Sunday, September 4, 2011

చుండూరు దళితుల న్యాయపోరాటంచుండూరు మారణకాండ జరిగి 20 ఏళ్లు అయ్యింది. నాటినుంచీ నేటి దాకా..బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అడుగడుగునా ఎదురౌతున్న అన్యాయ అడ్డంకులను అదిగమిస్తూ.. ధర్మపోరాటం చేస్తూనే ఉన్నారు. ఆధునిక భారతావనిలో..అత్యంత హేయమైన, అమానవీయ ఘటనగా.. చరివూతపుటల్లో నిలిచిన ఘట న చుండూరు మారణకాండ. పచ్చని కోస్తా పంటపొలాల్లో.. నెత్తు పారించిన అగ్రకుల దురహాంకారం బడుగుజీవులపై కన్నెర్ర జేసి కత్తులు దూసింది. ఎనమిది మంది ప్రాణాలను బలిగొంది. నాటినుంచీ నేటి దాకా.. చుండూరు దళితులు అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో.. న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. చుండూరు హత్యాకాండ ఆగష్ట్ 1991న జరిగింది. ఒక పద్దతి ప్రకారం, ప్రణాళికా బద్దంగా.. చుండూరు దళిత వాడను దాదాపు 500 మంది అగ్రకుల భూస్వాములు చుట్టుముట్టారు. రక్షకభటులుగా పిలుచుకొనే.. పోలీసుల సమక్షంలోనే.. మారణాయుధాలు, కొడవళ్లు, కత్తులతో.. దాడి చేశారు. దళితులను వెంటాడి, వేటాడి.. నరికి చంపారు.ఏకంగా మూడు గంటలు హత్యకాండ సాగించారు. హంతక మూకలు నింపాదిగా.. హత్యచేసిన దళితులన శవాలను గోనె సంచుల్లో కట్టి నీటి కాలు ల్లో పడేశారు. కొన్ని మృతదేహలను బుదలో పూడ్చిపెట్టారు. ఈ మారణకాండలో.. ఎనమిదిమంది చనిపోగా.., అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దళితులపై జరిగిన ఈ మారణకాండపై దేశవ్యాప్తంగా.. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో తో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు చుండూరు మారణకాండకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. ప్రజల వత్తడికి తలొగ్గిన ప్ర భుత్వం స్పెషల్ కోర్టును ఘటన జరిగిన చుండూరులోనే ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది.
మారణకాండ జరిగిన తర్వాత చుండూరులోనే ఏర్పాటైన స్పెషల్ కోర్టులో రెండున్నర ఏళ్లు విచారణ జరిగింది. 70 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. 239 డాక్యుమెంటల్ ఎవిడెన్స్, 51 మెటేరియల్ ఆబ్జెక్స్ట్(హత్యాకాండకు ఉపయోగించిన ఆయుధాలు, వస్తువులు)ను కోర్టుముందు ఉంచారు. విచారణ జరిగిన 16 ఏళ్ల తర్వాత జూలై 31, 2007 న తీర్పునిచ్చింది.మొత్తం 179 మంది నిందితులు.. విచారణ ఎదుర్కొనగా.. 56 మందిని కోర్టు దోషులగా తీర్పునిచ్చింది. ఇందులో 21 మందికి జీవిత ఖైదు విధించింది. మిగతా 35 మందికి ఒక సంవత్సరం శిక్ష, రెండు వేల రూపాయల జరిమానాతో సరిపుచ్చింది. ఈ మొత్తం న్యాయపోరాటంలో.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర గురించి ఇక్కడ చెప్పుకోవాలి.వైఎస్‌ఆర్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధితుల పక్షాన ఉండి నింధితులకు శిక్షపడేలా చూడాల్సింది పోయి.., నిందితులను రక్షించేందుకు శాయశక్తులా పనిచేశారు. కేసులో ముద్దాయిలుగా.. ఉన్న 116 మందిపై హత్యాకాండలో పాల్గొన్నట్లు తగినన్ని సాక్ష్యాధారాలున్నా.. వారిపై పై కోర్టుకు అప్పీలు చేయకుండా.. తన వర్గ స్వభావాన్ని చాటుకున్నారు. భారత దేశ న్యాయచరివూతలో ఎక్కడా, ఎన్నడూ లేనట్లు.. 114 మం దిని వదిలిపెట్టి ఇద్దరిపైన మాత్రమే పై కోర్టుకు అప్పీలు చేశాడు. విచారణ తతంగాన్ని గమనించిన చుండూరు పోరాట కమిటీ.. న్యాయకోసం హైకోర్టును ఆశ్రయించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరింది.
తర తరాలుగా సామాజిక అణిచివేతకు బలిఅవుతున్న దళితులకు కోర్టులలో కూడా న్యాయం దక్కడం లేదని చుండూరు దళితులు వాపోతున్నారు. కొసమెరుపు ఏమంటే.. చుండూరు మారణకాండ జరిగి ఇరవై ఏళె్లైనా.. ఆనాటి మారణకాండలో పాల్గొన్న నిందితుల్లో.. ఏడుగురు ఇంకా పరారీలో ఉన్నారని, వారు దొరకడం లేదని పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చుండూరు బాధితుల పోరాట కమిటి బాధితుల పక్షాన నిలిచి పోరాడుతోంది. ఈక్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. నిర్భంధాలను చవిచూసింది. మారణకాండలో తన వాళను పోగొట్టుకున్న వాళ్లు న్యాయం కోసం ఇరవై ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు
-జాలాది మోజెస్
అధ్యక్షులు, చుండూరు బాధితుల సంఘం

No comments:

Post a Comment