Sunday, September 4, 2011

మావోయిస్టులా, మావో అయిస్టులా?-2 ---మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు Namasethe Telangana 09/08/2011


మావోయిస్టులా, మావో అయిస్టులా?-2
మేం నిజమైన అంబేద్కర్ వాదులం. మేము విప్లవోద్యమ అభిమానులం. విప్లవోద్యమ త్యాగనిరతిని ఆదర్శంగా తీసుకొని ప్రజాస్వామిక ఉద్యమాల్లో పాలుపంచుకునే వాళ్లం. పీడిత కులాల, వర్గాల పక్షాన నిక్కచ్చిగా నిలబడే వాళ్లం. మేం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నూటి నూరు శాతం కోరుకుంటున్నాం.మేం సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధనకే లక్ష్యంగా మా వంతు మా శ్రేణులను కదిలిస్తాం. పోరాడుతాం.. సాధిస్తాం..
భూమి సమస్యను పునాది సమస్యగా, కుల సామాజిక సమస్యలను ఉపరితల సమస్యలుగా మావోయిస్టు పార్టీ చూసింది. కుల సమస్య లింగ, ప్రాంతీయ, జాతి సమస్యలతో పాటు ఇతర సామాజిక సమస్యలన్నీ విప్లవానంతరం వాటికవే పరిష్కారమవుతాయని 1980కి పూర్వం నాటి పీపుల్స్ వార్ అవగాహన. కానీ రాష్ట్రంలో 1985లో జరిగిన కారంచేడు సంఘటన అనంతరం, దళితుల ఆత్మగౌరవ పోరాటాలు పెల్లుబికిన తర్వాత దాదాపు దశాబ్ద కాలం పాటు తమ పార్టీ కుల, లింగ సమస్యలపై తీవ్రంగా చర్చించి పాత అవగాహనను మార్చుకొంది.1990 దశకంలో కుల అంశాన్ని, లింగ అంశాన్ని కూడా పునాది అంశంలో భాగంగానే చూడడం జరిగింది. అందుకనుగుణంగానే కులనిర్మూలన సంఘాలను, మహిళా విముక్తి సంఘాలను తమ పార్టీ ఏర్పాటు చేసిందని కూడా మేము భావిస్తున్నాం.
ఎమ్మార్పీఎస్ ఉద్యమం మీద మీరు రాసేటప్పుడు మావోయిస్టు దృక్పథంతో కనీసం చూడకుండా ఎవరో వ్యతిరేకులు మా మీద పెంచుకున్న కక్ష తో, ద్వేషంతో రాసినట్లుంది. ఎమ్మార్పీఎస్ ఒక సామాజిక న్యాయ డిమాండ్ మీద ఏర్పడ్డ ఒక సాంఘిక సంస్థ. ఈ డిమాండ్ సాధనలో మాకు కొన్ని పరిమితులుంటాయి. కానీ ఎమ్మార్పీఎస్ తమ పరిమితులను కూడా దాటి రాష్ట్రంలో ఏ సాంఘిక సంస్థ నిర్వహించనంత విశాల ధృక్పథంతో సామాజి క బాధ్యతను భుజాన వేసుకొని, మానవీయ కోణంలో మా కర్తవ్యాన్ని కూడా అన్ని వర్గాల ప్రయోజనాల కోసం నిర్వర్తిస్తున్నాము. మీరు కొనసాగించే సాయుధ పోరాటంతో ప్రత్యక్షంగా ఎమ్మార్పీఎస్‌కు సంబంధం లేకపోయినా, పీడిత వర్గాల కోసం మీరు చేసే పోరాటాలని మేము ఎప్పుడూ గౌరవ భావంతోనే చూస్తాం. నక్సలైట్ ఉద్యమంలో అసువులు బాసిన అమరులపై మాకు ఎనలేని గౌరవం ఉంది. విప్లవోద్యమాన్ని అణిచివేయడానికి పాలకవర్గం బూటకపు ఎదురుకాల్పులకు పాల్పడుతూ ఎంతోమందిని విప్లవకారులను హతమారుస్తున్న సందర్భంలో అవన్నీ ప్రభుత్వపు బూటకపు ఎదురుకాల్పులేనని ఎమ్మార్పీఎస్ ప్రతి సందర్భంలో బహిరంగంగా ప్రకటించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ కుల సంస్థ, ఏ ప్రధాన రాజకీయ పార్టీ పోషించనటువంటి పాత్రను మేము పోషిస్తున్నామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం.
