక చెల్లదని, ఆరు సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీకి ఆమె అనర్హురాలని సంచలన తీర్పును వెలువరించింది.
అప్పటికే దేశంలో పరిస్థితి దారుణంగా తయారైంది. బూర్జువా, భూస్వామ్య వర్గాలతో కూడిన కాంగ్రెస్ రెండున్నర దశాబ్దాల పుణ్యమా అని దేశం ఆర్థిక సంక్షోభంలోకి జారిపోయింది. ప్రజలపై ఆర్థిక భారాలు పెరిగాయి. కార్మికవర్గ కనీస హక్కులపై దాడులకు అంతు లేకుండా పోయింది. కార్మికోద్యమంపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో సైతం నూతన వేతన ఒప్పందాలపై మారటోరియం విధించింది. బోనస్ చట్టాన్ని రద్దు చేయబూనుకుంది. కార్మికవర్గ పోరాటాలకు, రైతాంగ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉన్న సిపిఎంపై విరుచుకుపడింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుతో దిక్కుతోచని స్థితిలో పడ్డ ఇందిరా గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖూనీ చేస్తూ సిపిఎం ముందే హెచ్చరించినట్లుగా దేశంపై అత్యవసర పరిస్థితిని రుద్దింది.
ఎమర్జన్సీపైన ఎమర్జన్సీ
1971లో పాకిస్తాన్‌తో యుద్ధం సందర్భంగా జాతీయ భద్రతకు బయటి నుంచి ముప్పు ఏర్పడిందంటూ ప్రధాని ఇందిర అత్యయిక పరిస్థితిని విధించింది. రాజ్యాంగం ప్రసాదించిన పౌర స్వేచ్ఛపై ఆమె దాడి చేసింది. యుద్ధాన్ని సాకుగా చూపి దేశంలో ప్రారంభమైన ప్రతి ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. ఆ ఎమర్జన్సీని రద్దు చేయకుండానే 1975 జూన్‌లో దేశానికి ఆంతరంగికంగా ముప్పు ఏర్పడిందంటూ 352 ఆర్టికల్ కింద ఎమర్జన్సీని ప్రకటించింది. దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది.
అలహాబాద్ హైకోర్టు తీర్పు, జూన్ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును దృష్టిలో పెట్టుకుని ఇందిరాగాంధీó, ఆమె ముఠా దేశ రాజధాని ఢిల్లీలోను, ఆమె ఆరతరంగిక ముఠా సభ్యులైన ముఖ్యమంత్రి వెంగళరావు పరిపాలిస్తున్న ఆంధ్రరాష్ట్రంలోను బీభత్సం సృష్టించడం ప్రారంభించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారు. తీర్పుకు వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి మద్దతుగా ఢిల్లీకి రైళ్ళలోను, బస్సులలోను చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మందిని తరలించారు. పోలీసు నిఘా విభాగాన్ని తమ గుత్త సంస్థగా మార్చేశారు. దేశ వ్యాపితంగా జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశారు వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాది మంది పేర్లతో జాబితాలు తయారు చేసి పోలీసు శాఖకు అప్పగించారు. దీంతో విచ్చలవిడిగా అరెస్టులు ప్రారంభమయ్యాయి, ఇక సిపిఎం మీద సాగిన పైశాచిక దాడుల గురించి చెప్పనలవికాదు. బెంగాల్‌లో వేలాది మంది పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి జైళ్లలో కుక్కారు. బెంగాల్, కేరళ, ఆంధ్ర, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ భౌతిక దాడులకు పాల్పడింది. సిపిఎం ముఖ్య నాయకత్వం అంతా అజ్ఞాతంలో ఉండి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దఎత్తున అరెస్టు చేయనున్న ప్రతిపక్ష నాయకులను నిర్బంధించేందుకు తీహార్‌జైలులో ఖాళీ ఉండేలా చూసి రమ్మని ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ సెక్రటరీకి జూన్ 23 నే ఆదేశాలు అందాయి. ఆ తరువాత రెండు రోజులకే అంటే జూన్ 25న అర్థరాత్రి ఎమర్జెన్సీ విధించింది. ఈ వార్త ప్రముఖ పత్రికలలో రాకుండా ఉండేందుకు జూన్ 26 తెల్లవారుజామున 2 గంటల నుండి కరెంట్ కట్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందాయని 'షా' కమీషన్ ముందు ఢిల్లీ ఎలక్ట్రిసిటీ సప్లయి జనరల్ మేనేజర్ డిఎన్.మెహతా చెప్పారు. క్రమంగా అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. మీసా (మెయిన్‌టెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యురిటీ యాక్టు), డిఐఆర్ (డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్) వంటి చట్టాలను కాంగ్రెస్ అధిష్టానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది.
మరింత ఘోరమైన విషయం ఏమంటే భారత రాజ్యాంగం హమీ ఇచ్చిన వ్యక్తి స్వాతంత్య్రాన్ని ఇందిరా కాంగ్రెస్ నిలువునా కాలరాచింది. ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, చివరికి కాంగ్రెస్‌లోనే ఇందిరాగాంధీ, ఆమె ముఠా చేస్తున్న పనులను వ్యతిరేకించే వారిపై కూడా బహిరంగ పోలీసు నిఘా ఏర్పాటు చేసింది. ప్రముఖ నాయకుల ఫోన్‌లను ట్యాప్ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ ముద్దుల కొడుకు సంజరుగాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్‌గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చివేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికివాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు.
