Sunday, September 4, 2011

తెలంగాణను దొరలేలబోతుండ్రు జర జాగ్రత్త....! మందకృష్ణ మాదిగ Surya News Paper


తెలంగాణను దొరలేలబోతుండ్రు జర జాగ్రత్త....!
దామాషా ప్రకారం దక్కని వాటాలు
అగ్రకులాలదే ఆధిపత్యం
ఎస్సీ, ఎస్టీలకు దక్కని పదవులు
బీసీ, మైనారిటీలకు దక్కని రాజకీయ రిజర్వేషన్లు
సామాజిక తెలంగాణ సాధనే శరణ్యం
తెలంగాణ రాష్ట్ర సాధనకు జరుగుతున్న ఉద్యమం కీలక దశకు చేరినట్లుగా బయటకు కనుపిస్తున్నది ఒక వాస్తవం మాత్రమే. మరో కోణంలో ఇంకా లక్ష్య సాధనకు నిర్దిష్ట కార్యాచరణ అమలుకు చేయాల్సిన నిరంతర పోరాటాలు, శత్రువును ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించే అసలైన అంతిమ పోరాటం ఇంకా చాలా మిగిలే ఉంది. ఈ లక్ష్య సాధనకు లక్షలాది మందిని ఉద్యమంలో భాగస్వాములను చేయడానికి తమ పాటలతో ఉర్రూతలూగించే విధంగా ప్రజలను యుద్ధానికి సన్నద్ధం చేస్తున్న కళాకారులతో బాటు పోరాటంలో భాగంగా లాఠీ దెబ్బలు తిన్నవారు, కేసులతో జైళ్ళపాలైన వేలాదిమంది విద్యార్థులు, యువకులు, నాయకులు పిలిచిందే తడవుగా తమ అన్ని పనులు మానుకొని సభలకు వచ్చే లక్షలాది మంది ప్రజలు, తమ కలల్ని సాకారం చేసుకోవడానికి తమ ఊపిరినే ఫణంగా పెడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న వందలాదిమంది విద్యార్థులు 98 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలవారే అన్నది జగమెరిగిన సత్యం.
జాతుల పోరాటాలు పైకి అందరికోసం జరుగుతున్నట్టు కనుపిస్తున్నా, ఆ పోరాటాలకు నాకయకత్వం వహిస్తున్న బూర్జువా శక్తుల ప్రయోజనాలే వారికి ముఖ్యం తప్ప అందరి ప్రయోజనాలు అందులో నెరవేరవని, జాతుల పోరాటాలకు మద్దతుగా ఉంటూనే అందులో పాల్గొంటున్న తమ కార్మిక వర్గ (పీడిత కులాల) ప్రయోజనాలను కాపాడుకునేందుకు సంఘటితంగా కదలాలని స్టాలిన్‌ చెప్పిన విషయాలను తెలంగాణలోని 90 శాతం పీడిత కులాలవారు, వారి నాయకులు మరచిపోరాదు.
కుల వ్యవస్థ కొనసాగుతున్న ఈ దేశంలో సామాజిక అంశంతో ముడిపడి ఉన్న సమస్యల్ని పరిగణనలోకి తీసుకోకపోతే తర్వాత ఆ వార్గాలే నష్టపోతాయని అంబేడ్కర్‌ చెప్పిన విషయాన్ని మరచిపోవద్దు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానం స్ఫూర్తిదాయకంగా ఉంటేనే అణగారిన కులాల పక్షాన మనం నిలబడ్డవాళ్ళమవుతాము.
తెలంగాణ పోరాటంలో పాల్గొంటున్న అణగారిన వర్గాలకు చెందిన నాయకులు కూడా తమ సామాజిక వర్గాల ప్రయోజనాలు కాక దొరలు చెప్పిందే వేదమన్నట్టుగా వారి పక్కన కూర్చోవడమే గొప్ప వరం అన్నట్టుగా భావిస్తూ తెలంగాణ లోని వారి సామాజిక వర్గాల ప్రయోజనాలను ఫణంగా పెట్టడం జరుగుతోంది.
