Sunday, September 4, 2011

మన త్యాగాలు మనకు మేలు చేసేనా? - మంద కృష్ణ మాదిగ Andhra Jyothi News Paper 18/08/2011


మన త్యాగాలు మనకు మేలు చేసేనా?
- మంద కృష్ణ మాదిగ
తెలంగాణ రాష్ట్ర సాధనకై పెద్దఎత్తున ఉద్యమం జరుగుతోంది. తెలంగాణ జనాభాలో 10 శాతంగా ఉన్న అగ్రకులాలవారితో బాటు 90 శాతంగా ఉన్న ఎస్‌సి, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలవారు కూడా ప్రత్యేక తెలంగాణను కోరుకుంటున్నారు. తెలంగాణేతర ప్రాంతాల్లోనూ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపర్చేవారు, చిన్న రాష్ట్రాల ఏర్పాటును స్వాగతించేవారిలో ఎస్‌సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచే ఎక్కువ మంది ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 90 శాతం వర్గాలు అనబడుతున్న ఎస్‌సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు త్యాగపూరితమైన పాత్ర పోషిస్తుంటే 10 శాతంగా ఉన్న అగ్రకుల వర్గాలు మాత్రమే మొత్తం ఉద్యమానికి నాయకత్వం వహించే పాత్ర కనిపిస్తున్నది.
అణగారిన వర్గాలు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నారనడానికి, ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్న 614 మందిలో 611 మంది ఎస్‌సి, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారుకావడమే నిదర్శనం. కేవలం ముగ్గురు మాత్రమే అగ్రవర్ణాలకు చెందినవారు. దీనిని బట్టి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అణగారిన వర్గాలు 99.50 శాతమైతే అగ్రకులాలు కేవలం 0.50 శాతం మాత్రమే. బూర్జువా వర్గాల నాయకులే జాతుల పోరాటాలకు నాయకత్వం వహిస్తారని ఆనాడు స్టాలిన్ చెప్పినట్లే ఇప్పుడు జరుగుతోన్న తెలంగాణ పోరాటానికి బూర్జువాలే (అగ్రకులాలు) నాయకత్వం వహిస్తున్నారు. ఉదా:- టిఆర్ఎస్ అధినేత, కె.సి.ఆర్. (వెలమ), టి.డి.పి. నుంచి ఎర్రబెల్లి దయాకరరావు (వెలమ), కాంగ్రెస్ నుంచి జానారెడ్డి ముందు వరసలో ఉంటే తెలంగాణ జేఏసీ నుంచి కోదండరామ్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించడం జరుగుతున్నది.
తెలంగాణలోని అణగారిన వర్గాల వారు చేస్తోన్న త్యాగాలే ఉద్యమాన్ని కీలకదశకు తీసుకువెళ్ళాయి. అగ్రకులాల వారు మాత్రం ఎలాంటి త్యాగాలు చేయకుండా రాబోయే తెలంగాణలో అధికారం ఎట్లా చేజిక్కించుకోవాలనే విషయమై వ్యూహరచనలో ఉన్నారు. తెలంగాణ ఏర్పడితే అది దొరల రాజ్యం కాకుండా దొరల ఆధిపత్యం లేని సామాజిక తెలంగాణగా ఏర్పడాలని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు కోరుకుంటున్నారు. కాగా అగ్రకులాల వారు తెలంగాణను తన గుత్తసొత్తుగా భావించుకుని ప్రాతినిధ్యాన్ని మరింత పెంచుకుని అణగారిన వర్గాలను అన్నిరంగాల్లో వెనుకకు నెట్టేసే విధంగా తమ రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి తెలంగాణ ఉద్యమ ముసుగులో ఇప్పటి నుండే పన్నాగాలు పన్నుతున్నారు.
