Sunday, September 4, 2011

తొలి లక్ష్యం 'భౌగోళిక'మే - చిక్కుడు ప్రభాకర్ Andhra Jyothi 16/08/2011


తొలి లక్ష్యం 'భౌగోళిక'మే
- చిక్కుడు ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉద్ధృతమౌతోంది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఉద్యమకారులు 'దొరల తెలంగాణ వద్దు, సామాజిక తెలంగాణ' కావాలని అంటున్నారు. వీరివలే ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న మానవ సమగ్ర వికాస భావజాల స్ఫూర్తిమంతులైన నాయకులు ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ కావాలని అంటున్నారు. ఈ రెండో వర్గం వారు ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ వచ్చేవరకు భౌగోళిక తెలంగాణ వద్దని అనడం లేదు; భౌగోళిక తెలంగాణ కొరకు కూడా పోరాడాలనేదే వారి భావన. ఈ నేపథ్యంలో భౌగోళిక, సామాజిక, ప్రజాస్వామిక, దొరల తెలంగాణ వాదనల గురించి సమగ్రంగా చర్చించాల్సిన అవసరమున్నది.
ప్రత్యేక తెలంగాణను కోరుకొంటోన్న నాలుగు కోట్ల ప్రజల వాస్తవ చరిత్ర, వర్తమాన గమనాన్ని చర్చించకుండా భవిష్యత్‌ను అర్థవంతంగా నిర్వచించుకోలేం. రకరకాల తెలంగాణాల గూర్చి చర్చించే ముందు రెండు ముఖ్య విషయాలను ప్రస్తావించుకోవల్సివుంది. అవి: (అ) 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ, భారతదేశంలో విలీనమయ్యేనాటికి కొన్ని శతాబ్దాలుగా రాజుల పాలనలో ఉన్నది. 1948 నుంచి 1956 వరకు స్వతంత్ర రాష్ట్రంగాఉన్న ఈ ప్రాంతం దొరల పాలనలో ఉన్నది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిననాటి నుంచి రెండు దశాబ్దాలపాటు దొరల పాలనలోనే మగ్గింది.
ఈ దొరలు, సీమాంధ్ర భూస్వాములు, పెట్టుబడిదారులు, ఉన్నతాధికార వర్గం అందరూ కలిసి తెలంగాణ జనాభాలో 90 శాతంగా ఉన్న అణగారిన కులాలవారిని మనుషులుగా చూడలేదన్నది వాస్తవం. సీమాంధ్రుల పాలననుంచి విడివడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికై 1969లో తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళన చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆ ఉద్యమాన్ని పాశవికంగా అణచివేశారు. దాదాపు నాలుగువందల మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
1971 పార్లమెంటరీ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి అత్యధిక స్థానాలను గెలుచుకున్నది. అయితే ఆ 'సమితి' నాయకత్వం సీమాంధ్ర భూస్వాములు, పెట్టుబడిదారులతో కుమ్మక్కవడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగిపోయింది. తత్ఫలితంగా నేటివరకు మనప్రాంతంలోనే మనం రెండవ తరగతి పౌరులుగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1969 ఉద్యమంలో అగ్రభాగాన నిలబడిన విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావి వర్గాలవారు తెలంగాణలోని భూస్వామ్య దౌష్ట్యాలకు వ్యతిరేకంగా పోరాటాలను కొనసాగించారు.
గ్రామాల్లో దొరలు పీడిత ప్రజల మీద చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ పోరాటాల ఫలితంగానే 1978 నాటికి గ్రామ గడీలలోని దొరలు పట్టణాలకు వలసపోయారు. ఆ పోరాటాలు పల్లెలలోని పీడిత ప్రజలందరినీ ఏకం చేసి అంటరానితనం, వెట్టి, బాలకార్మిక వ్యవస్థను పారదోలగలిగింది. దళిత, ఆదివాసి, గిరిజన, వెనుకబడిన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించ సాగారు.
భూమిలేని నిరుపేదలకు దొరల భూములను పంచడాన్ని అరికట్టే క్రమంలో ప్రభుత్వ భద్రతా దళాలు వందలాది పోరాటకారులను కాల్చి చంపాయి. 1995 నాటికి ఆ భూములను ఎస్‌సి కార్పొరేషన్, బిసి కార్పొరేషన్ మొదలైన సంస్థల ద్వారా కొని దొరలకు వాటి విలువ చెల్లించింది. ఆయా భూములను వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలకు కేటాయించడం వల్ల తెలంగాణ గ్రామ భూ సంబంధాలలో మార్పు వచ్చింది కానీ నిరుపేదలకు భూమి దక్కలేదు.
