Sunday, September 4, 2011

ప్రజాసంఘాలు: ప్రజాస్వామ్య సంస్కృతి ప్రొ.హరగోపాల్ Namasethe Telangana 19/08/2011


ప్రజాసంఘాలు: ప్రజాస్వామ్య సంస్కృతి
ప్రొ.హరగోపాల్
మహబూబ్‌నగర్‌లో ఈ నెల ఏడవ తేదీన ఆర్.ఎస్. రావు, పత్తిపాటి వేంక బుర్రా రాములు, మాధవస్వామి, జయశంకర్‌ల సంస్మరణల సభను పాలమూరు అధ్యయన వేదిక నిర్వహించింది. ఇంతమంది ప్రజాస్వామ్యవాదుల సంస్మరణ ఒకేసారి జరుపుకోవడం ఒక విషాదమే. ఈ ఐదుగురు సమాజానికి అందించిన సేవలు, ప్రజల పట్ల కనపరచిన శ్రద్ధ, వ్యక్తిగత జీవితంలో పాటించిన విలువల పట్ల గౌరవంతో ఈ సభ నిర్వహించారు. వాళ్లకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకోవడమే కాక ఒక్కొక్కరి వ్యక్తిత్వాన్ని విశ్లేషించి, వాళ్ల నుంచి ఉద్యమాల లో పనిచేసేవారు ఎలాంటి స్ఫూర్తి పొందవచ్చో తెలుసుకోవడానికి అదొక ప్రయత్నం.
పాలమూరు అధ్యయన వేదిక ఒక విధంగా చెప్పాలంటే పాలమూరు కరువు వ్యతిరేక పోరాట కమిటీ చేసిన కృషికి ఒక భిన్న రూపం. అయితే కరువు సంస్థ సమీకరించినట్లుగా ప్రజలను సమీకరించడం కాని, ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ల బాధల్లో భాగం పంచుకోవడం కానీ ప్రస్తుతం చేయడం లేదు. పాలమూరు కరువు, వలస లు, నీళ్లు, వ్యవసాయ సంక్షోభం, ప్రజల చరిత్ర, సంస్కృతి సాహిత్యం ద్వారా ప్రజ ల సమస్యల చారివూతక నేపథ్యాన్ని గురించి, వాటి పునాదుల గురించి, వాటి కార్యకారణ సంబంధాలను విశ్లేషించి మరింత సమగ్ర అవగాహన కొరకు కృషి చేస్తున్నది. దీంట్లో భాగంగానే పాలమూరులో పుట్టకున్నా ఈ జిల్లా ప్రజల పట్ల ఆసక్తి చూపించి, ఇక్కడి కరువుకు స్పందించిన, ప్రజల పట్ల బాధ్యతగా ఆలోచించిన ఈ ఐదుగురి గురించి విశ్లేషించడం అధ్యయన వేదిక తన బాధ్యతగా భావించి, ఈ సభ ద్వారా వాళ్ల పట్ల తమ కృతజ్ఞతా భావాన్ని ప్రకటించుకుంది.
కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆవిర్భవానికి చారివూతక సందర్భం పాలమూరు వలసలు, కరువు అని వేరే రాయనవసరం లేదు. తెలంగాణ ప్రాంతంలోనే కాక దేశ, అంతర్జాతీయస్థాయిలో పాలమూరు సమస్యలను చర్చకు పెట్టడం జరిగింది. ఏ ప్రజాస్వామిక ఉద్యమమైనా ఎలాంటి సమస్యతో ప్రారంభమైనా, ప్రజల దగ్గరకు వెళితే ప్రజలే ఆ ఉద్య మ ఎజెండాను నిర్ణయిస్తారు. ఇది ఏ ఉద్యమానికైనా ఒక సార్వజనీన లక్షణం. అందుకే కరువుతో ప్రారంభమైనా, విభిన్న వైవిధ్యపూరిత సమస్యలు, సవాళ్లు కమిటీ ముందుకు వచ్చా యి. ఈ సమస్యలు చేపట్టే క్రమంలో కమిటీ ప్రజలకు సన్నిహితమైంది. ప్రజల జీవనంలో ఏ మాత్రం మార్పు తేగలిగినశక్తి ఉన్నా, రాజ్యం ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది.
