Sunday, September 4, 2011

విశృంఖల విద్యా వ్యాపారం - సిలువేరు హరినాథ్ రీసెర్చ్ స్కాలర్, సెంట్రల్ యూనివర్శిటీ 15/6/2011



'తరగతి గదుల్లోనే దేశభవిష్యత్ రూపుదిద్దుకుంటుందన్నాడు' మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కానీ, ప్రస్తుత విద్యావ్యవస్థ స్థితిగతులు విద్యార్థుల భవిష్యత్‌కు తరగతి గదికి వెలుపలే సమాధి కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ రక్కసి విసురుతున్న మాయలవలకు మధ్యతరగతి ప్రజాజీవనం విలవిలలాడుతున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు చేస్తున్న జిమ్మిక్కులు అన్నీ, ఇన్ని కావు. ఒకవైపు ప్రభుత్వ విద్యావ్యతిరేక విధానాలే వీటికి పెట్టుబడిగా మారుతున్నాయి. ఎస్ఎస్‌సి, ఇంటర్ పరీక్షల ఫలితాల్లో కార్పొరేట్ ర్యాంకుల ముందు ఎప్పటిలాగే ప్రభుత్వ విద్యాలయాలు కుదేలవుతున్నాయి.

కార్పొరేట్ ఫలితాల దరిదాపుల్లోకి కూడా చేరలేకపోతున్నాయి. కార్పొరేట్ ఎడ్యుకేషన్ హంగులు, ఆర్భాటాలు సామాన్యున్ని ఇరకాటంలోకి నెడుతున్నాయి. అందుకోలేని ఆశల నడుమ విద్యార్థుల కంటే ముందు తల్లిదండ్రులు ఢీలా పడిపోతున్నారు. ఫీజుల పేరుతో రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాపారం వేలకోట్ల టర్నోవర్ దాటుతున్నది. కార్పొరేట్ కాలేజీలు క్వాలిటీ విద్య పేరుతో నర్సరీ నుండి మొదలు ఇంటర్ వరకు ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

గత దశాబ్దంలో కార్పొరేట్ విద్య అంటే ర్యాంకుల కోసం రాచిరంపాన పెట్టేవనే నిజం వెలుగుచూసింది. విద్యార్థులను మనుషుల్లా కాకుండా ర్యాంకులు సంపాదించిపెట్టే మరయంత్రాలుగా మార్చే దారుణం పట్ల విద్యార్థి సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో కార్పొరేట్ విద్యాసంస్థలు తమ రూటు మార్చుకొని, ఈ దుర్మార్గానికి "ఆహ్లాదకరమైన వాతావరణంలో అధునాతన విద్య'' అనే కొత్త నినాదాన్ని తలకెత్తుకున్నాయి.

అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ధనబలంతో చేజిక్కించుకొని వాటి ఎరచూపి డబ్బులు పిండుకుంటున్నాయి. ఈ దుర్మార్గాన్ని అరికట్టడానికి ప్రభుత్వం వద్ద సరైన విధానం లేకపోవడమే అందుకు కారణం. విచ్చలవిడిగా పర్మిషన్‌లు ఇవ్వడంతో పాటు, ఫీజుల క్రమబద్దీకరణ విషయంలో ఎలాంటి నియంత్రణను పాటించడంలేదు. దాంతో కార్పొరేట్ విద్యాలయాలు చదువును వేలంపాటకు పెట్టే విక్రయకేంద్రాలుగా మారుతున్నాయి.

ప్రతీయేడాది అమెరికన్ ప్రభుత్వం కూల్‌డ్రింక్స్ మీద కేటాయించే బడ్జెట్‌ను, భారత ప్రభుత్వం విద్యావ్యవస్థ కోసం కేటాయించలేకపోతున్నది. 11వ పంచవర్ష ప్రణాళికలో విద్య, శాస్త్రసాంకేతిక రంగాలకు పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం ఆ మాట ను నిలబెట్టుకోలేకపోతున్నది. దాంతో అస్థవ్యస్థంగా ఉన్న ప్రభుత్వ విద్యావ్యవస్థ ఆశించిన పురోభివృద్ధిని సాధించలేకపోతున్నది. దీంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు కుంటుపడుతున్నాయి.