దొరలతో మిలాఖతె్తైతే తమ వ్యక్తిగత ప్రయోజనాలు (పదవులు, డబ్బు) తాత్కాలికంగా నెరవేర గలవేమొ గాని తమ జాతులకు రావలసిన న్యాయమైన వాటా వీరి స్వార్ధం వల్ల దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తమ జాతుల భవిష్యత్తును ఫణంగా పెట్టే స్వార్ధపరులను గమనిస్తూ పీడిత కులాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
వేదికలు ఎక్కి పాటలు పాడే కళాకారులు తమ సామాజిక వర్గాల ప్రయోజనాలు కూడా లేని పాటలు పాడడం, వేదికలపై అగ్రకుల నాయకులతో కూర్చున్న అణగారిన వర్గాల నాయకులు తమ సామాజిక వర్గాల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించడం, ఉద్యమంలో దెబ్బలు తిని, కేసులపాలై, జైళ్ళపాలైన కింది సామాజిక వర్గాల విద్యార్ధులు, యువకుల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక పోడడం విషాదాలలో కెల్ల విషాదం. తమ సామాజిక వర్గాల ప్రయోజనాలను చూసుకోలేని కళాకారుల పాటలు, తమ వర్గాలకు రావలసిన న్యాయమైన వాటా అడగని నాయకుల ఉపన్యాసాలు, అణగారిన విద్యార్ధి, యువకుల ఆత్మహత్యలు- తెలంగాణలో దొరల ఆధిపత్యం మరింత పెరగడానికి దోహదపడుతున్నాయి.
ఏ ఉద్యమంలోనైనా మనం పాల్గొనేటప్పుడు మనకు వర్గ దృష్టి- స్టాలిన్‌లా- ఉండాలి. ఓ మహాత్మా ఫూలేలా, ఓ అంబేడ్కర్‌లా అణగారిన సామాజిక వర్గాల ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం నిరంతరం స్పందిస్తూ ఉండాలి. స్టాలిన్‌, మావోల ఆలోచనలు, వారి దృఢ సంకల్పం మన మాటల్లో, చేతల్లో ఉన్నాయో లేదో ఆత్మపరిశీలన చేసుకుంటూ నేటి ఉద్యమాలలో పాల్గొనవలసి ఉన్నది.
స్వాతంత్య్రం వస్తే అన్ని వర్గాల సమస్యలు పరిష్కారం అవుతాయని నాటి జాతీయోద్యమ కాంగ్రెస్‌ అగ్రకుల నాయకులు పెట్టిన భ్రమల్లో కొట్టుకెళ్ళడం వల్ల ఈ దేశ మెజారిటీ పీడిత వర్గాలు ఇప్పటికీ మోసపోతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాలి. దొరలు పెట్టే ఎంగిలి మెతుకులకు (పదవులు, డబ్బు) దాసోహమనడం మానుకోవలసిన అవసరం అణగారిన వర్గాల నాయకులకు ఉన్నది.
జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్‌ అగ్రకుల నాయకులను నమ్ముకుంటే, నమ్మినవారినే నేటికీ మోసగిస్తూ వస్తున్న సంగతి- బీసీ, మైనారిటీలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ లేని విషయంలో రుజువైంది. అయితే, తెలంగాణ రాకుండానే టీఆర్‌ఎస్‌ దొరల మాటలు నమ్మిన వివిధ సామాజిక వర్గాలు ఏ విధంగా మోసానికి గురవుతాయో, దొరల మాటలకు- చేతలకు ఎంద వ్యత్యాసం ఉన్నదో ఇప్పటికే ప్రజలందరికీ అర్ధమవుతూనే ఉంది.
తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అని దళిత వర్గాలను భ్రమల్లో పెడుతున్న ఈ దొరల బూటకపు మాటలకు మోసపోవద్దు. టీఆర్‌ఎస్‌ ఏర్పడ్డ ఈ 10 సంవత్సరాల కాలంలో తమ పార్టీకి జిల్లా స్థాయిలో ఒక దళితుణ్ణి అధ్యక్షునిగా నియమించని దొరలు, రేపు తెలంగాణ వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామంటే, దళిత ప్రజల ప్రయోజనాలు కోరుకునేవారెవరూ సిద్ధంగా లేరు. 6 శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను తెలంగాణ వస్తే 12 శాతం చేస్తామన్న దొరల మాటలకు అర్ధమే లేదు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు తమ జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లను పొందే హక్కును రాజ్యాంగం దేశ వ్యాప్తంగా కల్పించింది. రేపు తెలంగాణ ఏర్పడినా రిజర్వేషన్లలో తమ జనాభా దామాషా పరమైన వాటా పొందే హక్కు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉన్నది.
టీఆర్‌ఎస్‌ దొరలు నిజంగా గిరిజన వర్గాల ప్రయోజనాలను గౌరవించేవారే అయితే, రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో వారు చేసిన సందర్భంగా ఆరు మంత్రి పదవులూ వారే తీసుకుని అందులో గిరిజనులకు ఒక్క పదవిని కూడా ఇవ్వలేదు. ఆదిలాబాద్‌ జిల్లా ఎస్టీ నియోజకవర్గం నుంచి గెలిచిన గోండు సామాజిక వర్గానికి చెందిన సోయం బాబూరావుకు గాని, ఖానాపూర్‌ ఎస్టీ నియోజకవర్గంనుంచి మూడు సార్లు గెలిచిన ఎస్టీ- లంబాడా తెగకు చెందిన గోవింద్‌ నాయక్‌కు గాని మంత్రి పదవుల్లో అవకాశం కల్పించకుండా, అప్పటికి శాసన సభ్యుడే కాని తన అల్లుడైన హరీష్‌రావుకు మంత్రి పదవి కట్టబెట్టడం గిరిజన వర్గాలను వంచించడం, మోసం చేయడం కాదా?
తెలంగాణ వస్తే మైనారిటీలకు పెద్ద పీట వేస్తామని, ఉప ముఖ్యమంత్రిని కూడా చేస్తామని మైనారిటీలను నమ్మించే ప్రయత్నం చేయడం శుద్ధ దండుగ. తెలంగాణలో 12 శాతానికి పైగా ఉన్న ముస్లింలకు నేడు హైదరాబాద్‌ మినహాయిస్తే, తెలంగాణలోని ఏ జిల్లాలో కూడా వారి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఈ రోజు ముస్లిం ప్రాతినిధ్యం శాసన సభలో గాని, పార్లమెంట్‌లోగాని ఉన్నదంటే అది వారి సొంత పార్టీ అయిన ఎం.ఐ.ఎం. ద్వారా సాధించుకున్నదే తప్ప, ఏ పార్టీ వల్లనో, లేదా టీఆర్‌ఎస్‌ వల్లనో కాదు.
2004, 2009 ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్‌తో, మరొకసారి టీడీపీతో పొత్తు పెట్టుకుని 50 అసెంబ్లీ స్థానాలకు, 7 పార్లమెంట్‌ స్థానాలకు పోటీచేసిన టీఆర్‌ఎస్‌ ముస్లింలకు ఒక్కసీటు కూడా కేటాయించలేదు. ఇటువంటి టీఆర్‌ఎస్‌ దొరలు వారిని ఉపముఖ్యమంత్రులుగా చేయగలరా? ముస్లింల దగ్గరకు వెళ్ళినప్పుడు వారి తెల్ల టోపీని ధరించినంత మాత్రాన ముస్లింలకు శ్రేయోభిలాషులో, మిత్రులో కాదు. అన్ని రంగాలలో ముస్లింల ప్రాతినిధ్యాన్ని అంగీకరించి, అమలు చేయడం ద్వారానే వారు ముస్లింలకు మిత్రులు, శ్రేయోభిలాషులు అవుతారు.