ఇలాంటి ఉద్యమాలు నిధుల వేటలో ఉన్న ప్రజాప్రతినిధులు అని అనబడే వారికి కంటకింపుగానే ఉంటుంది. సంస్థ చేపట్టిన కార్యక్షికమాల వైవిధ్యం వీళ్లని భయపెట్టింది. ఎన్ని రకాల కార్యక్షికమాలు జరిగాయన్నది సంస్థ గత సంవత్సరం ప్రచురించిన కరపవూతాలను చూస్తే బోధపడుతుంది. ఇది ఒక రకంగా తన వైవిధ్య ఆచరణను, ప్రజల సమస్యలను రికార్డు చేసే ప్రయత్నం. ఈ కరపత్ర ప్రచురణకు బాలగోపాల్ ముందు మాట రాస్తూ (అది బహుశా ఆయన చివరి రాత ప్రతి కూడా) కరువు వ్యతిరేక పోరాటం చేయాలనుకున్నవారికి ఎవరికైనా ఇది ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందన్న కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత కాలంగా, ఈ కమిటీతో సన్నిహితంగా ఉన్నవారు, ఇతర ప్రజాసంఘాల బాధ్యులు, ప్రజల కొరకు తమ పరిమితులలో నిరంతరంగా పనిచేస్తున్న వారు, ఈ సంస్థ ‘రద్దు’ పిరికితనమని, తప్పించుకునే మనస్తత్వమని, అగ్ర కుల బలహీనతని విమర్శిస్తున్నారు. ఇది ఒక రకంగా బాధాకరమైన ధోరణి. ఈ విమర్శలు చేస్తున్న వారికి అప్పటి భయానక పరిస్థితుల గురించి తెలుసు. సంస్థ తన కార్యక్షికమాలను విరమించుకుంటున్నది అన్న ప్రకటన అప్పు డు జైలులో ఉన్న వి.వి. చూసి, పరిస్థితి ఎంత భయానకంగా తయారైందని ఊహించి చాలా ఆందోళనకు గురి అయ్యాను అన్నారే కాని సంస్థను ఎందుకు రద్దు చేశారు అని అడగలేదు.
రాజ్యం మీద అంచనా, చరిత్ర మీద అవగాహన ఉన్న నాలుగు దశాబ్దాలుగా అణచివేత రూపాలను చూసి అనుభవిస్తున్న ఒక సుసంపన్నమైన అనుభవం ఆయన స్పందనలో చూడవచ్చు.
నిజానికి చారివూతక తప్పిదం, పిరికితనం లాంటి విమర్శలు ఏ సంఘం మీద చేసేప్పుడు వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలి. చారివూతక తప్పిదం అంటే చరిత్ర పరిణామ క్రమంలో ఒక పెద్ద మలుపు తిరుగుతున్నప్పుడు ఒక నిర్ణయం ఆ క్రమానికి నష్టం కలిగించినా, విఘాతం కలిగించినా లేదా దాన్ని వేగాన్ని ఆపినా, ఆ నిర్ణయానికి ఆ నిర్ణాయక శక్తి ఉన్నప్పుడే బహుశా అలాంటి వ్యాఖ్యలు సమంజసమే మో? అంతేకాని ఒక జిల్లాలో పరిమితమైన లక్ష్యం కొరకు, తమ ఉద్యోగాలు చేసుకుంటూ, తమ చుట్టూ ఉండే సమాజానికి ఏదైనా పద్ధతిలో మద్దతు తెలపాలనో, ప్రజల పట్ల తమ బాధ్యతలను నెరవేర్చాలనో కొందరు వ్యక్తులు చేపట్టిన కార్యక్షికమాలకు నిర్మాణంలోనే పరిమితులుంటాయి.
