Sunday, September 4, 2011

నేను 'అన్నా'ను కాలేను - అరుంధతీ రాయ్ 24/08/2011 Andhra Jyothi


నేను 'అన్నా'ను కాలేను
- అరుంధతీ రాయ్
టీవీలో మన ం చూస్తోంది విప్లవమే అయితే, అది ఇటీవలి కాలంలో సంభవించిన విప్లవాల్లో అత్యంత ఇబ్బందికరమైనది, అర్థం కానిదని చెప్పవచ్చు. పూర్తిగా భిన్న కారణాల వల్ల, సంపూర్ణంగా వేర్వేరు మార్గాల్లో మావోయిస్టులు, జన్ లోక్‌పాల్ బిల్లు మధ్య ఒక ఉమ్మడి అంశం ఉంది - ఈ రెండూ భారత రాజ్య వ్యవస్థను కూల్చివేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఒకరు అట్టడుగు స్థాయి నుంచి సాయుధ పోరాటం ద్వారా అందుకు ప్రయత్నిస్తున్నారు. పేదలలో నిరుపేదలైన ఆదివాసీలే వారి సైనికులుగా ఉన్నారు. మరొకరు ఉన్నత స్థాయి నుంచి రక్తపాతరహిత గాంధేయ తిరుగుబాటు ద్వారా ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారు. సరికొత్తగా ఆవిర్భవించిన ఋషితుల్యుని నేతృత్వంలో చాలావరకు నగరవాసులైన వారు ఉద్యమిస్తున్నారు. గత ఏప్రిల్‌లో అన్నా హజారే తన మొదటి 'ఆమరణ నిరాహార దీక్ష'కు పూనుకున్నారు. ఒక దాని వెంట ఒకటి బయల్పడిన వివిధ అవినీతి కుంభకోణాలతో ప్రభుత్వం సతమతమవుతోన్న తరుణమది.
తన విశ్వసనీయతను కాపాడుకోవడానికై ప్రజల దృష్టిని ఆ కుంభకోణాల నుంచి మళ్ళించేందుకై మార్గాంతరాన్ని అన్వేషిస్తోన్న ప్రభుత్వం టీమ్ అన్నా (హజారే నాయకత్వంలోని 'పౌర సమాజం' ప్రతినిధుల బృందం)ను కొత్త అవినీతి నిర్మూలనా చట్టం ముసాయిదా కమిటీలో భాగస్వాములుగా చేరాలని ఆహ్వానించింది. ఆ తరువాత కొద్ది నెలలకే, సంయుక్తంగా ముసాయిదా బిల్లును రూపొందించే ప్రయత్నాన్ని విరమించి తన సొంత బిల్లును పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ బిల్లులో చాలా లోపాలు ఉన్నాయి. సీరియస్‌గా తీసుకోలేనంతటి లొసుగుల మయంగా ఉందది.
ఈ ఆగస్టు 16, అన్నా తన రెండో 'ఆమరణ నిరాహార దీక్ష'కు ఉపక్రమించనున్న రోజు. దీక్షను ప్రారంభించక ముందే, ఎటువంటి చట్టోల్లంఘనకు పాల్పడకున్నా ప్రభుత్వం అన్నా హజారేను అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. జన్‌లోక్‌పాల్ బిల్లు అమలుకై జరుగుతోన్న పోరాటం నిరసన తెలిపే హక్కు కోసం పోరాటంగా పరిణమించింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం కోసం పోరాటంగా అన్నా ఉద్యమం మారింది. 'ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం' ప్రారంభమైన కొద్ది గంటలకే అన్నాను జైలు నుంచి విడుదల చేశారు. అయితే ఆయన జైలు నుంచి బయటకు వెళ్ళిపోవడానికి తిరస్కరించారు. తీహార్ జైలులో గౌరవనీయ అతిథిగా ఉండిపోయారు.