'షా' కమిషన్ నివేదిక ప్రకారం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించే విషయం కేంద్ర మంత్రివర్గంలో బ్రహ్మానందరెడ్డికి తప్ప మరెవరికీ జూన్ 25వ తేదీ వరకు తెలియదు. అంతా ఆమె, ఆమె ముఠా తెరవెనుక నుండి నడిపించుకువచ్చారు. బ్రహ్మానందరెడ్డి హోం మంత్రిగా ఉండడం వల్ల , సాంకేతికంగా ఆయన ద్వారానే రాష్ట్రపతికి లేఖ పంపాల్సి ఉన్నందున ఆయనకు ముందుగా తెలియజేసి ఉంటారు.
''నాడు -నేడు''
ఎమర్జెన్సీ కాలంలో (1975-77) ప్రజలపై కాంగ్రెస్ ఎంత నిరంకుశంగా వ్యవహరించిందో అంతే దీటుగా 1977 ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారు. ఇందిరాగాంధీ ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. భావి యువరాజు, ఆమె ముద్దుల కొడుకు సంజరుగాంధీకి డిపాజిట్ సైతం దక్కలేదు. కాంగ్రెస్ దాదాపు తుడిచి పెట్టుకుపోయింది. నాటితో ఎమర్జెన్సీ చీకటి చరిత్ర ముగిసింది. కానీ పాలక వర్గాలలో, పాలక పార్టీలలో ఎమర్జెన్సీ వంటి వికృత ఆలోచనలు చావలేదని గత 35 సంవత్సవరాల చరిత్ర పదేపదే రుజువు చేస్తున్నది. 1978లో జరిగిన పార్టీ 10వ మహాసభ ''ఎన్నికలలో కాంగ్రెస్‌కు పరాభవం సంభవించినా, నియంతృత్వానికి అనుకూల వాతావరణం సృష్టించే వర్గాల పరాజయానికి ఇది దారితీయలేదు. అందువల్ల బాహాటంగా నియంతృత్వాన్ని రుద్దటానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఇంకా కొనసాగించాల్సి ఉంది.''
భారత దేశ ఆర్థిక వ్యవస్థపై గుత్త పెట్టుబడిదారుల, బడా బూర్జువా వర్గం, భూస్వాముల ఆధిపత్యం కొనసాగించడం కోసం, తన పాలన సాఫీగా సాగించటం కోసం పాలకవర్గ పార్టీలు లేదా కూటములు నియంతృత్వాన్ని ప్రవేశపెట్టటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయని మార్క్సిస్టు పార్టీ ఆనాడే హెచ్చరించింది.
నిజానికి అదే జరుగుతూ వస్తున్నది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన జనతాపార్టీలో అంతర్భాగంగా ఉండి బయటకు వచ్చిన భారతీయ జనతా పార్టీ నిలువెల్లా నియంతృత్వ ధోరణితో ఉంది. దాని హిందూ మతోన్మాద సిద్ధాంతమే నిరంకుశమైనది. అందువల్లనే పైకి ఎన్ని చెప్పినా వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'పోటా' చట్టాన్ని తెచ్చిపెట్టింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దేశానికి పనికిరాదని, అధ్యక్ష తరహా పాలన సరైనదనే చర్చను లేవదీసింది.
ఏమైనప్పటికీ దేశ పరిస్థితులలో అనేక పెనుమార్పులు సంభవించిన మాట వాస్తవం. ఈ రోజు ఉదారవాద ఆర్థిక విధానాలు రాజ్యమేలుతున్నాయి. వామపక్ష పార్టీలు మినహా ఇతర రాజకీయ పార్టీలన్నీ ఈ ఉదారవాద విధానాలను ఆహ్వానిస్తున్నాయి. పర్యవసానంగా స్వదేశీ మార్కెట్లు విదేశీ గుత్త సంస్థలకు దారాదత్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల స్థానంలో ప్రైవేటు సంస్థలను ప్రతిష్టించాలన్న ఆలోచన బలంగా సాగుతున్నది. పాలనాయంత్రాంగం క్రమంగా సామ్రాజ్యవాద పెట్టుబడికి, గుత్త పెట్టుబడికి ఊడిగం చేసే స్థితికి చేరింది. ఇందుకు రిలయన్స్- కెజి2 గ్యాస్ కుంభకోణం తిరుగులేని ఉదాహరణ.
రాజకీయంగా పార్టీలు ముక్కలు చెక్కలు అవటం, బలహీనపడడం ఒకవైపు జరుగుతూ వుంటే, మరోవైపు ప్రపంచబ్యాంకు ఆదేశిత ఉదారవాద ఆర్థిక విధానాల ఉచ్చులో దేశం బిగుసుకుపోతోంది. పర్యవసానంగా రాజకీయ నియంతృత్వానికి భిన్నంగా ఆర్థిక నియంతృత్వంలోకి దేశం జారిపోతోంది. ఈ క్రమాన్ని నిలువరించటమే వామపక్ష శక్తుల, ప్రజాతంత్ర లౌకిక శక్తుల కర్తవ్యం.
ఆర్. రఘు
(రచయిత సిపిఎం విజయవాడ నగర కార్యదర్శి)
No comments:
Post a Comment