(ఆ) తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తెలంగాణ జిల్లాల్లోని పరిశ్రమలు, హైదరాబాద్ నగరంలోని పరిశ్రమలను మూయించి వేశారు. ఆ పరిశ్రమలకు చెందిన వేలాది ఎకరాల భూములను సీమాంధ్ర పెట్టుబడిదారులకు చౌకగా విక్రయించారు. అలా దక్షిణ తెలంగాణలోని లక్షలాది ఎకరాల భూములను నేడు రియల్ఎస్టేట్ బిల్డర్స్, సినిమా స్టూడియోలు, రిసార్ట్స్, వివిధ పరిశ్రమలకు, ఫామ్ హౌజ్‌లకు ప్రభుత్వం కేటాయించింది. మణికొండ, కోకాపేట, నానక్‌రామ్‌గూడలో మైనారిటీల, దళితుల, వెనుకబడినవర్గాలవారి భూములు సీమాంధ్ర పెట్టుబడిదారుల పరమయ్యాయి.
దీంతో తెలంగాణలోని స్థానిక భూస్వాములు కనుమరుగయిపోయి 'నయా భూస్వామ్యం' ఆవిర్భవించింది. ఇది తెలంగాణ ప్రజల పట్ల గుదిబండగా తయారైంది. ఈ నయా భూస్వామ్యం వేలకోట్ల రూపాయల ఆస్తులు కలిగి హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని దక్షిణ, ఉత్తర భారతదేశాలను శాసిస్తున్నది. సీమాంధ్రకు చెందిన ఈ నయా భూస్వాములు తెలంగాణను సకలం దోచుకొని కుబేరులయ్యారు. ఈ ప్రాంత జనాభాలో 90 శాతంగా ఉన్న అణగారిన కులాల వారికి కూడు, గూడు, గుడ్డ కలిగి హుందాగా జీవించే అవకాశం లేకుండా చేశారు.
అలాగే జంటనగరాలలోని 30 శాతం ముస్లిం ప్రజల సకల జీవనోపాధి వనరులు, అవకాశాలను సీమాంధ్రవారే స్వాధీనం చేసుకున్నారు. ఈ నయా సంపన్నుల అరాచకాల వల్ల ముస్లింల బతుకులు అతలాకుతలమయ్యాయి. నవ యవ్వనంలోని బాలికలను వృద్ధులైన అరబ్ షేక్‌లకు అమ్ముకోవల్సిన దుస్థితి హైదరాబాద్ ముస్లింలకు ఏర్పడింది. ఒక గ్రామీణ తెలంగాణకు చెందిన వేలాది ప్రజలు కన్న ఊరికి దూరమై ఎక్కడో ఉన్న నగరాలలో హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడుతున్నారు.
అంతేకాదు తెలంగాణ పోరాటం పట్ల అమానవీయ దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. వేలాది పోలీసు బలగాలను తెలంగాణలో మొహరించి, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న విద్యార్థులను అణచివేస్తున్నారు. వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడడమంటే తెలంగాణ ప్రాంత 90 శాతం ప్రజలు హుందాగా జీవించడానికి అడ్డుపడడమే.
ఇందుకు కారకులైన సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడడం మన అందరి తక్షణ కర్తవ్యం అనేది వాస్తవం. అటువైపు ప్రజలందరూ కదులుతున్నదీ వాస్తవం. ఇటువంటి తరుణంలో సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడి తొలుత భౌగోళిక తెలంగాణను సాధించుకోవాలి; ఆ క్రమంలోనే ఉద్యమ శక్తులు కోరుకొంటున్నట్లు సామాజిక, ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణను సాధించుకోవచ్చును.
కాగా సామాజిక ఉద్యమ శక్తులు ఒక వితండవాదం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో అగ్రవర్ణాల పాత్ర ఉన్నది కాబట్టి రేపు రాబోయే తెలంగాణ వారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి సామజికశక్తుల్లో చేతుల్లో ఉండే సామాజిక తెలంగాణ కావాలి. ఒక వేళ తెలంగాణ రాకున్నా ఫర్వాలేదు కాని తెలంగాణ వద్దు అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటాన్ని బలహీనపరుస్తున్నారు. అయితే సామాజిక తెలంగాణ గూర్చిగాని, సామాజిక న్యాయం గూర్చిగాని సామాజిక ఉద్యమ శక్తులు తెలంగాణ ప్రజలకు వివరిస్తున్నది శూన్యం. సామాజిక న్యాయపునాదిగా అభివృద్ధి చెందే తెలంగాణ గూర్చి, సామాజిక తెలంగాణ గూర్చి సంగ్రహంగా చెబుతున్నారు కానీ సమగ్రంగా చెప్పడం లేదు.
సామాజిక న్యాయపునాది లేదా సామాజిక తెలంగాణ అంటే 'ఈ ప్రాంతంలో దొరికే సకల వనరులు, ఉద్యోగాలు, ఉత్పత్తి సాధనాలు, రాజకీయ పదవులు మొత్తం జనాభాలోని ఆయా కులాల నిష్పత్తి ప్రకారం స్వేచ్ఛగా అందరికీ అందే అవకాశం కలిగిన తెలంగాణ'గా తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అంశాన్ని విస్మరిస్తున్నారు.
