Sunday, September 4, 2011

గొంగడి మాటున మంట -గోసుల శ్రీనివాస్ యాదవ్ ANDHRA jYOTHI JUL 19/2011


గొంగడి మాటున మంట
-గోసుల శ్రీనివాస్ యాదవ్


ఇరవై లక్షల కుటుంబాలు, ఐదు కోట్ల గొర్రెలు, మేకలు; వెరసి ఏటా మార్కెట్లో వేల కోట్ల రూపాయల చెలామణి. అయినా ఇంత జనాభా ఉండి, ఇంత సంపద సృష్టిస్తున్న జాతికి నిలువ నీడ, రోగమొస్తే మందు, పిల్లలకు చదువు, ఆఖరుకు జీవనాధారమైన జీవాలకు నీళ్ళు, గాసం చూసే ఆప్తుడే లేడు. చేతిలో చిప్ప గొడ్డలి, భుజానికి గొంగడేసుకొని భార్యా పిల్లలను, జీవాలను తోలుకొని ఏటా వందలాది కిలోమీటర్లు మన్యం బాట పట్టే గొల్ల కురుమల గోడు నొల్లనంటుందీ సర్కారు.

జీవాలకు మందూ మాకు అందకపోవడం, వాటికి ఊరిలో తాగడానికి నీటి కుంటలు లేకపోవడం, మా పిల్లలకు చదువు లేకపోవడం, మా గొర్రె మేకల గాసాలకు ఇస్తామన్న భూములు కేవలం మ్యాపుల్లో సర్వే నెంబర్లుగా మాత్రమే కనిపించడం - వీటన్నిటికీ కారణాలేమిటి? అందరమూ కలసి అనుభవిస్తున్న దుష్పరిపాలన అంటే, అందరి దుఃఖంలో ఇదో కన్నీటి చుక్క అనుకునే వాళ్ళమే.

కానీ ఎప్పుడూ 'వాళ్ళే' అయి వుండటం వల్ల, మా జీవితాలని మేము ఏలుకునే అవకాశం అప్పుడప్పుడైనా దొరుకనప్పుడు, మా గుండెల్లో నరం దుఃఖంతో, కోపంతో మెలికలు తిరుగుతుంది. మేము కేవలం దుష్పరిపాలనకే కాదు, కులవివక్షకూ బాధితులమే. నిజానికి దుష్ట పరిపాలనకు కారణం కుల వివక్షే. ఎందుకంటే రాజ్యం వల్ల విజయవంతమైన పరిపాలన లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమౌతుంది? మా దగ్గరికొచ్చే సరికి సర్కారుకి చేయి పనిచేయదు.

మన దేశంలో పాజిటివ్ డిస్క్రిమినేషన్‌ను రాజ్యాంగబద్ధం చేశారు. సమానతను ఆదర్శం చేసిన రాజ్యాంగం చారిత్రకంగా అణగారిన కులాలకు, సామాజిక సమపాలనకూ ప్రత్యేక రిజర్వేషన్‌లు కల్పించిం ది. సమానతల్ని రూపు మాపడానికి మార్గం వేసింది. అందులో భాగ మే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు. 1962లో కాకా కలేల్కర్ కమిషన్ వెనుకబడిన తరగతుల క్రింద అనేక కులాలను చేర్చడమే కాకుండా వెనుకబాటుతనాన్ని సహితం నిర్వచించింది. అధికారంలో భాగస్వా మ్యం, పాలనా వ్యవస్థలో స్థానం లేకపోవడం వంటివి సామాజిక సమూహాల వెనుకబాటుతనానికి సూచికలుగా గుర్తించింది.

