Sunday, September 4, 2011

మావోయిస్టులా, మావో అయిస్టులా?-1-మందకృష్ణ మాదిగ Namasethe Telangana 08/08/2011


మావోయిస్టులా, మావో అయిస్టులా?-1
అటు స్టాలిన్, ఇటు కొండపల్లి సీతారామయ్యగార్లతో పాటు వరంగల్ డిక్లరేషన్ గుర్తించిన వివిధ వర్గాల మౌలిక సామాజిక అంశాలనే మేము మాట్లాడుతుంటే అందుకు అనుగుణంగా మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీలాంటి వాళ్లు హర్షించాల్సింది. కానీ మీ పార్టీ పంథాను కూడా పక్కకు పెట్టే విధంగా మీలో మార్పు ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలి?
ధైర్యంగా ఆలోచించు, ధైర్యంగా ఆచరించు అన్న మావో మాటలను ఉటంకిస్తూ నేను రాసిన వ్యాసంపై ఏ దొరలను ఉద్దేశించి ఆ వ్యాసం రాశానో ఆ దొరల నుంచి అంటే టీఆర్ ఎస్ ప్రధాన నాయకత్వం నుంచి స్పష్టమైన జవాబు రాలేదు. కానీ నా వ్యాసానికి స్పందనగా మావోయిస్టు రాజకీయ ఖైదీ శ్రీరాముల శ్రీనివాస్ రాశారు. ఆ వ్యాసం తను నమ్ముకున్న నికార్సయిన మావోయిస్టు సిద్ధాంతానికి కూడా వ్యతిరేకం అని భావిస్తున్నాం. తాను లేవనెత్తిన అంశాలకు తనే కట్టుబడి లేకపోవడంతో పాటు గందరగోళంగా వ్యాసాన్ని రాశాడు. అందులో వ్యక్తిగతమైన నిందలు, ఎమ్మార్పీఎస్ మీద కుహనా విమర్శలకు పాల్పడడమే కాకుండా మావోయిస్టు రాజకీయ ఖైదీ పేరుతో రాయడం ఆశ్చర్యాన్ని కలిగింది. మావోయిస్టు రాజకీయ ఖైదీ గా కాకుండా ఒక సాధారణ తెలంగాణ అభిమానిగా, వర్గ సామాజిక దృక్పథం లేని ఒక సాధారణ పౌరునిగా రాసినట్లుగా ఉంది.
నా వ్యాసం లోగానీ, ఆచరణలోగానీ మావో, స్టాలిన్‌ల స్ఫూర్తి కనిపించడం లేదని తీర్పు ఇచ్చాడు. మావోను, స్టాలిన్‌ను మావోయిస్టులు తప్ప మరెవరు ఏ కోణంలోనైనా ఆదర్శంగా తీసుకోకూడదా? ఒక మహనీయుడు తాము నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి తమ లక్ష్యాన్ని చేరే దిశగా, తమ కర్తవ్యాన్ని కొనసాగించడం జరుగుతుంది. కర్తవ్య నిర్వహణలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ, మధ్యలో వచ్చే ఎన్నో అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొంటు, ఆచరణలో ముందు వరుసలో ఉండి విజయాన్ని సాధించి పెట్టిన మహనీయులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అలా విజయాన్ని సాధించి పెట్టిన వారి సిద్దాంత భూమిక కూడా అందరికి నచ్చకపోవచ్చు. అయితే వారి ఆచరణ , నిబద్ధత, దృఢసంకల్పం చాలా మందికి నచ్చవచ్చు.