అలాగే అటువంటి తెలంగాణలో 'సామ్రాజ్యవాద, బహుళజాతి, బడా పెట్టుబడిదారుల దోపిడీ లేకుండా స్వయం సమృద్ధి సాధిస్తూ ఈ ప్రాంత ప్రజలు రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలుజరిగి స్వేచ్ఛగా జీవించే ప్రజాస్వామిక తెలంగాణ కావాలని ప్రజాస్వామిక తెలంగాణను కోరే శక్తులంటున్నాయి. సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల కబంధ హస్తాల నుంచి భౌగోళిక తెలంగాణ సాధించుకున్న తర్వాతనే ఉద్యమ శక్తులు అంటున్న సామాజిక లేదా ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సాధ్యం కాని ఇప్పుడెలా సాధ్యం?
సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులు తెలంగాణ రైతాంగానికి సంబంధించిన భూమి, నీటిని దశాబ్దాలుగా కొల్లగొడుతున్నారు. తత్కారణంగా భూమిలేని నిరుపేదలకు భూమి దక్కలేదు. నీటిపారుదల సదుపాయాలను అభివృద్ధి చేయలేదు. పరిశ్రమలన్నీ మూసేశారు. సింగరేణి లాంటి పెద్ద పరిశ్రమలో 80 శాతం అధికారులు సీమాంధ్రకు చెందిన వారుండడం ద్వారా ఓపెన్‌కాస్ట్ గనులు పెరిగి కార్మికులు రోజురోజుకు తగ్గుతున్నారు. ఇప్పటికే 1,25,000నుంచి 60,000 కుదించబడినారు.
ఈ కార్మికులలో 95 శాతం దళిత, అణగారిన కులాలకు చెందిన వారన్నది వాస్తవం. తెలంగాణ ప్రజలకు కనీస వనరులు దక్కాలన్నా సీమాంధ్ర భూస్వామ్య ఆధిపత్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి 'భౌగోళిక తెలంగాణ'ను సాధించుకోవల్సిందే. స్వాతంత్య్రానికి పూర్వం అంబేద్కర్ 'ఈ దేశ స్వాతంత్య్రంలో మా వాటా ఎంత? స్వాతంత్య్రం వస్తే మా అణగారిన కులాలకు దక్కేదేమిటని' బ్రిటీష్ పాలకులను, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. మన సమాజంలో కుల వ్యవస్థ బలంగా ఉండి శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన కూడా జరిగిందనేది వాస్తవం.
పునాదిలో కులం, వర్గం రెండూ ఉండడం ద్వారా జమిలిగా చేసే మహత్తర పోరాటం ద్వారా ఆ రెండు వ్యవస్థలను నిర్మూలించగలుగుతాము. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కుల మతవర్గాల తేడా లేకుండా పోరాడి ప్రజలు డిసెంబర్ 9 ప్రకటనను సాధించుకున్నారు. సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులు తెలంగాణను అడ్డుకునేందుకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మావోయిస్టులు ఉన్నారని, వారి ఎజెండానే టిఆర్ఎస్ అమలుచేస్తుందనే ప్రచారం చేసి కేంద్రాన్ని నమ్మించారు. నిజమేమిటి? తెలంగాణ పోరాటం ప్రజా పోరాటం.
అందులో ఒక భాగమే రాజకీయాలు, రాజకీయ పార్టీలు తప్ప సమస్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షేనన్నది ఉద్దేశపూర్వకంగా సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆ విషయాన్ని దాటవేస్తున్నారు. ఏమైనా డిసెంబర్ 9 ప్రకటన అమలుకు జరుగుతోన్న పోరాటం కీలక దశకు చేరుకుంది. ఈ తరుణంలో మనమందరం ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా ఏకోన్ముఖ పోరాటం నడపాల్సిన అవసరం ఉన్నది. ఆ పోరాటం ద్వారానే కేంద్రం దిగివస్తుంది. రేపు సామాజిక తెలంగాణగా కానీ, ప్రజాస్వామిక తెలంగాణగా కానీ రూపుదిద్దుకునేందుకు మంచి 'భౌతిక పునాది' ఇక్కడ ఉన్నది.
నాలుగు కోట్ల ప్రజలు సమృద్ధిగా జీవించే సకల వనరులు ఉన్నాయి. ఈ వనరుల ద్వారా తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చేసుకొని దేశానికేకాక ప్రపంచానికే ఆదర్శం కావచ్చు. ఈ మహత్తర అవకాశాన్ని వదిలి వాస్తవానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే చరిత్రలో తప్పుచేసిన వారిగా మిగిలిపోతాం. కనుక భౌగోళిక తెలంగాణ ఏర్పాటు సామాజిక లేదా ప్రజాస్వామిక తెలంగాణకు మొదటి మెట్టుగా లేదా ముందు షరతుగా భావించి సకల ప్రజల సమ్మెను జయప్రదం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలి.
- చిక్కుడు ప్రభాకర్

No comments:

Post a Comment