జీవన సంస్కృతి దేవుళ్లనూ వదలని వలస వివక్ష!
దేశంలో పన్నెండేళ్లకోసారి జరిగే మహాకుంభమేళ ఉత్సవాల తర్వాత అధిక సంఖ్యలో హాజరయ్యే మరో ఉత్సవం మేడారం జాతర. ప్రతి రెండేళ్లకోసారి మేడారం సమ్మక్క-సారక్క జాతర జరుగుతోంది. గంగానదిలో ఉత్తరభారత పుణ్యక్షేవూతాల్లో జరిగే మహాకుంభమేళ పుష్కరాలకు జాతీయ పండుగ హోదానిచ్చి కేంద్ర ప్రభుత్వం వందలకోట్ల రూపాయలను విడుదల చేస్తున్నది. అర వై లక్షల నుంచి ఎనభై లక్షల మంది భక్తులు హాజరయ్యే మేడారం సమ్మక్క-సారక్క ‘గిరిజన కుంభమేళా’కు మాత్రం ఇంతవరకు ఇరవై కోట్ల రూపాయలకు మించి ఖర్చు చేయలేదు.
వరంగల్ జిల్లాలోని దట్టమైన దండకారణ్య ప్రాంతంలో చిన్నగిరిజన గూడెం మేడారం. కనీస సౌకర్యాలు లేకుండా ఎనిమిది మిలియన్ల భక్తు లు నాలుగురోజుల పాటు గుమికూడటం తెలంగాణ ప్రజల ఇలవేల్పులు సమ్మక్క-సారలమ్మల మహిమ అనటంలో సందే హం లేదు. దేశంలోని అన్ని ఉత్సవాల, జాతరల్లో కెల్లా అనేక విశిష్టత లు కలిగిన మేడారం జాతర దేశంలోని, ముఖ్యంగా మధ్య భారతదేశంలోని ఆదివాసీల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని వందల ఏళ్లుగా కొనసాగిస్తున్నది. మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు కులాలు,మతాలు, సంప్రదాయాలకతీతం గా సమ్మక్క-సారక్కలను ఆరాధ్య దైవాలుగా కొలుస్తా రు.ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకోసారి మాఘశుద్ధ పౌర్ణమి మూడు, నాలుగు రోజుల్లో జరుగుతుంది. పల్లెలు, పట్టణాలు ఒక్కటై కదులుతూ మేడారం వైపు బారులు కడుతాయి.చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా జాతర జోష్‌లో ఆధ్యాత్మిక భక్తి భావంతో ఉంటారు. ఎలాంటి సౌకర్యాలు లేని కీకారణ్యమైన కుగ్రామంలో ఇంతటి మహత్తు కలిగిన జాతర ఆరేడు వందల సంవత్సరాలుగా సాగుతోంది.
ఉధృతంగా ప్రవహించే గంగానదిలో కోట్లాది భక్తులు అరడజను రాష్ట్రాల్లోని గంగాతటుల్లో పవిత్ర స్నానాలాచరిస్తారు. జంపన్నవాగులో మూడురోజుల్లో కనీసం కోటి మంది స్నానాలు చేస్తారు. సమ్మక్క-సారక్కల జాతరకు ఛత్తీస్‌గఢ్, మధ్యవూపదేశ్, మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా ఆదివాసీలు తరలివస్తారు. దట్టమైన అరణ్యాలను, వాగులను, వంకలను, కొండలను దాటుతూ కష్టనష్టాలకోర్చి జాతర సమయానికి మేడారం చేరుకుంటారు. ఇద్దరమ్మలను ఇలవేల్పుగా భావించే వందలాది ఎన్నారై కుటుంబాలు కూడా జాతర సమయంలో నిలు బంగారం (బెల్లంతో) మొక్కులు చెల్లించుకుంటారు. ఖండంతరాలు దాటినా మేడారం భక్తి భావన చెక్కు చెదరదు.
