అద్దె ఇల్లుకు అంటరాని తనం
- దళితులపై వివక్ష
- పట్టణ ప్రాంతాల్లోనూ దారుణం
64 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో నేటికీ దళితుల పరిస్థితి అధ్వానంగానే ఉంది. అంటరాని వారిగా భావించి వారిపై అనేక రూపాల్లో దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. వివక్ష చూపుతూ గెంటేస్తూనే ఉన్నారు. హత్యలు, అత్యాచారాలు నిత్య కృత్యమవుతున్నాయి. అవమానాలకు అడ్డూ అదుపూ లేదు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లోనూ వివక్ష వేళ్లూనుకుని ఉంది. వరంగల్ జిల్లా జనగామ పట్టణంలో ఇప్పటికీ కులం పేరు చెప్పనిదే ఇళ్లు కిరాయికి ఇవ్వని దుస్థితి నెలకొంది. ఇల్లు దొరక్క ఇటీవల కులం పేరు తప్పు చెప్పి ఇంట్లోకి అద్దెకు దిగిన ఓ కుటుంబాన్ని కులం పేరు తెలిశాక ఆ ఇంటి యజమాని ఇంట్లో నుంచి గెంటేశాడు. ఇలాంటి అనేక ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
జనగామలో చాపకింద నీరులా కుల వివక్ష కొనసాగుతోంది. పట్టణంలోని పెత్తందారులు నివాసం ఉంటే రెడ్డి వీధి, కుర్మవాడ, నాగులకుంట లాంటి ఏరియాల్లో దళితులకు ఇళ్లు కిరాయికి ఇవ్వడం లేదు. జనగామలోని రెడ్డి వీధిలో ఎక్కువ రెడ్డి కులానికి చెందిన వారే ఉన్నారు. ఇక్కడ ఇల్లు కిరాయికి కావాలంటే ముందుగా ' మీదేం కులం' అంటూ ప్రశ్నిస్తారు. మాల, మాదిగ, గిరిజన అని చెబితే 'మీకు ఇంకా ఎక్కడ ఇళ్లు దొరకలేదా...రెడ్డొళ్ల ఇళ్లే కలిపించాయా' అంటూ ఆగ్రహంతో ఊగిపోతారు. ఉద్యోగులు అయినప్పటికీ వారి కులాన్నే చూస్తున్నారు. కానీ మనిషిగా చూడని పరిస్థితి ఉంది. రెడ్డి వీధే కాకుండా నాగుల కుంట, కుర్మవాడలో ఎక్కువగా బిసి సామాజిక తరగతికి చెందిన గొల్లకుర్మ, ముదిరాజ్‌లు నివాసం ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఇల్లు అడిగితే కూడా అదే పరిస్థితి. ముందు కులం పేరు చెబితేనే ఇల్లు కిరాయికి ఇస్తారు. దళిత కులాలకు చెందిన వారికి తప్ప మిగతా వారందరికీ ఇళ్లు అద్దెకు ఇస్తారు.
కులం పేరు తెలిసిన మరుక్షణం మెడబట్టి గెంటేశారు
జనగామ పట్టణంలోని నాగులకుంటలో ఎస్ ప్రభావతి కుటుంబం అద్దెకు ఇల్లు కావాలని గల్లీలన్నీ తిరిగింది. కులం పేరు తెలియడంతో ఎవరూ అద్దెకు ఇల్లు ఇవ్వలేదు. చివరకు విసిగి వేశారిన ప్రభావతి కులం పేరు తప్పు చెప్పి ముదిరాజ్ కులానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అద్దెకు దిగింది. ఇళ్లు అద్దెకు ఇచ్చిన కుటుంబీకులు రెండు నెలల పాటు ప్రభావతిలో చాలా చనువుగా ఉన్నారు. వారి ఇంట్లో కూరలు వీరు తీసుకోవడం వీరి ఇంట్లో కూరలు వారు తీసుకోవడం వరకు బాగానే ఉంది. రెండు నెలల తరువాత ప్రభావతి మాదిగ కులానికి చెందిన వ్యక్తి అని తెలిసి పోయింది. మరుక్షణమే ఆ ఇంటి యజమానురాలు 'మీరు ఒక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు' అంటూ గొడవకు దిగింది. నానా బూతులు తిట్టింది. ఎంత చెప్పినా వినకపోవడంతో సమాగ్రి బయటపడేస్తానంటూ బెదిరించింది. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభావతి కుటుంబీకులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
సైకిల్ అంటే మాదిగ, రిక్షా అంటే మాల
దళితులను కులం పేరుతో పిలిస్తే కేసులు పెడతారనే భయంతో అగ్రవర్ణాలకు చెందిన వారు వరంగల్ జిల్లాలో మాల, మాదిగల పేర్లను యంత్రాల పేర్లుగా మార్చారు. వరంగల్ నడిబొడ్డున గల కాకతీయ యూనివర్సీటీ ప్రాంతంలో మాల, మాదిగలను రెండు పేర్లతో ఉచ్చరిస్తున్నారు. మాదిగ కులానికి చెందిన వ్యక్తిని సైకిల్ అంటారు. సైకిల్ అంటే మాదిగ అనే పదానికి మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి అలా పిలుస్తున్నారు. మాల అంటే రిక్షా అంటారు. రిక్షాకు రెండు అక్షరాలు ఉంటాయి కాబట్టి. ఇలా ఉచ్చరిస్తూ దళితుల్ని హీనంగా చూస్తున్నారు. ఈ విషయం చర్చకు వచ్చిన క్రమంలో పెత్తందారులు 'మిమ్మల్ని కులం పేరు పెట్టి పిలిచామా' అంటూ తప్పించుకుంటున్నారు. ఇప్పటికీ కాకతీయ యూనివర్సీటీ ప్రాంతంలో యంత్రాల పేర్లతోనే రిక్షా ఏరియా, సైకిల్ ఏరియా, రిక్షాగాడు, సైకిల్ గాడు అంటూ ఉచ్చరిస్తున్నారు. ఈ విషయంలో అక్కడ ఉన్న దళితులకు తెలిసినప్పటికీ ఏం చేయలేని పరిస్థితి.