డాక్టర్ అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లు చట్టసభలలో ఉండడం వలన ఎస్‌సి, ఎస్టీలకు తగు విధమైన కనీస ప్రాతినిధ్యం దొరుకుతుంది. ఎస్‌సి, ఎస్టీలకు కేటాయించిన రాజకీయ రిజర్వేషన్ స్థానాలను ఎస్‌సి, ఎస్టీయేతరులు కొల్లగొట్టే అవకాశం లేదు. కానీ బీసీలకు. మైనార్టీలకు చట్టసభలలో రిజర్వేషన్ లేకపోవడం వలన జనరల్ స్థానాలలో మాత్రమే వారు తమ న్యాయమైన వాటా పొందాలి. అయితే రాజకీయ పార్టీలు అగ్రకుల భూస్వాముల నాయకత్వంలో ఉండడం వలన అగ్రకులాల వారికే టిక్కెట్టు ఇస్తున్నాయి. ఆ కులాలు తమ జనాభాను మించి చట్ట సభలలో ప్రాతినిధ్యాన్ని పొందుతూ బి.సి. ముస్లింలకు రావాల్సిన వాటాను కొల్లగొడుతున్నాయి.
జాతీయోద్యమ కాలంలో ప్రత్యేకంగా అణచివేతకు గురైన దళితులు, గిరిజనులు అంబేద్కర్ నాయకత్వంలో చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించుకున్నారు. అయితే బి.సి.లను అనాడే అగ్రవర్ణాల నాయకులు మోసగించారు. ఆనాడు మోసపోయిన బలహీనవర్గాలు నేటివరకు దేశంలో మోసపోతూనే ఉన్నాయి. స్వాతంత్య్రపోరాటం అనంతరం మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో 50 శాతం ఉండాల్సిన బి.సి.ల ప్రాతినిధ్యం 5 శాతం కంటే మించలేదు. అది కాంగ్రెస్ నాయకత్వంలో జరిగిన స్వాత్రంత్య పోరాటమైనా, సమసమాజాన్ని కోరే కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమైనా ఏ పేరుతో పోరాటాలు జరిగినా ఆ పోరాట రాజకీయ ఫలాలు అందుకున్నది మాత్రం అగ్రకులాలే. నిన్న జరిగిందదే! నేడు జరుగుతున్నదీ అదే!! రేపు మనం మేల్కోకపోతే జరగబోయేది కూడా అదే!!!
ఈ వాస్తవాలను చూడండి: 1) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన అనంతరం హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో రాజకీయ లబ్దిపొందినది అగ్రవర్ణాలవారేనని చరిత్ర సాక్ష్యం చెప్పింది. 2) తెలంగాణ ఆంధ్రలో విలీనమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన 1956 నుంచి 2009 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో రాజకీయ లబ్దిని పొంది రాష్ట్రాన్ని నిరంతరాయంగా పరిపాలిస్తున్నది అగ్రవర్ణాలవారేనని రుజువైంది. నిజాం పరిపాలన అనంతరం హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు మొదలుకొని హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రలో విలీనమై ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డ నవంబర్ 1, 1956 నుం,ఇ నేటివరకు మూడు ప్రాంతాల నుండి ముఖ్యమంత్రులైన వారందరూ మధ్యలో సంజీవయ్య పాలన రెండు సంవత్సరాలను మినహాయిస్తే అగ్రవర్ణాలవారే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.
ఒకవైపు దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటం జరుగుతుంటే మరోవైపు నిజాం పరిపాలనలో జరుగుతున్న దోపిడీ, వివక్షలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 1946 మొదలై 1951 వరకు కొనసాగింది. నైజాం వ్యతిరేక పోరాటం గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య దేశ్‌ముఖ్ జాగీర్దార్ల వ్యతిరేక పోరాటంగా కొనసాగింది. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కూలీరేట్ల పెంపుదల కోసం పోరాటం కొనసాగినా అది కౌలుదారుల హక్కుల రక్షణకోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంగా దేశంలో గుర్తింపు కొచ్చింది. ఈ పోరాటం నిజాం సైన్యానికి, రజాకార్ల అఘాయిత్యాలకు భూస్వామ్య గూండాల ఆగడాలను ప్రతిఘటిస్తూ కేంద్ర ప్రభుత్వ సైనిక దళాల అణచివేతకు వ్యతిరేకంగా కూడా పోరాడింది. తెంలగాణలోని దాదాపు మూడువేల గ్రామాలలో రైతాంగ పోరాటం సాగింది. తాము ద్వేషించే భూస్వాములను గ్రామాల నుంచి, కోటలవంటి వారి గడీల నుంచి, గృహాల నుంచి ప్రజలు తరిమివేశారు. వారి పొలాలను రైతాంగం పంచుకుంది. కొంత మేరకు వెట్టిచాకిరీ రద్దైంది. వ్యవసాయ కార్మికుల రోజు కూలీ పెంచబడింది.
