హక్కులు అడిగితే అరదండాలు
ఎ మర్జెన్సీ వార్షిక దినాన కేవలం తమ రాజకీయ భావా ల కారణంగా ఖైదులో ఉన్న వారిని గురించి మాట్లా డుకోవడం ఉచితంగా ఉంటుంది. చాలామందే ఉన్నారు గానీ, ఎక్కువగా చర్చకు రాని ఒక బందీ అస్సాంకు చెందిన లచిత్ బోర్దలాయ్. అతన్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 9న తూర్పు అస్సాం నుంచి గౌహతికి బస్సులో వస్తుండగా దింపి, అరెస్టు చేశారు. ఆ రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అతని పైన తీవ్ర అభియోగాలతో కేసులు పెట్టారు. అన్ని కేసు ల సారాంశం, అతనికి ఉల్ఫా (యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం)తో సంబంధాలున్నాయనేది. చివరికి జాతీయ భద్రతా చట్టం (నాసా) కింద వారంటు జారీ చేశారు.
ఆ వారంటును నాసా కింద నెలకొల్పిన సలహా మండలి (అడ్వై జరీ బోర్డు) ఓకే చేసింది కాబట్టి అతను ఇంకొక్క సంవత్సరం జైలులో ఉండబోతాడు. అతని పైన ఒకరిని కొట్టాడన్న అభియోగం లేదు. ఒక బాంబు దొరికిందన్న ఆరోపణ లేదు. ఒక హత్యతో గానీ రైలు పట్టాల పేల్చివేతతో గానీ సంబంధం ఉందన్న నింద లేదు. భారత ప్రభుత్వాన్ని కూలదోయడానికీ భారత ప్రభుత్వం పైన యుద్ధం చేయడానికీ ఉల్ఫాతో కలిసి కుట్ర చేశాడన్నది అతని పైన అభియోగం. ఉల్ఫాతో 'ఆక్షేపణీయ మైన సంబంధాలు పెట్టుకున్నాడ'ని మీడియా కూడ అతని గురించి రాసింది.
పెట్టుకున్నాడనుకున్నా, ఆక్షేపణీయమైన సంబంధమే అయి నా, అది నేరం ఎట్లా అయిందో? లచిత్ బోర్దలాయ్ రాజకీయభావాల గురించి మళ్లీ మాట్లా డుకుందాంగానీ, ఇప్పుడు మూడేళ్ళుగా అతను ప్రధానంగా కృషి చేస్తున్నది శాంతి సాధన కోసం. ఈశాన్య భారత రాష్ట్రా లలో -అందులో భాగంగా అస్సాంలో- అనేక సాయుధ పోరాటాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతం ఎన్నో జాతులకు నిలయం. అందులో చాలా వాటి భాషా సంస్కృ తులు భారత 'ప్రధాన స్రవంతి'కి భిన్నమైనవి. వైష్ణవ మత ము, దానితో బాటు బెంగాలీ భాషా సంస్కృతులు ప్రసార మైన మేరకే అవి 'భారతీకరణ' చెందాయి. అది అస్సామీ లలో అత్యధికంగా, నాగా, మిజో జాతులలో అత్యల్పంగా జరిగింది.
ఈ జాతులలో కొన్ని 'మాకు ఇండియాతో ఏం సంబంధం?' అన్న ప్రశ్నతో స్వతంత్ర అస్తిత్వం కోరుకుంటు న్న సంగతి తెలిసిందే. అయితే స్వతంత్రం కోరుకున్నా, ప్రత్యేక రాష్ట్రం మాత్రమే కోరుకున్నా, కేవలం ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కోరుకున్నా, అన్ని జాతులలోనూ సాయుధ పోరాట సంస్థలున్నాయి. అవెందుకనే ప్రశ్నకు జవాబు సులభంగా దొరకదుగానీ ఈశాన్య భారతంలో అడుగడుగునా సాయుధ పోరాటాలు నడుస్తున్న సంగతి సత్యం. ఇంగ్లండ్ నుంచి ఇండియా అరువు తీసుకున్న ప్రజాస్వా మ్య నమూనా దేశ 'ప్రధాన స్రవంతి'లో అన్నీ కాకున్నా కొన్ని ఆకాంక్షలకు జవాబు చెప్పగలిందేమోగానీ, దానికి వెలుపల ఉన్న ఈ ఆకాంక్షలను తనలో ఇముడ్చుకోలేక పోయింది.
డబ్బులు వెదజల్లి అవకాశవాదులను తయారుచేసుకోవడం, సైన్యాన్ని దించి అణచివేత ప్రయోగించడం, వల్లగానప్పుడు చర్చలకు ఆహ్వానం పంపడం ఆ ప్రాంతంలో పాలనా విధా నంగా ఉంది. దీనివల్ల ఆ ప్రాంత ప్రజా జీవితంలో అశాంతి, హింస, భయం ప్రధాన విషయాలుగా ఉన్నాయి. లచిత్ బోర్దలాయ్ వంటివారు చాలామంది ఈ స్థానిక జాతీయవాదం పట్ల ఆకర్షితులయి దానికి అనుగుణంగా తమ కార్యాచరణను మలచుకున్నారు. భారత పాలకులు మర్యాద గా అడిగినదేదీ ఇవ్వక పోగా కనీసం చెవి ఒగ్గరు కాబట్టి ఆయుధాలు పట్టుకోవడం అనివార్యమనీ నమ్మారు. తాము ఆయుధం పట్టుకోకపోయినా, ఏ హింసకూ పాల్పడక పోయి నా సాయుధరూపం తీసుకున్న జాతిపోరాటాల ఆలోచనల కు బాహాటంగానే మద్దతు ఇచ్చారు.
