Sunday, September 4, 2011

న్యాయం దొరకని వాకపల్లి ఆదివాసీ మహిళలపై అత్యాచారం జరిగి నాలుగేళ్లైన సందర్భంగా


న్యాయం దొరకని వాకపల్లి
ఈ కేసును తప్పుదోవ పట్టించటానికే అత్యాచారం జరిగిందో లేదో నిర్థారించుకోవటానికి బాధిత మహిళలకు ఫోరెనిక్స్ పరీక్షలు చేయాలన్నారు. వాస్తవంగా ఫోరెనిక్స్ పరీక్ష అనేది అత్యాచారం జరిగిన కొద్ది గంటలలోనే చేయవలసిన పని. పోలీసులు కుట్రతో 24 గంటలు దాటాక ఫోరెనిక్స్ పరీక్షలకు పంపారు. అలాంటప్పుడు అత్యాచారం జరిగింది అనే నివేదిక వచ్చే అవకాశం లేదు.
చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే భావంతో మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటయింది. అయితే ఆదివాసీలు అందుకు మినహాయింపుగా ఉన్నారు! నాలుగేళ్ళ క్రితం వాకపల్లిలో 11 మంది ఆదివాసీ మహిళలపై జరిగిన అత్యాచార సంఘటనే ఈ కఠోర వాస్తవానికి నిదర్శనం.
విశాఖపట్నం జిల్లా, మాడుగుల మండలం వాకపల్లి గ్రామం కోంథ్ తెగ ఆదివాసీలకు నెలవు. 2007 ఆగస్టు 19 తెల్లవారు జామున మావోయిస్టుల కూంబింగ్ పేరుతో గ్రేహౌండ్స్ దళాలు వాకపల్లిపై దాడి చేశాయి. ఒక్కసారిగా అమాయక ఆదివాసీ మహిళలపై తుపాకులు ఎక్కుపెట్టి, 11 మంది ఆదివాసీ మహిళలను తీసుకువెళ్ళి వారిపై సామూహిక అత్యాచారం జరిపారు. అత్యాచార బాధితులను ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం గూడెం నుంచి వెలివేశారు. ఆకలితో అలమటించే బిడ్డలకు పాలివ్వలేని ఆ తల్లుల ఆత్మఘోషను వినేదెవరు? ఈ ఘటన జరిగి నాలుగేళ్లు కావస్తున్నప్పటికీ ఆ మహిళలకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు.
ఈ సమాజ సృష్టికి మూలం స్త్రీ అని చర్రిత చెబుతుంది. అంత పవిత్రత గల స్త్రీకి భారత సమాజం ఏమేరకు న్యాయం అందించగలిగింది? భారతదేశంలో ఈ ఆదివాసీ స్త్రీలు భాగం కాదా? చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్నప్పుడు ఈ ఘటనలో పోలీసులను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు? అత్యాచారం జరిగిన ప్రదేశంలో అత్యాచారం జరిగినట్లు పసుపు దొడ్లు, గడ్డి దుబ్బలో పగిలిన గాజులు, నలిగిపోయిన పసుపు తోట గడ్డి మొక్కలు మొదలైనవి రెండు నెలల వరకు భౌతికంగా సాక్ష్యం చూపడానికి యథాతథంగా వున్నాయి.
కాని స్థానిక ఎస్‌పి గానీ కలెక్టర్ గానీ వీటిపై ప్రాథమిక విచారణ కూడా జరపలేదు. కనీసం మానవహక్కుల సంఘం కూడా ఇటువైపు తిరిగి చూడలేదు. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ సాక్ష్యాలను బయటికి తీయలేదంటే దీనివెనుక ఎంత తతంగం నడిచిందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఒక స్త్రీ నాపై అత్యాచారం జరిగింది అని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తదుపరి భారత శిక్షాస్మృతి 24 ప్రకారం ఏ ఆధారం లేకున్నా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి ఆ దురాగతానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి.
కాని ఎందుకు చేయలేదు? అత్యాచారం జరిగిన వెంటనే హైదరాబాద్‌లో ఉన్న డి.జిపి., యస్.పి.లు ఏ ప్రాథమిక విచారణ జరపకుండానే ఇది నక్సల్స్ కుట్రలో భాగం అని ప్రకటించారు! అత్యాచార బాధిత మహిళలు స్థానిక సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి ఐ.పి.సి. 376(11) (జి) కింద పోలీసులపై సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. బాధితులు ఆదివాసీ కోంథ్ తెగ మహిళలు కనుక అత్యాచార నిరోధక చట్టం 1989 సెక్షన్ (3...) (వి) క్రింద 21 మంది గుర్తుతెలియని పోలీసులపై కేసు నమోదు చేశారు.