స్వతంత్ర భారత చరిత్రంతా వివక్షను, అసమానతల్ని పెంచి పోషించడమే గాని రాజ్యాంగంలోని సమానత ఆదర్శాన్ని నిలబెట్టడం కాదనేది అందరి అనుభవమే. గొల్ల కురుమలు దేశవ్యాప్తం. మా ప్రాథమిక వ్యాపకం సంచార జీవనం, పశుపాలన. మాలో ఎవరైనా వ్యవసాయం చేస్తే అ ది చరిత్రలో ఇటీవలి పరిణామమే. అది కూడా భుక్తి వ్యవసాయమే. మనరాష్ట్రంలో ఏ రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నా గొర్ల మంద, దాని వెనుక గొల్ల కురుమ కుటుంబం ఎక్కడో ఒక దగ్గర కనపడక మానదు.

మహబూబ్‌నగర్ నుంచి ఆదిలాబాద్, అంటే గోదావరితో కలిసి వందలాది కిలో మీటర్లు ప్రయాణం చేస్తాం. ఒక్క నారాయణపేట నియోజక వర్గం నుంచి ఏటా దాదాపు రెండు వేల కుటుంబాలు లక్షగొర్రెలను తోలుకుంటూ ఆరు వందల కిలో మీటర్లు ప్రయాణించి ప్రాణహితను చేరుకుంటాయి. మాది మన్యం బోయే జాతి.

ఎందుకు మన్యం బోతాం మేము? - గొర్రెలు, మేకలు మా జీవనాధారం. అవి బ్రతికితేనే మేము బ్రతుకుతాం. జీవాలు బ్రతకాలంటే గాసం కావాలి. జీవాల గాసం కోసం సంచార జీవనానికి బందీలైనాం మేము. గొర్రెలు మన్యానికి కదిలితే వాటి వెనుకే కుటుంబం మొత్తం వందలాది కిలోమీటర్లు బతుకీడ్చ వలసిందే. మన్యం బాటలోనే కోట్లాది గొర్రెల వెనుక లక్షలాది కుటుంబాలు, కుటుంబాల వెనుక మహిళలు, పిల్లలు కదలాల్సిందే. స్థిర జీవనానికి అందుబాటులో ఉండే సదుపాయాలు అంటే వైద్యం, విద్య ఏమీ మా వెంట నడిచి రావు. రాష్ట్రంలో ఐదు కోట్ల గొర్రెలు, మేకలు ఉన్నాయని, వాటికి గాసం భూములు లేవని ప్రభుత్వమే చెబుతుంది.

నిజానికి ప్రభుత్వం జి.వో.559 విడుదల చేసింది. 1994లో వచ్చిన ఈ జీ.వో. ప్రకారం ప్రతి గ్రామంలో గొర్రెల, మేకల పెంపకం దార్ల సొసైటీని స్థాపిస్తామని, ప్రతి సొసైటీ పేరున గాసం భూములు కేటాయించాలనీ వుంది. ఆ మేరకు ఒక కార్పొరేషన్‌ను సహితం ప్రభుత్వం స్థాపించింది. కానీ కార్పొరేషన్‌కు ఇప్పటి దాకా చైర్మన్ లేడు. కొన్ని సొసైటీలను మాత్రమే స్థాపించారు. ఎక్కడా ఒక గజం భూమి, గడ్డిపోస కూడా మాకు అందుబాటులోకి రాలేదు. పాలనా లోపమా? వివక్షా? ఎట్లా అర్థం జేసుకోవాలి?

పశు సంవర్థక శాఖ బాధ్యతలు - పశు సంతతిని వృద్ధి చేయడం, పశు పోషకులకు పశు వైద్యశాలలు అందుబాటులోకి తేవడం, పశుసంపద రక్షణకు బీమా లాంటి సౌకర్యాలు కల్పించడం.. ప్రతి వంద గొర్రెలు/మేకలకు గాను గొల్ల కురుమలు ఏడాదికి వైద్య ఖర్చులు, మందులకు గాను రూ.30 వేలు ఫ్రైవేటు ఫార్మా కంపెనీలకు ధారాదత్తం చేస్తారు. మొత్తం ఐదు కోట్ల గొర్రెలు మేకలు ఉన్నాయి. అంటే ఏటా దాదాపు 1500 కోట్ల రూపాయలను ఫార్మా కంపెనీలు జీవాల పేరు మీద దండుకుంటున్నాయి. ఐతే పశు వైద్యశాలలు ప్రభుత్వానివే. గొర్రెలకు ప్రభుత్వమే మందులందించాలి. అసలు అందుబాటులో ఉన్న పశు వైద్యశాలలు అంతంత మాత్రమే.