వీళ్లంతా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ విప్లవకారులు కాదు. ఇది రాజ్యానికి తెలుసు. అయితే కనకాచారి, మునెప్పను చంపిన తర్వాత పాలమూరులో ముఖ్యంగా కరువు కమిటీ సభ్యులను టార్గెట్ చేస్తామని పేర్లు ప్రకటించారు. కుటుంబాలు చాలా ఆందోళనకు గురైయ్యాయి. అప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా యస్.పి., రాజశేఖర్‌డ్డి స్వభావానికి ప్రతిరూపంగా ఒక లాటిన్ అమెరికా నియంతగా ప్రవర్తించాడు. అప్పుడు జరిగిన విధ్వంసం, ప్రాణ నష్టం, మనోహర్, మల్లేష్‌ల అదృశ్యం-వీటన్నింటి మీద లోతైన పరిశీలన జరగవలసి ఉంది. యస్.పి, పోలీసులు ఎవ్వరి మాట వినరని అన్న ఎమ్మెల్యేలు తర్వాత వచ్చిన చారుసిన్హాను (ఆమె నా విద్యార్థి) తమ ప్రయోజనాలకు అడ్డుపడుతుందని ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసి బదిలీ చేయించారు. ఆ పరిస్థితిలో అందరం రెండు రోజులు తర్జనభర్జన పడ్డాం.
అప్పుడు ఉండే పరిస్థితుల్లో పనిచేయడం సాధ్యం కాదని అందరి సభ్యుల (అంటే అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు) అవగాహన మేరకే నిర్ణయించాం. అంత మాత్రాన వ్యక్తిగత విలువలతో రాజీపడడమో, తమ వృత్తి ధర్మాలను పాటించకపోవడమో జరగలేదు. నిజాయితీ కోల్పోతున్న మధ్యతరగతిలో ఎవరు భాగం కాలేదు. అంటే తమను తాము మనుషులుగా నిలబెట్టుకోవాలనే తపన తగ్గిందని భావించడం లేదు.
పిరికితనం గురించి చర్చించుకోవడం కూడా చాలా అవసరం. ఈ అవసరం ఒక్క కరువు కమిటీకే కాదు. చాలా కారణాలలో ఈ అంశం మీద విశ్లేషణ జరగవలసి ఉంది. మన రాష్ట్రంలో కోబ్రాలు, టైగర్లు విజృంభించి పోలీసుల ప్రోత్సాహంతో వాళ్లను, చంపుతాం, వీళ్లను చంపుతాం అని బెదిరిస్తున్నప్పుడు, మా లాంటి వాళ్లకు ఏదైనా చేయమని ఆందోళనపడుతూ ఫోన్లు చేసిన వాళ్లున్నారు.
ప్రభుత్వంలో బాధ్యులుగా ఉండే అధికారుల దృష్టికి తీసుకవచ్చే వాళ్ళం. తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేవాళ్లం. ఈ అంశం మీద నేను విరసం హైదరాబాద్‌లో నిర్వహించిన సభలో మాట్లాడాను. మనలో చాలా మందిమి ఎందుకు భయపడుతున్నాం. జీవించడం ఇష్టపడా? ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఈ ప్రపంచంతో మనకుండే జ్ఞాపకాలు చాలా బలంగా ఉన్నందుకే, మనకుండే సామాజిక సంబంధాల న్ని రద్దవుతాయనా? ఇంకా చేయవలసింది చాలా ఉందనా? మధ్యనే మనం చేసే పని ఆగిపోయిందనా? చంపే పద్ధతి క్రూరమైనదనా? ఇలా ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు. నిజానికి భయానికి కారణాలు పూర్తిగా తెలియవు. ధైర్యం అంటే భయానికి వ్యతిరేకంగా పోరాడడమే. ఇది ఒక్కొక్కరి సంసిద్ధతా స్థాయిని బట్టి ఉంటుంది. ధైర్యమంటే ప్రాణాన్ని కోల్పోడానికి సంసిద్ధతే అంటే బహుశా మనలో చాల మందికి ఆ సంసిద్ధత ఉందో లేదో తెలియదు. విప్లవకారులు కూడా సాహసంగా సినిమాలో చూయించినట్లుగా ఎదుటపడి ప్రశ్నించి, సవాలు చేసి దుస్సహాసంగా ప్రాణా లు ఇవ్వరు. వాళ్లు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కన్నబిరాన్ గారు, రామనాథం గారు, నర్రా ప్రభాకర్‌డ్డి ఆ జాగ్రత్తలు తీసుకోలేదని జీవితమంతా బాధపడ్డారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా తగు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరికలు చేయడం ప్రజా ఉద్యమాలల్లో బాధ్యులుగా ఉన్న అందరు చేసిన పనే.
