Sunday, September 4, 2011

కనుమరుగవుతున్న ఆదివాసీ తెగలు-----మైపతి అరుణ్‌కుమార్ Jul 17/2011


దేశంలో, రాష్ట్రంలో ఆదివాసుల సమస్యులు అన్నీ ఇన్నీకావు.నిత్యం జీవనపోరాటంలో మునిగిఉండే గిరిపువూతుల మనుగడకే ముప్పు వచ్చింది. అభివృధ్ధి ప్రాజెక్టులపేర ఆదివాసులజీవితాలను ఛిద్రం చేస్తున్నారు.మైనింగ్ పేరిట ఆదివాసులను నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. పాలకుల విధానా ల ఫలితంగా.. ఆదివాసీ తెగలు అంతర్ధానమయ్యే పరిస్థితి వచ్చింది.

అడవినే కన్న తల్లిగా భావిస్తూ.. తరతరాలుగా.. తమదైన జీవనం చేస్తు న్న గిరిజనుల జీవనం.. సమస్యల వలయం. ఆర్థికంగా.., రాజకీయంగా , విద్యా, ఆహార ఆరోగ్యపరంగా.. మిగతా వర్గాలతో పోల్చితే.. ఆదివాసుల స్థితి అధ్వాన్నం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 2001 జనాభా లెక్కల ప్రకారం 20, 46, 531 మంది గిరిజనులు ఉన్నారు. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 31,485 చ. కిమీ షెడ్యూల్డ్ ఏరియాలో30 ఆదివాసు ల తెగలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని.. ఆదివాసులంతా ఇప్పుడు మైనింగ్ మాఫియా కాటుకు విలవిలలాడుతున్నారు. గిరిజనుల జీవితాలను పట్టించుకోకుండా.. పాలకులు మైనింగ్‌చేస్తూ...లాభాలు చూసుకుంటున్నారు. కానీ.. స్థానిక గిరిజనుల జీవితాలను గురించి ఆలోచించటం లేదు.

విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలం కండ్రు పంచాయితీ పరిధిలోని సర్రాయి, జికంరగూడ, జోడిగూడ గ్రామాల్లో చైనా క్లే విస్తారంగా ఉంది. ఈ ఖనిజ నిక్షేపాలే ఇప్పుడు వీరి పాలిట శాపంగా మారింది. ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూముల్లో చైనా క్లేను వెలికి తీయడానికి బడానేతలు పావులు కదిపారు. బినామీ పేర్లతో ఆదివాసుల పేరుతో కాంట్రాక్టులు సంపాదించి తవ్వకాలు జరుపుతున్నారు. ఇందుకు గాను స్థానిక గిరిజన గూడాల్లో 50 లక్షలతో...అభివృద్ధి కార్యక్షికమాలు చేస్తామని, పాఠశాల నిర్మిస్తామని నమ్మబలికారు. దీంతో.. చైనా క్లే తో.. 600 కోట్లు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గిరిజనుల పేరుతో మైనింగ్ మాఫియా అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతున్నా.. పాలకులు వత్తాసు పలుకుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే... ప్రజాభివూపాయ సేకరణకు వెళ్లిన ఎమ్మెల్యే, ఎంపీపీలను గిరిజనులు తరిమి తరిమికొట్టారు.

విశాఖ ఏజెన్సీ లో బాకె్సైట్ తవ్వకాలకు జిందాల్ కంపెనీకి అనుమతిచ్చారు. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం విశాఖ మన్యంలో 8 వేల హెక్టార్ల విస్తీర్ణంలో బాకె్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. బాకె్సైట్‌ను తవ్వకాలు చేస్తే... ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన గూడాలన్నీ ఖాళీ చేయాలి. అంతే గాకుండా.. బాకె్సైట్ తవ్వకాలు, బాకె్సైట్ శుద్ధిచేసేప్పుడు వస్తున్న ఎర్ర దుమ్ముతో.. పరిసర చెట్లు చేమలన్నీ నాశనమవుతున్నాయని గిరిజనులు అంటున్నారు . పంటభూములు పనికిరాకుండా పోయి ఆకలితో అలమటిస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు. తాగే నీరు కూడా కలుషితమై.. గుక్కెడు నీళ్లకోసం తపిస్తున్నామంటున్నారు. అంతే గాక... ఈ మైనింగ్ కారణంగా.. మూడు మండలాల్లోని 14 గ్రామపంచాయితీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. 274 గిరిజన గ్రామాలు, 40 వేలమంది ఆదివాసులు నిర్వాసితులౌతున్నారు. అలాగే 24 జీవనదులు కాలుష్యమై పనికి రాకుండా పోతున్నాయి. ఈ తవ్వకాల వలన తూర్పుకనుమల నుంచి ప్రవహించే నదులు, వీటిపై ఉన్న ప్రాజెక్టులు తీవ్రంగా నష్టపోతాయని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. అయినా.. పాలకులు ఇవేమీ పట్టించుకోకుండా..
మైనింగ్‌కు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.