భారతదేశంలో ఉన్నత విద్యలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థానంలో ఉండటం హర్షించదగ్గ విషయం. కానీ, విద్యావ్యాపారంలో కూడా ఇతర రాష్ట్రాల కంటే అగ్రస్థానం దక్కించుకోవడం గర్హమానం. సాంకేతిక విద్యారంగానికి నాంది పలికిన హరితాంధ్రప్రదేశ్ పోటీ ప్రపంచంలో మరో అడుగు ముందుకువేసి విద్యను ప్రైవేటుపరం చేసి పూర్తిస్థాయి వ్యాపారవస్తువుగా మార్చివేసింది. కార్పొరేట్ విద్యాసంస్థలు కోట్లాదిరూపాయలు దోచుకునే పనిలో పడ్డాయి.

దీంతో తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనుకుంటున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోతున్నాయి. పాకిస్తాన్, కెనడా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాల్లో రోజుకు ఒక డాలరు సంపాదించే పేదవర్గాల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలు విద్యను అందుబాటులో ఉంచాయి. అంతేకాకుండా మన దేశంలోని మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ప్రైవేటు విద్య అణగారిన వర్గాలకు అందిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రైవేటు విద్యాసంస్థలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.

రాష్ట్రంలో దాదాపు 18వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలున్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతం, సెమీ అర్బన్ ఏరియాల్లో ఉన్న పాఠశాలలు ఎ, బి, సి కేటగిరీలుగా విభజించి ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు నిర్ణయిస్తున్నాయి. భాగ్యనగరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో అడ్మిషన్ దొరకడమే గగనంగా మారింది. టాప్-50 పాఠశాలల్లో నర్సరీలో అడ్మిషన్ కోసం లక్షరూపాయల నుండి 4 లక్షల వరకు ఫీజులు గుంజుతున్నారంటే పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అంతేకాకుండా నిరక్షరాస్యులైన తల్లిద్రండుల పిల్లలకు కొన్ని పాఠశాలల్లో కనీసం అడ్మిషన్ ఇవ్వకుండా అనర్హులుగా ప్రకటిస్తున్నాయి. అధికఫీజులు వసూలు చేసే కార్పొరేట్ విద్యాసంస్థలు తొలుత విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్, రంగారెడ్డి, తిరుపతి లాంటి ప్రధాన పట్టణాలకే పరిమితమైనాయి. కానీ రానురాను రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీల పేరుతో విప్తరించాయి. అప్పటికే స్థాపించిన పాఠశాలలకు అనుబంధంగా ఐఐటి, ఒలంపియాడ్, ఇంటర్ నేషనల్ స్కూల్, ట్యాలెంట్, టెక్నో, మోడల్, కాన్సెప్ట్, ఇ-స్కూల్స్ లాంటి ఆకర్షణీయమైన పేర్లు తగిలించుకుని అటు తల్లిదండ్రులను, ఇటు విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నాయి.

ఈ పేర్లు ఉన్న స్కూళ్ళు సంవత్సరానికి 75వేల నుండి లక్షాయాభై వేల రూపాయలు ట్యూషన్ ఫీజుల పేర వసూలు చేస్తున్నాయి. ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంతగొప్ప స్కూల్ అనే భ్రమను కలిగిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా వీటివైపే మొగ్గుచూపుతున్నారు. 50 శాతానికి పైగా పాఠశాలలు గోబెల్ ప్రచారం చేసుకుంటూ పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థిని తీర్చిదిద్ది చదువును అందిస్తున్నామన్న పేరుతో పక్కా వ్యాపారం చేస్తున్నాయి.