అన్నింటికీ మించి సంచారంలో ఉన్న జీవాలకు మందులు అందుబాటులోకి తెచ్చే సదుపాయం, వ్యవస్థ గురించి ఇంతవరకు ప్రభుత్వం ఆలోచించలేదు. ఫార్మా కంపెనీలు దండుకొంటున్న 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ఆలోచించకుండా చేస్తున్నాయన్నదే మా అనుమానం. మరో పార్శ్వమేమంటే ప్రతి ఏటా ప్రభుత్వ బడ్జెట్‌లో పశు వైద్యశాలలకు అవసరమయ్యే పరికరాలకు, మందులకు డబ్బు కేటాయిస్తారు. ప్రభుత్వం దేశంలోని అనేకానేక వైద్య పరికరాలను కొనుగోలు చేస్తున్నట్లు నివేదికలు ఉంటాయి.

మందులు కొంటున్నామని కంపెనీల పేర్లు, టెండర్లను ప్రభుత్వమే ప్రకటిస్తుంది. మరి మేము 1500 కోట్లు ఫార్మా కంపెనీలకు ఎందుకు పెట్టాల్సివస్తుంది? ఈ చక్రబంధంలోని వక్రమార్గమేమిటంటే రోగాన్ని బట్టి మందులమ్మరు. ఏ రోగానికైనా అందుబాటులోని మందులే కొనాలి. అసలు కొన్ని రకాల మందులు, కొన్ని రకాల కంపెనీలవే ఎందుకమ్మబడుతున్నాయన్నదే మా ప్రశ్న. అన్నింటికీ మించి ఇంత సర్కారు బడ్జెట్ ఉన్నది, ఇన్ని వైద్యశాలలున్నా ప్రతి ఏటా లక్షలలో మా గొర్రెలు ఎందుకు రోగాలొచ్చి చనిపోతున్నాయన్నది కూడా మా ఆందోళనే.

వైద్యం మాటటుంచి, గొర్రెలు చచ్చిపోతే నష్టపరిహారాన్ని ఇప్పించే సౌకర్యం కల్పించమని చెప్పి, గొర్రెల మీద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు ఐదు కోట్ల గొర్రెలలో కేవలం ఐదేళ్ళలో మొత్తం 46 లక్షల గొర్రెలకు మాత్రమే బీమా సదుపాయాన్ని కల్పించారు. ఈ లోగా గొల్ల కురుమలకు లక్షలాది గొర్ల ప్రాణ నష్టం జరిగింది. మా వాళ్ళు బీమా పాలసీ కడుతూ పోయారు. కానీ నష్టపరిహారం దగ్గరకొచ్చేసరికే ప్రభుత్వం, బీమా సంస్థలు రెండూ చేతులెత్తేసినాయి.

పులిమీద పుట్రలాగ సచ్చిన గొర్రెనకు వైద్యశాల డాక్టరు పంచనామా చేస్తే గానీ బీమా ప రిహారం అందదు. అత్యధిక శాతం గొర్రెలు మన్యంలో ఉంటాయి. కొండల్లో, గుట్టల్లో, తొవ్వల్లో, డొంకల్లో వాగుల్లో చచ్చే గొర్లకు పంచనామా ఎవరు చేస్తారు? నష్టపరిహారం ఎవరిస్తారు? కానీ మా గొర్రెల పేరు మీద ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి డబ్బులు దండుకుంటున్నాయి.