తెలంగాణలో 50 శాతం జనాభా గల బీసీల ప్రయోజనాలను టీఆర్‌ఎస్‌ దొరలు విస్మరిస్తూనే వస్తున్నారు. 2004 ఎన్నికల్లో గాని, 2009 ఎన్నికల్లో గాని బీసీలకు న్యాయబద్ధమైన వాటా ఇవ్వదలచుకుంటే, 25 సీట్ల చొప్పున ఇవ్వాలి. కాని 5 ఒకసారి, 6 ఒకసారి మాత్రమే ఇచ్చారు. బీసీలకు రావలసిన వాటా 50 శాతం అయితే, టీఆర్‌ఎస్‌ ఇచ్చింది 10 శాతం మాత్రమే. బీసీలకు రావాల్సిన 40 శాతం, ముస్లింలకు రావాల్సిన 12 శాతం సీట్లను వారికి ఇవ్వకుండా ఆ అవకాశాన్ని అగ్రకులాల వారికే ఇవ్వడం జరిగింది. డా వై.ఎస్‌. హయాంలో మంత్రివర్గంలో చేరిన టీఆర్‌ఎస్‌, మంత్రివర్గ పదవుల్లో రెండు ఎస్సీలకు ఇచ్చి, 2 రెడ్లు, 1 బ్రాహ్మణ, 1 వెలమ సామాజిక వర్గాలకు ఇవ్వడం జరిగింది.
జనాభాలో 10 శాతం గల అగ్రకులాలవారికి 4 మంత్రి పదవులు కేటాయించిన టీఆర్‌ఎస్‌ నాయకత్వం, జనాభాలో 50 శాతం గల బీసీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం బీసీలను దారుణంగా వంచించడమే. అంతేకాకుండా, అప్పటికే ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు ఉండగా, బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను టీఆర్‌ఓస్‌లోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కెప్టెన్‌ లక్ష్మీకాంతరావుకు కట్టబెట్టారు. టీఆర్‌ఎస్‌ చేసే సామాజిక న్యాయం ఇదేనా?
ఈ అంశాలను పరిశీలిస్తే, టీఆర్‌ఎస్‌ దొరలకు బీసీల విషయంలో గాని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విషయంలో గాని ఎలాంటి సానుకూల దృక్పథం లేదని రుజువయింది. అగ్రకుల ప్రయోజనాలు కాపాడుతామని టీఆర్‌ఎస్‌ ఏనాడూ చెప్పక పోయినా అన్ని అవకాశాలలో వారికే పెద్ద పీట వేయడం జరిగింది.
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలారా, నాయకులారా, డా అంబేడ్కర్‌ చిన్న రాష్ట్రాల ఉద్యమాన్ని బలపరిచాడు. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిద్దాం. అందుకు వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. వచ్చే తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం బడుగు, బలహీన కులాలవారు తమ హక్కులు తాము అనుభవించే విధంగా ఉద్యమించాల్సి ఉంది. అంతేకాని ఏ దొరల మాటలో నమ్మి మన బాధ్యతను విస్మరించరాదు. ఇప్పుడు విస్మరించిన అంశాలే రేపటి తెలంగాణలో మన ప్రయోజనాలను కాపాడుకోలేని అంశాలుగా మాని అవే మనకు, మన వర్గాలకు అన్నిరంగాల్లోను నష్టం తీసుకు వచ్చే విధంగా మళ్ళీ మన ముందుకు వస్తాయి.
