Sunday, September 4, 2011

కీర్తి పురస్కార తిరస్కరణ లేఖ ----జూపాక సుభద్ర, రచయిత


కీర్తి పురస్కార తిరస్కరణ లేఖ
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం
ఉపకులపతి గారికి,
మీరు నాకు ప్రకటించిన ఉత్తమ కవయిత్రి, కీర్తి పురస్కారాన్ని తిరస్కరిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రస్తుతం ఒక ప్రజాస్వామిక యుద్ధం నడుస్తున్నది. తెలంగాణలో కేంద్ర మిలటరీ బలగాల్ని దించి స్వంత రాష్ట్రం కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజలను అక్రమ అరెస్టులు, లాఠీ చార్జీ, బాష్పవాయువులతో భీతావహం చేస్తున్నారు. సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచి వేసే చర్యలకు పాల్పడుతున్నది . వేల బలిదానాల, ఆత్మత్యాగాల నెత్తుటిదారుల్లో రాజీనామాలు, అమరణ దీక్షలు, సమ్మెలు, హర్తా ళ్లు, ఆందోళనలతో తెలంగాణలో యుద్ధభూమి అయిన ఈ సందర్భంలో తెలంగాణ ఆకాంక్షకు, ఉద్యమానికి మద్దతునివ్వకుండా ‘కీర్తి’ పురస్కారాలు ప్రకటించి తెలంగాణ గడ్డమీదనే ఉత్సవాలు చేయడం మనస్థాపం కలిగించింది.
ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ దండోర ఉద్యమం, ఎస్టీల తుడుందెబ్బ ఉద్యమం, సంచార జాతుల, వెనుకబడిన కులాల రిజర్వేషన్ల కోసం ఎంబీసీ ఉద్యమం, మహిళా రిజర్వేషన్లు వికలాంగుల రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు నడుస్తున్న కాలమిది.
నిజానికి విశ్వవిద్యాలయాలు సమాజంలో ముందుకొచ్చిన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పంపకాల ఉద్యమాలను చర్చించాలి. వాటికి సానుకూల పరిష్కారాలను సూచించే మేధో వేదికలుగా ఉండాలి. కాని మీ తెలుగు విశ్వవిద్యాల యం ఇతర అన్ని అకాడమీలు తెలంగాణ మాదిగ దండోర, తుడుందెబ్బ, మహిళలు, దళిత మహిళలు, సంచారజాతులు, వికలాంగులు ముస్లిములు లేవనెత్తిన రాజకీయ డిమాండ్ల పట్ల మౌనంగా ఉంటున్నయి. పెద్దస్థాయిలో ప్రాణత్యాగాలతో ఉధృతంగా జరుగుతున్న వర్తమాన సందర్భంలోనూ మీ విశ్వవిద్యాలయం ఉత్సవాలు చేయడాన్ని, ఆయా వర్గాల ప్రజల ఆకాంక్షలకు మద్దతు తెలపకపోవడాన్ని తెలంగాణ బిడ్డగా , సామాజిక బాధ్యత కలిగిన రచయితగా నేను తీవ్రంగా నిరసిస్తున్నాను.
విశ్వ విద్యాలయాలు అకాడమీలు ఇచ్చే పురస్కారాలు సత్కారాలు అన్నింటిలో దళితులు ఆదివాసులు, బీసీలు, సంచార జాతులు, తెలంగాణ వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించటం లేదు. మనువాద కుల సమాజం లాగనే మమ్మల్ని మా జాతుల్ని పురస్కారాలకు దూరంగానే ఉంచారు. ఎంత ప్రతిభావంతులైనప్పటికీ, తెలంగాణ రచయివూతుల్ని, రచయితల్ని, కళాకారుల్ని ప్రాంతీయ వివక్షకు గురి చేస్తున్నారు. మీ తెలుగు విశ్వవిద్యాలయం మాగడ్డ మీద ఉండి మాకు మా చరివూతకు సంబంధం లేని పేరు పెట్టుకున్నది (పొట్టి శ్రీరాములు ) కనీసం ఆడిటోరియానికి కూడా మా ప్రాంత కళాకారుల పేరు లేదు. (ఎన్టీఆర్) మా తెలంగాణలో అనేక మంది గొప్ప రచయితలు, కళాకారులున్నా వారికి దక్కిన పురస్కారాలు చాల అరుదు. స్వతహాగా నేను పురస్కారాలకు వ్యతిరేకిని కాకపోయినప్పటికీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పాటిస్తున్న వివక్షలకు నిరసనగా, తెలంగాణ పోరు నడుస్తున్న యుద్ధభూమి నుంచి నాకు ఇచ్చిన కీర్తి పురస్కారాన్ని తిరస్కరిస్తూ ప్రదానోత్సవాన్ని బహిష్కరిస్తున్నారు.
-జూపాక సుభద్ర, రచయిత

No comments:

Post a Comment