బహిరంగ ప్రదేశంలో నిరశన దీక్ష నిర్వహించేందుకు అనుమతినివ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన జైలులోనే దీక్ష ప్రారంభించారు. మూడు రోజుల పాటు తీహార్ జైలు వెలుపల ప్రజలు, మీడియా ప్రతినిధులు నిరంతరం అక్కడే ఉండిపోయారు. టీమ్ అన్నా సభ్యులు జైలు లోపలికి బయటకు తిరుగుతూ తమ నాయకుని వీడియో సందేశాలను టీవీల వారికి అందించారు. ఆ సందేశాలను అన్ని జాతీయ ఛానెల్స్ ప్రసారం చేశాయి. ఇలా వుండగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 250 మంది ఉద్యోగులు, 15 ట్రక్కులు, ఆరు ఎర్త్ మూవర్స్‌తో రేయింబవళ్ళు పనిచేసి అన్నా నిరశన దీక్షకు రామ్‌లీలా మైదానంలో సకల ఏర్పాట్లు చేశారు.
అసంఖ్యాకంగా గుమిగూడిన ప్రజలు నినాదాలు చేస్తుండగా, భారతదేశపు అత్యంత ఖరీదైన వైద్యనిపుణుల ఉపచారాలతో, టీవీ కెమెరాల సాక్షిగా అన్నా ఆమరణ నిరాహార దీక్ష మూడో దశ ప్రారంభమయింది. ప్రభుత్వంపై పోరుకు అన్నా హజారే అనుసరిస్తోంది గాంధేయ మార్గమైనా, ఆయన డిమాండ్లు నిశ్చితంగా గాంధేయ డిమాండ్లు కావు. అధికార వికేంద్రీకరణకు సంబంధించి గాంధీ భావాలకు విరుద్ధమైనది జన్ లోక్‌పాల్ బిల్లు. అది కఠోరమైన అవినీతి వ్యతిరేక చట్టం. కొద్దిమంది వ్యక్తులు, వేలాది ఉద్యోగుల సహాయంతో ఆ చట్టాన్ని అమలుపరుస్తారు. ప్రధానమంత్రి, ఉన్నత న్యాయవ్యవస్థ, పార్లమెంటు సభ్యులు, ఉన్నతాధికార గణం నుంచి క్రిందిస్థాయి ప్రభుత్వాధికారుల వరకు లోక్‌పాల్ వ్యవస్థ నిఘా ఉంటుంది.
లోక్‌పాల్ ప్రయోజనకరంగా పనిచేస్తుందా లేదా అనేది అవినీతిని మనం ఎలా చూస్తున్నామనే దానిపై ఆధారపడివుంది. కళ్ళు మిరుమిట్లు గొల్పే షాపింగ్ మాల్స్ ఉన్న నగరాన్ని ఊహించండి. ఆ మాల్స్ ఉన్న వీధిలో బండ్లపై తినుబండారాలు, చిన్న చిన్న సరుకులు అమ్ముకునే వాళ్ళను అనుమతించరు. ఆ సన్నకారు విక్రేత ఆ వీధి కానిస్టేబుల్‌కు, మునిసిపల్ ఉద్యోగికి కొద్ది మొత్తంలో లంచం ఇచ్చి, ఆ మాల్స్ వీధిలో తన సరుకులు అమ్ముకోవడానికి అనుమతి సాధించుకుంటాడు. ఇలా చేయడం ద్వారా అతను చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు.
నిజమే కాని, అదేమైనా ఘోరమా? భవిష్యత్తులో లోక్‌పాల్ ప్రతినిధికి కూడా అతను లంచం ఇవ్వకుండా ఉంటాడా? వ్యవస్థీకృత అసమానతలను అధిగమించడంలో సామాన్య పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ప్రజలు విధిగా గౌరవించాల్సిన మరో అధికారిక వ్యవస్థను సృష్టించడమేనా?
సరే, అన్నా ఉద్యమం తీరుతెన్నులను చూద్దాం. అన్నా 'ఆమరణ దీక్ష' ఇరోమ్ షర్మిల దీక్ష వంటిదా? కాదు మణిపూర్‌లో ఎవరినైనా కాల్చిచంపడానికి సైనికులకు సకల అధికారాలు కల్పించిన చట్టానికి వ్యతిరేకంగా షర్మిల గత పదేళ్ళుగా నిరాహారదీక్ష చేస్తున్నారు. అణు విద్యుత్కేంద్రాలకు వ్యతిరేకంగా కూడన్ కులంలో పదివేలమంది రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష వంటిది కూడా కాదు.