మీరు చేసిన వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర, తెలంగాణ కోసం చేస్తున్న ప్రాణ త్యాగాలను ఎందుకు ఆపలేకుండా పోయిందని మీరు అనడం చూస్తుంటే మీ అమాయకత్వాన్ని చూసి మాకు జాలేస్తుందని చెప్పదలుచుకున్నాము. తెలంగాణ ప్రజల పోరాటానికి మద్దతుగా ప్రజలను, ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యసాధనకు చైతన్యవంతులను చేయడానికి 2001 అక్టోబర్ 7 నుంచి డిసెంబర్7 వరకు రెండునెలలు పాటు 3600 కిలోమీటర్‌ల సైకిల్ యాత్ర కొనసాగించాము. మా సామాజిక దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకు మా బాధ్యత నెరవేర్చాం. అయితే వర్గీకరణ సాధించుకునే దిశగా పోరాడుతూనే, తెలంగాణ ఉద్యమానికి మేం మద్దతుదారులం మాత్రమే. ఇదే సమయంలో స్టాలిన్, కె.ఎస్ (కొండపల్లి సీతారామయ్య) లు చెప్పినట్లుగానే బూర్జువా శక్తులు నాయకత్వం వహిస్తున్న జాతుల ఉద్యమాలకు మద్దతిస్తూనే మొత్తం పీడిత కులాల ప్రజలు భూస్వాములను గుడ్డిగా నమ్మే విధంగా కాకుండా శ్రామికవర్గ (పీడిత కులాల) దృక్పథంతో సంఘటిత పడేవిధంగా అంతిమంగా తెలంగాణలో సామాజిక న్యాయాన్ని అమలు చేసుకొనే దిశగా మా కర్తవ్య నిర్వహణ ఉంటుంది.
టీఆర్‌ఎస్ ఏర్పడకముందే తెలంగాణ లక్ష్యసాధన దిశగా మావోయిస్టు పార్టీ తెలంగాణ జనసభను ఏర్పాటు చేసింది. మీ సంస్థ ద్వారా కూడా తెలంగాణను సాధించలేదు. కనుక జరుగుతున్న ఆత్మహత్యలకుమీరు కూడా బాధ్యులేనని మేము అనడం భావ్యమా? ఇక కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ ఏర్పడకుండా అడ్డంకులు కల్పిస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. కానీ అడ్డంకులు అధిగమించే విధంగా విద్యార్థి ఉద్యమం 2009 డిసెంబర్ నుంచి ఉప్పెనలాగా ముందుకు వస్తే ఆ విద్యార్థుల ఐక్య ఉద్యమాన్ని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బలహీనపరిచింది టీఆర్‌ఎస్ అధినాయకత్వం కాదా? టీఆర్‌ఎస్ నాయకత్వమే విద్యార్థి ఉద్యమాన్ని దెబ్బతీసిందని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ అనలేదా?
అమరులను అవమానించడం ఎందుకు? ఇందులో కూడా కులసమస్య ఎంత వరకు సబబు అని అంటున్నారే. తెలంగాణ కోసం అమరులైన ప్రతి ఒక్కరినీ కులాలకు అతీతంగా మేము గౌరవిస్తాం. వారికి ఎమ్మార్పీఎస్ పక్షాన జోహార్‌లు కూడా చెబుతాం. అదే సమయంలో 600 మందికి పైగా బీసి,ఎస్సీ, ఎస్టీ, యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఇవ్వని తెలంగాణ బంద్‌లు అగ్రకులాలకు చెందిన వేణుగోపాల్‌డ్డి, ఇషాంత్‌డ్డి, యాదిడ్డి లు చనిపోయిన వివిధ సందర్భాల్లో మాత్రమే ఎందుకు ప్రకటించారనేది మా ప్రశ్న? కులవ్యవస్థ ఉన్న ఈ దేశంలో ఏదైనా ఒక అంశాన్ని కులానికి అతీతంగా చూడగలమా? జేఏసీ ల అగ్రకుల నాయకత్వం ఈ అంశం మీద జవాబే చెప్పక వాళ్ళే తప్పించుకుంటుంటే, జైళ్ళో ఉన్న మీకెందుకండి ఈ బాధ?
