Sunday, September 4, 2011

అడవిపై హక్కు ఆదివాసీలదే - చిక్కుడు ప్రభాకర్ Jun /16/2011Andhra Jyothi



దేశంలోని ఖనిజ సంపదంతా బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు యుపిఏ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను ఆదివాసీలకు దక్కకుండా మన రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా బడా పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు చట్టాలను పూర్తిగా తానే తుంగలో తొక్కుతున్నది. పేదవానికి ఇంటి నిర్మాణం కొరకు 100 చ. గజాల భూమిని, కడుపు నింపుకునేందుకు హెక్టారు వ్యవసాయ భూమి కేటాయించకుండా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం ధనికులకు మాత్రం ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా లక్షలాది హెక్టార్ల ప్రజల భూమిని, అందులోని సంపదను అప్పనంగా కట్టబెడుతున్నది.

పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌ఘడ్ ప్రాంతంలో దాదాపు 30,000 హెక్టార్ల ఇనుప ఖనిజం కలిగిన భూమిని జిందాల్‌కు కేటాయించగా, అక్కడి ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి ఆ సంపద తమకే దక్కాలని జిం దాల్‌ను తరిమికొట్టారు. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల్లో కూడా రిలయన్స్, ఎస్.ఆర్, జైస్వాల్, అలాయడ్స్, వేదాంత, టాటా లాంటి బడా కంపెనీలకు విలువైన ఇనుప ఖనిజాన్ని కట్టబెట్టిన ఆయా ప్రభుత్వాలు, ప్రజల పోరాటాలకు తలొ గ్గి కొన్ని కంపెనీలతో ఒప్పందాలను రద్దుచేసుకున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాలోని బయ్యారం నుండి విశాఖ జిల్లాలోని చింతపల్లి, గూడెం కొత్తవీధి, అరకులోయలలో విస్తరించివున్న ఇనుపరాతి ఖనిజం, బాక్సైట్‌లతో పాటు నిన్న దుంబ్రిగూడలో ఆదివాసులు వ్యతిరేకించిన చైనాక్లే (కాల్షియేట్) తవ్వకాల వరకు లక్షల కోట్ల అటవీ సంపదను ప్రభుత్వ రంగ సంస్థయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎ.పి.యం.డి.సి) ప్రభుత్వం నుండి గనులను సొంతం చేసుకొని ఆ తర్వాత బడాపెట్టుబడిదారులకు, గుత్తపెట్టుబడిదారులకు, అడవి ప్రాం తంలోని బినామీలకు కట్టబెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న ది. ఇందులో భాగమే దుంబ్రిగూడ చైనాక్లే తవ్వకాలు. అందుకే ఆదివాసీ ప్రజలు ఇటువంటి బినామీలకు ప్రజాప్రతినిధులు మ ద్దతు ఇవ్వడం వలన వారి మీద దాడులకు పాల్పడుతున్నారు.

ఎ.పి.యం.డి.సి. 5-1-2009న ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ తెలుగు దినపత్రికలలో మాత్రమే ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో, వరంగల్ జిల్లాలోని గూడూరు మండలంలోని నిక్షిప్తమయివున్న లక్షలాది కోట్ల విలువైన కోట్ల కొలది మెట్రిక్ టన్నుల ఇనుపరాతి ఖనిజం ఉపయోగించుకుని స్టీల్‌ప్లాంట్ నిర్మించేందుకు ముందుకు రావాలని బడాపెట్టుబడిదారులను కోరింది. జాయింట్ వెంచర్‌లో నిర్మించే ఈ ప్లాంట్‌లో తనది 2 శాతం వాటాగా, మిగతా 98 శాతం వాటా ప్రైవేట్ రంగానిదిగా నిర్ధారిస్తూ అటవీ ప్రజల సంపదంతా బడాపెట్టుబడిదారులకు దారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది.

26 జనవరి 1950 ప్రకారం నోటిఫై చేసిన ఈ ప్రాంతాలు పూర్తిగా ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతాలు. ఇందులో ల్యాండ్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ యాక్ట్ 1959, సెక్షన్ 3 ప్రకారం ఇక్కడి భూములను ఆదివాసేతరులెవరూ కొనేటందుకుకాని, లీజుకు తీసుకునేందుకుగానీ అనుమతిలేదు. ఇదే విషయాన్ని 1/70 చట్టం కూడా ధృవీకరిస్తుంది. ఇంకా లోతుల్లోకి వెళితే అటవీ ప్రాంతాల్లో గిరిజనులకు తప్ప ఇతరులెవరికి అటవీ సంపదను లీజుకు ఇవ్వవద్దని "సమరతావి మరియు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1997'' కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పింది.

