దళిత తత్వమంటే మానవత్వమే
మన కుల పోరాటం సామాజిక పోరాటం కావచ్చు. కులానికి న్యాయం జరిగితే అది కుల న్యాయం. అదే సమాజానికి న్యాయం జరిగితే అది సామాజిక న్యాయం. కుల న్యాయం సామాజిక న్యాయం కాదు. కానీ సామాజిక న్యాయం కుల న్యాయం కాగలదు. సమాజంలో ఉన్న అన్ని కులాలకు, వర్గాలకు సమ న్యాయం, సరి న్యాయం జరిగితేనే అది సామాజిక న్యాయం అవుతుంది. మనల్ని అవమానపర్చారని, అణచివేశారని ఇతరులను కూడా మనం కించపరచాలనుకోవడం అది సామాజిక న్యాయం కాదు. పాశవిక న్యాయం.
అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణలో నాటి నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. అవి సమ్మక్క సారలమ్మ, సర్వాయి పాపన్న కాడ్నించి బ్రిటిష్ వారిపై రోహిల్ల వీరుడు తుర్రెబాజ్‌ఖాన్ సాయుధ తిరుగుబాటు నైజాంను గడగడలాడించిన ఆదివాసీ పోరాట యోధుడు కొమురంభీం చేసిన పోరాటాలు. తరువాత వచ్చిన వీర తెలంగాణ సాయుధ పోరా టాలు ఇక్కడి ప్రజలకు పోరాట వారసత్వాన్ని ఇచ్చాయి. 1952 గైర్ ముల్కీ గోబ్యాక్, 1969 తెలంగాణ ఉద్యమం, విప్లవోద్యమాలతో పాటు ఎస్సీ వర్గీకరణ వంటి ఉద్యమాలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న తెలంగాణఉద్యమం కూడా తెలంగాణ ప్రజల పోరాట పటిమకు, స్వేచ్ఛా. స్వాతంవూత్యాల ఆకాంక్షకు నిదర్శనాలు.
నాటి నుంచి నేటి వరకు అనేక మోసాలు, ద్రోహాలు, అణచివేతలతో అల్లకల్లోలమైన తెలంగాణ ప్రజలు నేడు తిరగబడి రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమిస్తున్నారు. ఆత్మగౌరవం కోసం ఆత్మత్యాగాలు సాగుతున్నాయి. నాలుగున్నరకోట్ల ప్రజానీకం సమరం సాగిస్తున్నది. తెలంగాణ అనుకూల, వ్యతిరేక శక్తులను గుర్తించింది. వారి పట్ల స్పష్టత ఉంది. వారితో ప్రమాదాలను, లాభ-నష్టాలను బేరీజు వేసుకుంటే ఉద్యమాన్ని ముందుకు తీసుకునిపోవచ్చు. కానీ అనుకూలతతో వ్యతిరేకించే వారితోనే పెద్ద ప్రమాదం. వీరినే ‘అనుకూలవ్యతిరేక’ శక్తులుగా గుర్తించి వారిపట్ల అప్రమత్తతతో వ్యవహరించాలి. అందు లో స్వార్థపరులు, స్వార్థ రాజకీయ పార్టీలు, సొంత ఎజెండాలు, ఆధిపత్యం కోసం పాకులాడే వారి భావజాలాన్ని నిశితంగా పరిశీలించాలి, ప్రశ్నించాలి.
తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి అనేకమంది వివిధ రూపాల్లో వస్తుంటారు. ప్రజలను, ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి సర్కస్ ఫీట్లు వేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే గుర్తించారు. గతంలో ఎన్నోసార్లు బుద్ధి చెప్పారు. ఉత్తుత్తి రాజీనామాలకు పోటీపడి నేనంటే నేను అని ముందుకొస్తున్నారు. అసలు విషయానికి వచ్చే సరికి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తెలంగాణ ఉద్యమం కీలకదశకు చేరుకున్నది. ఈ దశలో జిత్తుల మారి నక్కలు, మేకవన్నె పులులు గజకర్ణ-గోకర్ణ విద్యలతో మన ముందుకు వస్తున్నారు. ఈ సమయంలోనే జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ మాదిగ దండోరా కోరుకుంటున్నది.