ఇకపోతే మీరు ప్రారంభించిన ఉద్యమం ఇప్పటివరకు ఎ.బి.సి.డి లను ఎందుకు సాధించలేక పోయిందని అన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం మీద ఏ మాత్రం మీకు అవగాహన ఉన్నా ఇట్లాంటి రాతలు మీరు రాసేవారు కాదు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ సాధించకపోతే 2000- 2004 వరకు వర్గీకరణ ఎట్లా అమలు జరిగింది. ఆ నాలుగు సంవత్సరాలలో 22 వేల ఉద్యోగాలు మాకు, మా ఉపకులాలకు ఎలా వచ్చాయి? ఎన్నో వేల ఉన్నత విద్యావకాశాలు ఎలా పొందగలిగాము? ఇవన్నీ వర్గీకరణ అమలు జరిగిన కాలంలోనే మేము పొందగలిగామనే విషయం మీకు గుర్తులేదా? సుప్రీం కోర్టు ద్వారా కొంత మంది మాల స్వార్థపరులు కల్పించిన అడ్డంకులతో ప్రస్తుతం ఈ సమస్య కేంద్ర ప్రభుత్వపరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఎమ్మార్పీస్ నడిపిన ఉద్యమంతో అసెంబ్లీ ఏకక్షిగీవ తీర్మానం చేసింది. ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఒత్తిడితో కేంద్రం జస్టిస్ ఉషా మెహ్ర కమిషన్ నియమిస్తే, నివేదిక కూడా వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. ఈ అంశం మీద శాసన సభలో అన్ని రాజకీయ పార్టీల మధ్య సంపూర్ణ ఏకాభివూపాయం ఉంది. జాతీయస్థాయిలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణకు మద్దతుస్తున్నా కూడా కేంద్రం ప్రభుత్వం మాల రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ సమస్య పరిష్కారాన్ని జాప్యం చేస్తున్నది.
కేంద్రం చేస్తున్న ఈ జాప్యానికి నిరసనగా మరింత శక్తివంతమైన ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అనుకున్నది సాధించుకుంటాం. అందుకు అందరి మద్దతు కూడా కోరుతున్నాం. అయితే మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ అంశం ఎంత న్యాయమైనదైనా , తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలు తెలంగాణ ను కోరుకుంటున్నా , 110 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా, 600 మంది కి పైగా ఆత్మహత్యలు చేసుకున్నా ఇంకా ఈ సమస్య కు పరిష్కారమే దొరకలేదు. ఈ విషయాన్ని మరిచిపోవడం మీ బాధ్యతను విస్మరించినట్లే. అంతేకాకుండా ఎమ్మార్పీఎస్ పరంగా మేము మొదటగా సాధించింది మాదిగల ఆత్మగౌరవం. ఇది మేము సాధించాల్సిన అన్ని అంశాలకంటే గొప్పది. ఎందుకంటే వేల సంవత్సరాలుగా అంటరానితనానికి , కుల వివక్షతకు గురై కులం పేరును చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి, బాధపడ్డ జాతిమాది. కానీ ఎమ్మార్పీఎస్ ఏర్పడ్డ తర్వాత మేం మాదిగలమని ధైర్యంగా, గర్వంగా చెప్పుకోవడం ప్రారంభమైంది.
అంతేకాకుండా ఎమ్మార్పీఎస్ ఉద్యమం రాష్ట్రంలో అణచివేయబడ్డ ప్రతి సామాజిక వర్గానికి ఆదర్శమైంది. ఈ రోజు అణచివేయబడ్డ ప్రతి సామాజిక వర్గం తమ కులం పేరు చెప్పుకునే పరిస్థితులు వచ్చాయంటే అది ఎమ్మార్పీఎస్ అందించిన స్ఫూర్తేనని గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఇక ఏ ఉద్యమ ప్రయాణమైన ఎల్లకాలం ఒకే ఉధృతితో సాగవు. సమయం, సందర్భాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలను బట్టి అడ్డంకులను అధిగమిస్తూ ముందుకెళ్లాల్సి వుంటుంది. ఇప్పటికే మేము వర్గీకరణ సాధించుకునే దిశగా చాలా దూరం ప్రయాణించి చివరి అంకానికి చేరాం. ఇంకా మిగిలిన లక్ష్యాన్ని సాధించుకోవడానికి అంతిమ పోరాటానికి కూడా సిద్ధపడతాం. అయినా తమ మావోయిస్టు పార్టీ మొత్తం రాష్ట్రంలో నిర్వీర్యమైపోయిందని చాలా మంది అనుకుంటున్నా మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి ఉద్యమం తమ లక్ష్య సాధనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లాల్సి వుంటుంది. అది ఎమ్మార్పీస్‌కైనా, నక్సలైట్ ఉద్యమానికైనా వర్తిస్తుంది. ఎందుకంటే మోసేవాడికే తెలుసు కావడి బరువు.
