Sunday, September 4, 2011

ధైర్యంగా ఆలోచించు, ధైర్యంగా ఆచరించు! అన్న-----మంద కృష్ణమాదిగ Namasethe Telangana News Paper 28/7/2011


ఏ ఉద్యమంలోనైనా అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకుంటూ, సామాజిక న్యాయ లక్ష్య సాధనకు దోహదపడే విధంగానే మాపావూతను నెరవేరుస్తామే కానీ పై అంశాలను విస్మరించం. కుల వ్యవస్థ ఉన్న ఈ సమాజంలో ఏ అంశమైనా కులానికి అతీతం కాదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది కావున సామాజిక అంశాన్ని ప్రస్తావించకూడదు అనడం అగ్రకుల ఆధిపత్యాన్ని
కాపాడుకునే వారి దృక్పథం. ప్రజాస్వామిక చైనా విప్లవ నిర్మాత ‘మావో’ స్ఫూర్తిని కొనసాగించే క్రమంలో ‘ఎమ్మార్పీఎస్’ మాదిగ అణగారిన కులాల పక్షాన వారి హక్కులను సాధించడానికి వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి నిరంతరం పోరాడుతూనే ఉంది.

అంతేకాకుండా మానవత, ప్రజాస్వామ్య దృక్పథంతో ఎమ్మార్పీఎస్ నడిపిన నిరుపేద గుండె జబ్బు పిల్లల ఉద్యమం అంతిమంగా ఆరోగ్యశ్రీ పథకానికి దారితీస్తే, వికలాంగుల కోసం ముందుండి నడిపిన ఉద్యమం.. వారి పెన్షన్ పెరగడంతో పాటు మరిన్ని హక్కులను సాధించడానికి ఎమ్మార్పీఎస్ చేయూత నిచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ ప్రజల ఆకాంక్ష .ఈ ఆకాంక్షను 2001లోనే గుర్తించి, డా. బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను, అందులో భాగంగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ మద్దతుగా నిలబడింది. అలాగే వచ్చే తెలంగాణ అగ్రకులాల అధికారాన్ని చెలాయించే విధంగా కాకుండా, అణగారిన కులాల ఆకాంక్ష నెరవేరే విధంగా ఉండాలనీ ఎమ్మార్పీఎస్ ప్రజాస్వామిక తెలంగాణ సాధించుట కొరకు సైకిల్ యాత్రల ద్వారా వేల కిలోమీటర్లు తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసే దిశగా బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించింది.

కేవలం ఎన్నికల ద్వారానే తెలంగాణ సాధించవచ్చన్న కొంత మంది అగ్రకుల నాయకులతో ఎమ్మార్పీఎస్ సైద్ధాంతికంగా మొదటినుంచి విభేదిస్తోంది. ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ రాజకీయంగా ఒక శక్తిగా చేసే ప్రయత్నం ద్వారా తెలంగాణ సాధించవచ్చన్న అభివూపాయాన్ని ఎమ్మార్పీఎస్ బలంగా నమ్ముతుంది.అయితే.. ఎన్నికలే నమ్ముకొని పొత్తులతో 2004లో 50 స్థానాలకు గాను 26 స్థానాలు గెలిచి 2009 లో 50 పోటీ చేసి 10 మాత్రమే గెలువగలిగింది టీఆర్‌ఎస్ రాజకీయ లక్ష్యం చాలా బలహీనపడిన సమయంలో టీఆర్‌ఎస్ అధినేత ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిస్తే అందరికంటే ముందు మద్దతు ఇచ్చి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించింది ఎమ్మార్పీఎస్. ఎమ్మార్పీఎస్ భౌగోళికంగా తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు.

రాయలసీమ, కోస్తాంధ్ర, ప్రాంతంలోనూ చాలా బలంగా ఉంది. డిసెంబర్ 9 కేంద్ర ప్రభుత్వం ప్రకటన తర్వాత తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంవూధలో ఉండే అగ్రకుల రాజకీయనేతలు బలం గా అడ్డు తగులుతున్న సమయంలో,రాజీనామాలు సంధించి ప్రజలను సమైక్యాంవూధకు మద్దతుగా బలంగా కూడగడుతున్న సమయంలో తెలంగాణకు మద్దతుగా ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు కొనసాగించి ఉద్యమాలు చేస్తూ సీమాంధ్ర ప్రాంతంలో దెబ్బలు తిని, జైలుపాలైంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలే. శ్రీకృష్ణకమిటీ నివేదికలోనే అన్ని కులాలతో పాటు మాలలు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తుంటే.. ఒక మాదిగలే సమర్ధిస్తున్నారని తమ నివేదికలో పొందుపరచటం జరిగింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విషయంలో మా నిజాయితీ నిరూపితమైంది.