ఈ మహత్తర సాయుధ రైతాంగ పోరాటంలో దాదాపు నాలుగువేల మంది అమరులయ్యారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణలోని నల్గొండ వరంగల్ తదితర కొన్ని జిల్లాల్లో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని కూడా అధిగమించి ప్రజలు 1952లో హైదరాబాద్ స్టేట్‌లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించారు. పార్లమెంటుకు పోటీచేసిన రావి నారాయణరెడ్డికి దేశంలోనే ఎవరికీ రాని మెజారిటీ వచ్చింది. అత్యధిక ఓట్లు పొందినవారిలో అచ్చాలు అనే ఎస్.సి. మాదిగ రెండోస్థానంలో ఉండగా భారతప్రధాని నెహ్రూ మూడో స్థానంలో ఉన్నారు. దీన్ని బట్టి తెలంగాణ సాయుధ పోరాట ప్రభావం ప్రజలపై నాడు ఏ స్థాయిలో వుందో రుజువయ్యింది.
1920లోనే విస్నూరి దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పేద ముస్లిం రైతు బందగి సాగించిన పోరాటం అత్యంత వీరోచిత పోరాటాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 1945-51 తెలంగాణ పోరాటంలో అశేష ప్రజాదరణ చూరగొన్న నాటికలో బందగికి శాశ్వతస్థానం కల్పించబడిన చరిత్ర మనందరికి తెలుసు. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడకముందే భూస్వాములకు వ్యతిరేకంగా ముస్లిం యువకుడైన బందగీ నడిపిన పోరాటం తెలంగాణలోని పీడిత వర్గాలకు స్ఫూర్తినిచ్చింది.
ఇంకా పుచ్చలపల్లి సుందరయ్య మాటల్లో చెప్పాలంటే పేరుమోసిన దేశ్‌ముఖ్ విస్నూరు రామచంద్రారెడ్డిపై చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం, సాధించిన విజయం తెలంగాణ ప్రజలకు ఉత్తేజాన్నిస్తే 1946 జూలై 4న విస్నూర్ దేశ్‌ముఖ్ గుండాలు జరిపిన కాల్పుల్లో అమరుడైన దొడ్డి కొమరయ్య ఆత్మార్పణం అమరత్వం తెలంగాణ రైతాంగంలో నిద్రాణమైవున్న ఆగ్రహాన్ని ప్రజ్వరిల్లచేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రారంభాన్నిచ్చింది.
సాయుధ పోరాటంలో భాగంగా దాదాపు 4వేల మంది అసువులు బాసారు. మరి ఆ నాలుగు వేల మంది అమరులలో 95 శాతం పైగా ఎస్‌సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారే. బడుగు వర్గాల వారు ఆ పోరాటంలో ప్రాణ త్యాగాలు చేస్తే 1952లో జరిగిన ఎన్నికల్లో రాజకీయ ప్రాతినిధ్యం ఏ వర్గాలకు దక్కిందో చూడండి. వ్యాసంలో ఇచ్చిన పట్టికను బట్టి పోరాటాల త్యాగాలు నూటికి 95 శాతం అణగారిన వర్గాలు చేస్తే ఆ పోరాట రాజకీయ ఫలాలు అందుకున్నది మాత్రం అగ్రకులాలేవారేనని రుజువయ్యింది. అంటే సాయుధ రైతాంగ పోరాటంలోనే కమ్యూనిస్ట్ పార్టీగా పిలవబడ్డ ఎర్రజెండా పార్టీలలోనే అగ్రకుల ఆధిపత్యం ఎంత ఉందో వారు దక్కించుకున్న రాజకీయ ఆధిపత్యమే తేల్చేసింది.
