Sunday, September 4, 2011

మనుధర్మపు చర్మం ఒలిచిన జాంబ పురాణం - గ్రంథ సంపాదకవర్గం Jun 21 Andhra Jyothi


మనుధర్మపు చర్మం ఒలిచిన జాంబ పురాణం
- గ్రంథ సంపాదకవర్గం

దేశీయం కాని ఆర్య సాహిత్య వ్యవస్థలో ఇక్కడి స్థానిక మహా పురాణాలు, మహా కథనాల స్థానే విజేత పౌరాణిక పాఠ్యాలను రూపొందించి ప్రచారం చేసేవారు. అందువల్లే ప్రాదేశిక నృశాస్త్రాల దృష్ట్యా జరిపిన అధ్యయనం ద్వారా తెలిసేదేమంటే- విజేతల పాఠ్యాలు, భావజాలం దేశీయ పౌరాణికతపై ప్రభావం చూపడం ఆధునిక కాలంలో ఆంగ్లేయులతోనే ప్రారంభం కాలేదు. విదేశీ దండయాత్రలు జరిగిన ప్రతిసారీ అలాంటి ప్రయత్నాలు జరిగాయి. మనదేశంలో కూడా ఒక్కో దశలో ప్రాంతం, నాడు, గణరాజ్యం ఓడినప్పుడల్లా వారిపై విజేతల పౌరాణిక భావనలు అంటగట్టబడ్డాయి.

ఆలయవ్యవస్థ, మత ప్రాతినిధ్యం, రాజ్యం, పాలకవర్గం మొదలైన వాటిని రూపొందించి ఈ కార్యాన్ని సాధించే ప్రయత్నం చేశారు. ఇందుకుగాను దేశీయ పండితవర్గం విజేతల ఆలోచనలకు వివిధ రకాల సహకారం అందించింది. ఈ కారణాల వల్ల వివిధ రకాల కిందివర్గాల పౌరాణిక సాహిత్య రూపాలు కూడా కొన్ని దెబ్బతిన్నాయి.

పోగా కొన్ని మాత్రమే మిగిలివున్నాయి. అలాంటి వాటిలో జాంబపురా ణం, విశ్వకర్మ పురాణం, మడేల్ పురాణం మొదలైనవాటిని చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో పాశ్చాత్య సంస్కృతీకరణ దేశీయ పురాణాలపై గాథలపై కూడా ప్రభావం చూపుతున్నది. విశ్వవ్యాప్తంగా ఏక సంస్కృతి ప్రతిష్ఠాపనకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని ఎదుర్కోవడానికి దేశీ సాహిత్య ప్రవక్తలు పూనుకోవాలి.

దేశీ సాహిత్య ప్రవక్తలు, రచయితలు కూడా జాంబపురాణం లేదా జనాదరణ వున్న కుల పురాణాలను ప్రస్తావించలేదు. అంటే వాటిని ఆయా కులాల/సమూహాల పవిత్ర కథలుగా రహస్యంగా దాచుకున్న పౌరాణిక రూపాలుగా భావించి వాటిని గుర్తించలేకపోయి వుండాలి. అంటే అడుగువర్గ పౌరాణికులు తాము వాటిని ప్రదర్శిస్తామనే విషయాన్ని కూడా బహిర్గతం చేసి ఉండరు. ముఖ్యంగా డక్కలివారు కథాగానం విషయాన్ని మహాగోప్యంగా ఉంచారు. అందుకే వారి వ్యవహారశైలి కూడా ఎప్పుడూ అనుమానాస్పదమే.

పై వర్గాలవారికి అనుమానం కలిగేలా వారి జీవిత విధానం కనిపిస్తుంది. అందుకే అతినీచంగా శిష్టులు వారిని ఈనాటికీ తిడతారు - వారి కులం పేరునే తిట్టుగా ఉపయోగిస్తారు. ఈ రోజుకీ గ్రామాల్లో మంత్రగాళ్లుగా, మాయగాళ్లుగా భావిస్తారు. వీరిని అనుమానితులుగా, అవమానితులుగా, నేరగాళ్లుగా గ్రామాధికార వ్యవస్థ ఇంకా పరిగణిస్తుంది.

ఈ కారణంగానే శిష్టులు వేసిన పాత ముద్రనే ఆంగ్లేయ పాలకులు పాటించారు. ఒకింత ముందుకెళ్లి వారిని ఛిటజీఝజీn్చజూ ్టటజీఛ్ఛట గా పేర్కొన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛా భారతంలో ఇల్లు, రేషన్‌కార్డు, ఓటర్ కార్డుల గుర్తింపులు లేని అలగాజనంగా, అంటే ఈ దేశ పౌరులు కాని వాళ్లలాగే ఉండిపోయారు చాలాకాలం. ఎందుకంటే వీళ్లు ఒక మహత్తర సాంస్కృతిక అణ్వాయుధ రహస్య కాపలాదారులు.