మాదిగల కోసం వర్గీకరణ ఉద్యమం అయినా, ముస్లింలకు గుజరాత్‌లో అన్యాయం జరిగినప్పుడు వారికి అండగా నిలబడే విషయంలోనైనా, మాదిగల కంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డ ఉపకులాల విషయంలోనైనా, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లు, రిజర్వేషన్లు సాధించే విషయంలోనైనా, గుండె జబ్బు పిల్లల వికలాంగుల హక్కుల విషయాల్లో .. ఆదుకునే విషయంలోనైనా, బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ నక్సలైట్ అమరవీరుల అంత్యక్షికియలల్లో పాల్గొనే విషయంలో నైనా, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీల ప్రజా సంఘాలకంటే ముందు, ఎన్నో రెట్లు ఎమ్మార్పీఎస్ ముందు వరుసలో నిలబడింది. ఆ విధంగా ై‘దెర్యంగా ఆలోచించు! ధైర్యంగా ఆచరించు!!’ అన్న మావో స్ఫూర్తిని ఎమ్మార్పీఎస్ ఆచరిస్తూనే ఉంది. భవిష్యత్తులో కూడా ఏ విషయంలోనైనా ఈ దృక్పథాన్నే కొనసాగిస్తుంది.


అయితే మేం పాల్గొనే ఏ ఉద్యమంలోనైనా సామాజిక న్యాయానికి నష్టం జరుగకుండా, అడుగడుగునా వేయి కళ్లతో నిరంతరం చూసుకోవడం ద్వారా మా అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రయోజనాలను కాపాడుకోవటం మా బాధ్యత అవుతుంది. ఈ దృక్పథమే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో మా వైఖరిగా ఉంటుందని స్పష్టం చేస్తున్నం. అదే సమయంలో మా పాత్ర అది ఏ ఉద్యమంలోనైనా అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకుంటూ, సామాజిక న్యాయ లక్ష్య సాధనకు దోహదపడే విధంగానే మాపావూతను నెరవేరుస్తామే కానీ పై అంశాలను విస్మరించం. కుల వ్యవస్థ ఉన్న ఈ సమాజంలో ఏ అంశమైనా కులానికి అతీతం కాదు.

తెలంగాణ ఉద్యమం ఉదృతంగా జరుగుతుంది కావున సామాజిక అంశాన్ని ప్రస్థావించకూడదు అనడం అగ్రకుల ఆధిపత్యాన్ని కాపాడుకునే వారి దృక్పథం. సామాజిక న్యాయాన్ని , ఆత్మగౌరవాన్ని ప్రస్థావించడం అణిచివేయబడ్డ కులాల సామాజిక దృక్పథం. సామాజిక అంశాలు చర్చకు రాకుండా చూడటం అగ్రకులాల స్వార్థమైతే, సామాజిక అంశాన్ని చర్చకు పెట్టి తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల (90 శాతం) ప్రయోజనాలను కాపాడుకోవటం, అన్ని రంగాల్లో 90 శాతం వాటా సాధించుకోవటం మా ప్రయోజనాలకు అనుగుణమైనది. ఈ వైరుధ్యం ఇప్పుడు మొదలైంది కాదు. జాతీయోద్యమ కాలంలో కొనసాగిన విషయం మర్చిపోవద్దు. కొంతమంది అన్నట్లుగా ముందుగా సీమాంధ్ర వలసాధిపత్యంతో నుంచి విముక్తిని కోరుకుందాం.

ప్రజాస్వామిక, సామాజిక న్యాయం తెలంగాణ తెచ్చుకున్నంక సాధ్యం అవుతుందని మాట్లాడటం చూస్తే పోరాటంలో భాగంగానే మాట్లాడుకోవాల్సిన కొన్ని అంశాలను పరిష్కరించుకోవాల్సిన కొన్ని ఆంకాంక్షలను, కుదుర్చుకోవాల్సిన కొన్ని ఒప్పందాలను వాయిదా వేయటం తప్ప మరొకటి కాదు. వాయిదా వేయాలను కోవటం అగ్రకులాల దృక్పథం. వాయిదా పడకుండా చూసుకోవటం అణచివేయబడ్డ కులాల దృక్పథం. జాతీయోద్యమ కాలంలో ముస్లింలు వారికంటూ ప్రధాన ఎజెండా పెట్టుకొని జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఈ దేశంలో ఉండబడే అణగారిన కులాల పక్షాన ముఖ్యంగా దళితులు, గిరిజనుల పక్షాన డా. బీఆర్ అంబేద్కర్ ముందువరుసలో నిలబడ్డాడు.