ఇక అన్నా 'ఆమరణ దీక్షకు మద్దతు ఇస్తోన్న ప్రజలు ఎవరు? వారేమీ షర్మిల దీక్షకు మద్దతు ఇస్తోన్న మణిపురిల వంటివారేమీ కాదు, జగత్‌సింగ్‌పూర్, కళింగనగర్, నియామ్‌గిరి, బస్తర్, జైతాపూర్‌లో సాయుధ పోలీసులను, మైనింగ్ మాఫియాలను ఎదుర్కొంటున్న ప్రజల వంటి వారు కాదు. వారేమీ భోపాల్ విషవాయువు దుర్ఘటన బాధితులు కారు. నర్మదా లోయలో నిర్వాసితులైన వారూకాదు. అలాగే నోయిదా, ఫూణే, హర్యానా, మరెన్నోచోట్ల సెజ్‌ల కోసం భూములు కోల్పోయిన అమాయక రైతుల వంటి వారూ కాదు.
'ప్రజలు' అంటే, తన జన్‌లోక్‌పాల్ బిల్లును నిర్దిష్ట గడువులోగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్షకు పూనుకున్న 74 ఏళ్ళ అన్నాకు మద్దతు ఇస్తున్న వారే ప్రజలు సుమా! అన్నా దీక్షాస్థలి వద్ద గుమిగూడిన ప్రజలు అంతకంతకు పెరిగిపోతున్నారని టీవీ ఛానెల్స్ సాక్ష్యం పలుకుతున్నాయి. అన్నార్తుల కోసం జీసస్ చేపలను అమాంతంగాపెంచేసినట్టు అన్నా మద్దతుదారులు పెరిగిపోతున్నారని టీవీ ఛానెల్స్ యాంకర్లు వ్యాఖ్యానిస్తున్నారు. 'వందకోట్ల గొంతుకలు ముక్తకంఠంతో మాట్లాడుతున్నాయని' మనకు చెబుతున్నాయి. ఏమని? 'భారత్ అంటే అన్నా' అని.
ఇంతకూ ఈ కొత్త ఋషిసత్తముడు ఎవరు? ఆయన ఎప్పుడైనా రైతుల ఆత్మహత్యల గురించిగానీ, ఆపరేషన్ గ్రీన్ హంట్ గురించి గానీ మాట్లాడడం మీరు విన్నారా? సింగూర్, నందిగ్రామ్, లాల్‌గఢ్, పోస్కోల గురించి ఆయనెప్పుడైనా మాట్లాడారా? సెజ్‌లకు వ్యతిరేకంగా నిర్వాసితులైన రైతుల ఆందోళనలను ఆయన ఎప్పుడైనా పట్టించుకున్నారా? మధ్య భారతం అడవుల్లో భారత సైన్యాన్ని పెద్ద ఎత్తున మొహరించడానికి యూపీఏ ప్రభుత్వం చేస్తోన్న సన్నాహాల గురించి అన్నా హజారే అభిప్రాయమేమిటి?
మరి ఈ అన్నానే రాజ్ ఠాక్రే మరాఠి మనూస్ ఉద్యమానికి మద్దతిచ్చారు; 2002లో ముస్లింలను ఊచకోత కోయించిన గుజరాత్ ముఖ్యమంత్రి 'అభివృద్ధి నమూనా'ను ప్రశంసించారు. అన్నా పట్ల ప్రజల అభిమానం వెల్లువవుతున్నప్పటికీ వివేచనాపరులైన జర్నలిస్టులు కొన్ని వాస్తవాలను వెల్లడించడంలో తమ విధ్యుక్త ధర్మాన్ని విస్మరించలేదు. ఆరెస్సెస్‌తో అన్నాకు సంబంధాలు ఉన్నాయని వెల్లడయింది. అన్నా గ్రామమైన ర్యాలేగావ్ సిద్ధిలో అభివృద్ధి తీరుతెన్నులను ముకుల్ శర్మ అధ్యయనం చేశారు.