ఇంతటి విస్ఫోటన శక్తి వీళ్ల వద్ద ఉందని తెలిస్తే కొత్తగా వెలివేయడమే కాదు ఇరాక్‌ని కబళించిన అమెరికా లాగా మన అగ్రవర్ణాలు వారిని ఊచకోతకు గురిచేసేవి. ఈ కరణాల వల్లనే కావచ్చు వీరశైవ సాహిత్య పథ నిర్దేశకుడు, దేశీసాహిత్య మార్గదర్శి ఆది తెలుగు కవి పాల్కురికి సోమనాథుడు కూడా వీరి జాంబపురాణం వంటి గాథలను ప్రస్తావించలేదు. అంతేకాదు ఆంగ్లేయ నృశాస్త్రవేత్త ఎడ్గార్ త్రస్టన్, రంగాచార్య వంటి పరిశోధకులు ఈ కులాలవారికి సంబంధించిన వివరాలు ఇచ్చినా వారి వద్ద గల పౌరాణిక సాహిత్యం గురించి ఒక్క మాట ఎక్కడా పేర్కొనలేదు.

భూమి పొరలలో దాగిన అజ్ఞాత తెలుగు ప్రతుల్ని పసిగట్టి వెలికితీసి ప్రచురించిన సి.పి.బ్రౌన్ లాంటివారు ఇలాంటి పాఠ్యాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు. వేమనకే పాత సాహిత్యంలో ఉటంకింపు లేదంటే ఇక జాంబపురాణాలకి ఉంటుందా? వేమనకన్నా వందరెట్లు అగ్రవర్ణ భావజాలాన్ని ఖండించి పోగులు పెట్టిన ఈ మూల పురాణాలను అంచుల్లోకి నెట్టేవేసి ఉంటారు. వేమనని వెలికి తీసినందుకే తనపై కారాలు నూరిన వైనం తెలిసిన సి.పి.బ్రౌన్ జాంబపురాణాల్ని వెలికి తీయడానికి సాహసించలేదేమో? పోనీ ఆయన విదేశస్తుడు. ఆయనకి జాంబపురాణాల మూలమట్టులు తెలియవు.

కాని ఈ నేలమీదే పురుడుపోసుకున్న మన సంస్కర్తలు, ప్రజాస్వామ్య మేధావులైనా ఆ పని చేయగలిగారా? మరి ఎందుకు చేయలేదు. అన్నిరకాల చిన్నా చితకా పాత్రల్ని ప్రవేశపెట్టిన 'కన్యాశుల్కం' తన చుట్టూరా ఉన్న 10 రకాల గిరిజన తెగలలో ఏ ఒక్కడి పాత్రనైనా సృష్టించనట్లే అన్ని రకాల అజ్ఞాత సాహిత్యాల్ని వెలికితీసిన అముద్రిత గ్రంథ చింతామణులు, 'తెలుగు కవుల చరిత్రలు', ఆంధ్ర సాహిత్య చరిత్ర సంపుటాలు జాంబపురాణాల ఊసు ఎత్తలేదు.

ఇది మోసమైతే మరి అలాంటి సాహిత్య చరిత్ర విగ్రహాలను, ప్రగతిశీలవాదులు ఆధునిక సాహిత్య పితామహులుగా ఎందుకు పేర్కొంటున్నారు. ఇలా రెండు సహస్రాబ్దాలు పాత విధానంలోనే విజయవంతంగా గడిచిపోయాయి. సమాజం తిరిగి మత/కుల/నిరంకుశ/ ఆధిక్యాలలో కూరుకుపోతున్న ఈ సమయంలో సైతం ఇలాంటి పరిశోధనలు వేగంగా ముందుకు కదలకపోవడం ఆధునిక విషాదం.

మహత్తర పురాజ్ఞాపకాల నుండి ఈ మానవ జన్మ పరంపరని సుకృతంగా భావిం చే పవిత్ర భావన కొనసాగిస్తూ, సమాజం తమ మీద విధించిన శాపాన్ని, తమని నిర్దయగా అణచేసేవారిని ప్రశ్నించి నిలబడే తత్వాన్ని పొందడానికి చేసే యాత్రే జాంబపురాణం. ఆనందం (బుడ్డన్‌ఖాన్), అద్భుతభావన (సృష్టిజననం), తమ స్త్రీ దైవాలు బలహీనపడిన వైనం (ఆదిశక్తి నిర్వీర్యం), పురుషదైవ ఆవిర్భావం (పరమేశ్వరుడు) వీటి మధ్య అందరికన్నా బలశాలి, ధీశాలి తమ కుల పురుషుడు (తాతా జాంబవుడు) తమ చుట్టూ ఉన్న తమ పోషకులు, శూద్ర ప్రజల సయోధ్య-సామరస్యం-ఇవీ జాంబపురాణంలో కనిపించే ముఖ్యమైన అంశాలు వీటిని తమ పోషకులకు వినిపించడమే ఏకైక విధిగా డక్కలివారు బతుకీడుస్తున్నారు.

