Sunday, September 4, 2011

బడుగుల ఆశాజ్యోతి---భారతదేశంలో సంఘ సంస్కర్తలలో, మహాపురుషుల్లో శ్రీ నారాయణగురు (1956-1928) Surya News Paper


బడుగుల ఆశాజ్యోతి
భారత జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం కంటే ముందుగా 19వ శతాబ్దానికి చెందిన సామాజిక తత్వవేత్తలలో దక్షణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో సంఘ సంస్కర్తలలో, మహాపురుషుల్లో శ్రీ నారాయణగురు (1956-1928) ఒకరు. మహాత్మా పూలే (1827-1890) సత్యశోధన సమాజ్‌ స్థాపనతో బ్రాహ్మణీయ భావజాలానికీ, మతమౌ డ్యానికి వ్యతిరేకంగా నిమ్నకులాల విద్యావ్యాప్తికి అశాస్త్రీయమైన పద్ధతులను అవలంబిస్తున్న మూఢా చారులు, పెత్తందారులపై అలుపెరగని పోరాటం చేశారు. అలాగే పెరియర్‌ రామస్వామి నాయకర్‌ (1879-1973) హేతువాద, నాస్తిక ఉద్యమాన్ని నడిపి ఆర్యసంసృ్కతికి వ్యతిరేకంగా ద్రావిడ రాజ్యాన్ని స్థాపించారు.
అణగారిన వర్గాల స్వాభిమాన ఉద్యమాన్ని కూడా నడిపారు. వీరి అనంతరం డాభీంరావ్‌ అంబేడ్కర్‌ (1891-1956) మేధావిగా, రాజ్యాంగ నిర్మాతగా, వ్యవస్థీకృత విధానం ద్వారా నిమ్నకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమానత్వాన్ని సాధించారు. ఈయన మహాత్మా పూలే, శ్రీ నారాయణగురులను తన గురువులుగా భావించారు.
వీరందరికీ భారత దేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు గౌతమ బుద్దుడు, ఆయన బోధనలు స్ఫూర్తిని, ప్రేరణను కలిగించాయి. 19, 20 శతాబ్దాలలో జాతిని పట్టిపీడిస్తున్న సమస్యలు- కుల వ్యవస్థ, అవిద్య, అజ్ఞానం, అంటరాని తనం సతీసహగ మనం, బాల్యవివాహాలు, మహిళలకు విద్య, ఆస్తిలో భాగం కలిగించడానికి ఈ మహాపురుషులు జీవితాంతం పోరాడినవారు. వీరి స్ఫూర్తి దేశంలో నలుమూలల ఎందరినో ప్రభావితం చేశాయి.
శ్రీ నారాయణ గురు కొంత భిన్నంగా శ్రీ ఆదిశంకరాచార్య ప్రభావంతో మతాన్ని సమర్ధిస్తూనే- అందులో మతోన్మాదం, కులవివక్ష, అంటరానితనం, మూఢాచారాల నిర్మూలనకు, నిమ్నకులాలలో స్త్రీ, పురుషులకు సమానంగా విద్యావ్యాప్తి, ఉపాధి అవకాశాలు, వృత్తి విద్య, ఉన్నత విజ్ఞానం, వాణిజ్యం, సాంకేతిక రంగాలలో కూడా భాగస్వామ్యం కల్పించారు.
ఆత్మగౌరవాన్ని పెంపొందించారు. మనుషులందరికి ఒకే కులం, ఒకేమతం, ఒకే దేవుడు ఉండాలని, మతం కోసం మనిషికాదు, మనిషికోసం మతం ఉన్నదని- అందుకే కులం అడగవద్దు, కులం చెప్పవద్దు, కులం గురించి మాట్లాడవద్దని బోధించారు. 19వ శతాబ్దంలో కేరళలో తాను జన్మించిన ఈళవ కులంతో పాటు ఇతర నిమ్నకులాలు సామాజికంగా ఎంతో వెనుకబడి ఉన్నాయి. శ్రీ నారాయణగురు వేదాలను, సంస్కృత భాషను, పురాణాలను అధ్యయనం చేసి, నిమ్న కులాలకు దేవాలయాలు నిర్మించి వారికి వేదాలు చదవడాన్ని- పౌరోహిత్యాన్ని, వివాహాలు జరిపే పద్ధతిని కూడా నేర్పించి, కుల వివక్ష లేకుండా అందరికీ దేవాలయ ప్రవేశం కల్పించారు.
తిరువనంతపురం బహిరంగ సభలో మహాత్మాగాంధీ మాట్లాడుతూ శోభాయమానమైన తిరువాన్కూర్‌ రాష్ట్రంలో పర్యటించడం, శ్రీనారాయణ గురును కలుసుకోవడం తన జీవితానికి లభించిన మహాద్భాగ్యం గా భావిస్తు న్నానని అన్నారు. ఆ తరువాత ఆయనతో సమావేశమైన గాంధీకి కులం యొక్క హేతువిరుద్ధ పాత్ర అర్థమైందనీ, దేశంలో అంటరానితనాన్ని రూపు మాపాలనే ఆవశ్యకత తెలిసిందని చెప్పారు. నాటి భారత జాతీయ కాంగ్రెస్‌ కుల తత్వానికి, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడాలనే తీర్మానాన్ని కూడా చేసింది.
శ్రీనారాయణగురు ఆశయాలు, విధానాలు, ఆలోచనలు మనల్ని ఇంకా ఇంకా ఆలోచింపజేస్తాయి. భారతదేశం ప్రగతిని సాధించాలంటే నేడున్న ఈ సమాజంలో కులం, మతం, ప్రాంతం, స్త్రీ, పురుష వివక్షపై సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలోని మేధావులు, రాజకీయ నాయకులు, పార్టీలు ఆయన ఏనాడో చెప్పిన అంశాలపై పూర్తిగా ఆధ్యయనం చేయవలసి ఉన్నది.
-ఈద చెన్న

No comments:

Post a Comment