పై చట్టాలేవి పరిగణలోకి తీసుకోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎ.పి.యం.డి.సి.కి ఈ గనులను కేటాయించడం, ఈ సంస్థ ప్రైవేట్ సంస్థయిన (వై.ఎస్.ఆర్. కుటుంబానికి చెందిన) రక్షణ స్టీల్స్‌కు 24-02-2009న జీ.వో.నెం. 69/2009 ద్వారా ఇనుప రాతి ఖనిజం పంపిణీ చేసేందుకు ఉత్తర్వులు విడుదల కాగా, ఆ తర్వాత రోజునే (25-02-2009) ఎ.పి.యం.డి.సి. రక్షణ స్టీల్స్‌తో ఇనుపరాతి ఖనిజ పంపిణీ ఒప్పందం చేసుకున్నది.

మైన్స్ మరియు మినరల్ చట్టం 1957 (కజీn్ఛట్చజూ ఈ్ఛఠ్ఛిజూౌఞఝ్ఛn్ట - ఖ్ఛజఠజ్చ్టూజీౌn అఛ్టి 1957)లో సెక్షన్ 11 మైనర్, మేజర్ గనుల కేటాయింపును నిర్దేశిస్తుంది. ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1991లో సెక్షన్ 11(5)గా చట్టసవరణ జరిగిందేమిటంటే ఏజెన్సీ ప్రాంతంలోని మైనర్, మేజర్ గనులన్నీ గిరిజనులకు, గిరిజన సొసైటీలకు మాత్రమే కేటాయించాలి. అలాగే ప్రభుత్వరంగ సంస్థలకు కూడా కేటాయించవచ్చు తప్ప గిరిజనేతరులకు కేటాయించవద్దని చెబుతున్నది.

ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించవచ్చనే చట్టం లొసుగును ఆసరా చేసుకుని ఆదివాసులు, గిరిజనులు ఎందరో ఆ ప్రాంతంలో దరఖాస్తు చేసుకున్నా, వారి దరఖాస్తులను కనీసం పరిశీలించని ప్రభుత్వం జూన్ 30, 2010న ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలంలోని దాదాపు 56,690 హెక్టార్ల భూమిని ఎ.పి.యం.డి.సి.కి రిజర్వ్ చేస్తున్నట్లుగా జీవో 64/2010 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులు, స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీలు రాజీలేని పోరాటం చేయగా, ఇంకొకవైపు గిరిజనుల న్యాయవాదులు జీ.వో 64/2010ని రద్దు చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, డిసెంబర్ 12, 2010న పై జీవోను రద్దు చేస్తూ, జీవో నెం 126/2010ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ఎ.పి.యం.డి.సి.కి నోటీసునిచ్చి దాని నుండి ఎటువంటి అభ్యంతరాలు లేవని ధృవీకరించుకున్న తర్వాతనే పై సంస్థకు గనుల రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్లు జీ.వో.నెం. 126/2010ని విడుదల చేయగా, వైఎస్ఆర్ కుటుంబ సంస్థయిన రక్షణ స్టీల్స్ తన దోపిడీని కొనసాగించేందుకు జీ.వో.నెం. 126/2010 రద్దు చేయాల్సిందిగా డిసెంబర్ 16న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ జీవో రద్దుకు నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం, తుది తీర్చు వచ్చేవరకు మూడో వ్యక్తులెవరికీ ఆ గనులు కేటాయించవద్దని "యథా - తథాస్థితి'' (ఖ్ట్చ్టిఠట ఛిౌ)ని కొనసాగించాల్సిందిగా ఆదేశించింది.

ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఉద్దేశపూర్వకంగానే కేసును చూసీ చూడనట్లు వదిలేశారని, వై.ఎస్. జగన్ ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఈ గనులు ఆదివాసీలకు దక్కకూడదనే ప్రయత్నంలో భాగంగానే న్యాయస్థానంలో గట్టివాదనలు చేయలేదని, "స్టేటస్-కో''ను ఎత్తివేసేందుకు ప్రయత్నం చేయడం లేదని విమర్శలు వినిపించాయి. అది నిజమేనని కాలం నిరూపిస్తున్నది కూడా. అలాగే ప్రజల ఆస్థిని కాపాడే సంస్థలయిన ఎ.పి.ఐ.ఐ.సి, ఎ.పి.యం.డి.సి.లు బడాపెట్టుబడిదారుల, గుత్తపెట్టుబడిదారులకు బినామీ సంస్థలుగా మారాయి. ప్రభుత్వ భూములను, అపారమైన గనుల సంపదను తాము దక్కించుకోవడం, తమ ద్వారా గుత్తపెట్టుబడిదారులకు, రాజకీయ బలం కలిగిన వ్యాపార సంస్థలకు ధారాదత్తం చేయడం పరిపాటయింది.