మేము 1997లో మహాపాదయావూత మొదలు పెట్టినప్పుడు మీకు స్ఫూర్తి ఎవరు అని విలేఖరులు ప్రశ్నించినప్పుడు చైనా విప్లవోద్యమ నేత మావో కొనసాగించిన లాంగ్ మార్చ్ నాకు స్ఫూర్తి అని చెప్పాను. అదే స్ఫూర్తితో 3 విడుతలుగా చేసిన నా పాదయాత్ర 4000 కిలోమీటర్లు దాటింది. మావో సాయుధ పోరాటాన్ని ఎమ్మార్పీస్ కొనసాగించలేకపోయినా, ఆయన కొనసాగించిన లాంగ్‌మార్చ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాం. హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించి ప్రపంచాన్ని కాపాడిన రష్యా సోషలిస్టు నిర్మాత జోసెఫ్ స్టాలిన్ దృఢసంకల్పాన్ని మార్కిస్టు , లెనినిస్టులే కాదు వామపక్ష సిద్ధాంతాలకు భిన్నమైన వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుంటే, అలా తీసుకున్న వారిలో మేము కూడా ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? గాంధీ సామాజిక రాజకీయ సిద్ధాంత అవగాహన మీద ఎమ్మార్పీఎస్‌కు నమ్మకం లేదు. మాకే కాదు అంబేద్కర్ వాదులకు , కులనిర్మూలన వాదులకు, వర్గరహిత సమాజాన్ని కోరుకునే వారికి కూడా నమ్మకం లేదు.
అయినా గాంధీ కోట్లాది మందిని జాతీయోద్యమంలో భాగస్వాములను చేసిన ప్రజాస్వామిక శాంతియుత పోరాటాన్ని, నేనే కాదు గాంధీతో సైద్ధాంతిక భిన్న దృక్ఫథం ఉన్నవారు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. అంబేద్కర్‌ను కులతత్వవాదులు కొన్ని విషయాల్లో వ్యతిరేకించవచ్చు. కానీ ఆయన ఆశయ సాధన కోసం చేసిన కృషిని ఆయనను వ్యతిరేకించే వారు కూడా శ్లాఘిస్తారని నమ్ముతున్నాం.
తెలంగాణ ఉద్యమం సీమాంధ్ర పెట్టుబడిదారులతో అమీ తుమీ తెల్చుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఏర్పాటును సమర్థించడం లేదా పోరాడడం, తెలంగాణ ఏర్పాటుకు నష్టం కలిగించేలా వ్యవహరించడం అనేది తేల్చుకోవాల్సిన మౌలిక అంశం అన్నట్లు వ్యాసకర్త రాశారు. తెలంగాణే ఏకైక లక్ష్యంగా ముందుండి పోరాడుతున్న వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అడ్డంకులు కల్పించే సీమాంధ్ర పెట్టుబడిదారులు అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణను సమర్థించే విభిన్న వర్గాలు, సంస్థలు వారి ఆకాంక్షలను కూడా ఉద్యమంలో భాగంగానే ప్రతిస్పందించడం తప్పు ఎలా అవుతుంది? తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నది కాబట్టి సామాజిక అంశాలను ప్రస్తావించకూడదని ఎవరూ అనరని వ్యాసకర్తనే చెప్పారు. ఆత్మగౌరవ అంశాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను ప్రతిబింబించే విధంగా కార్యాచరణ ఉండాల్సిందేనని కూడా మీరే అంటున్నారు.
మరి మేము మా అంశాలను ప్రతిబింబించే విధంగా కార్యాచరణే తీసుకుంటే మీరు, మీతో పాటు తెలంగాణ అగ్రకుల శక్తులు జీర్ణించుకోగలరా?స్థల, కాల పరిస్థితుల్లో ఏది ప్రధానాంశమో, ఏది అప్రధానాంశమో తెలుసుకోవాలని మీరు అనడం భావ్యంగా లేదు. ఎలాంటి ఉద్యమంలోనైనా, ఏ వర్గ ప్రయోజనాలు ఆ వర్గానికే ప్రధానం. ఈ విషయాన్ని మీరు విస్మరించారు. స్వాతంవూత్యోద్యమంలో పాల్గొంటున్న ముస్లింలు జిన్నా నాయకత్వంలో తమ ప్రధాన ఎజెండాను ముందుకు తీసుకువచ్చి దేశ స్వాతంత్య్రం కంటే ముందే మాకు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయండని, లేని పక్షంలో ఈ స్వాతంవూత్యమే మాకు అవసరం లేదని ఒత్తిడి చేసి పాకిస్తాన్‌ను సాధించుకోలేదా? దేశ స్వాతంత్య్రం కోసం ముస్లింలు తమ ఎజెండాను మూలకు పెట్టారా? వాళ్ళు మూలకు పెడితే నేటి పాకిస్తాన్ ఆవిర్భవించేదా!
