Sunday, September 4, 2011

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు- సాటి లేని శంకరన్ Andhra Jyothi


సాటి లేని శంకరన్
-సంపాదకీయం
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు- అని ప్రజాకవి అందెశ్రీ రాసిన పాట, మనుషులలో మృగ్యమవుతున్న మానవవిలువల గురించిన ఆవేదన కావచ్చును కానీ, మంచి మనుషులు భౌతికంగా కూడా మాయమైపోతున్నారు. నిజాయితీకి, నిప్పులాంటి ఆచరణకీ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి మారుపేరుగా మెలగి న హక్కుల నేత కె.బాలగోపాల్ కన్నుమూసి ఏడాది అయిన సందర్భంగా శుక్రవా రం నాడు ఆయనను సగౌరవంగా కృతజ్ఞతతో ఇంకా ఆరని కన్నీళ్లతో సంస్మరించుకోబోతున్నాము. ఇంతలోనే మరో శిఖరం కూలిపోయింది.
జీవితాంతం దళితుల సంక్షేమం కోసం, పేదవారి అభ్యున్నతి కోసం తపన చెందుతూ, అధికార యంత్రాంగం అనే ఇసుము నుంచి సంక్షేమ తైలాన్ని పిండిన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ గురువారం నాడు అనారోగ్యంతో కన్నుమూశారు. సుమారు రెండు దశాబ్దాల కిందట రిటైరయ్యేదాకా ప్రభుత్వ సర్వీసులోనూ, ఆ తరువాత సామాజిక కార్యక్షేత్రంలోనూ తాను నమ్మిన ఆదర్శాల కోసమే పనిచేస్తూ వచ్చిన అరుదైన వ్యక్తి శంకరన్. ఆయన చేసిన కృషిని సవినయంగా స్మరించుకుని శ్రద్ధాంజ లి ఘటించేటప్పుడు- ఆయన వంటి వారు రాను రాను కరువవుతున్న వర్తమానం భయం కలిగిస్తున్నది.
కుటుంబం స్వార్థ చింతన కలిగిస్తుందని, తన ఆదర్శాలకు అవరోధం అవుతుంద ని పెళ్లే చేసుకోకుండా ఉన్న వ్యక్తి శంకరన్. ప్రశాసన నగర్ వైభవం చూసిన వారికి పంజాగుట్టలో శంకరన్ నివసించిన పాతకాలపు క్వార్టర్స్ చూస్తే చాలు ఆయనేమి టో అర్థమవుతుంది. బాలగోపాల్‌లో లాగే శంకరన్‌లో కూడా నిరాడంబరత, నిస్వా ర్థం వ్యక్తిత్వ విశేషాలే తప్ప, అవే వారి వ్యక్తిత్వ సారాంశాలు కావు. పరిస్థితులను మార్చాలన్న దృఢమైన, చైతన్యవంతమైన సంకల్పమే వారి వ్యక్తిత్వాలను అట్లా తీర్చిదిద్దింది.
సాంఘిక సంక్షేమ శాఖలో ఆయన పనిచేసిన కాలం- శంకరన్ యుగం. ఆయన హయాంలో జారీ అయిన అసంఖ్యాకమైన ఉత్తర్వులు శంకరన్ జీవోలు. అసలు ఆయన పేరే సోషల్ వెల్ఫేర్ శంకరన్. నేడు దళితులు అనేక రంగాలలో పొందుతున్న రాయితీలు కానీ, సహాయాలు కానీ శంకరన్ జీవోల ద్వారా సంక్రమించినవే. అత్యాచారాల నిరోధక చట్టం రూపకల్పనలోనూ, దానిని అర్థవంతంగా వినియోగించడంలోనూ ఆయన కృషి విశేషమైనది.
చట్టం అమలులో జిల్లా కలెక్టర్లకు క్రియాశీల పాత్ర కల్పించడం శంకరన్ ఆలోచనే. అత్యాచారాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కూడా ఆయన ప్రయత్న ఫలితమే. దళితుల సంక్షే మం కోసం శంకరన్ చేసిన కృషి అంతటిలోకి విశిష్టమైనది దళిత ఉపప్రణాళిక అమ లు. అట్టడుగుస్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ స్థాయి వరకు వ్యయంలో పదిహేను శాతం దళితుల కోసం వెచ్చించాలని ఆయన పోరాడి ఉత్తర్వులు సాధించారు. ఏజె న్సీ ప్రాంతాలలో పనిచేసినప్పుడు గిరిజన సంక్షేమం కోసం కూడా ఆయన అంతే పట్టుదలగా పనిచేశారు.