వంద విప్లవాల నిబద్ధత కలిగిన సామాజిక రాజకీయ కళాకారులతో వీళ్లు సమానం. వీళ్లు పూర్తికాలపు కళాకారులు. ఎలాంటి నిర్దిష్ట పారితోషికం అంటూ ఉండదు. పెడితే తింటారు. లేదా పస్తుంటారు. జాంబవ సంతతి వద్ద తప్ప వేరెవరి వద్ద సాహిత్యం (తిండి పదార్థాలు) అడుక్కోవద్దు. ఎందుకంటే వీరు వంట వండుకోకూడదు. మంచంపై పడుకోవద్దు. స్థిరమైన ఇల్లు ఉండవద్దు. కాగితంపై రాయకూడదు. సొంత వైద్యమే తప్ప ఏ వైద్యుణ్ణీ ఆశ్రయించవద్దు. సంచార జీవితమే గడపాలి. జీవిత సంచారంలోనే సంసారం. కథ చెప్పడం. రంజింపచేయడం. బోధించడం వీరి బతుకు...

-జయధీర్ తిరుమలరావు (ప్రధాన సంపాదకులు), ఎ.కె.ప్రభాకర్ (సంపాదకులు)
జాంబవులు లేదా అరుంధతీయులు గ్రామీణ వ్యవస్థలోనూ, ఉత్పత్తిరంగంలోనూ అద్వితీయులు. మహా శ్రామికులు. గ్రామాల్లో నాడు ప్రతి పంచాయితిలో, తీర్పులో, సమస్యలో అగ్రజులుగా (పెద్ద) పిలవబడేవారు. బోయిలుగా రాజ్యాలు ఏలినవారు. యుద్ధాలలో ఆరితేరినవారు, కట్టడాలు, నిర్మాణాలలో దక్షత పొందినవారు. అలాంటి మాదిగలు ఈనాడు ఆర్థికంగా తమకు ఉన్నా లేకపోయినా అప్పో సప్పో చేసి తమపై ఆధారపడి బతికే ఎనిమిది ఆశ్రిత కులాలను బతికిస్తున్నారు.

ఆ కులాలకి చెందిన కళాకారులను ఆదరిస్తున్నారు. ఐతే ఈ అంటరానికులాల వారికి, వారి ఆశ్రితులు మాత్రం ఈనాటికీ అంటరానివారే. మాలమాదిగ కులాలనుండి వచ్చిన సంస్కర్తలు ఈ విషయం గుర్తించలేదా. గుర్తించి కూడా మిన్నకుండిపోయారా. డా.బి.ఆర్.అంబేద్కర్ ఆలోచనల్లో, రచనల్లో కూడా కింది పొరల్లోని ఈ 'అంటరానితనం' భాగం కాలేదు. కాని ఆయన ఆలోచనలు, అధ్యయనం వెలుగులో ఈ సమస్యని గుర్తించవలసి ఉండింది. సమాజం పొరల్లో దాగి ఉన్న అంటరానితనం వల్ల అడుగు వర్గాల ప్రజలలో ఐక్యత సాధ్యం కావడంలేదు.

ఉద్యమాలు ఎన్ని వచ్చినా కొంతమేరకే మనగలుగుతున్నాయి. ఈ ఒక్క అంశం వల్ల మనదేశంలో మార్పు సాధ్యం కాకుండా పోతున్నదనిపిస్తుంది. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగాలని అగ్రవర్ణాలు కోరుకుంటున్నాయి. ఈ వ్యవస్థలోంచి విముక్తి పొందాలంటే అడుగువర్గాలలో ఐక్యత పెంపొందాలి. కేవలం రాజకీయ పోరాటం వల్లే ప్రజలు ఐక్యం కాలేరు. సాంస్కృతిక పోరాటం సమాంతరంగా జరగాలి. ఈ దేశంలో శుద్ధ వర్గవాదం, శుద్ధ కుల అస్తిత్వవాదం ఏదీ సరైన ఫలితం సాధించలేకపోవచ్చు.. అంటరానితనం ఒక గీత. దీన్ని మలపాలనేవారు ఒకవైపు, కొనసాగాలనేవారు మరోవైపు. దీని అస్తిత్వంపై రేపటి భారతీయ సమాజం స్వరూప స్వభావాలు ఆధారపడి ఉన్నాయి.

- గ్రంథ సంపాదకవర్గం
(త్వరలో వెలువడనున్న 'డక్కలి జాంబపురాణం' సంపాదకీయాలలోని కొన్ని భాగాలు)

No comments:

Post a Comment