స్వాతంత్య్రం కంటే ముందే మా అస్పృశ్యుల హక్కులు ఏంటో తేల్చాలని అంబేద్కర్ పట్టుబట్టి దళితులకు, గిరిజనులకు తమ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోలేదా? జాతీయోద్యమ కాలంలోనే ఏ వర్గ ప్రయోజనాలను ఆ వర్గాలు చూసుకున్నప్పుడు అది తెలంగాణ ఉద్యమానికి వర్తించదా? ఈ మధ్యకాలంలో అన్నాహజారే నాయకత్వంలో లోక్‌పాల్ బిల్లు కోసం దేశ వ్యాప్తంగా అవినీతి వ్యతిరేక పోరాటం జరుగుతున్నది. నేడు దేశ ప్రజలందరూ ముక్తకం అవినీతి నిర్మూలన జరగాలని కోరుకుంటున్నారు. లోక్‌పాల్ బిల్లుకంటే తెలంగాణ అంశమే ముఖ్యమని కోదండరాండ్డి గారు ఢిల్లీలో ప్రకటించారు. ఆయన డిమాండ్‌ను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కోదండరాండ్డి గారికి దేశ ప్రయోజనాల కంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యం. ఈ ముసుగులో తెలంగాణలోని అగ్రవర్ణాలకు అధికారాన్ని సాధించిపెట్టుకోవడమే ఆయనకు ముఖ్యమైనప్పుడు, తెలంగాణలో 90 శాతం గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వాటా అన్ని రంగాలలో వారికి దక్కాల్సిందేనని మేము అడగడం తెలంగాణకు అడ్డెలా అవుతుంది? మా అణగారిన వర్గాల గురించి, వారి హక్కుల గురించి ఇప్పుడే ఆలోచించనోళ్లు, పరిష్కారాన్ని చూపెట్టనోళ్లు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆలోచిస్తారని, పరిష్కరిస్తారని మేము నమ్మాలా? జాతీయోద్యమ కాలంలో అగ్రకుల నాయకుల మాటలు నమ్మిన మా అణగారిన బీసీ నాయకులు, ప్రజలు మోసపోలేదా? ఇప్పటికీ దేశంలో 50 శాతం గల బలహీనవర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం అగ్రకులాలు చేసిన మోసం కాదా? మమ్మల్ని ఇప్పుడు అగ్రకులాల్ని నమ్మి మోసపొమ్మనే చెప్పదలుచుకున్నారా? భూమి, నీటి పంపిణీతో పాటు విద్యా, ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో అందరికీ జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఉండాల్సిందేనని మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా! మరి ఆమాటే తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న అగ్రకుల నాయకులు ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఆ విషయం తెలిసిన మీరు ఎందుకు ఈ అగ్రకుల నాయకత్వాన్ని ప్రశ్నించడం లేదు?
తెలంగాణ వచ్చాక తక్కువ ఒత్తిడితో పై అంశాలను సాధించవచ్చని మీలాంటి వారు మాట్లాడడం అర్థరహితం. నిజాం పరిపాలన కాలంలో తెలంగాణలోని అగ్రవర్ణాల దొరలు వాళ్ల గడీల ముందు చెప్పులేసుకొని తిరగడానికే అణగారిన వర్గాలను అంగీకరించేవారు కాదు. దళితులతో, పీడిత కులాలతో వెట్టి చేయించుకొన్న చరిత్ర, బాంచన్ దొర అనిపించుకున్న చరిత్ర తెలంగాణ దొరలది, భూస్వాములది కాదా? దొరల, భూస్వాముల ఆగడాలకు, గడీల్లో జరిగిన ఆకృత్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటమే జరిగిన విషయం మీకు తెలియదా? ఆ తర్వాత కూడా తెలంగాణలో నక్సలైట్ల ఉద్యమం, భూస్వాముల భూములను పీడిత కులాలకు పంచడానికి, దొరలు దళితులను వేధించడానికి నిరసనగా ప్రారంభమైన ఉద్యమం కాదా? తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నాటి నక్సలైట్ ఉద్యమం వరకు వేలాది మంది ఉద్యమకారులు తమ విలువైన హక్కులను సాధించవచ్చని మీరు మాట్లాడడం ప్రజలను మభ్యపెట్టడంతోపాటు, నికార్సయిన మావోయిస్టు వైఖరికి భిన్నం కాదా?