ఆ పోరాటాల స్ఫూర్తిని నిలబెట్టడం తమ కర్తవ్యంగా భావించారు. దానిని అణచడా నికి ప్రభుత్వం అనుసరించిన విధానాలను వ్యతిరేకించే కర్త వ్యాన్నీ మీద వేసుకున్నారు. లచిత్ ప్రత్యేకించి ఈ కార్యరం గాన్నే ప్రధానంగా ఎంచుకున్నాడు. అస్సాంలో పనిచేస్తున్న 'మానవ్ అధికార్ సంగ్రాం సమితి' (మాస్)అనే మానవ హక్కుల సంస్థ ప్రధాన కార్యదర్శిగా కొంతకాలం పనిచేశాడు. ప్రస్తుతం ఆ సంస్థ సలహాదారుగా ఉన్నాడు. అయితే కాలక్రమంలో లచిత్ వంటి వారికి ఈ హింసా ప్రతిహింసలు తమ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయ నీ రాజకీయ పరిష్కారానికి ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టడం ప్రజల శ్రేయస్సు దృష్ట్యా చాలా అవసరమనీ తోచింది.
ప్రభు త్వం గౌరవప్రదమైన రాజకీయ పరిష్కారానికి సిద్ధపడితే సాయుధ పోరాట సంస్థలను కూడా ఆ దిశగా ఆలోచించేట ట్టు చేయడం సాధ్యమని వారు నమ్మారు. 2005లో పౌర సమాజానికి చెందిన 27 సంస్థలతో 'అస్సాంలో శాంతి ప్రక్రి య కోసం ప్రజా కమిటీ' (పిసిపిఐఏ) అనే వేదిక ఏర్పడింది. ఈ వేదిక ఏర్పాటులో లచిత్ పాత్ర ప్రధానమైనది. సాయుధ పోరాట సంస్థలతో ప్రభుత్వం రాజకీయ చర్చలు జరపాలని ఆందోళన చేయడం ఈ వేదిక లక్ష్యం. ఈ క్రమంలో ఉల్ఫాతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమయింది.
ఉల్ఫా తరపున చర్చలలో పాల్గొనే ప్రతినిధి బృందాన్ని నియమించమని ప్రభుత్వం కోరగా ఆ సంస్థ ఒక బృందాన్ని నియమించింది. అందులో ఇందిరా గోస్వామి అనే ప్రముఖ రచయిత్రితో బాటు లచిత్ కూడ ఉన్నారు. ప్రజా సంప్రదింపుల బృందం (పీపుల్స్ కన్సల్టేషన్ గ్రూపు) అని పిలవబడుతున్న ఈ బృందానికి లచి త్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇరు పక్షాలనూ ఒక దగ్గరికి తెచ్చి చర్చలు జరిగేటట్టు చూడడానికి ఈ బృందం శాయ శక్తులా కృషి చేస్తున్నది. అయినప్పటికీ ఆ చర్చల ప్రక్రియ సంక్షోభంలో పడింది. దాదాపు ఆగిపోయిందనే చెప్పాలి. దీనికి ఎవరు బాధ్యులనేది ఇక్కడ అప్రస్తుతం. లలిత్ మాత్రం బాధ్యుడు కాడు.
అతను చైర్మన్‌గా ఉన్న ప్రజాసంప్రదింపుల బృందానిదీ బాధ్యత కాదు. అయితే చర్చల ప్రకియ సంక్షోభంలో పడిన తరువాత లచిత్ బోర్దలాయ్‌కి ఉల్ఫాతో సంబంధాలన్నాయని ప్రభు త్వం కనుక్కుంది. అతని పైన కేసుల మీద కేసులు పెట్టి చివ రికి నాసా వారంటు జారీ చేసింది. ఉల్ఫా ఒక సాయుధ ముఠా కాదు. సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్న రాజకీయ సంస్థ. దాని సాయుధ కార్యకలాపాలతో సంబంధం గానీ వాటిలో భాగస్వామ్యంగానీ లేకుండ, రాజకీయ భావసారూ ప్యత ఉన్న కారణంగాగానీ, సామీప్యత ఉన్న కారణంగా గానీ ఉల్ఫాతో రాజకీయ సంబంధం ఏదో ఒక రూపంలో అస్సామీ సమాజంలో చాలా మందికి ఉంటుంది.
