Sunday, September 4, 2011

నెత్తుటి ప్రశ్నలు... - కృపాకర్ మాదిగ పొనుగోటి Andhra Jyothi Jul/ 17/2011



జూలై 17, 1985.... కారంచేడు నరమేధం. సమాజం ఉలిక్కిపడినరోజు. దానికి బాధ్యులైన కులోన్మాదులపై కారంచేడు మాదిగలంతా యుద్ధానికి తలపడిన రోజు. నెత్తురు, మట్టి కలసి నూతన దళిత శకం పురుడుపోసుకున్న రోజది. ఎన్నాళ్ళీ కూలి బతుకులు? చెప్పులు కుట్టుడు? డప్పులు కొట్టుడు? అంటరానితనం? అవమానాలు? కారంచేడు మృతవీరులు 'రుధిర క్షేత్రం' నుంచి ఆధిపత్య కుల సమాజంపై విసిరిన ప్రశ్నలవి. సొంత కులస్తులను మెలితిప్పిన ఆలోచనలవి.

కారంచేడు సంఘటన తర్వాత దళిత ఉద్యమాన్ని నడిపిన ఆనాటి దళిత మహాసభ నాయకత్వం మాదిగలు ఇతర దళిత కులాలపై వర్ణ«ధర్మ సామాజిక... యుద్ధం సాగిస్తున్న ఆధిపత్య కులాల ప్రభుత్వం నుంచి సహాయ, పునరావాస, నష్టపరిహారాలే తప్ప, యుద్ధ పరిహారాన్ని సాధించలేకపోయింది. అయితే, దళిత సమస్యను సమాజంలో, ప్రభుత్వంలో చర్చకు పెట్టి, ఎజెండా చేసి, మద్దతును, సానుభూతిని ఎల్లెడలా కూడగట్టగలిగింది. 1994 తర్వాత వచ్చిన మాదిగ దండోరా ఉద్యమం మాదిగలకు మానవ గౌరవం, రిజర్వేషన్లలో వాటా సాధనకూ, వారికి అన్ని అవకాశాల్లో సరైన ప్రాతినిధ్యం డిమాండ్ చేస్తూ కొనసాగింది.

దళితుల్లో ప్రతి కుల సమూహానికి సామాజిక గౌరవం, సూక్ష్మ స్థాయి పంపిణీ న్యాయం కోసం మాదిగ దండోరా ఉద్యమం "యుద్ధా''లే చేసింది. దళిత ఉద్యమం, దండోరా ఉద్యమం రెండూ కూడ తమపై సాగుతున్న ఆధిపత్య కులాల అణచివేతలను ప్రశ్నించి, ప్రతిఘటించాయి. అంబేద్కర్ వాదాన్ని ఇందుకు బూస్టర్‌గా ఉపయోగించుకున్నాయి. ఇంతేకాకుండా ఈ రెండు ఉద్యమాలు మాదిగలను, ఇతర దళితులను యథాతథవాద మనువాద రాజకీయావకాశాల్లో కొంత మేరకు ప్రాతినిధ్యం కల్పించుకునే చెయ్యగలిగాయి. అంతేకానీ మాదిగలనుగానీ, ఇతర దళిత కులాలను గానీ రాజ్యాధికారం సాధించే రాజకీయ కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయాయి. నిలబెట్టలేకపోయాయి. ఈ రెండు ఉద్యమాలకీ ఇటువంటి పరిమితులున్నాయి.

కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. దీని ద్వారా రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న మాదిగల ఓటర్లను ఆకర్షించాలని ఎత్తులు వేస్తోంది. టిఆర్ఎస్ వైపు ఉన్న మాదిగలను తనవైపు మరల్చుకోవాలని అనుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న మాదిగలను చల్లబరచాలని చూస్తున్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను కోల్డు స్టోరేజీలో పెట్టింది. ఎస్సీ రిజర్వేషన్లను ఎబిసిడి గ్రూపులుగా హేతుబద్ధీకరించకుండా ఉపముఖ్యమంత్రి పదవి తాయిలంతో మాదిగలను బుజ్జగించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది.

ఉపముఖ్యమంత్రికి సన్మానం చేసే టెండర్లను కూడా మాదిగలకు కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మొత్తం కోటి మంది మాదిగలు, దాని ఉపకులాల ప్రజలను బుట్టలో వేసుకోవాలని చూస్తోంది. ఇవన్నీ నిజాలు కావా? ఆధిపత్య కులాల పార్టీలకు, వాటి ప్రభుత్వాలకు ఊడిగం చేసే కొందరు మాదిగ నాయకుల వల్ల మాదిగలు ఇంకెంత కాలం మోసపోతారు? ఇవి ఈనాటి కారంచేడు స్ఫూర్తినందుకున్న మాదిగల నెత్తుటి ప్రశ్నలు. పద్దెనిమిదేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ ఇవే రాజకీయాలు చేసింది.