నేను స్టాలిన్ ఆదర్శాలను ఉటంకించడమనేది అన్యాయమని మీరు అంటున్నారు. అదే మీ వాదనైతే దళితులు చదువుకోవడం అన్యాయం, వేదాలు వల్లించడం అన్యాయం అన్న ఒకనాటి బ్రాహ్మణీయ భావజాల వైఖరికి, మీ వైఖరికి తేడా ఏంటి? జాతుల స్వయం నిర్ణయాధికారం కోసం చేసే పోరాటాన్ని బలపరిచేటప్పుడు సోషలిస్టు సమాజాన్ని నిర్మించుకొనే దృక్పథంతో ప్రజల్ని సంఘటితం చేయాలని, భూస్వామ్య శక్తులను నమ్మి మన కర్తవ్యాన్ని విస్మరించరాదని కమ్యూనిస్టులను జోసెఫ్ స్టాలిన్ హెచ్చరించాడు. ఈ దృక్పథాన్ని భారతదేశంలో జాతుల పోరాటాలని బలపరిచేటప్పుడు, అణచివేయబడ్డ కులాలవారు సామాజిక న్యాయాన్ని సాధించుకునే లక్ష్యంగా ఉద్యమంలో భాగస్వాములైతారే కానీ స్థానిక భూస్వామ్య శక్తులని నమ్మడమంటూ జరుగదు. అంతేకాకుండా దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని కోరే మావోయిస్టులు కూడా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా స్టాలిన్ దృక్పథాన్నే అమలు చేస్తారని ఆశిస్తున్నాం.
అంతెందుకు పీపుల్స్‌వార్ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య రాష్ట్ర విభజనోద్యమం, మార్క్సిజం అనే అంశం మీద తను 1973లో సృజనలో రాసిన వ్యాసమే ఇప్పటికీ పార్టీ దృక్పథంగా ఉందని మేము భావిస్తున్నాం. ఆయా దేశాల్లో సాంఘిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా జాతుల సమస్య అనేక రూపాల్లో బహిర్గతం కావచ్చు. ఏ రూపాల్లో బహిర్గతమైనా ప్రధానంగా అది విభిన్న జాతులకు చెందిన బూర్జువా వర్గాలకు చెందినవారి వైరుధ్యమే! ఆ వైరుధ్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నంలో తమ వెనుక ప్రజలందరినీ సమీకరించుకోవడానికి గానూ జాతినంతటిని రకరకాల నినాదాలతో ఉత్తేజ పరచటానికి ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకోవడానికి ప్రాంతీయ పెట్టుబడిదారులు ప్రయత్నిస్తారని కొండపల్లి సీతారామయ్య గారు చెప్పడమే కాకుండా, స్టాలిన్ జాతుల పోరాటాలపై చెప్పిన విషయాన్ని కూడా ఈ విధంగా పొందుపరిచాడు. ‘పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతూ ఉన్న పరిస్థితుల్లో జాతుల సమస్యపై జరిగే పోరాటం, బూర్జువా వర్గాల మధ్య జరిగే పోరాటమే. కొన్ని సందర్భాల్లో జాతుల ఉద్యమంలోకి కార్మికవర్గాన్ని కూడా బూర్జువా వర్గం ఆకర్షించగలుగుతుంది. అలాంటప్పుడు అది జాతి మొత్తం పోరాటంగా వ్యక్తం అవుతుంది.