'ఉల్ఫాతో సంబంధా లు ఉన్నాయి' అనే నిందాత్మకమైన ప్రయోగం ఈ తేడాను చెరిపేస్తుంది. సంబంధాలు ఉండటం అంటే హింసాకాండలో భాగస్వామ్య మేనన్న అభిప్రాయం కలిగిస్తుంది. ఆ నింద వేసి కేసులు పెట్టి జైలులో పారేస్తే అది శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా జరిగిందని విచక్షణ ఎరుగని వారు అనుకోవాల న్నది దాని వెనుక ఉన్న ఉద్దేశం. రాజకీయ చర్చలు కాంక్షనీ యం అని ప్రభుత్వం భావించినప్పుడు ఉల్ఫాను ఒక రాజకీ య సంస్థగా గుర్తించినట్టు కాదా? మీ ప్రతినిధి బృందాన్ని పంపండి అన్నప్పుడు ఉల్ఫాతో రాజకీయ సంబంధాలున్న వారు అస్సామీ సమాజంలో ఉన్నట్టు గుర్తించినట్టు కాదా? అది రాజకీయ పరిష్కారానికి ప్రయోజనకరం అని గుర్తించి నట్టు కాదా? ఇప్పుడది నేరం ఎట్లా అయింది? సమస్య ఎక్కడొస్తుందంటే మిలిటెంట్ పోరాటాలతో చర్చ లు జరిపే విషయంలో ప్రభుత్వాలు ఎప్పుడూ ఒక గొంతుతో మాట్లాడవు.
రాజకీయంగా పరిష్కరించుకోవాలన్న విజ్ఞత గల వర్గం ఒక పక్కన ఉండగా, చర్చల ప్రక్రియ సాయుధ పోరాట సంస్థలు బలపడడానికే దోహదం చేస్తుందనీ, అదే అందులోని 'హిడెన్ అజెండా' అనీ నమ్మే వర్గం ఒకటి పాలనా యంత్రాంగంలో ఉంటుంది. ఇందులో పోలీసులూ సైన్యమూ ముఖ్యులు. ప్రజాభిప్రాయం ఎప్పుడూ రాజకీయ పరిష్కారం వైపే ఉంటుంది కాబట్టి వీళ్లు మొదట్లో మౌనం పాటిస్తారు. చర్చలను సాగనిస్తారు. అయితే ఎక్కడెక్కడ ఆ ప్రక్రియను సంక్షోభంలో పడేయొచ్చో చూసి దెబ్బవేస్తారు. చివరకు అది (ఎవరి తప్పు వల్లనైనా గానీ) సంక్షోభంలో పడ్డప్పుడు రంగం లోకి వేగంగా దిగుతారు. చర్చల ప్రక్రియలను ఇంక అసాధ్యం చేయటమే కాదు, దాని ప్రతిష్ఠను కోలుకోలేనంతగా దిగజా ర్చాలని చూస్తారు.
లచిత్ బోర్దలాయ్ ఉల్ఫాతో కలిసి హింసా త్మకచర్యలకు కుట్ర చేశాడని కేసులు పెట్టడం ఈ క్రమంలో భాగంగా జరిగినదే. ఉల్ఫా నడవడికలోనూ, ఆ నడవడిక విషయంలో లచిత్ వంటి ప్రజాతంత్రవాదులు మౌనం పాటించిన వైనంలోనూ ఈ కుట్రకు దోహదం చేసిన విషయాలేవీ లేవని కాదు. నిరా యుధులయిన సామాన్య పౌరులుపైన హింస ప్రయోగించే విషయంలో ఉల్ఫా దేశంలోని మిలిటెంట్ సంస్థలన్నిటిలోకి అగ్రభాగాన నిలుస్తుంది. ఆ రకమైన హింసాకాండను లచిత్ గానీ అతను నాయకునిగా ఉన్న హక్కుల సంఘం 'మాస్' గానీ ప్రశ్నించకపోవడం వారి విశ్వసనీయతకు దెబ్బే.
సాయు« ద పోరాట రాజకీయాలను కూడ రాజకీయాలుగా చూసి వాటితో రాజకీయంగా వ్యవహరించాలనడం వేరు, వారి సాయుధ చర్యలు అన్యాయమైన రూపం తీసుకున్నప్పుడు కూడ మౌనంగా ఉండడం వేరు. ఈ తప్పు, నిర్బంధాన్నే ఏకైక పరిష్కార మార్గంగా ఎంచుకున్న వారి ఎత్తుగడలకు బలం చేకూరుస్తుందన్న స్పృహను ప్రజాతంత్ర వాదులు తప్పనిసరి గా దృష్టిలో ఉంచుకోవాలి. ఇది ప్రజాతంత్ర ఉద్యమం ఆంత రంగిక విమర్శ లేక ఆత్మ విమర్శ. దీని అర్థం ఈ లోపాన్ని ఆస రా చేసుకొని ప్రజాతంత్ర రాజకీయ ప్రయత్నాలనే అసాధ్యం చేసే పోలీసు, సైనిక సంస్థల కుతంత్రాన్ని గురించి ఏమీ చేయ లేమని చేతులెత్తేయాలని కాదు.
- కె. బాలగోపాల్ వ్యాసకర్త
'మానవహక్కుల వేదిక' రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
No comments:
Post a Comment