స్వాతంత్య్రం కంటే ముందే కొన్ని ప్రాంతాలను కలిపి ముస్లింలకు ప్రత్యేక దేశం ఇవ్వాలని చెప్పి ముస్లింల పక్షాన నిలబడ్డ జిన్నా తీసుకొచ్చిన ఒత్తిడే పాకిస్తాన్ మనకంటే ఒక రోజు ముందే స్వాతంత్య్ర దేశంగా అవతరించింది. ఇది వాస్తవం కాదా? దళిత, గిరిజనుల పక్షాన నిలబడ్డ అంబేద్కర్ ‘స్వాతంత్య్రం వస్తే మాకేం వస్తదో ముందే తేల్చండి’ అని బ్రిటిష్ ప్రభుత్వాన్ని జాతీయోద్యమ కారులను నిలదీయటం వల్లే అది కమ్యూనల్ అవార్డ్ కు , తద్వారా గాంధీతో జరిగిన పూనా ప్రజావూపాతినిధ్య ఒప్పందం, తదనంతరం ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల విధానానికి దారి తీయలేదా? ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు దళిత, గిరిజనులు అనుభవిస్తున్న వాటాను పొందింది. స్వాతంత్య్రం కంటే ముందు జరిగిన ఒప్పందంలో భాగం కాదా? ఇప్పుడు ఈ వర్గాలకు సామాజిక న్యాయం సంపూర్ణంగా అమలు జరగక పోవచ్చునేమో కానీ జరిగిన సామాజిక న్యాయం స్వాతంత్య్రం కంటే ముందే సాధించుకున్న విషయం మరిచిపోవటం సహేతుకమేనా? స్వాతంవూత్యానంతరం బిసిలకు సామాజిక న్యాయాన్ని అందించగలమన్న ఆనాటి జాతీయోద్యమ నాయకుల వారసులే ఈనాటికీ పరిపాలిస్తున్నా బిసిలకు 50 శాతం చట్టసభల్లో ప్రాతినిధ్యం ఈ నాటికీ కల్పించబడలేదు. అంటే ముందుగా అప్రమత్తం కాకపోతే కొన్ని వర్గాలు ఏ విధంగా మోసపోతరో.. ఈ దేశంలో 50 శాతంగా జీవిస్తున్న బలహీనవర్గాల పరిస్థితే మన కళ్లకు కనిపిస్తున్న సాక్ష్యం.

ఇక ఈ దేశంలో కుల వ్యవస్థ కొనసాగడం వలన ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కులం అంటూ ఉండక తప్పదు. అయితే ఈ కుల వ్యవస్థ వల్ల నష్టపోయిన వర్గాలు బాధపడ్డ వర్గాలు కుల వివక్షతకు వ్యతిరేకంగా కుల నిర్మూనలకోసం పోరాటం చేయటం కూడ తప్పదు. ఒక వ్యక్తి కుల నిర్మూలనంటే.. కుల తత్వవాదా? కులం అనేది ఆయన పుట్టుకతో సంబంధం లేదు. ఆయన ఆచరణతో సంబంధం ఉంది. ఇక్కడ యాదిడ్డికి, చందర్‌రావుకి, హరీష్‌రావుకి కులం ఉంది. కానీ యాదిడ్డికి ఒక్క అమ్మా ఉందని, ఆ అమ్మ వంట తింటే తన లక్ష్యం మారుతుందేమో నీ యాదిడ్డి స్వయంగా రాశాడు.

యాదిడ్డి రాయడాన్ని మీరు గుర్తు చేయటం బాగానే ఉంది. యాదిడ్డి అమ్మ చేతి వంటలో లక్ష్యం నుంచి పక్కదారి పట్టించే పదార్థం ఉన్నదేమో నని మీరు భావించారేమో కానీ..,తెలంగాణ కోసం అసువులు బాసిన 600 మంది ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ వర్గాల బిడ్డలకు కూడ అమ్మలు ఉన్నారు. ఆ అమ్మల చేతి వంట తిన్నా కూడా త్యాగాల బాటే నడిచారు. వాళ్ల అమ్మల కంటే తెలంగాణ కోసమే ప్రాణత్యాగాలు చేసిన సందర్భం ఉన్నది. ఇక్కడ యాదిడ్డి మరణాన్ని , ఇషాన్‌డ్డి , వేణుగోపాల్‌డ్డి మరణాన్ని వారి కులం కోసమో, కుల దురహంకారం కోసమో చేశారు అని ఎవరూ అనలేదు. మేమూ అనలేదు.కానీ ఆ ముగ్గురు చనిపోయినప్పుడే బంద్‌లు ప్రకటించిన అగ్రకుల జాక్, టీఆర్‌ఎస్ నాయకత్వం , 600 మంది అణగారిన వర్గాల బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే బంద్ పిలుపులు ఎందుకు ఇవ్వలేదో అనేదే మా ప్రశ్న.