మేం ఒక కులం సమస్య బరువు మోయడానికే ఎంతో ఇబ్బంది పడుతుంటే, సమస్త పీడిత వర్గాల బరువు, బాధ్యతలు మోస్తున్న విప్లవోద్యమం మాకంటే వెయ్యిట్లు అడ్డంకులను అధిగమించాల్సి వుంటుందనే గౌరవభావం వుంది. ఎమ్మార్పీస్ ఈ రాష్ట్రంలో మారుమూల గ్రామమైన ఈదుమూడిలో 1994లో 20 మంది యువకులతో ఏర్పడ్డ ఒక సంస్థ. నాలుగున్నర దశాబ్దాల క్రితం నక్సల్‌బరి గ్రామంలో పుట్టిన నక్సలైట్ ఉద్యమం దేశ వ్యాప్తంగా విస్తరించుకుంటునట్లుగానే, ఈదుమూడిలో ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, ఎంతో విలువైన ప్రాణత్యాగాలు చేస్తూ, లక్ష్యసాధనలో వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్ళడం వల్లే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందు వర్గీకరణ అంశాన్ని ప్రధానాంశంగా పెట్టగలిగాం.
చంద్రబాబు, రాజశేఖర్‌డ్డిల మీద ఆధారపడి మేం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎవరికి లాభాన్ని చేకూర్చాయో అని మీరు అడగడం జరిగింది. అది మా సంస్థ రాజకీయ నిర్ణయం. ఎవరి అశయానికి అనుగుణంగా వారి రాజకీయ నిర్ణయాలుంటాయి. రాజ్యాధికార సాధనే ధ్యేయంగా ఏర్పడ్డ బీఎస్పీ నాయకుడైన కాన్షీరాం తమ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్లడం కోసం బీజేపీతో ఒకసారి, సమాజ్‌వాదీ పార్టీతో ఒకసారి పొత్తులు కొనసాగించారు. తెలంగాణే లక్ష్యసాధనగా ఏర్పడ్డ టీఆర్‌ఎస్ కూడా ఒక సందర్భంలో కాంగ్రెస్‌తో, మరోసారి టీడీపీతో పొత్తు పెట్టుకుంది.
మావోయిస్టు పార్టీ తన ఎత్తుగడల్లో భాగంగా ప్రతిసారీ ఎన్నికలను బహిష్కరించేది. కానీ 2004 జనరల్ ఎన్నికల్లో బహిష్కరణకు పిలుపునివ్వకుండా టీడీపీ, బీజేపీ కూటమిని అడ్డుకోండి, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను నిలదీయండని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో తేడా అందరికి తెలిసిందే. ఎన్డీఏ కూటమిని ఓడించే నిర్ణయం, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు పరోక్షంగా సహకరించడం కాదా?
తెలంగాణ రాష్ట్రం కోసం అంకుఠిత దీక్షతో అనేక కష్టనష్టాలకోర్చి ఉద్యమిస్తుంటే మీరెందుకు ఒంటరి అవుతున్నారంటూ ప్రశ్నేశారు. ఎమ్మార్పీఎస్ తెలంగాణకు మద్దతిస్తూనే, సామాజిక అంశాల మీద, తెలంగాణలోని 90శాతం వున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పక్షాన అన్ని రంగాలలో వారికి రావాల్సిన న్యాయపరమైన వాటా కోసమే ప్రశ్నిస్తున్నది. తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న అగ్రవర్ణాల భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గం మాకు రావాల్సిన న్యాయమైన వాటా మీద జవాబు చెప్పడానికి నిరాకరిస్తూ, తెలంగాణ మొత్తాన్ని వాళ్ల గుత్తసొత్తు అనుకొని తెలంగాణలోని వారి ఆధిపత్యాన్ని మరింత పెంచుకొని తద్వారా పీడిత కులాలను మరింత అణగదొక్కేందుకు ఇప్పటి నుంచే పన్నాగాలు పన్నుతున్నది. వారి గోబెల్స్ ప్రచారాన్ని నమ్మే వారి ద్వారా మమ్మల్ని ఒంటరి చేయాలనుకోవడం సహజమే. అది వారి వర్గ స్వభావమే.
150-200 సంవత్సరాల క్రితమే సామాజిక ఉద్యమ పితామహులైన మహాత్మ ఫూలేను ఒంటరి చేసి దెబ్బకొట్టే ప్రయత్నం, ఆతర్వాత ఆయనను చంపించే ప్రయత్నం చేసిన విషయాన్ని మనం మరిచిపోరాదు. ఆ తర్వాత అంబేద్కర్‌ను కూడా ఒంటరి చేసి దెబ్బకొట్టే కుట్రలను కూడా అగ్రకులాలు చేశాయి. ‘సత్యం గడపదాటకముందే అసత్యం ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్టుగా’ మేం లేవనెత్తిన సామాజిక అంశాలు ఇంకా మా వర్గాలకు చేరకముందే, మా వర్గాలే మా నాయకుల్ని దూరం బెట్టే విధంగా మహాత్మ ఫూలే కాలంలో, అంబేద్కర్ కాలంలో కూడా జరిగింది. అదే నేటికీ కొనసాగుతూనే వుంది. అయినంత మాత్రాన మేము మా లక్ష్యసాధనలో వెనుకంజవేసే ప్రసక్తే లేదు.
