మరో భూ దాష్టీకం
- సంపాదకీయం
మహారాష్ట్ర పుణెలో భూసేకరణ రక్తసిక్తమయింది. పుణెలోని పావ్‌నా డ్యాంనుంచి పింప్రి-చించ్‌వాడ్ జంట పారిశ్రామిక కేంద్రానికి సాగునీటి మళ్ళింపుకోసం మావల్ వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టుకు, సంబంధింత భూగర్భ పైప్‌లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు వ్యతిరేకంగా రైతాంగం చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేసి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఓ మహిళతోసహా నలుగురు ఆందోళనకారులు మరణించారు. నాలుగు వందల మందికిపైగా రైతులు గాయపడ్డారు. దేశంలో ఇదొక సర్వసాధారణ సామాజిక ఘట్టంగా మారింది. బహుర్ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ పోలీసు కాల్పులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ప్రకంపనల్ని సృష్టించింది. ఈ సంఘటనలపై ప్రతిపక్షాలు ఆందోళనల కారణంగా గురువారం మహారాష్ట్ర చట్టసభలు మూడురోజులుగా ప్రతిష్టంభనకు గురైనాయి. ఈ ఉదంతంపై ప్రతిపక్షాల నిరసనతో పార్లమెంట్ స్తంభించింది.
రైతు నేతలతో చర్చిస్తున్న సమయంలో కొంతమంది తమపైకి రాళ్ళు రువ్వి, పోలీసు వాహనాలకు, బస్సులకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వాదిస్తున్నారు. అయితే పావ్‌నా డ్యాంలోని సాగునీటి తరలింపుపై దాదాపు మూడేళ్ళ నుంచి సాగుతున్న వివాదాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సకాలంలో పరిష్కరించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది.
పుణె భూసేకరణ దాష్టీకం, ప్రజా ప్రతిఘటన కొత్తదేమీ కాదు. సాక్షాత్తు దేశ రాజధానికి సమీపంలోని నోయిడా నుంచి మొదలుకొని సింగూర్, నందిగ్రాం, జైతాపూర్, పోస్కో, సోంపేట ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూసేకరణ స్థానిక ప్రజలనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన విషయం తెలిసిందే. అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడం జాతి ఆర్థిక వికాసానాకి అత్యవసరం, అనివార్యం. అయితే వాటి మూలాన ఏవో కొద్ది మంది వ్యక్తులకు, కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చి, లక్షలాది నిర్వాసితుల జీవితాలను చీకటిమయం చేయడం సమర్ధనీయం కాదు.
ప్రాజెక్టులకోసం ప్రభుత్వం భూసేకరణను చేపట్టినపుడు జీవనోపాధి కోల్పోవడం, ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లడం లాంటి అనేక సమస్యలు ముందుకు వస్తాయి. ప్రజలు వాటి పునాదిగా ఉద్యమిస్తారు. ప్రభుత్వం వాటన్నిటిని ఓపికగా పరిష్కారించాలే గాని, బలవంతంగా భూసేకరణకు సిద్ధపడటం ప్రజాస్వామికం కాదు. పుణె భూసేకరణ విషయంలో కూడా అక్కడి రైతాంగాన్ని అనేక భయాలు వెంటాడుతున్నాయి. పారిశ్రామిక కేంద్రానికి మంచినీటి తరలింపు ప్రాజక్టుతో సాగునీటి, తాగునీటి సమస్యలు వస్తాయని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందడం సహజం.
ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజలకు నచ్చ చెప్పి, వారు భయపడుతున్న సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారం చూపించకుండా బలవంతంగా భూసేకరణకు పాల్పడటం అన్యాయం. ఆందోళనకారులపై కావాలని కాల్పులు జరిపిన పాలీసు అధికారులను డిస్మిిస్ చేసి, హత్యానేరం కింద విచారించకుండా మహారాష్ట్ర ప్రభుత్వం వారిపై కేవలం శాఖా పరమైన విచారణకు మాత్రమే ఆదేశించింది. అందుకు భిన్నంగా రైతులను మాత్రం పదుల సంఖ్యలో అరెస్టు చేసి కేసులు పెట్టింది.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణలలో ప్రభుత్వం ప్రజలకు న్యాయమైన నష్టపరిహారాన్ని అందించలేదని స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాపితంగా సెజ్‌లు, హైవేలు, డ్యాంలు లాంటి వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట జరిగిన భూసేకరణ స్థానిక బతుకులను, స్థానిక సంస్కృతులను నాశనం చేశాయి. ఆ భయాలు దేశ ప్రజలను వెంటాడుతున్నాయి. ఎంత నష్టమైనప్పటికీ పొలాన్ని, ఉపాధిని వదలుకోలేని అభద్రతా భావం భూసేకరణను సంక్లిష్టం చేసింది.