అయితే, గిరిజన సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన గిరిజనేతర అధికారులు అనేక మంది కనిపిస్తారు. కానీ, దళితుల కోసం ఇంతగా తపన పడిన దళితేతరుడైన అధికారి ఎవరంటే శంకరన్ పేరు మాత్రమే స్ఫురిస్తుం ది. గిరిజన రాష్ట్రం త్రిపుర అవతరించినప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించాలని వెదికినప్పుడు- దేశమంతటిలోనూ శంకరన్ ఒక్కరే యోగ్యుడిగా కనిపించారు. ఆయనలోని కార్యసాధకుడిని చూసే సుప్రీంకోర్టు శంకరన్‌ను ఆహారహక్కు కమిషనర్‌గా నియమించింది.
ఆహారహక్కును జీవించే హక్కులో భాగంగా పరిగణించి, దాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా శంకరన్ గుర్తించారు. ఆకలి నుంచి ప్రజలకు విముక్తి లభించి, వారు ఆత్మగౌరవంతో జీవించే వీలున్న సమాజా న్ని సృష్టించడమే రాజ్యాంగ కర్తవ్యమని, అందుకే తాను తపన పడుతున్నానని శంకరన్ చెప్పేవారు.
రాజ్యాంగంలో చెప్పిన ఆదేశిక సూత్రాలను కానీ, చట్టాలలో పొందుపరచిన రక్షణలను కానీ ప్రభుత్వాధినేతలు, యథాతథవాద బ్యూరోక్రాట్లు తేలికగా తీసుకోవ చ్చు. ఇరవయి సూత్రాల కార్యక్రమమో, పదిహేను సూత్రాల కార్యక్రమమో మభ్యపెట్టే ప్రయత్నం తప్ప పట్టింపుగా అమలు చేయనక్కరలేదని రాజకీయవాదులు భావించవచ్చు. శంకరన్ భారత రాజ్యాంగాన్ని, అందులో పొందుపరచిన లక్ష్యాల ను, ఆదర్శాలను సీరియస్‌గా తీసుకున్న అధికారి.
శాసనాల్లో చెప్పుకున్న సంక్షేమా న్ని ఆచరణలో ఎందుకు తీసుకురాలేమని పంతం పట్టి, అనేక చేదు అనుభవాలు ఎదురైనా సరే, పట్టువదలని నిజమైన సివిల్ సర్వెంట్ ఆయన. ఇరవయి సూత్రాల అమలులో భాగంగా వెట్టిచాకిరి నిర్మూలనను పటిష్టంగా అమలుచేస్తూ, అస్మదీయులకెవరికో ఇబ్బంది కలిగించారని ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కోపగించినప్పుడు, సెలవులో వెళ్లి తన ఆత్మాభిమానాన్ని, నిరసనను వ్యక్తం చేసిన వారు శంకరన్.
శంకరన్ వ్యక్తిత్వం, నిక్కచ్చితనం పేదప్రజలను ఎట్లాగూ ఆకర్షిస్తుంది. కానీ, ప్రభుత్వోద్యోగులలోనూ, సివిల్ సర్వీస్ అధికారుల్లోనూ ఆయనకు అభిమానులు అసంఖ్యాకం. ఆయన దగ్గర పనిచేసి, ఆయన మార్గంలో ఎంతో కొంత పనిచేయాలని కొందరైనా దళిత, దళితేతర అధికారులు ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు.
అయితే, కఠోర నైతికత, నిరాడంబర జీవనశైలిలో శంకరన్ దరిదాపుల్లో కూడా ఎవ రూ కనిపించరు. తన సామాజిక బాధ్యతను ఉద్యోగ ధర్మంతోనే ఆయన ముడిపెట్టుకోలేదు. ప్రభుత్వమూ నక్సలైట్ల మధ్య చర్చల కోసం ఆయన 'పౌరస్పందన వేది క' ద్వారా జరిపిన ప్రయత్నాలు విశేషమైనవి. నక్సలైట్లు 1987లో కిడ్నాప్‌చేసిన ఐఏఎస్ అధికారుల బృందంలో ఒకరిగా శంకరన్ ఆనాడు సంచలన వార్త అయ్యా రు. శంకరన్ వంటి అధికారిని కాపాడుకోవడం ప్రభుత్వానికి ఆనాడు అనివార్యమైంది.
శంకరన్ బృందానికి అపకారం తలపెట్టగలిగే సాహసం నక్సలైట్లూ చేయలేకపోయారు. కిడ్నాప్ చేసిన నక్సలైట్లు ఒక్కొక్కరుగా తరువాత కాలంలో ఎన్‌కౌంటర్లలో మరణించినప్పుడు శంకరన్ ఎంతో బాధపడ్డారు. నక్సలైట్ల మార్గంతో ఏకీభావం లేనప్పటికీ, మెరుగైన సమాజం కోసం ప్రయత్నిస్తున్న సాధకులుగా ఆయనకు వారిపై గౌరవం ఉండేది. అదే సమయంలో హింసా సంఘటనలను ఆయన వ్యతిరేకించేవారు.
శంకరన్ జీవితం, త్యాగపూరిత జీవితం వృథా కావని, ఆయన నుంచి కొందరైనా స్ఫూర్తి పొంది మంచితనాన్ని మిగుల్చుతారని ఆశిద్దాం

No comments:

Post a Comment