ఎప్పుడైనా నిజం ప్రారంభ దశలో చేదుగానే వుంటుంది. దళితులకు, మహిళలకు, చదువు నేర్పే సమయంలో మహాత్మ ఫూలెకు అండగా నిలబడ్డవారు చాలా కొద్ది మందే మాత్రమే. ఆయనను ద్వేషించిన వారే ఆ సమయంలో ఎక్కువగా వున్నారు. దళితులు చదుకోవడం ఇష్టంలేని ఇతర వర్గాల వారు మహాత్మ ఫూలేని హేళన చేయడమే కాకుండా చంపించే ప్రయత్నం కూడా చేశారు. ఎన్నో అడ్డంకులను కల్పించారు. అయితే ఏమైంది? నేడు దేశంలో ఒక మానవతామూర్తిగా నిజమైన మహాత్ముడిగా అట్టడుగు వర్గాలే కాదు అగ్రవర్గాల వారు కూడా ఫూలేని గౌరవించి ఆరాధించే పరిస్థితి వచ్చింది.
అంతెందుకు ఈదేశ విప్లవోద్యమ పితామహుడు చారు ముజుందార్‌ను పశ్చిమబెంగాల్ సీపీఎం అతివాదిగా ముద్రవేసి పార్టీ నుంచి బహిష్కరించినపుడు ఒంటరివాడు కాదా? నాడు ఒంటరివాడైన చారుముజుందారే తన సాయుధ పోరాట పంథాకు మరింత పదునుపెట్టి తమ సిద్ధాంతాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళారు. ఈ రోజు భారత విప్లవోద్యమం చారు ముజుందార్‌నే ఆదర్శంగా తీసుకొని అన్ని ప్రాంతాలకు, అన్ని రాష్ట్రాలకు విస్తరించి కేంద్ర పాలక వర్గాలనే గడగడలాడించే స్థాయికి ఎదగలేదా?
అలాగే తెలంగాణలో అణగారిన వర్గాల పక్షాన ప్రస్తుతం మేం లేవనెత్తిన అంశాలు, తెలంగాణ అగ్రకుల నాయకుల దృష్టిలో, వారికి వంతపాడే వారి దృష్టిలో, సెంటిమెంట్ ప్రభావానికి కొట్టుకెళ్లే వారి దృష్టిలో ప్రధానాంశాలు కాకపోవచ్చు. మమ్మల్ని ఒంటరి వాళ్లను చేయడానికి మేం లేవనెత్తిన అంశాలనే ఆధారంగా చేసుకొని అగ్రవర్ణాలు మా వర్గాల నుంచే మాకు నష్టం తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేయవచ్చు. కానీ మేము లేవనెత్తిన అంశాలకే కట్టుబడి ఉండడమే కాకుండా నమ్ముకున్న మా అశయం కోసం తుదికంటా పోరాడతామే కాని వెనుకంజ మాత్రం వేయం. ఎందుకంటే ఇప్పుడు మేం లేవనెత్తిన అంశాలే రాబోయే తరాలకు భవిష్యత్తునిస్తాయి.
మేం నిజమైన అంబేద్కర్ వాదులం. మేము విప్లవోద్యమ అభిమానులం. విప్లవోద్యమ త్యాగనిరతిని ఆదర్శంగా తీసుకొని ప్రజాస్వామిక ఉద్యమాల్లో పాలుపంచుకునే వాళ్లం. పీడిత కులాల, వర్గాల పక్షాన నిక్కచ్చిగా నిలబడే వాళ్లం. మేం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నూటి నూరు శాతం కోరుకుంటున్నాం.మేం సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధనకే లక్ష్యంగా మా వంతు మా శ్రేణులను కదిలిస్తాం. పోరాడుతాం.. సాధిస్తాం..
మేం నిజమైన అంబేద్కర్‌వాదులం...విప్లవోద్యమ అభిమానులం.. మీరు మావోయిస్ట్‌లా, మావో అయిస్ట్‌లా తేల్చండి?
-మందకృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు
(ఈ చర్చ ఇంతటితో ముగిస్తున్నాం - ఎడిటర్)

No comments:

Post a Comment