నిర్వాసితులకు తమ భూమిలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులో ఉపాధి, లాభాలలో వాటా లేదా రాయల్టీని అందజేసినట్లయితే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతంది. భూసేకరణ కోసం ప్రజలను ఒప్పించడం కూడా సులువవుతుంది. అలాకాక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడో బ్రిటీష్‌కాలం నాటి భూసేకరణ చట్టాలననుసరించి బలవంతపు భూసేకరణకు పాల్పడటం వల్ల దేశవ్యాపితంగా అనేక ఆందోళనలు చెలరేగుతున్నాయి. భూసేకరణ చట్టం ఒకరకంగా రైతుకు శాపంగా మారింది.
దానిపేరు చెబితేనే వారు కొంతకాలంగా మండిపడుతున్నారు. మన రాష్ట్రంలో కొన్నేళ్ళుగా జరుగుతున్న వ్యవహారాలను పరిశీలిస్తే ఇక్కడ ప్రధానంగా బలంతపు భూసేకరణ సాగుతోంది. సెజ్‌ల కోసం పేద, మధ్యతరగతి రైతాంగం నుంచి 'కార్డ్ వేల్యూ'కు భూమిని కొనుగోలు చేసి ఎమ్మార్ ప్రాపర్టీస్‌లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వమే ధారాదత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఐఐడీసీ) ద్వారా ప్రజా ప్రయోజనాల పేరు మీద ప్రజలనుంచి భూమిని కారుచౌకగా సేకరించి దేశ విదేశీ కార్పొరేట్ సంస్థలకు, ఆశ్రితులకు అవసరానికి మించి కేటాయించింది.
కేటాయించిన భూముల్లో ఎలాంటి పారిశ్రామిక అభివృద్దిని చేపట్టక పోవడం, వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలాంటి ఎన్నో అక్రమాలు ఈ మధ్యకాలంలో వెలుగు చూశాయి. రానున్న రోజుల్లో శరవేగంగా విస్తరించే పారిశ్రామిక, మౌలిక రంగాలకు భూముల అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 'సమగ్ర భూ సేకరణ' బిల్లును త్వరలో తీసుకురానుంది. ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ కొత్త భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టాలని సర్కారు యోచిస్తోంది.
ప్రభుత్వ భూములు దాదాపుగా కనుమరగైపోవడం, మెగా పారిశ్రామిక ప్రాజెక్టు అవసరాలు ముందుకు రావడంతో రైతుల భూములను సైతం సేకరించక తప్పని పరిస్థితి. 2012-17 పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో భూముల అవసరం చాలా ఉంటుంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ) ఎక్కవ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని ప్రణాళికా సంఘం పేర్కొనింది. పీపీపీ పద్ధతిలో తన వాటాగా భూమిని సమకూర్చడం ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో కూడా పీపీపీ ఒప్పందంలో భాగంగా తన వాటాగా ఎల్అండ్‌టీ సంస్థకి ప్రభుత్వం భూములను సేకరించి అందిస్తోంది.
ప్రైవేటు సంస్థలే ప్రజలనుంచి నేరుగా భూసేకరణ చేపట్టాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలాంటివారు కొంతకాలంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే దేశ విదేశీ కార్పొరేట్ సంస్థలు భూ సేకరణ తలనొప్పిని ప్రభుత్వంపైకి నెట్టివేస్తూ పీపీపీ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దాంతో భూసేకరణ బాధ్యతనుంచి సర్కారు తప్పించుకోలేని పరిస్థితి. భూసేకరణలో అత్యంత కీలకమైనవి మెరుగైన నష్టపరిహారం, పునరావాసం. భూ సేకరణ కోసం ఆ ప్రాంత ప్రజల్లో అత్యధికులు రాతపూర్వకంగా సానుకూలత వ్యక్తపరచాలన్న నిబంధనను ప్రభుత్వం కొత్త భూసేకరణ బిల్లులో పొందుపరచనుంది.
మార్కెట్ విలువకు ఆరింతల పరిహారం ఇవ్వాలంటూ సోనియా నేతృత్వంలోని జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ) సిఫార్సు చేసింది. నిర్వాసితులే ఆ ప్రాజెక్టు కింద ప్రధాన లబ్ధిదారులు కావాలన్న అంతర్జాతీయ నిబంధనల వెలుగులో కొత్త భూసేకరణ చట్టాన్ని రూపొందించాలి. దేశ అభివృద్దితోపాటు రైతు శ్రేయస్సూ ముఖ్యమే.
అభివృద్ధి పనులకు ప్రజలు సంతోషంగా భూమిని అప్పగించాలే తప్ప, నిర్వాసితుల కుటుంబాలు కుంగి, కృశించిపోయే పరిస్థితి రాకూడదు. ప్రజల హక్కులను, జీవనాధారాల్ని, పర్యావరణాన్ని హరించి కార్పొరేట్ శక్తుల కొమ్ముకాయకుండా, అభివృద్ధి ఫలాలను నిర్వాసిత ప్రజానీకానికి అందించే చట్టం అవసరం! అలాంటి సమగ్రమైన భూసేకరణ చట్టం అమలులోకి వచ్చేంతవరకూ దేశవ్యాపితంగా భూసేకరణ కార్యక్రమాన్ని నిలిపివే స్తేనే, పుణె కాల్పుల ఉదంతాలు పునరావృతం కాకుండా ఉంటాయి.
No comments:
Post a Comment