Sunday, September 4, 2011

వర్గీకరణ తరువాతే తెలంగాణ - మందకృష్ణ మాదిగ Andhra Jyothi 19/07/2011


యస్.సి. రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జరుగుతున్న ఉద్యమం - ఈ రెండు కూడా ప్రజల ఆకాంక్షలను సాధించే ప్రజాస్వామిక ఉద్యమాలే. యస్.సి. సామాజిక వర్గాల్లోని అంతరాలను తొలగించడానికి రిజర్వేషన్ల ఫలాలు యస్.సి.ల్లోని ప్రతి సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రకారమే వర్గీకరించాలనేది అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణమైనది. యస్.సి.ల్లోని ఏ కులమైనా రిజర్వేషన్ల అవకాశాలను తమ జనాభా దామాషా నిష్పత్తి కంటే అదనంగా పొందడానికి అంగీకరించకూడదని, విద్య, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా రిజర్వేషన్లను పంచాలని అంబేద్కర్ నిర్మొహమాటంగా చెప్పారు.

ఆయన వివేక వాణి స్ఫూర్తిని తీసుకోకుండా మాలల్లోని కొంత మంది స్వార్థపరులు తమ రాజకీయ పలుకుబడి ద్వారా ఉన్నత ఉద్యోగ వర్గం రూపంలో ఎస్.సి. వర్గీకరణకు అడ్డుతగులుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటును స్వాగతించిన, సమర్థించిన అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎం.ఆర్.పి.యస్. బలపరుస్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారీ వర్గం అడ్డుకుంటున్న విషయం స్పష్టమౌతూనే ఉంది.

ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల అన్యాయం జరిగిన మాదిగలు, ఉపకులాలు తమకు దక్కాల్సిన న్యాయమైన వాటా వర్గీకరణ రూపంలో కోరుతుంటే సమైక్యాంధ్రలో కలిసినప్పటి నుంచి అన్ని రకాలు గా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఏ ర్పాటుకై ఉద్యమిస్తున్నారు. అ యితే వర్గీకరణను వ్యతిరేకించే కొంతమంది స్వార్థపరులు దళితుల ఐక్యత దెబ్బతింటుందనే ముసుగుతో అడ్డుకుంటున్నారు; అలాగే తెలంగాణను అడ్డుకునే శక్తులు కూడా తెలుగు ప్రజల ఐక్యత దెబ్బతింటుందనే సాకుతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అడ్డు తగులుతున్నారని తేటతెల్లం అవుతుంది.

ఎం.ఆర్.పి.యస్. వర్గీకరణ సాధించుకునే లక్ష్యంతో ఏర్పడ్డ సామాజిక ఉద్యమ సంస్థ. ఈ సంస్థ తన లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం పోరాడుతూనే ఇతర అణగారిన వర్గాల ప్రజల, ప్రజాస్వామిక డిమాండ్‌లను బలపరచే విషయంలో మొదటి నుంచి అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామిక దృక్పథంతో చాలా విషయాల మీద స్పష్టతతో నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల న్యాయమైన ఆకాంక్షలను బలపరుస్తూ వస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా ఎం.ఆర్.పి.యస్. మొదటి నుంచి బలపరుస్తుంది.

అయితే ఇక్కడ మేధావులు, ప్రజాస్వామిక వాదులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడ్డ సంస్థలు, పార్టీలు గుర్తించాల్సింది ఏమిటి? ఏదైనా ఒక సంస్థ లేదా పార్టీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏర్పడ్డప్పుడు ఆ లక్ష్య సాధన మీదనే ప్రధానంగా దృష్టిపెడుతూనే యితర ప్రజాస్వామిక డిమాండ్లను బలపరిచే విధంగా ఉండాలి. అంతేకాని ఆ సంస్థ తమ లక్ష్యాన్ని పూర్తిగా పక్కకు పెట్టి యితర ప్రజాస్వామిక, డిమాండ్ల సాధనకై నిరంతరం పోరాడాలా? ఇది ఏ సంస్థకైనా ఏ పార్టీకైనా సాధ్యమౌతుందా?