అమ్ముకునే ప్రతి గొర్రెకు గాను గ్రామ పంచాయితికి పది రూపాయలు పన్ను గట్టాలి. కట్టి జీవాన్ని కబేళాకు తోలుకుపోతే అక్కడ మా దగ్గర వసూలుకు ప్రభుత్వం తయారు! అమ్మే ప్రతి నూరు రూపాయలలో నాలుగు రూపాయలు కట్ట మంటుంది సర్కారు. కండ లేదు, బరువులేదు, రోగమొచ్చింది లాంటి విసుగుల్ని మా మొకాల మీద చిలుకరించి, రేటు తగ్గించి మా గొర్రెలను కొంటారు. ఏం గొంటారు, కొని వారేం దండుకుంటారో ఒకసారి చూద్దాం. ప్రాణమున్న జీవాన్నే అమ్ముతాము. కానీ కొనేవాళ్ళు గొర్రెను మాంసం లెక్కకే కొంటారు.

దాని తోలుధర మాకివ్వరు. తోలు అమ్మే మార్కెట్టే లాభపడుతుంది. కొన్ని రాష్ట్రాలలో గొర్రె ఉన్నిని సేకరించి మార్కెట్ చేసే సౌకర్యం వుంది. ఇక్కడ మన దగ్గర లేదు. కాబట్టి ఆదాయం తెచ్చి పెట్టే ఉన్ని, తోలు మాకు కాకుండా పోతుంది. జీవాల గాసానికి సర్కారిస్తామన్న భూములు లేవు. మన్నెంలో సచ్చే జీవాలకు పరిహారం లేదు. కుటుంబాలు మన్నెంలో వుంటే లక్షలాది కుటుంబాల్లోని మా పిల్లలు చదువుకు దూరమౌతున్నారు. సంచారంలో వున్న మాకు మందు మాకులు లేవు.

ఊర్లోకి వస్తే గొర్రెనకు పది రూపాయలు వసూలు చేస్తారు. మార్కెట్‌కు బోతే మాంసం కొని తోలు వసూలు జేస్తారు. ఇంటికి దూరమై, ఊరుకు దూరమై, చదువుకు దూరమై, మందులకు దూరమైన మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? సాంస్కృతికంగా చూడండి : ఎర్రి గొల్లోడంటారు; గేలి చేస్తుంటారు. ఓటర్లుగానే చూస్తారు. అధికారానికి ఆమడ దూరం వుంచుతారు. హక్కులే మైనాయి? కమిషన్లు ఏమైనాయి? జీవో లేమైనాయి? బడ్జెట్లే మౌతున్నాయి? మా జీవాలకు మందులేం కావాలో, ఎక్కడ కావాలో నిర్ణయించే ప్రక్రియల్లో, సభల్లో, సమావేశాల్లో మేంలేం.

మా జీవాల పేరు మీద చేస్తున్న కోట్లాది రూపాయల బీమా లావాదేవీల నిర్ణయాల్లో మేం లేం. మార్కెట్లో మా జీవాలను అమ్మే దాంట్లో మా మాట చెల్లదు. మా కుటుంబాలు మన్యాలకు పోతే, మా పిల్లలకు చదువెట్లా చెప్పాలో ప్రభుత్వాలు ఆలోచించవు. రాజకీయాధికారమే ఈ నిర్ణయాలన్నింటికీ గుత్తాధిపత్యం తీసుకున్నప్పుడు, మా బతుకుల్ని, మా జీవాల్ని, మా పిల్లల్ని, మా హక్కుల్ని కాపాడుకోవడానికి మాకు రాజకీయ అధికారం కావలసిందే. రాజ్యాధికారం దిశగా గొల్ల కురుమలు కదలాల్సిందే.

-గోసుల శ్రీనివాస్ యాదవ్
రాష్ట్ర కన్వీనర్, గొల్లకురుమ హక్కుల పోరాట సమితి

No comments:

Post a Comment