ఇప్పుడు అనేక కుట్రలకు రచనలు జరుగుతున్నాయి. ఆంధ్రా పెట్టుబడిదారులు తమ ఫాసిస్ట్ విధానాలకు తెర తీస్తున్నారు. ‘మన వేలితో మన కన్ను పొడిచే’ విధంగా కుతంత్రాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రా పెట్టుబడిదారులకు ఇక దింపుడు కల్లం ఆశనే మిగిలిం ది. ఈ దింపుడుకల్లంలో నాలుగు మూలలకు బియ్యం, పైసలు వేస్తారు. వాటి కి ఆశపడే వారు మనల్ని మోసం చేస్తారు జాగ్రత్తా! తెలంగాణ జిల్లాల్లో ఎన్నోపోరాటాలకు అన్నంపెట్టిన జాతి మాదిగజాతి. నాతల్లి పోరాటాన్ని-త్యాగాన్ని ఉగ్గుపాలతోనే రంగరించి పోసింది. నా తండ్రి ప్రతి అడుగు ధైర్యంగా వెయ్యమని చెయ్యిపట్టి నడిపించిండు. అందుకే ఆలోచించాల్సింది ధైర్యంగా కాదు ధర్మంగా, నైతికంగా, న్యాయంగా.
వర్గపోరాటాలు-కులపోరాటాలు వేరు. ఎప్పటికీ ఒకటి కాలేవు. వర్గ పోరా ట యోధుల స్ఫూర్తిని కుల పోరాటంతో పోల్చడం ఏ స్ఫూర్తికి నిదర్శనం. దాన్ని ప్రదర్శించే పెద్దలు ఈ దేశంలో ముందుగా వర్గాన్ని గుర్తించండి. ఆ వర్గాల్లో ఏ కులం లేదో ముందుగా తేల్చి చెప్పండి. అప్పుడు ఫలాన కులం ఈ వర్గానికి చెందింది అని చెప్పండి. దోపిడీ వర్గానికి ఏ కులం అతీతమో కూడా చెప్పండి. ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించిననాడే ఈ దేశ భవిష్యత్తు మారుతుంది. కులాన్ని అడ్డం పెట్టి ఎవరూ ఎవరి మీద దాడిచేసినా తప్పే. అవమానపరిచినా తప్పే. హరీష్‌రావు చందర్‌రావు మీద చెయ్యి చేసుకున్నది ఎందుకోసం? చందర్‌రావును కొడితే కోట్ల రూపాయలు వస్తాయని కాదు. ఎవరో పిలిచి పిల్లనిస్తరని కాదు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే ఆంధ్రా అహం మీద కొట్టాడు దెబ్బ. ఆ స్థానంలో ఆత్మాభిమానం ఉన్న ప్రతి మనిషి అదే విధంగా తిరగబడతారు. మనం మనుషులం. ఆ తర్వాతనే కులం.
హరీష్‌రావు మనిషిలాగా ఆలోచించాడు కాబట్టి ఆ విధంగా స్పందించాడు. ఆ తర్వాత కులం తెలిసింది కాబట్టి క్షమాపణ చెప్పాడు. ఆ స్థానంలో మందకృష్ణ మాదిగ ఉన్నా అదే పని చేసేవాడు. అంతకంటే ఎక్కువ చేసేవాడు. అదే చందర్‌రావు దళితుడు కాకుండా అగ్రకులస్తుడు అయితే మందకృష్ణ ఏ విధంగా స్పందించేవారో మేము అర్థం చేసుకోగలం. ఎందుకంటే గతంలో ఒక పత్రిక ‘బాడుగ నేతలు’ అనే శీర్షిక పేరుతో వార్త రాస్తే ఆ పత్రిక మీద దాడి ఏవిధంగా జరిగిందో?ఎట్లా కాల్చి వేశారో మనం చూశాం. ఆ పత్రిక మీద ఒక న్యాయం? చందర్‌రావుకు ఒక న్యాయమా? ఇదెక్కడి అన్యాయం? ఇది ఎవరి సిద్ధాంతం. మావోది కాదు, మార్క్స్‌ది కాదు, స్టాలిన్‌ది అంతకంటే కాదు.
చందర్‌రావు ముప్ఫై ఏళ్ల నుంచి ఏపీ భవన్‌లో మకాం వేసి పదవీ విరమణ చేసినా రెండుసార్లు పొడిగించుకున్నారు. ఢిల్లీలో ఉద్యోగం వెలగబెట్టే పెద్దమనిషి మానవత్వం మరిచి; బాధ్యతలను విస్మరించి ఆంధ్రా వెకిలి బుద్ధిని ప్రదర్శించాడు. అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీకైన ఈ దేశ పార్లమెంట్ ముందు యాదిడ్డి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆ అమరునికి జరగాల్సిన లాంచనాలు జరిపించకుండా స్మశానానికి తరలించి తగపూయ్యమని చెప్పడానికి చందర్‌రావు ఎవ్వరు? మానవ మర్యాదలు లేని చందర్‌రావు దళితుడు అయినందుకు సిగ్గుపడుతున్నాం. ఈ దేశంలో ప్రతి మనిషికి హక్కులు ఉన్నా యి. వాటిని కాలరాసే నైతికత మనకు ఎవరు ఇచ్చారు? చందర్‌రావుకు మానవహక్కులు ఉల్లంఘించాలని ఎవరు చెప్పారు? దాని వెనుక కుట్ర దాగి ఉంది. మోసం, దగా, దోపిడీ ఉంది.