ఉదా : ఎం.ఆర్.పి.యస్. వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, గుర్తిస్తూ ఎన్నో ఉద్యమాలకు అండగా నిలబడింది. అట్లానే తెలంగాణ కోసం ఏర్పాటైన పార్టీలు/సంస్థలు ఆ లక్ష్యసాధన మీదనే ప్రధాన దృష్టి పెడుతూ యితర ప్రజాస్వామిక డిమాండ్లను బలపరిచే విధానంలో ప్రజాస్వామిక బద్ధంగా వ్యవహరించవచ్చు. మరో ఉదాహరణ : ఒక పార్టీగా టి.ఆర్.యస్. తెలంగాణ సాధించుకునే లక్ష్యంలో భాగంగా నిరంతరం ఆ అంశం మీదనే ప్రధాన దృష్టి పెడుతూ మా వర్గీకరణ అంశంతో పాటు ఇతర ప్రజాస్వామిక డిమాండ్లను బలపరచవచ్చు.

అంతేగాని తెలంగాణ లక్ష్య సాధనను పక్కకు పెట్టి ఇంకో అంశం మీద ప్రధాన దృష్టి పెట్టి నిరంతరం పనిచేసే విధానం ఆ పార్టీకి ఉండడం సాధ్యమేనా? అనేది ఆలోచించాలని మేధావి వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాకే తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలన్న మా డిమాండ్‌ను మా కోణంతో పాటు వాస్తవ దృక్పథంతో అవగాహన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రెండు అంశాలు (వర్గీకరణ, తెలంగాణ) కేంద్రం వద్ద పరిష్కారం కాకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఆ రెండు అంశాలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నా ముందుగా పరిష్కారం కావలసింది వర్గీకరణ అని వర్గీకరణ కోసమే ఏర్పడ్డ ఎం.ఆర్.పి.యస్. వర్గీకరణను ముందు కోరుకోవడం తప్పు ఎలా అవుతుంది? మేము కోరుకోవడానికి కావాల్సిన అర్హతలు, అవకాశాలు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని వాస్తవ దృష్టితో పరిశీలించాలి. అందుకు ఈ క్రింది అంశాలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఇవీ ఆ అంశాలు : (1) సామాజిక వివక్షను, అసమానతలను తొలగించుకోవడంలో భాగంగా హక్కుల సాధనకై వర్గీకరణ కోసం పోరాడుతున్న సామాజిక ఉద్యమ సంస్థ ఎం.ఆర్.పి.యస్. దీన్ని సామాజిక వివక్ష కోణంతో చూడండి.
(2) ప్రాంతీయ వివక్ష కోణంలో తెలంగాణ డిమాండ్‌ను చూడండి.
(3) సామాజిక వివక్ష, దోపిడీ మాదిగ ఉపకులాల ప్రజల మీద తెలంగాణలోను అటు సీమాంధ్రలోను కుల వ్యవస్థ ఏర్పడ్డప్పటి నుంచి నేటి వరకు కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది.
(4) ఇక ప్రాంతీయ వివక్ష, ప్రాంతీయ దోపిడీ తెలంగాణ ఆంధ్రలో విలీనం అయినప్పటి నుంచీ అంటే గత 55 సంవత్సరాల నుంచి మాత్రమే కొనసాగుతోంది.
(5) కుల వివక్ష నిర్మూలన సామాజిక న్యాయం కోసం గతంలో మాదిగ పెద్దల ఆధ్వర్యంలో ఎన్నోసంస్థలు ఏర్పడినా 1994లో ఎం. ఆర్.పి.యస్. ఆవిర్భావంతోనే బలమైన ఉద్యమరూపం దాల్చింది.
(6) అలాగే ఎన్నో సంస్థలు ఎన్నో పార్టీలు గతంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డా 2001లో టి.ఆర్.ఎస్. ఏర్పడ్డాకనే ప్రజల ఆకాంక్షకు రాజకీయ రూపం వచ్చింది. ఇందులో ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేదు.
సామాజిక వివక్ష, ప్రాంతీయ వివక్షకు సంబంధించి రెండు కోణాల్లో విశదీకరించి చూసినా వర్గీకరణే ముందు జరగాలని మేము కోరుకోవడం సమంజసమే అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అందుకు ఈ క్రింది అంశాలను గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
వర్గీకరణకు, తెలంగాణకు ఉన్న అనుకూలత వ్యతిరేకతలను పరిగణన లోకి తీసుకొని సహృదయంతో సామాజిక న్యాయకోణంలో ఆలోచించి మా వర్గీకరణ సమస్యను ముందుగా పరిష్కరించేందుకు తోడ్పాటును అందించాలని తెలంగాణను కోరే, బలపరిచే శక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

- మందకృష్ణ మాదిగ
ఎమ్.ఆర్.పి.ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు

No comments:

Post a Comment