విమర్శలు చేసేవారు ఈ విషయాల గురిం చి లోతుగా ఆలోచించాలె. ఇది కేవలం కరువు వ్యతిరేక పోరాట కమిటీకి సంబంధించిన అంశం కాదు. అయితే ఆ ధైర్యమే లేకపోతే ప్రజా సంఘాల్లో ఎందుకు పని చేస్తున్నారు? అందరిలాగా రాజీపడి జీవించవచ్చు కదా? అంటే అది చాలా సమక్షిగంగా చర్చించవలసిన అంశమే.ప్రజా సంఘాల్లో తమకు తోచినట్లు విమర్శలు చేయడం, ఈ మధ్య ఒక అలవాటైపోయింది. వ్యక్తులు పుట్టిన కులాలను బట్టి (ఆ విషయంలో ఎవ్వరమూ ఆ కులంలో పుట్టడానికి కోరుకున్న వాళ్లం కాదు) ఆచరణతో సంబంధం లేకుండా వ్యక్తుల మీద దాడి చేయడంపై బహిరంగ చర్చ జరగాలి. అయితే కొన్ని సామాజిక వర్గాలలో పెరిగిన వాతావరణం వలన కులానికుండే జాడ్యాలు, అహంకారం, ఆచారాలు, మనుషుల పట్ల వివక్ష అబ్బి ఉంటాయి.
వాటి మీద ఆయా కులాల్లో పుట్టిన వాళ్లు సామాజిక మార్పును కోరుతూ ఉద్యమాలలో పాల్గొంటున్న వారు తమతో తాము ఎంత పోరాటం చేస్తున్నా వాళ్ల వాళ్ల వ్యక్తిత్వాలను బట్టి ఉంటుంది. ఈ విషయంలో విమర్శ చాలా అవసరం. విమర్శ చేసే వారుకూడా ఆ కోణం నుండి విమర్శ చేయవలసి ఉంటుంది. దళిత వర్గాలకు చెందిన ప్రజా సంఘాలలో అగ్ర కులాల అనుభవమే కాక, ఉద్యమాలలో ఉన్న వాళ్లు తమతో తాము పోరాడుతున్న అనుభవం గురించి సంభాషించవలసిన అవసరం కూడా ఉంది. అంబేద్కర్ కుల నిర్మూలన కావాలని కలలు కన్నాడని మరిచిపోకూడదు.
కుల నిర్మూలన దళితుల విముక్తికి ఎంత అవసరమో, అధిపత్య కులాలకు కూడా అంతే అవసరం. పాలోవూఫయర్ అణచివేయబడ్డ వర్గాల్లో తమ విముక్తితో పాటు, అణచుతున్న వారిని కూడా విముక్తి చేయవలసి ఉంటుంది అంటాడు. ఆధిపత్య కులాల్లో పెరిగిన వారు తమ మీద తాము చేస్తున్న పోరాటానికి సహకరించవలసి ఉంటుంది. వాళ్ల పరిమితులను గుర్తు చేయవలసి ఉంటుంది. కాని వాళ్లు ఫలాన కులంలో పుట్టారు కాబట్టి, దళిత కులాలలో పుట్టిన ఎవ్వరైనా ఏదైనా అనవచ్చు అనే ‘లెసెన్స్’ గురించి తీవ్రమైన చర్చ జరగవలసి ఉంది. విమర్శకు ఒక విలువల చట్రం, కొన్ని ప్రమాణాలు చాలా అవసరం. నూతన ప్రజాస్వామిక విలువల పురుటి నొప్పులు అనుభవిస్తున్న సామాజిక సందర్భంలో నుండి సమాజం పరిణామం చెందుతున్న కాలమది. ఈ ఘర్షణ, సంఘర్షణ అనివార్యం.
అయితే అస్తిత్వ ఉద్యమాలకుండే ప్రజాస్వామ్య స్వభావాన్ని కోల్పోకుండా, విశాలమైన సామాజిక మార్పు దిశగా కృషి చేయాలి. అలాగే ప్రజల పట్ల బాధ్యత కలిగిన అన్ని ప్రజా సంఘాలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇతరుల గురించి మాట్లాడేప్పుడు విలువలు, ప్రమాణాలు పాటించడమే కాక, రాజ్య దుర్మార్గాన్ని, పని చేయలేని పరిస్థితి కల్పించిన రాజ్యాన్ని వదిలి, బాధితులను విమర్శించడం ఎంతో సబబో కూడా ఆలోచించాలి

No comments:

Post a Comment