ఈ గుర్తు తెలియని గ్రేహౌండ్స్ దళం ఎవరో నిజంగా ప్రభుత్వానికి తెలియదా? ఈ కేసును తప్పుదోవ పట్టించటానికే అత్యాచారం జరిగిందో లేదో నిర్థారించుకోవటానికి బాధిత మహిళలకు ఫోరెనిక్స్ పరీక్షలు చేయాలన్నారు. వాస్తవంగా ఫోరెనిక్స్ పరీక్ష అనేది అత్యాచారం జరిగిన కొద్ది గంటలలోనే చేయవలసిన పని. కాని పోలీసులు కుట్రతో 24 గంటలు దాటాక ఫోరెనిక్స్ పరీక్షలకు పంపారు. అలాంటప్పుడు అత్యాచారం జరిగింది అనే నివేదిక వచ్చే అవకాశం లేదు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్నట్లు ప్రభుత్వం ఈ నివేదికను మొత్తం తారుమారు చేసి ఆఖరుకి అత్యాచారం జరగలేదని నిరూపించింది.
2007 ఆగస్టు 24న ఎక్కడో మన్యం నుంచి రాజధాని హైదరాబాద్‌కి వచ్చి అయ్యా మమ్మల్ని పోలీసులు చెరిచారు మాకు న్యాయం చేయకుంటే ప్రాణాలు తీసుకోవటమే దిక్కు అని స్వయానా ముఖ్యమంత్రి కాళ్లపై పడి వేడుకుంటే నివేదికలు రాకుండా ఎవరిని అరెస్ట్ చేయలేమని ఉచిత సలహా ఇచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించవలసిన తీరు ఇదేనా? 2007 ఆగస్టు 25న మానవ హక్కుల కమిటీ చైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డిని కలిశారు. ఆయన అన్నిరకాల రిపోర్టులు రాసుకొని వాటిని కాగితాలకే పరిమితం చేశారు.
మానవ హక్కుల రక్షణకు కూడా ఆదివాసీలు వర్తించరా? 2007 అక్టోబర్ 26న వాకపల్లిని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నాగిరెడ్డి ఉన్నతస్థాయి విచారణ జరిపి అత్యాచారం జరిగింది నిజమే అని ప్రభుత్వానికి నివేదించారు. 2007 జూలై 24న దళిత బహుజన శ్రామిక్ యూనియన్ అత్యాచారం జరిగిన విషయాన్ని నిర్ధారించింది. నిజం ఇంత తేటతెల్లంగా ఉన్నా బాధితులకు న్యాయం జరగనే లేదు. రాష్ట్ర హైకోర్టు కూడా ఆదివాసీలకు న్యాయం అందించలేదు. బాధిత మహిళల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది యన్.రామచంద్రరావు నిజానిజాలను తేల్చటానికి విచారణ జరిపించాలని కోరారు.
దానికి స్పందించిన హైకోర్టు నిజానిజాలు తేల్చేందుకు సి.ఐ.డి. యస్.పి.ని నియమించింది. ఆయన తన నివేదికలో 11మంది బాధిత మహిళలను, ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది పోలీసులను, 8 మంది వైద్యాధికారులను వాకపల్లికి చెందిన 37 మంది ఇతరులను, 18 మంది సాక్షులతో పాటు 91 మందిని విచారించినట్లు పేర్కొన్నాడు. ఇంత నివేదిక తయారుచేసి ఆయన పాడిన పాట హైకోర్టులో ఆధారాలు లేవని పేర్కొనటం! ఒకపక్క ప్రభుత్వమే అసెంబ్లీలో బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఒప్పుకొంది.
అంటే బహిరంగంగా అత్యాచారం జరిగినట్టు ఒప్పుకున్నట్టు కాదా? 2007 నవంబర్ 13న సి.ఐ.డి నివేదిక పరిశీలించిన హైకోర్టు అత్యాచారం జరిగిందని గాని జరగలేదని గాని ఉత్తర్వులు ఇవ్వలేక పోతున్నాం అని పేర్కొంది. అంటే నేర నిర్ధారణ సరిగా జరగలేదని అర్థం. అలాంటప్పుడు మధ్యంతరంగా ఈ కేసు మూసివేయటం వెనుక కారణం ఏమిటి? ప్రజాసంఘాల వాదన ప్రకారం సి.బి.ఐ. చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ వాదనను స్వయానా హైకోర్టు కొట్టివేసి పోలీస్ డిపార్ట్‌మెంట్ అనుబంధమైన సి.ఐ.డి. చేత విచారణ ఎలా జరిపించింది? బాధిత మహిళలు, ప్రజాసంఘాలు, ఆదివాసీ సంఘాలు, మహిళా సంఘాలు చేసిన న్యాయ పోరాటాలను, మీడియా ద్వారా పత్రికలలో వచ్చిన కథనాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? భారత రాజ్యాంగ నిబంధనలు, గ్రంధాలు, న్యాయ శాస్త్రం మాకు వర్తించవా అని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు.