ఇవ్వక పోవటం అంటే .. ఆ ముగ్గురి త్యాగాలను ఆకాశానికి ఎత్తి చూపటం , 600 మంది అణగారిన వర్గాల బిడ్డల త్యాగాలను వారి భౌతికకాయాలతో పాటు వారి త్యాగాలను కూడా సమాధి చేయటమే కాదా?
ఇక్కడ చందర్‌రావు గారి భార్య చెప్పెత్తి చూపెట్టడాన్ని తెలంగాణ వాళ్ల అందరికి వర్తించే విధంగానే కొంతమంది చూస్తున్నారు. ఆమె చెప్పెత్తింది తన భర్త మీద దాడి చేసి అవమానించిన హరీష్‌రావు దొర మీద మాత్రమే. దాడి చేసిన వాళ్లమీద చెప్పెత్తటం , దాడి చేసిన వాళ్లను ఎదుర్కోవటం దళితమహిళల పోరాట సంప్రదాయంగానే ఉన్నది. మీరు చెప్పిన కారంచేడులోనే దళిత మహిళ సువార్తమ్మ గ్రామ అగ్రకుల భూస్వాములపైనే చేతుల ఉన్న బిందతో ఎదురు తిరిగింది. కాళ్లకు ఉన్న చెప్పును విసిరింది. మా ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి , మా మాన ప్రాణాలను సంరక్షించుకోవడానికి అది తెలంగాణలో నైనా, ఆంధ్రాలోనైనా , రాయలసీమలోనైనా , దేశంలో మరెక్కడైనా ముందుగా మాకు ఆయుధంగా ఉండేది మేం కుట్టిన చెప్పే.


దురహంకారంతో చేసిన దాడిని ‘సారీ’తో కప్పి పుచ్చలేం. ఇక్కడ ప్రధాన నిందితుడుగా ఉన్న ఏపీ భవన్ అధికారి రజిత్ భార్గవ్ అగ్రకుల అధికారిని చర్చలతో సరిపెట్టి, చందర్‌రావు మీదికి వెళ్లేటప్పుడే ఎంత దురహంకారంతో వెళ్లాడో ? ఏవిధంగా దుర్భాషలాడాడో! ఎంత దుర్మార్గంగా తన్నాడో.. దేశ రాజధాని మీడియా సాక్ష్యంగా ప్రపంచమే చూసి నివ్వెరపోయింది. ముఖ్యంగా తెలంగాణలో ఉండబడే అ గారిన కులాలు తెలంగాణ రాకముందే ఈ దొరల దౌర్జన్యాలు ఈ స్థాయిలో ఉంటే.. తెలంగాణ వచ్చాక ఈ దొరల దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉంటాయో.. అని ఈ వర్గాలు భయాందోళనలకు గురైన మాట వాస్తవమే. ఎందుకంటే గతంలో ఈ అగ్రకుల ఆధిపత్య అహంకారానికి బలైన ఈ అణగారిన వర్గాలకు భయం ఉండటం సహజమే. చందర్‌రావును తన్ని కూడా సారీ చెప్పి ఈ రోజు తప్పించుకోవాలను కునేటోల్లు , రేపు తెలంగాణ వస్తే మా వర్గాలను చంపి కూడా సారీ తో తప్పించుకోగలరు.

మా వర్గాల మీద ఎవరు దాడిచేసినా, దౌర్జన్యాలు చేసినా ,తప్పించుకోజూసే ఏ మార్గానై్ననా మేం అంగీకరించం. హరీష్‌రావే కాదు, ఇంక ఎంతటి వారైనా..మామీద దౌర్జన్యం చేస్తే జైలుకు వెళ్లాల్సిందే. శిక్ష అనుభవించాల్సిందే. తెలంగాణ సెంటిమెంట్ ముసుగులో దొరలు తమ ఆధిపత్యాన్ని అణగారిన వర్గాలపై కొనసాగించాలని చూస్తే మాకు తెలంగాణ సెంటిమెంటు కంటే అణచివేయబడ్డ కులాల ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవటం, అంతకంటే కోటి రెట్లు ముఖ్యమని మేం విశ్వసిస్తున్నాం. మేం తెలంగాణకు అనుకూలమే. అయితే.. దొరల రాజ్యానికి దారితీసే ఎలాంటి పరిణామానికి మేం అంగీకరించం.
‘జాతుల స్వయం నిర్ణయాధికారం కోసం జరుగుతున్న పోరాటాన్ని బలపరచటం తోపాటు అదే సందర్భంలో దోపిడీ , అసమానతలను తగ్గించడానికి దోహదపడే విధంగా ఉండటం కోసం మనం జాగ్రత్త వహించాల’ ని అన్న రష్యా సోషలిస్ట్ నిర్మాత జోసఫ్ స్టాలిన్ మాకు ఆదర్శం.
-మంద కృష్ణమాదిగ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు

No comments:

Post a Comment