ఆనాడు కోనేరు రంగారావును కాంగ్రెస్ ప్రభుత్వం హోంమంత్రిని చేసింది. నిజాం కాలేజీ గ్రౌండ్‌లో సన్మానించింది. తర్వాత ఆయన ఉపముఖ్యమంత్రి కూడా అయ్యారు. మాదిగ కులం ముందుకు తెచ్చిన డిమాండ్ల సాధన విషయంలో కోనేరు కూడా ఏమీ సాధించలేకపోయారు. ఆ తర్వాతే ఎం.ఆర్.పి.ఎస్ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపాం. మాదిగలను మోసం చేసే అవే ఎత్తుగడలను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు చేస్తోంది.

మాదిగలు కేవలం ఎబిసిడిలు డిమాండు చేసినంతకాలం ఎబిసిడిలు సాధించుకోలేకపోవచ్చు. ఎందుకంటే, మాదిగలు ఆకాశాన్ని డిమాండు చేస్తే ఆధిపత్య కులాల ప్రభుత్వం భూమిని చూపెడుతుంది. మాదిగలు భూమిని డిమాండు చేస్తే, ప్రభుత్వం పాతాళాన్ని చూపెడుతుంది. అధికారం మనకు ఆకాశంతో సమానమైనది. రిజర్వేషన్లు భూమితో సమానమైనవి. ఐతే మనువాద ప్రభుత్వాలకు మన డిమాండ్లన్నీ పాతాళంతో సమానమైనవి. కనుక మాదిగలు, ఉపకులాల వారు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే రాజకీయాలు చెయ్యనంతవరకూ మనువాద ప్రభుత్వాలు ఎబిసిడిల దోబూచులాటలు ఆడుతాయనే సంగతి గుర్తుంచుకోవాలి. రాజ్యాధికార రాజకీయాల బరిలో మాదిగలు ఒక్కసారి గట్టిగా నిలబడితే ఎ నుంచి జడ్ వరకు అన్నీ సాధించుకోవడానికి మార్గం సులభతరమౌతుందని గ్రహించాలి.

ఓటింగ్ యంత్రం మీద మీట నొక్కే తమ చూపుడు వేళ్ళలోనే, ఓటు వెయ్యడానికి స్టాంపును చేతబుచ్చుకునే తమ గుప్పెళ్ళలోనే తమ సార్వభౌమాధికారశక్తి, రాజ్యాధికారశక్తి దాగి ఉందన్న సంగతిని మాదిగలు ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకోవాలి. ఐదేళ్ళకో, మూడేళ్ళకో ఆధిపత్య కులాల పార్టీలకు ఓట్లు వేసి, వారి ముందు వారి ప్రభుత్వాల ముందు మాదిగలు బికారులుగా మిగిలిపోయి నవ్వులపాలు అవుతున్నది నిజం కాదా? మన ఓట్లలోని అధికారం అగ్రకుల పెత్తందార్ల చేతుల్లో పెడుతున్నాం.

వారి ముందు వట్టి చేతులతో నిలబడిపోతున్నాం. బియ్యం వారికిచ్చి, గంజి అడుక్కుంటున్న చందంగా ఉంది. జనాభా దామాషా సూత్రం ప్రకారం అధికారం సాధించుకునే రాజ్యాధికార రాజకీయాలు చెయ్యటానికి మాదిగలు, అణగారిన కులాలు, జాతులు సిద్ధం కావాల్సిన సమయం ఇది. ఐడెంటిటీ ఉంచుకుంటూనే అలయెన్సు రాజకీయాల ఐక్యత కోసం కృషిచెయ్యాల్సిన కాలమిది. ఇందుకు కాన్షీరామ్ ఆచరించిన సిద్ధాంతాన్ని బూస్టర్‌గా ఉపయోగించుకుని మాదిగలంతా ఇపుడు రాజ్యాధికార రాజకీయ కక్ష్యలోకి ప్రవేశించాలి.

రాజ్యాధికారం కోసం మనువాద రాజకీయ పార్టీలతో పోటీపడగలిగితేనే మాదిగలు ఎబిసిడిల ఉట్టికొట్టగలరు. రాజ్యాధికార స్వర్గానికి ఎక్కగలరు. కారంచేడు ఉదంతాలు పునరావృతం కానీయని శక్తి పొందగలరు. కారంచేడు నెత్తుటి ప్రశ్నలకి జవాబులివ్వగలరు. కులమంతా రాజకీయంగా ఒక్కతాటిపైకి రావాలనే రాజకీయ పరివర్తన వచ్చిననాడే మాది గలు తమ తాత జాంబవంతుడి జంబూద్వీపంపై జెండానెగు రవేయగలరు. మాదిగ ఎల్లమ్మ రాజ్యానికి సువార్త ప్రకటిద్దాం. ఈ నిబద్దతతో కారంచేడు మృతవీరులకు నివాళులర్పిద్దాం.

- కృపాకర్ మాదిగ పొనుగోటి
వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి
(నేడు కారంచేడు దళితుల ఊచకోత దినం)

No comments:

Post a Comment