దౌర్జన్యం ఉంది. మానవత్వాన్ని మంటగలిపిన చందర్‌రావుకు ఏ తత్వం ఉంది? ఏ సిద్ధాంతం ఉంది. దళితుడు అయినంత మాత్రానా మానవ శవాలను పశువులకంటే హీనంగా చూడాలని ఉందా? ఇది అహంకారానికి నిదర్శనం కాదా? దళితులకు మానవత్వం ఉండాల్సిన అవసరం లేదా? దళితులమైతే అగ్రవర్ణ శవాలమీద ఆగ్రహం చూపించాలా? మేధావులు, పెద్దలు, దళిత వర్గాల ప్రతినిధుల్లా రా ఆలోచించండి. అవమానించకండి. అవమానబాధలు, మన అనుభవాలు ఇతరులకు ఆపాదించి తృప్తి చెందకండి. అమానవీయంగా ప్రవర్తించిన చందర్‌రావు చర్యలను ఖండించండి.
చందర్‌రావును సమర్థించడం అమానవీయ మే. అందులో ముఖ్యంగా మాదిగలు అసలు సమర్థించకూడదు. ఎందుకంటే గతంలో ఇదే చందర్‌రావు ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడంలో కీలక పాత్రుడే. ఇప్పుడు తెలంగాణను అడ్డుకోవడంలో కూడా ఆయనది పెద్ద పాత్రే. సంకుచిత భావనతో భావ ప్రకటనలు ఉండకూడదు. తెలంగాణ మాదిగలుగా తెలంగాణ మాదిగ దండోరా సమన్యాయం, సరిన్యాయం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుంది.
మందకృష్ణ మాదిగ స్ఫూర్తితో సామాజిక కుల పోరాటాలతో పాటు వర్గకుల దృక్పథంతో రాజ్యాధికార పోరాటాలకు తెలంగాణ మాదిగలుగా ముందుకు సాగుదాం. మన కుల పోరాటం సామాజిక పోరాటం కావచ్చు. కులానికి న్యాయం జరిగితే అది కుల న్యాయం. అదే సమాజానికి న్యాయం జరిగితే అది సామాజిక న్యాయం. కుల న్యాయం సామాజిక న్యాయం కాదు. కానీ సామాజిక న్యాయం కుల న్యాయం కాగలదు. సమాజంలో ఉన్న అన్ని కులాలకు, వర్గాలకు సమ న్యాయం, సరి న్యాయం జరిగితేనే అది సామాజిక న్యాయం అవుతుంది. మనల్ని అవమానపర్చారని, అణచివేశారని ఇతరులను కూడా మనం కించపరచాలనుకోవడం అది సామాజిక న్యాయం కాదు. పాశవిక న్యాయం. అది ఏ సామాజిక పరివర్తకులు ఒప్పుకోరు. అది ఏ మహానుభావుల స్ఫూర్తి అంతకంటే కాదు. ఇలాంటి విషపూరిత సంక్లిష్ట పరిస్థితి నుంచి ఉద్యమాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ దళిత వర్గాలపై ఉన్నది.
ఎన్నిసార్లు ఆలోచించినా, మాట్లాడుకున్నా ఒక వాస్తవిక సత్యాన్ని చెప్పకతప్పదు. సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో కులం ప్రధాన పాత్ర పోషిస్తున్నది. కులాల, వర్గాల ఆధారంగా కాకుండా అంకిత భావంతో కష్టపడి పనిచేస్తున్న వారికి చేయూతనిస్తూ, ఉద్యమ రాజకీయాల పట్ల తర్ఫీదునిస్తూ, సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేసుకోవాలి. మూర్తీభవించిన రాజకీయ చైతన్యంతో విస్తృత పోరాటాలను నిర్మించుకోవాలి. వలసాంధ్ర కుట్రలను సమూలంగా కూకటివేళ్లతో పెకిలించాలి. తెలంగాణ అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర సాధన కోసం అంకుఠిత దీక్షతో ఐక్యంగా పోరాడుదాం.
-చింత స్వామి మాదిగ
తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు
No comments:
Post a Comment