ఫీజుల వసూళ్ళపై నియంత్రణ లేకపోవడంతో పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రైవేటు యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసి జిల్లా అధికారులకు బాధ్యతలు అప్పగించింది. దీనికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా ఆడిట్ అధికారి సభ్యులుగా (జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీని) ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ పాఠశాలలను సందర్శించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేది. కానీ ప్రభుత్వం విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం 1983కు సవరణ చేయడం ద్వారా కొత్త జీవోను తీసుకొచ్చి వీటి కోరలను పీకేసినట్లయింది. ప్రైవేటు ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం రెండు నెలల కాలంలోనే 91, 92, 93 జీవోలు జారీచేసింది. గత సంవత్సరం జనవరి 5న మరో జీవోను 94 జారీ చేయడం ద్వారా అసలు ఫీజుల నియంత్రణే లేకుండా పోయింది.

మరోవైపు ప్రభుత్వం ఉన్నత విద్యకు కోట్లాది రూపాయలు వెచ్చించినా ఫలితం లేకుండా పోతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యానైపుణ్యాలు సరిగా లేకపోవడం ద్వారా అనేక మంది మధ్య తరగతి, నిరుపేదలు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న విద్యపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడం ద్వారానే ప్రైవేటు విద్యవైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ టీచర్లు తమ వృత్తికి న్యాయం చేయలేకపోతున్నామనే విమర్శలు వారే బహిర్గతం చేయడం ద్వారా ప్రభుత్వ విద్య దుస్థితికి అద్దం పడుతుంది.

నూతన ఆర్థిక విధానాల పుణ్యమా అని దేశంలో ప్రైవేటు భూతం కోరలు చాచిన తర్వాత విద్య సరుకుగా మారిందనేది పాతమాటగా మారింది. చిన్నచిన్న కిరాణాషాపులను రిలయన్స్ ఫ్రెష్‌లు, సూపర్ మార్కెట్లు కొల్లగొట్టినట్లు బడా కార్పొరేట్ కాలేజీలు, అప్పటివరకు నామమాత్రపు ఫీజులతో విద్యను అందించిన ప్రైవేటు కళాశాలలను తిమింగలాల తీరుగా మింగి కూర్చున్నాయి. ప్రతీయేడాది వేసవికాలంలో పరీక్షల ఫలితాలు వెలువడ్డాయో లేదో సొంతడబ్బా కొట్టుకోవడానికి కోట్లాదిరూపాయలు ఖర్చుపెడుతున్నాయి.

గ్రామీణ, సెమీ అర్బన్‌కు చెందిన మధ్యతరగతి కేంద్రంగా ఉచ్చుబిగిస్తున్నాయి. టీవీలో వచ్చే వాణిజ్య ప్రకటనలు చూసి, పదే పదే మోసపోయినట్టు ఇప్పుడు రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులను కదిలించాన ఈ దారుణాలే కథలుకథలుగా వెలుగుచూస్తున్నాయి. పైపై మెరుగులకు ఈస్ట్‌మన్ కలర్‌లను అద్ది, అందాల మాటున కాసుల దాహాన్ని తీర్చుకుంటున్నాయి. పాలకులు ప్రజల ఇబ్బందిని కనీసం పట్టించుకోకపోగా కార్పొరేట్ దొరల కొమ్ముకాస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుతం స్పందించి దొడ్డిదారిన విద్యావ్యాపారం చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలకు కళ్ళెం వేసి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే విద్యాహక్కుకు భంగం వాటిల్లి విద్య అనేది కేవలం సంపన్న వర్గాల చేతిలో బంధీగా మారుతుంది. త్వరలోనే ప్రభుత్వం ప్రజల నుండి ఫీజుల పరంగా భారీ వ్యతిరేకతను చవిచూడనున్నది. కార్పొరేట్ విద్యను, ఫీజులను అదుపులో ఉంచే విధానాల గురించి ప్రభుత్వం, విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజాశ్రేయస్సును కోరుకునే వర్గాలు ఆలోచించాల్సిన సందర్భం ఆసన్నమైంది.

- సిలువేరు హరినాథ్
రీసెర్చ్ స్కాలర్, సెంట్రల్ యూనివర్శిటీ

No comments:

Post a Comment