దళితులు అంటే ప్రజాప్రతినిధులకూ అలుసే
దళితులంటే ప్రజాప్రతినిధులకు కూడా అలుసుగానే ఉంది. దళిత ఉద్యోగుల్ని, ప్రజాప్రతినిధుల్ని కులం పేరుతో దూశించిన సంఘటనలు జనగామ లాంటి ప్రాంతాల్లో అనేకం ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న నాగపురి రాజలింగం గతంలో మద్దూర్‌లో పనిచేస్తున్న ఎఎన్‌ఎంను కులం పేరుతో దూశించారు. దళిత సంఘాలు ఆందోళనలు నిర్వహించడంలో రాజలింగం ఆ ఉద్యోగికి క్షమాపణ చెప్పారు. రఘునాథపల్లి ఎంపిడిఓ మిట్టకోల చంద్రమౌళి అదే మండలంలోని అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన యాదగిరిని కులం పేరుతో తిట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రమౌళి, కోర్టు స్టేలు తెచ్చుకుంటుండడంతో పోలీసులు ఆరు నెలలుగా అరెస్ట్ చేయడం లేదు. ఒకటి రెండు అని కాకుండా కులం పేరుతో దూశించిన సంఘటనలు అనేక ఉన్నాయి.
పార్నంది వెంకటస్వామి - వరంగల్
దళితులుగా పుట్టడమే పాపమా : సుంచు విజేందర్
నేటి సమాజంలో దళితులుగా పుట్టడమే పాపమా అంటు కెవిపిఎస్ జనగామ డివిజన్ కన్వీనర్ సుంచు విజేందర్ ప్రశ్నించారు. మనిషిని మనిషిగా చూడని రోజులు నేటికీ ఉండడం బాధాకరమన్నారు. నేటికీ గ్రామాల్లో కుల వివక్ష వేళ్లూనుకొని ఉండగా పట్టణ ప్రాంతాల్లో కూడా రెడ్లు, దొరలు, పెత్తందారులు తమ అహంకారాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో పని చేసే వ్యక్తి మాల, మాదిగ కులానికి చెంది వాడు అయినప్పడు వారి ఇంట్లో డబ్బులు ఇచ్చి కిరాయి ఉండే వ్యక్తి దళిత కులాలకు చెందిన వారు అయితే తప్పేంటని ప్రశ్నించారు. దళితులు దుక్కుల్ని దున్ని పండించిన మెతుకులు తినేప్పుడు లేని వివక్ష వారి ఇంట్లో కిరాయికి కుంటూ బతుకుతుంటే ఎందుకని ప్రశ్నించారు. దళిత, గిరిజనలు గౌరవంగా బతకడం నేటికీ పెత్తందారులకు ఇష్టం లేదన్నారు. వివక్షకు గురిచేస్తున్న వారిని కఠినంగా శిక్షించడం, సామాజికంగా వారిలో నాటుకొని ఉన్న అహంకారాన్ని తొలగించడం ద్వారానే కుల వివక్షతను రూపుమాపగలము.
వారి రక్తం ఎర్రగా మా రక్తం నల్లగా ఉందా : వివక్షతను ఎదుర్కొన్న ప్రభావతి
ఇతర కులాల వారి రక్తం ఎర్రగా ఉంటే దళితులమైన మా రక్తం నల్లగా ఉందా? ఎందుకు అంత వివక్ష. జనగామలో అద్దె ఇంటి కోసం ప్రయత్నిస్తే కులం పేరు అడిగి ఇల్లు ఇవ్వబోమన్నారు. దీంతో చివరకు కులం పేరు తప్పు చెప్పి నాగులకుంటకు చెందిన ఒక వ్యక్తి ఇంట్లో అద్దెకు దిగాను. ఇంటివారు రెండు నెలలు మా కుటుంబంతో బాగానే ఉన్నారు. వదిన అంటూ వరసలు కలిపారు. మా ఇంట్లో అన్నం తిన్నారు. కూరలు వేసుకుపోయారు. చివరకు నేను మాదిగ కులానికి చెందిన వ్యక్తిని అని తెలియగానే ఇంట్లోంచి గెంటేశారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడా చూడలేదు అంటూ ప్రభావతి విలపించింది.
No comments:
Post a Comment