ముఖ్యంగా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఈ సంస్థలు ఆయన కుటుంబ సభ్యుల సంస్థల చేతిలో కీలుబొమ్మలయ్యాయి. 2005 సంవత్సరంలో బయ్యారం మండలంలోని రామచంద్రపురం, మొట్ల తిమ్మాపురం గ్రామాలలో బ్రదర్ అనిల్ కుమార్ బినామీలకు 24 హెక్టార్ల ఇనుపఖనిజం కేటాయించగా, వారు 20 సంవత్సరాలలో తవ్వుకోవలసిన ఖనిజాన్ని కేవలం అయిదు సంవత్సరాలలోనే త్వరగా, అపరిమితంగా పరిమిట్లు ఇచ్చి వారికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు తమ వాటాలను వారి నుండి మింగారు.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆ గనుల మీద విచార ణ జరిపించగా వేలాది కోట్ల రూపాయల ఖనిజం అక్రమంగా తవ్వుకున్నట్లు నిర్ధారణ కాగా, ఆ లీజును తాత్కాలికంగా ప్రభు త్వం రద్దు చేసింది. ఆ లీజులను తిరిగిపొందేందుకు బ్రదర్ అనిల్ కుమార్ మనుషులు "డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ'' కార్యాలయంలో తిష్టవేసి అధికారులమీద ఒత్తిడి తెస్తూనే వున్నారు. ఇంకొకవైపు గార్ల మండలంలోని సిరిపురం గ్రామంలో లక్షలాది కోట్ల రూపాయల విలువైన బైరైటీస్ గనులను వైఎస్ బామ్మర్ది కడప నగర మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ సమీప బంధువులు ఎమ్మెల్యేలు, ఎంపీలయిన మేకపాటి సోదరులు బినామీ ట్రైబల్ సొసైటీలు సృష్టించి గత ఆరు సంవత్సరాలుగా వేలాది కోట్ల రూపాయల ఖనిజం తవ్వుకుంటున్నారు. ఈ సొమ్ముతో వై.ఎస్.ఆర్ కుటుంబం ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నది.

దేశంలోని అత్యంత ధనవంతునిగా మారేందుకు తెలంగాణ ప్రాంతంలోని బయ్యారం విలువయిన ఇనుపరాతి ఖనిజాన్ని ఎ.పి.యం.డి.సి.ద్వారా దక్కించుకుని స్టీల్ ప్లాంట్ ముసుగులో ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు పన్నిన కుట్రను తెలంగాణ ప్రజలు వమ్ముచేశారు. తాను దోపిడీ చేసిన సొమ్ముతో ఆ గనులను మళ్ళీ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న వైఎస్ కుటుంబాన్ని ప్రభుత్వం సమర్ధవంతంగా పోరాడి న్యాయ స్థానం విధించిన "యథా - తథ స్థితి''ని ఎత్తివేయించాలి.

బయ్యారం, గార్ల, నేలకొండపల్లి, గూడూరు మండలాల్లో నిక్షిప్తమయిన ఇనుపరాతి ఖనిజాన్ని స్థానిక ఆదివాసీలకు, గిరిజనులకు కేటాయించి ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలి. అలాగే ఈ గనులను శాస్త్రీయంగా అభివృద్ధి చేసేందుకు వారికి శిక్షణనివ్వాలి. ఏ ముడిసరకు అయితే ఆ ప్రాంతంలో వుంటుందో, ఆ ప్రాంతంలో ఆ ముడిసరకు ఆధారిత పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా ఆ పరిశ్రమను దీర్ఘకాలికంగా అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతాం. ఇందులో భాగంగానే పారిశ్రామికంగా వెనుకబడివున్న వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆదివాసీ ప్రాంతాలలో 10,000 టన్నులు రోజుకు (10,000 ఖీౌnn్ఛట ఞ్ఛట ఛ్చీడ) ఇనుము ఉత్పత్తి చేయగల స్టీల్ ప్లాంట్లను నిర్మించేందుకు గిరిజనులకు సహకరించాలి. అప్పుడే ఈ ప్రాంతాలలోని దాదాపు 50,000ల ఆదివాసీ, ఆదివాసేతర యువతీ యువకులకు ఉపాధి లభిస్తుంది.

ఈ విధంగా అటవీ సంపదను, ఆదివాసులకు, గిరిజనులకు కేటాయించడం ద్వారా స్వతంత్ర భారతదేశంలోని ఆదివాసుల్లో- తాము అడవిలోని కట్టె పుల్లలు మాత్రమే కాదు, అటవీ సంపదలోను తమ హక్కు ను దక్కించుకున్నవాళ్లమనే విశ్వాసం పెరుగుతుంది. వారి అభివృద్ధికి మహానుభావులు చేసిన చట్టాలు ఉపయోగంలోకి వస్తాయి. ఇలా జరగకపోతే లాల్‌ఘడ్‌లు, కలింగనగర్‌లు, బయ్యారంలు, దుంబ్రిగూడ పోరాటాలు మరింత ఉధృతమై "ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారకముందే'' కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరచి ఆదివాసీ, గిరిజనులకు ఆ సంపదను దక్కేందుకు కృషి చేసి వారి కొరకు ఏర్పాటు చేసిన చట్టాలను అమలు చేయించాలి. ఈ ప్రయత్నం ద్వారా ప్రత్యక్షంగా ఆదివాసి, గిరిజన ప్రాంతాలను పరోక్షంగా రాష్ట్ర, దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి.

- చిక్కుడు ప్రభాకర్

No comments:

Post a Comment