కానీ వాస్తవానికి అది బయటికి కనిపించే లక్షణం మాత్రమే. సారాంశంలో అది ఎప్పుడూ బూర్జువా పోరాటమే. ప్రధానంగా బూర్జువాల ప్రయోజనాల కొరకు జరిగే పోరాటమే’
ఇంకా కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య వ్యాసాన్ని కొనసాగిస్తూ, జాతుల పోరాటం ప్రజలందరి క్షేమం కోసమే జరుగుతున్నట్లు కనిపిస్తున్నా, సారాంశంలో బూర్జువా వర్గాల ప్రయోజనం కోసమే, బూర్జువావర్గ నాయకత్వం కిందనే జరుగుతుందనే విషయం కార్మికవర్గం ఎన్నడూ మర్చిపోవద్దు. సాధారణంగా జాతుల పోరాటంలో వర్గ దృష్టిని లోపింపజేసి, అన్ని వర్గాల ప్రయోజనాలు ఒక్క అవాస్తవిక వాతావరణం సృష్టించబడుతుంది. ప్రజల్లో వున్న విభిన్న వర్గాల ప్రయోజనాలు భిన్నభిన్నంగా వుంటాయనే యదార్థం మరుగునపడిపోతుంది. ప్రత్యేకించి జాతుల ఉద్యమానికి నాయకత్వం వహించే పెట్టుబడిదారులు తమకున్న ప్రచార సాధనాలను ప్రయోగించి అలాంటి వాతావరణాన్ని సృష్టించడంపై కేంద్రీకరిస్తారు. కానీ అలాంటిది జరగకుండా తమ శక్తినంతా వినియోగించి కార్మికవర్గం చైతన్య పూరితంగా కృషి చేయాలి. ఇంత స్పష్టంగా అక్కడ స్టాలిన్, ఇక్కడ కొండపల్లి సీతారామయ్య చెప్పారు. ఈ పంథాకు అనుగుణంగానే మావోయిస్టు పార్టీ ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షపై వరంగల్ డిక్లరేషన్ పేరుతో తమ కర్తవ్యాన్ని నిర్దేశించుకుంది. అందులో ఈ విధంగా పేర్కొంది.
‘ఆంవూధవూపదేశ్ నుంచి తెలంగాణ భౌగోళికంగా వేరుపడి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రాజకీయ, ఆర్థిక విధానాలలో మార్పు రాకపోతే, అలాంటి ప్రత్యేక రాష్ట్రం వల్ల రాష్ట్ర ప్రజలకు లాభించేది ఏమీ ఉండదు. అధికారంలో వుండే వారిలో మార్పు వచ్చి విధానాల్లో మార్పు రాకపోతే అది ఏ విధంగా నిజమైన మార్పుకాదో మన అనుభవంలో వుంది’.అంతేకాకుండా దేశంలోనూ, విదేశాల్లోను వున్న బడా పారిక్షిశామికవేత్తలకు దళారులుగా వున్న సీమాంధ్ర రాజకీయ శక్తులు స్థానిక తెలంగాణ భూస్వామ్య రాజకీయ శక్తులు తెలంగాణ ప్రస్తుత పరిస్థితికి కారణం. ఇట్లాంటి వాస్తవ విషయాల జోలికి పోకుండా, కేవలం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడేవారు ప్రజలను మభ్యపెడుతున్నారు. వీళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి. తెలంగాణలో ఒక ప్రజాసమూహానికి, మరో ప్రజాసమూహానికి మధ్యలో తేడా వుంది. వివిధ వర్గాల ప్రజలు తమ మౌలికమైన సమస్యలకు, మౌలికమైన పరిష్కారాలను కోరుతూ పోరాడాలి. ప్రజలకు నిజమైన ప్రాతినిధ్యం వహించే ప్రజా, రాజకీయ వ్యవస్థ కలిగిన తెలంగాణ రాష్ట్రం కావాలని, దీన్ని ప్రజాస్వామిక తెలంగాణగా అందామని వరంగల్ డిక్లరేషన్ స్పష్టం చేసింది.
అటు స్టాలిన్, ఇటు కొండపల్లి సీతారామయ్యగార్లతో పాటు వరంగల్ డిక్లరేషన్ గుర్తించిన వివిధ వర్గాల మౌలిక సామాజిక అంశాలనే మేము మాట్లాడుతుంటే అందుకు అనుగుణంగా మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీలాంటి వాళ్లు హర్షించాల్సింది. కానీ మీ పార్టీ పంథాను కూడా పక్కకు పెట్టే విధంగా మీలో మార్పు ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలి?