పైన తీసుకొచ్చిన వాస్తవ విషయాలను ఈరోజు ప్రజలముందు పెట్టడమంటే ఆనాడు జరిగిన సాయుధపోరాటాన్ని - ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వారిని అవమానించడానికి కాని, నిందలు వేయడానికి కాదు. అగ్రకుల నాయకుల త్యాగాలను అందులో పాల్గొన్న అగ్రకుల ప్రజల త్యాగాలను గుర్తిస్తాము, గౌరవిస్తాము. వెట్టిచాకిరి కొంతమేరకు రద్దుకావచ్చు. వ్యవసాయ కూలీలకు కొంతమేరకు కూలీ రేట్లు పెరగవచ్చు. కాని పంచబడ్డ లక్షలాది ఎకరాల భూమిలో 80శాతం పైగా రైతాంగం పేరుతో అగ్రవర్ణాలకే దక్కింది.
కౌలుదారులకు పట్టాలు రావడం వల్ల అగ్రవర్ణాల రైతాంగానికే భూములమీద హక్కు దొరికింది. అంతే కాకుండా తెలంగాణ పీడిత వర్గాల త్యాగాలవల్ల వచ్చిన రాజకీయ ప్రాతినిధ్యం నూటికి 80 శాతం అగ్రవర్ణాలకే దక్కింది. అది పచ్చినిజం. పోరాటంలో పాల్గొన్నవారి అందరి త్యాగాలు గౌరవిస్తూనే పోరాట ఫలాలు అన్నివర్గాలకు న్యాయబద్ధమైన పంపిణీలో ఏమేరకు దక్కాయో కూడా చూసుకోవడంతోబాటు సమన్యాయం ఎందుకు జరగలేదో తెలుసుకోవలసిన అవసరం మా అణగారిన వర్గాలకు ఎంతైనా ఉంది.
అంతేకాకుండా అందరి త్యాగఫలాలు కొందరే ఎందుకు పొందగలిగారో, అందులో నాయకత్వపరమైన సంస్థాగతమైన బాధ్యతలను నిర్వర్తించవలసినవారు తమ బాధ్యతలను ఏమేరకు విస్మరించారో ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఆనాడు నాయకత్వం వహించిన ఈనాటి వామపక్ష పార్టీలకు ఉంది. నాడు కమ్యూనిస్టులు నాయకత్వం వహించిన సాయుధ రైతాంగ పోరాటంలోనే పీడిత కులాలకు వర్గాలకు రాజకీయ పరమైన వాటా దక్కలేదు. మరి నేటి దొరల నాయకత్వంలో తెలంగాణే ఏర్పడితే ఎస్.సి, ఎస్.టి., బి.సి, మైనార్టీ వర్గాలకు అన్ని రంగాలలో తగు విధమైన న్యాయమైన వాటాదక్కే అవకాశం ఉంటుందా? దొరల నాయకత్వంలో టి.ఆర్.యస్ ఏర్పడి 10 సంవత్సరాలు దాటింది.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రామస్థాయి టిఆర్ఎస్ కమిటీల నుంచి మొదలు రాష్ట్ర కమిటీ వరకు 70 శాతం పైగా దొరలే నాయకత్వం వహిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలను భ్రమల్లో పెట్టడానికి ఏవిధంగా హామీల వర్షం కురిపిస్తారో ఆ తర్వాత వారిని ఏవిధంగా మోసం చేస్తారో ప్రతి ఎన్నికల సందర్భంగా ఇప్పటికే రుజువైంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు పీడిత కులాలు చేస్తున్న త్యాగాలను ఏ విధంగా దొరలు తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారో ఇప్పటికే తేటతెల్ల మైంది.
మన శ్రమ, మన త్యాగాలనే వారి రాజకీయ అభివృద్ధికి మెట్లుగా ఉపయోగించుకుంటున్న విషయం మనం మరిచిపోరాదు. మెజారిటీ జనం మనది. తెలంగాణ కోసం 95 శాతం పైగా త్యాగాలు మనవి. అధికారం మాత్రం అగ్రకులాల దొరలకా? స్వాత్రంత్య పోరాటంతో పాటు నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన అన్యాయం - నేటి తెలంగాణ రాష్ట్రపోరాటంలో జరగకుండా చూసుకోవడమే పీడితకులాల ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
తెలంగాణ దొరల గుత్త సొత్తేంకాదు! తెలంగాణ అణగారిన కులాలదే!!
- మంద కృష్ణ మాదిగ

No comments:

Post a Comment