ఎలాంటి వైదిక, బ్రాహ్మణ పోకడలకు తావు లేకుండా సంప్రదాయక ఆదివాసీ పూజారులే ఇక్కడ తమ విశిష్టమైన పూజాదికాలు నిర్వహిస్తారు. అక్కడ బంగా రు తాపడాలు పూసిన దేవాలయాలు లేవు. వజ్ర, వైఢూర్యాలు, కెంపు లు పొదిగిన కిరీటాలు లేవు. ఉన్నదల్లా సామాన్యుల భక్తి, బంగారమే (బెల్లం). మేడారం జాతరను ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతుతున్న డిమాడ్ కనుగుణంగా 1996లో ‘స్టేట్ ఫెస్టివల్’గా గుర్తింపునిచ్చారు. ఇది కూడా నామ్‌కే వాస్తే గుర్తింపుగానే పాలకులు కంటితుడుపుగా ఇచ్చారన్నది వాస్తవం. గోదావరి పుష్కరాలకు ఆంధ్రలో చేసే ఖర్చులో కనీసం పదిశాతమైనా ఇక్కడ కేటాయింపులు జరగవు. ఆంధ్ర పాలకుల వివక్ష ప్రాంత దేవుళ్లనూ, ఆదివాసీ ఆచార, వ్యవహారాలనూ వదలలేదు.
మేడారం జాతర మాఘమాసం (జనవరి, ఫిబ్రవరి)లో వస్తుందని తెలిసినప్పటికీ, జాతరకు మూడు నెలల ముందు అధికారుల హడావుడితో ఏర్పాట్లు చేస్తారు.
అత్తెసరు నిధులు కేటాయించి, కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించి, అరకొరగా పనులతో ఏదో మ మ అనిపిస్తారు.భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించ కుం డా నిర్లక్షం చేస్తారు. లక్షల మంది హాజరయ్యే ‘మేడారం’ గిరిజన జాతరను ‘నేషనల్ ఫెస్టివల్’గా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం వందకోట్ల రూపాయలు కోటాయించాలి. భక్తులకు శాశ్వత సౌకర్యాల కల్పన చేయాలి. భక్తి భావనతో వేలాదిమంది ప్రజలు సంవత్సరం పొడుగునా మేడారంకు వస్తూ, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ దృష్ట్యా కూడా అక్కడ భక్తుల వసతి గృహాలు నిర్మించాలి.
ఆదివాసీల తరతరాల సంప్రదాయల పరిరక్షణకు అనుగుణంగా సమ్మక్క-సారక్కల జాతరను జాతీయ పండుగగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం వెంటనే లేఖ రాయాలి. సమగ్ర నివేదికను పంపాలి. రాష్ట్ర ప్రభు త్వం తన వంతు బాధ్యతగా కనీసం యాభై కోట్ల రూపాయలు కేటాయించి, భక్తులకు కనీస సౌకర్యాల కల్పన చేయాలి. మేడారం జాతరకు సంబంధించిన స్థానిక గిరిజన పూజారుల కుటుంబాలకు గృహవసతి, ఉపాధి, ఉద్యోగాలను కల్పించాలి. సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించే విధంగా కృషి చేయాలి.
దేవాదాయశాఖ అధికారులతో, తెలంగాణ మేధావులతో, చరివూతకారులతో, ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి మేడారం జాతరను ‘నేషనల్ ఫెస్టివల్’గా గుర్తించాల్సిన ఆవశ్యకతను సమక్షిగమైన డాక్యుమెంట్, ఆడియో, విజువల్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం రాష్ట్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. కనీసం ఆరేడు రాష్ట్రా ల నుంచి నేటివ్ ఆదివాసీలు తరలివచ్చే మేడారం జాతర ‘జాతీయ ఫెస్టివల్’ హోదా పొందకపోతే అది ఇక్కడి పాలకుల నిర్లక్ష్యమే. అది ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధం. పార్టీలకతీతంగా తెలంగాణ నాయకులు, ప్రజలు ఏకమై ‘మేడారానికి జాతీయపండగ హోదా’ సాధించాలి. ఇద్దరమ్మలకు నిలు బంగారం సమర్పించాలి.
-కంకట రాజారామ్
తెలంగాణ విశ్వవిద్యాలయం జర్నలిజం అధ్యాపకులు
No comments:
Post a Comment