ఇక నా వ్యాసంలో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈ దేశానికి ప్రధానమంవూతులైన వారందరూ, రెండు సంవత్సరాలు మినహా ఈ రాష్ట్రానికి ముఖ్యమంవూతులైన వారందరూ అగ్రవర్గాల వారేనని నేను అన్నాను. అందుకు మీరు స్పందిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ ముఖ్యమంవూతులు, ప్రధానమంవూతులైతే వారి సమస్యలు పరిష్కారమవుతాయని భ్రమలు పెట్టడం సరైనది కాదని రాశారు. అంటే ఈ అణగారిన వర్గాల నుంచి ప్రధానమంవూతులు, ముఖ్యమంవూతులైతే వారికి వర్గ దృక్పథం, కుల నిర్మూలన దృక్పథం ఉండదా? అన్ని దృక్పథాలు అగ్రవర్ణాలకే ఉంటాయా? 90 శాతం వర్గాల నుంచి వర్గ, కుల నిర్మూలనే ధ్యేయంగా పనిచేసే వాళ్లు, ఉద్యమించే వాళ్లు ఉండరనా మీ అభివూపాయం? అణగారిన వర్గాలు అధికారంలోకి వస్తే వారు విముక్తి వాళ్లు చేసుకోలేరా? 90 శాతం ఉన్న అణగారిన వర్గాల విముక్తి ఎల్లకాలం 10శాతంగా ఉన్న అగ్రవర్ణాల దయా, దాక్షిణ్యాల మీదమే అధారపడాలా? మీ మాటలు, మీ రాతలు 10 శాతం వున్న అగ్రకులాల వారికి సంతోషిన్నిస్తాయేమోగానీ, 90 శాతం వున్న అణగారిన ప్రజలకు ఆగ్రహం కలిగిస్తుందనే విషయాన్ని మరిచిపోవద్దు.
ఇక కారంచేడు సువార్తమ్మ ప్రతిఘటనను, పోరాటాన్ని నేను సమర్థించాను. చందర్‌రావు భార్య చెప్పు ఎత్తి చూపెట్టడాన్ని కూడా సమర్థించాను, గర్వపడ్డాను. ఇది దళిత మహిళల పోరాట సంప్రదాయంగానే వున్నదని స్వాగతించానే తప్ప, పోరాటాన్ని విరమించే నీరు గార్చే భ్రమలు కల్పించే విధంగా మేము ఏ ప్రయత్నం చేయలేదు. మీరేమో మీ వ్యాసంలో మమ్మల్ని పోరాటాన్ని నీరుగార్చే వారిగా, కోర్టులపై భ్రమలు కల్పించేవారిగా చూపెట్టే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉంది. అన్ని చట్టాల ద్వారానే పరిష్కారమవుతాయనే భ్రమల్లో మేము లేము. కానీ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వుండే చట్టాలను ఉపయోగించుకోవడంలో తప్పేమీ లేదని నమ్ముతున్నాం. ఒకసారి మీ విషయానికే వద్దాం. ప్రస్తుతం మీరు జైళ్ళో ఉన్నట్టుగానే 1977 ఎమ్జన్సీలో క్రామేడ్ చెరబండరాజు కూడా జైలులో వున్న సమయంలో చట్టాలమీద, కోర్టుల మీద మాకు నమ్మకం లేదనీ, బూర్జువా కోర్టులను బహిష్కరిస్తున్నామని బెయిల్ తీసుకోవడానికి నిరాకరించారు. కానీ తర్వాత కాలంలో విప్లవకారులు కూడా ఈ బూర్జువా చట్టాలను ఉపయోగించుకొని ప్రజల కోసం మరింతగా పోరాడాలని పార్టీ అవగాహనకు వచ్చిన విషయం తమరికి తెలిసిందే. రాజ్యాంగంలో వుండే కనీస పౌరహక్కులను ఉపయోగించుకోవడం కూడా చట్టాల మీద భ్రమలు కల్పించడమే అయితే మీరు రేపు బెయిల్ తీసుకొని బయటికి వస్తే అది కనీస పౌరహక్కులను ఉపయోగించుకొన్నట్లా? లేక బూర్జువా చట్టాల మీద మీరు కూడా ప్రజలకు భ్రమలు కల్పించినట్లా

No comments:

Post a Comment