మహిళలను గౌరవించటం భారతదేశ సాంప్రదాయం అని చెప్పుకునే ఈ దేశంలో మహిళా పక్షపాతి, మహిళా అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తూ భారతదేశ పరిపాలననే తన కనుసన్నలతో నడుపుతున్న సోనియాగాంధీ కూడా 2007 సెప్టెంబర్ 1న అంటే అత్యాచారం జరిగిన పదకొండు రోజులకు రాజమండ్రి బహిరంగ సభలో పాల్గొని అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. కాని సాటి మహిళలకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించలేదు.
అయేషా మీరాపై అత్యాచారం హత్య జరిగితే నిజనిర్ధారణకు అవసరమైతే పోలీసులకు కూడా నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తామన్న అప్పటి హోంమంత్రి వాకపల్లి మహిళల విషయంలో ఎందుకు ఈ పరీక్షలు నిర్వహణకు ఆదేశించలేదు? ఉన్నత వర్గానికి ఒకన్యాయం? అణగారిన వర్గానికి ఒక న్యాయమా? ఇదే ఘటన రాజకీయ నాయకుల బంధువర్గానికి జరిగివుంటే? ఇన్ని రకాల పరీక్షలు చేసేవారా? న్యాయం దొరకటానికి నాలుగేళ్ళ కాలం పట్టేదా? ఎవరి వలన న్యాయం దొరకదని భావించిన ఆదివాసీ మహిళలు ఆదివాసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో 2007 సెప్టెంబర్ 22న పాడేరులోని అంబేద్కర్ జంక్షన్ ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
దీంతో వాకపల్లి గ్రామస్తులను మీరు పాడేరు వెళ్ళి దీక్షలో పాల్గొన్న, న్యాయ విచారణకని పట్టుబట్టినా ఇప్పుడు జరిగిన దానికన్నా ఎక్కువగా ఒక్కొక్కరిని 20 మంది కలిసి అత్యాచారం చేస్తామని బెదిరించారు. ఒకవైపు అలా బెదిరిస్తూనే సి.ఐ.డి.(యస్.పి) ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తామని డబ్బులు ఎరచూపి లొంగదీసుకోవాలనుకున్నారు! ఇంత జరిగినా న్యాయం అందక ఆదివాసీ మహిళలు మానసికంగా కృంగి, కృసించి, నరకయాతనతో సాధారణ జీవితం గడుపుతుంటే 2008 మార్చి 5న పాడేరు కోర్టు నోటీసులు జారీచేసింది.
వారం రోజులలో వారి అభియోగాలను వినిపించాలని కోర్టుకు హాజరు కానియెడల సి.ఐ.డి నివేదిక ప్రకారం బాధిత మహిళలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీని ఆధారంగా ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? ఎందుకు ఆదివాసీలపై ఈ విధమైన చర్యలకు పూనుకుంటుంది? న్యాయం జరిగేమాట దేవుడెరుగు కాని ఈ అత్యాచార బాధితులలో ఒక మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ప్రాణాలు పోతున్నాయి తప్ప న్యాయం దొరకని పరిస్థితి ఆదివాసీ మహిళలది.
విశాఖ మన్యంలోని 515.89 మిలియన్ టన్నుల బాక్సైట్ తవ్వకానికి అడ్డుగా వున్న ఆదివాసీలను తొలగించటానికి వాకపల్లి బల్లుగూడ అత్యాచారం జరిగితే, ఒరిస్సాలోని కొందమహల్ జిల్లాలో 2010న నలుగురు ఆదివాసీ మహిళలపై సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లు అత్యాచారం చేశారు. 1996 ఆగస్టులో భారతిబాయి అనే గోండు మహిళ తన పొలం దగ్గర నుండి బిడ్డకు పాలు ఇవ్వటానికి వస్తుంటే మధ్యలో గ్రేహౌండ్స్ బలగాలు ఎదురై అసభ్యంగా ప్రవర్తించారు. ఆదివాసీల కాళ్ళ క్రింద వున్న ఖనిజ సంపద అంతరించే వరకు ఆదివాసీలకు ఈ బాధలు తప్పవనేది స్పష్టత కలిగిన విషయం.
- మైపతి అరుణ్ కుమార్
ఆదివాసీ విద్యార్థి సంఘం(తుడుం దెబ్బ)
(2007 ఆగస్టు 20న 11 మంది ఆదివాసీ మహిళలపై అత్యాచారం జరిగి నాలుగేళ్లైన సందర్భంగా)

No comments:

Post a Comment