అప్పుడు మళ్ళీ మన కనీస హక్కుల కోసమే పోరాడే అనివార్య పరిస్థితుల్లో పడతాము. ఆ పరిస్థితులు రాకుండా ఇప్పుడే మన సామాజిక బాధ్యతను గుర్తించి మన కర్తవ్యాన్ని నెరవేర్చుదాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలవారు సామాజిక దృక్పథంతో సంఘటితంగా సామాజిక తెలంగాణ సాధన దిశగా పోరాడే కర్తవ్యాన్ని నిర్వహించాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్టు బీసీ- ముస్లింలకు ఇప్పటికీ రాజకీయ రిజర్వేషన్లు లేవు. అవి లేనంతవరకూ ఈ వర్గాలవారికి రాజకీయ ప్రాతినిథ్యం న్యాయబద్ధంగా దక్కే అవకాశం లేదు. అగ్రకుల రాజకీయ పార్టీల దగ్గర సీట్లను అడుక్కునే పరిస్థితులే తప్ప ఒక హక్కుగా మనం అనుభవించలేము. చట్టసభలలో బీసీలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు అవసరమేనని అసెంబ్లీలో తీర్మానాలు చేసిన రాజకీయ పక్షాలు వాటిని పార్లమెంట్‌ ద్వారా అమలు చేయించే విషయంలోగాని, అంతవరకూ ఎతమ పార్టీలో 50 శాతం బీసీలకు, 12 శాతం ముస్లింలకు సీట్లు కేటాయించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ, ఆచరణలో ఈ వర్గాలకు వ్యతిరేకమైన వైఖరినే అమలు చేస్తున్న విషయం మరచిపోరాదు.
స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటి వరకూ అధికారంలో అగ్రవర్ణాలు ఉండి అన్ని రంగాల్లో వాళ్ళు ముందడుగు వేస్తూ సమాజ సంపదను కొల్లగొడుతూ చివరికి 90 శాతం మన వర్గాలను బానిసత్వంలోకి నెట్టివేస్తున్న పరిస్థితి కళ్ళముందే కనుపిస్తున్నది. ఈ పరిస్థితే కొనసాగుతూ ఉంటే, అది మనం చూస్తూనే ఉంటే, మనం అగ్రవర్ణాలకు బానిసలుగా మారే పరిస్థితి నిజంగానే వస్తుందనే విషయం విస్మరించరాదు. బానిసత్వ జీవితాలు గడపడం కంటె సామాజిక న్యాయం కోసం చేస్తున్న మన యుద్ధంలో ప్రాణాలైనా వదలడానికి సిద్ధపడవలసిన అవసరం ఉంది. అంతేగాని ఆత్మగౌరవం లేని జీవచ్ఛవాలుగా బతకాల్సిన అవసరమే లేదని పీడిత కులాల నాయకులకు, ప్రజలకు గుర్తు చేస్తున్నాం. ఇప్పటినుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొం టూనే మన స్వతంత్రతను, సామాజిక దృక్పథాన్ని నిర్దిష్టంగా ఎలుగెత్తి చాటుదాం.
అన్యాయాన్ని ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని దక్కించుకోగలం. అసమానతలను ఎదుర్కొనడం ద్వారానే సమానత్వాన్ని సాధించుకోగలం. చట్టసభతో బాటు అన్ని అన్ని రంగాల్లో తమ వాటా కొల్లగొడుతున్నా నిజమైన శత్రు సామాజిక వర్గాలను స్పష్టంగా గుర్తించి వారిని ఎదుర్కొనే పదునైన వ్యూహాలతో వారితో పోరాడి విజయాన్ని సాధించాలి. అగ్రకుల రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలంగాణ దొరల దురహంకార నిజ స్వరూపాన్ని గ్రహించి వారు కల్పించే ఆశలకు లొంగకుండా స్వతంత్రమైన సామాజిక దృక్పథంతో సంఘటితంగా ఉద్యమిద్దాం.
దొరల దురహంకారం లేని, దొరల ఆధిపత్యం లేని ఎలాంటి అసమానతలకు తావు లేని తెలంగాణను కోరుకుందాం. సామాజిక తెలంగాణ సాధన దిశగా ఇప్పటినుంచే మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం. అంతేకానీ తెలంగాణలో దొరలు తమ రాజ్యాన్ని స్థాపించడం కోసం చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా ఎండగడదాం- ఓడిద్దాం!
ఇట్లు
.
మీ మందకృష్ణ మాదిగ

No comments:

Post a Comment