ఆ గ్రామంలో గత పాతికేళ్ళుగా గ్రామ పంచాయత్‌కు గానీ, సహకారసంఘానికి గానీ ఎన్నికలు జరగనేలేదు. 'ప్రతి గ్రామంలోను వివిధ వృత్తికారులు ఉండాలని, వారు తమ వృత్తికి అనుగుణంగా పనిచేయాలని, తద్వారా గ్రామం స్వయం సమృద్దమై ఉండాలనే గాంధీ దార్శనికతనే రాలేగావ్ సిద్ధిలో ఆచరిస్తున్నారని' శర్మ పేర్కొన్నారు. మరి టీమ్ అన్నా సభ్యులకు 'యూత్ ఫర్ ఈక్వాలిటీ, రిజర్వేషన్ల వ్యతిరేక ('ఫ్రతిభ' అనుకూల) ఉద్యమాలతో సన్నిహిత సంబంధాలుండడంలో ఆశ్చర్యమేముంది. కోకో కోలా, లేమాన్ బ్రదర్స్ ఇత్యాది బహుళజాతి సంస్థల విరాళాలతో నడిచే ఎన్‌జిఓల ప్రతినిధులు అన్నా ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్నారు.
టీమ్అన్నాలో కీలక సభ్యులుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మనీష్ శిశోడియాల ఆధ్వర్యంలోని కబీర్ అనే ఎన్‌జిఓకు గత మూడేళ్ళలో ఫోర్డ్ పౌండేషన్ నుంచి నాలుగు లక్షల డాలర్ల నిధులు అందాయి. ప్రభుత్వం తన సంప్రదాయ బాధ్యతలనుంచి వైదొలుగుతూ, మౌలికసేవల (నీటి సరఫరా, విద్యుత్తు, టెలికమ్యూనికేషన్స్, విద్య, వైద్యం మొదలైనవి) బాధ్యతలను కార్పొరేట్ సంస్థలు, ఎన్‌జిఓలకు అప్పగిస్తున్న తరుణమిది. ప్రజల ఆలోచనలను నిర్దిష్ట దిశలో కట్టడి చేయడానికి మీడియా శతవిధాలా ప్రయత్నిస్తోన్న సందర్భమిది. మరి వీటికి బాధ్యులైన సంస్థలను అంటే కార్పొరేషన్లు, మీడియా, ఎన్‌జిఓలను కూడా లోక్‌పాల్ పరిధిలో చేర్చవలసిన అవసరం లేదా? ప్రతిపాదిత బిల్లు ఈ అంశాన్ని పూర్తిగా వదిలివేసింది.
తమను మరింతగా పేదరికంలోకి త్రోసివేసి, దేశాన్ని అంతర్యుద్ధం వైపునెట్టే విధానాలను పటిష్టం చేయడం వల్ల ఇరవై రూపాయల దినసరి ఆదాయంపై బతుకుతోన్న 83 కోట్ల మంది ప్రజలకు కలిగే లబ్ధి ఏమిటి? భారతదేశపు ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామ్యం వైఫల్యం నుంచే ఈ సంక్షోభం ఉత్పన్నమయింది. ప్రజలకు ప్రాతినిధ్యం వహించని నేరస్థులు, కుబేరులైన రాజకీయవేత్తలతో చట్ట సభలు నిండిపోతున్నాయి.
ఏ రాజ్యాంగ సంస్థా సామాన్య పౌరునికి అందుబాటులో ఉండడంలేదు. జెండాలు ఊపుతూ అన్నాకు మద్దతు తెలుపుతున్నవారిని చూసి ఏదో మార్పు రాబోతుందని భ్రమించవద్దు. నిజానికి మనరాజ్య వ్యవస్థ, సహజ సంపదలపై ఆధిపత్యానికి జరుగుతోన్న యుద్ధంలోకి మన దేశం నెట్టివేయబడుతోంది. అది, ఆప్ఘానిస్తాన్‌లో ఆధిపత్యం కోసం యుద్ధ ప్రభువుల మధ్య జరుగుతున్న ఏ పోరాటం కంటే కూడా చాలా తీవ్రమైనది.
- అరుంధతీ రాయ్
("I'd rather not be anna" అన్న వ్యాసానికి సంక్షిప్త స్వేచ్ఛానువాదం)

No comments:

Post a Comment