శ్రీకాకుళం లోని కన్నెదార కొండపైన గ్రానైట్ తవ్వకాలు కూడా.. స్థానిక ప్రజల పాలిట శాపంగా మారింది. సీతంపేట మండలం పులిపుట్టి గ్రామపంచాయితీ పరిధిలో.. గ్రానైడ్ కొండలను ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. దీనిని లీజుకు తీసుకున్న మంత్రి కొడుకు ఇష్టానుసారం గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. దీంతో.. ఈ కొండ దిగువన ఉన్న సాగు, తాగునీరు అందించే ఊట గడ్డలు ఎండిపోయి స్థానికులు తీవ్ర కష్టా ల పాలవుతున్నారు. 300 పైగా కుటుంబాలు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నారు. అలాగే.. ప్రకృతి వైవిధ్యంతో..అలరారే ఈ కొండలను గ్రానైట్ కు అప్పగించడంతో.. 59 రకాల ఔషధ మొక్కలు నాశనమవుతున్నాయి.


పత్తిపాడు మండలం వంతాడులో కోట్ల విలువచేసే లాటరైట్ గనులను మైనింగ్ కోసం బడా కంపెనీలకు ప్రభుత్వం అప్పగించింది.ఈ తవ్వకాలకోసం రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌లో 18 కిలోమీటర్ల దూరం రోడ్డు వేశారు. దీనికోసం విలువైన అటవీ సంపదను నాశనం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న డి- పట్టా భూములను బలవంతంగా ఆదివాసుల నుంచి గుంజుకొని నిర్వాసితులను చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో...చెంచులను వెల్లగొట్టి అక్కడ ఉన్న వజ్రాలు, బంగారం, సీసం, రాగి, జింక్ లాంటి విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యం పేరుతో.. స్థానిక చెంచులను నిర్వాసితులను చేస్తున్నారు. అలాగే.. స్థానిక గిరిజనుల జీవితాలను గాలికి వదిలి.. 2 వేల చ.మీ. విస్తీర్ణం గల ప్రదేశాన్ని డిబీర్స్ కంపెనీకి అప్పగించడం జరిగింది.

తెలంగాణకు కొంగు బంగారంగా చెప్పుకునే.. సింగరేణిలో.. 65 మండలాల్లో 6 లక్షల మందిని నిర్వాసితులను చేశారు. ఇదీ చాలక పర్యావర ణానికి గొడ్డలి పెటుఅయిన ఓపెన్ కాస్ట్ గనులను
ప్రభుత్వం ప్రారంభించి ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, నేలకొండపల్లి మండలాల్లో.. వేల కోట్ల రూపాయల విలువ చేసే ఇనుప ఖనిజ నిల్వలను కారు చవకగా.. రక్షణ స్టీల్స్‌కు అప్పగించారు. ఈ తవ్వకాల వల్ల 42 వేల ఎకరాల పంటభూములు నాశనమవుతున్నాయి.
షెడ్యూల్డ్ ఏరియాలో.. నిబంధనల ప్రకారం మెటల్ తవ్వకాలను గిరిజన సొసైటీలకే ఇవ్వాలి. స్థానిక గిరిజనుల అనుమతి, ఆమోదంతో.. మాత్ర మే చేయాలి. కానీ.. గిరిజన చట్టాలను, అటవీ
పరిరక్షణ చట్టాలను తుంగలో తొక్కి బడా కాంట్రాక్టర్లకు ఖనిజ సంపదను కట్టబెడుతున్నారు. ప్రభుత్వాధి కారులు లంచాలకు మరిగి మైనింగ్ మాఫియాను పెంచి పోషిస్తున్నారు. స్థానిక గిరిజనుల నిర్వాసితులను చేస్తూ.. వ్యతిరేకించిన వారిపై దమనకాండను అమలు చేస్తున్నారు. మావోయిస్టుల పేరుతో.. అణిచివేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధిస్తునారు.సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సంస్థ జరిపిన అధ్యయనంలో మైనింగుల వల్ల లక్షలాది హెక్టర్లలో అడవి నాశనమైందని, ఇలాగే కొనసాగితే.. దేశం అధోగతి పాలవుతుందని

పేర్కొన్నది.
-మైపతి అరుణ్‌కుమార్
ఆదివాసీ విద్యార్థి సంఘం తుడుందెబ్బ

No comments:

Post a Comment